కథానికా, దాని శిల్పమూ – రాచమల్లు రామచంద్రారెడ్డి

‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. షాక్ (దిమ్మరపాటు) మాట యేమైనా పాఠకుని హృదయం మీద గాఢమైన అనుభూతి ముద్ర వేయాలనే ఉద్దేశంతోనే నేనీ కథానికలు రాసినాను. కథానికను గురించే కాదు. మొత్తం సాహిత్యం గురించే నా అవగాహన అది. అనుభూతి లేకుండా సాహిత్యమనేదే లేదు. సమస్త సాహిత్యమూ హృదయ వ్యాపారమే. అంటే అనుభూతి వ్యంజకమే. అయితే, అనుభూతి అనేది వెగటు కలిగించే మెలోడ్రామా స్థాయికి దిగజారకూడదు. వెలపరం కలిగించే చౌకబారు సెంటిమెంటు కాకూడదు. గాజుగ్లాసు పగిలిపోతే, మగడు చచ్చినంతగా మొత్తుకోవడం మెలోడ్రామా. పడమట సూర్యుడు మునిగిపోతున్నాడని శోకాలు పెట్టడం చౌకబారు సెంటిమెంటు. అనుభూతి అనేది కథకు తగినంతగా, లేదా కథలోని యితివృత్తానికి తగినంతగా, మాత్రమే వుండాలి.

కథానికకు పాయింటు అనేది వుండాలంటారు. (దానికి తెలుగు మాట యింత వరకు పుట్టినట్లు లేదు. ప్రస్తుతానికి నేను లక్ష్యం అంటాను. ) లక్ష్యం అంటే యేమిటి? కథానిక అనేది జీవితానికి సంబంధించిన ఒక సత్యాన్నో, ఒక నీతినో, ఒక నియమాన్నో, ఒక సూత్రాన్నో పాఠకునికి తెలియజెయ్యాలి. అదే లక్ష్యం. ఒక కథానికకు ఒకే లక్ష్యం వుండాలి. యెక్కువ లక్ష్యాలు వుంటే, అది యేమౌతుందో గాని, కథానిక మాత్రం కాదు. కథానికలో లక్ష్యమే అన్నిటికంటె ముఖ్యమైనది. పాత్రలూ, ఘటనలూ మొదలైనవన్నీ దానికి అనుగుణంగా, దానికి పోషకంగా, దానికి ఉపస్కారంగా మాత్రమే వుండాలి. అయితే మరి అనుభూతి మాట యేమిటి? కథానికలో దాని పాత్రయేమిటి?

గత శతాబ్దిలో కథానిక పుట్టినప్పుడు దాని లక్ష్యం యేదైనా ఒక జీవితసత్యంగానో, నీతిగానో వుండేది. అంటే, అదొక భావం (ఐడియా) మాత్రమే. లేదా, రచయిత అభిప్రాయం మాత్రమే. అంటే, ఇది పాఠకుని మెదడుకు (లేదా మేధకు, లేదా బుద్ధికి) తాకేది. భావం అనేది హృదయానికి తాకని మాట నిజమే. కానీ, కథానిక (యితర సాహిత్య శాఖలలాగే) పాత్రలనూ, సన్నివేశాలను సృష్టిస్తుంది. వర్ణిస్తుంది. అంటే, వ్యక్తులనూ, నిర్దిష్ట సన్నివేశాలలో వాళ్లకు కలిగే కష్టసుఖాలనూ, రాగ ద్వేషాలనూ చిత్రిస్తుంది. అంటే, కథానికలో ఆద్యంతం పాత్రల అనుభూతులు వ్యక్తమౌతూనే వుంటాయి. అవి పాఠకుని హృదయానికి తాకుతూనే వుంటాయి. అనగా, కథానిక చదివినంతసేపు పాఠకునికి అనుభూతులు కలుగుతూనే వుంటాయి. అనగా, లక్ష్యం అనేది శుద్ధ మేధా వ్యాపారంగానే వుండినా, కథానిక మాత్రం మొదటి నుంచి చివరిదాకా హృదయ వ్యాపారంగానే వుండేది. అందువల్ల పంచతంత్రం కథలు చదివి నీతులు నేర్చుకున్నట్లు కాక, ఉత్తమ సాహిత్యం చదివిన సంతృప్తి పాఠకునికి కలిగేది.

యిలా లక్ష్యమూ, అనుభూతి దేనిపాటికది విడిగా వుండక తప్పదా? లక్ష్యానికి అనుభూతిని జోడించి, లక్ష్యాన్ని అలా అనుభూతి సంపన్నం చేసి, కథానిక రాయకూడదా?

శుద్ధ మేధా వ్యాపారమైన లక్ష్యం కథానికకు అవసరమా? అనుభూతే లక్ష్యం యెందుకు కాకూడదు? ఒక జీవిత సత్యాన్ని చెప్పే ఉద్దేశ్యంతో కాక, పాఠకుని హృదయంలో ఒక అనుభూతిని కలిగించే ఉద్దేశంతోనే కథానిక రాయకూడదా? చంద్రోదయాన్నో, తుఫానునో వర్ణిస్తూ ఒకటి రెండు పుటల్లో ఖండ కావ్యం రాస్తే, దానిలో యే జీవిత సత్యమూ లేకుండా అనుభూతి మాత్రమే వుంటుంది గదా? కథానిక అలా వుండకూడదా?

లక్ష్యాన్ని అనుభూతి సంపన్నం చేయవచ్చుననే స్పృహ మొదటి రష్యన్ రచయిత చేహూవ్‌కు కలిగినట్లుంది. ఆయన రాసిన కొన్ని కథానికలలో లక్ష్యానికి గాఢమైన అనుభూతి తోడై వుంటుంది. ఆయనకు ముందు అలాంటి కథలు ఒకటో అరో యెవరైనా రాసి వుండవచ్చు. కానీ ఉద్దేశపూర్వకంగా కథానికా లక్ష్యాన్ని అనుభూతి పుష్టం చేసిన మొదటి రచయిత కాథరిన్ మాన్స్‌ఫీల్డ్. (రచయిత్రి అనే మాట అనవసరం, ఒకోసారి అనర్థదాయకం కూడా. కనుక ఆమెను రచయిత అనే అంటున్నాను.) ఆమె కథానికలలో అనుభూతి సంపన్నంకాని లక్ష్యం సాధారణంగా ఉండదు. అంతేకాదు. కొన్ని కథానికలలో అనుభూతే లక్ష్యంగా వుంటుంది. అంటే, కథానికలో యే జీవిత సత్యమూ ఉండదు. పాఠకునికి గాఢమైన అనుభూతి మాత్రం కలుగుతుంది. ఖండకావ్యంలో లాగ.

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

నిజానికి అనుభూతికి సంబంధించినంతవరకు కథానికకూ, ఖండ కావ్యానికీ ఒక సామాన్య లక్షణం వుంది. దానికి కొంత వివరణ అవసరమనుకుంటాను.

కవిత్వం ఆదిమ కాలంలోనే పుట్టింది. ఆది కావ్యం యిక్కడ వాల్మీకితోనూ, యూరప్‌లో హూమర్‌తోనూ సుమారు మూడు వేల యేండ్లక్రితం పుట్టింది. తరువాత రెండున్నర సహస్రాబ్దాలకు గానీ వచనం పుట్టలేదు. అంతవరకు యెందుకు పుట్టలేదంటే, మానవ నాగరికతా, మానవ సంస్కారమూ పెరిగి పెరిగి ఒక దశకు చేరుకుంటే తప్ప వచనం పుట్టజాలదు, మానవుడు ప్రకృతినీ, జీవితాన్ని వివేకంతో పరిశీలించి, హేతుబద్ధంగా ఆలోచించగలిగినప్పుడు మాత్రమే వచనం పుట్టగలదు. అగ్నినీ, సూర్యునీ, గాలినీ, వాననూ, కొండలనూ, నదులనూ దేవతలని అనుకున్నన్నాళ్లూ కవిత్వమే పుడుతుంది గానీ వచనం పుట్టదు. వాటిని నియమాలకు లోబడిన శక్తులుగా గ్రహించినప్పుడే వచనం పుట్టే అవకాశమూ, పుట్టవలసిన అవసరమూ యేర్పడతాయి. విజ్ఞాన శాస్త్రాలన్నీ వచనం పుట్టినప్పటినుంచే వికసించడం చరిత్రలో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు. వచన వికాసానికీ, శాస్త్ర విజ్ఞాన వికాసానికి ఆధారం ఒకటే – ఒక దశకు చేరుకున్న మానవ సంస్కారం.

యూరప్‌లో ఫ్యూడల్ (వ్యవసాయ) నాగరికత అవసాన దశకు చేరుకొని, బూర్జువా (వ్యాపార) నాగరికత ఆవిర్భవిస్తున్న కాలంలో వచనం పుట్టింది. వ్యాసం అనేది చేకన్‌తో ప్రారంభమైందనుకుంటే, అది 16వ శతాబ్దిలో పుట్టిందనవచ్చు. డేనియల్ ఢిపో రాసిన రాబిన్సన్ క్రూసోతో నవల ప్రారంభమైందనుకుంటే, అది 17వ శతాబ్దిలో పుట్టినట్లు అర్థమౌతుంది. లేక, స్పెయిన్‌కు చెందిన సెర్వాంటిస్ రాసిన డాన్‌క్విక్సట్‌తోనే అది ప్రారంభమైందనుకుంటే, యింకా కొంత ముందే పుట్టినట్లు అర్థమౌతుంది. తరువాత చాలా కాలానికి – 19వ శతాబ్దిలో – కథానిక పుట్టింది. దీని లక్షణాలు సరికొత్తగా వున్నందువల్లనే యింగ్లీషులో షార్ట్‌స్టోరీ అనే మాటా, తెలుగులో క థానిక అనే మాటా కొత్తగా సృష్టించుకోవలసి వచ్చింది.

యీలోగా కవిత్వంలో కూడా ఒక మార్పు వచ్చింది. కావ్యంలో కవిత్వంతో పాటు కథా, కథతో పాటు కవిత్వమూ వుంటాయి. కానీ, నవలలో కవిత్వం లేకుండా కథ మాత్రమే వుంటుంది. అంటే, కథ అనేది కవిత్వం నుండి విడివడి, కవిత్వంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిలబడి, నవల అయింది. అలాగే కవిత్వం కూడా, కథ నుంచి విడివడి, కథతో సంబంధం లేకుండా స్వతంత్రంగా నిలబడి, ఖండకావ్యం అయింది. ఖండకావ్యంలో కథ అనేది బొత్తిగా వుండదు. ఖండకావ్యం యొక్క విశిష్ట లక్షణం యేమిటంటే, పాఠకునిలో ఒకే ఒక అనుభూతిని కలిగించడం. అది పది పంక్తులున్నా, పది పుటలున్నా ఆ లక్షణం వుండాలి. ఖండకావ్యం యొక్క ప్రాణపదమైన లక్షణం అది. రసం అనే మాట వాడవచ్చుననుకుంటే, ఖండకావ్య లక్షణం యేక రసవ్యంజకత్వం – యేకైక రస వ్యంజకత్వం.

( 17వ శతాబ్ది నాటి మిల్టన్ కొన్ని ఖండకావ్యాలు రాసినాడు. 16వ శతాబ్ది నాటి షేక్‌స్పియర్ రాసిన సానెట్లు ఖండకావ్యాలే. కానీ, వాళ్ళవల్ల వాటికి గానీ, వాటిద్వారా వాళ్ళకు గానీ ప్రశస్తి రాలేదు. ఖండకావ్యానికి ప్రశస్తీ, ప్రచారమూ వచ్చింది ఇంగ్లీషులో రొమాంటిక్ కవులతోనే. శతాబ్ది ప్రారంభంలో, తెలుగులో భావకవులతో, యీ శతాబ్ది మొదటిపాదంలో.)

యీ యేక రక వ్యంజకతా సూత్రాన్ని వచన సాహిత్యానికి వర్తింప జేసినప్పుడు కథానిక రూపొందుతుంది. అంటే, ఖండకావ్యంలాగే కథానిక కూడా ఒకే ఒక అనుభూతిని కలిగించాలి. పాత్రలూ, ఘటనలూ యెన్ని వున్నా, కథానిక పొడవు యెన్ని పుటలున్నా, అది సృష్టించే అనుభూతిలో మాత్రం ఏకత్వం వుండాలి. ఖండకావ్యానికీ, కథానికకూ గల సామాన్య లక్షణం యిదే.

అయితే కథానికను సృష్టించిన తొలి కథకులు అనుభూతికి ప్రాముఖ్యం ఇవ్వలేదు. లక్ష్యానికి (పాయింట్) ప్రాముఖ్యం ఇచ్చి, కథానికలోని సర్వాంగాలు దానికి అనుగుణంగా వుండేటట్లు చూసుకున్నారు. కథానికకు అనుభూతి దృష్టి వచ్చింది చేహూవ్‌తోనూ, మాన్స్‌ఫీల్డుతోనూ, కానీ, యీ నాటికీ (తెలుగులోనే కాదు. ప్రపంచమంతటా) రచయితలలో అత్యధిక భాగం లక్ష్యాన్ని గుర్తిస్తున్నారు గానీ, అనుభూతిని గుర్తించడం లేదు. గుర్తించినా, గుర్తించకపోయినా, పాత్రల అనుభూతులు వుండనే ఉంటాయి.

చదవండి :  సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 1

యేక రస వ్యంజకతా సూత్రం నాటక రంగంలోకి ప్రవేశించినప్పుడు నాటిక ఏర్పడింది. (ఇంగ్లీషులో దీన్ని One Act Play అంటారు. ) 19వ శతాబ్ది అంతంలో యిది కేవలం కాలక్షేపం కోసం curtain raiserగా పుట్టినప్పుడు దీని రస ప్రాముఖ్యానికి గుర్తింపు రాలేదు. యీ శతాబ్ది తొలి దశకంలో ఆ గుర్తింపు లభించినప్పుడు నాటిక స్వతంత్ర సాహిత్య శాఖగా నిలదొక్కుకుంది. నవలను కుదిస్తే నవల కానట్లే, నాటికను సాగదీస్తే నాటకం కాదు.

ఖండకావ్యం, కథానిక, నాటిక – యీ మూడు ఒకే సూత్రాన్ని ఆశ్రయించినట్టివి. మూడు యిటీవలి కాలంలో పైకి వచ్చినవే – 19వ శతాబ్ది ప్రారంభంలో ఖండకావ్యమూ, మధ్యలో కథానికా, చివరన నాటికా, మానవుని సంస్కారం పెరిగి, కొద్ది నిమిషాల వ్యవధిలో ముగిసే రచనలోని అనుభూతిని ఆస్వాదించగల హృదయ సౌకుమార్యం మానవునికి కలిగిన చారిత్రక దశలో యీ మూడు రూపొందినాయి. అలాంటి హృదయ సంస్కారం గతంలో యెక్కడా యెవరికీ లేదా అంటే, యే ఒకరిద్దరికో వుండవచ్చు – భాసుని లాంటి వాళ్ళకో, భవభూతిలాంటి వాళ్ళకో, కానీ, అలాంటి వాళ్ళు తగు సంఖ్యలో వుండి, పాఠకలోకమంటూ యేర్పడినప్పుడే యివి ఆదరణ పొందగలవు.

యిప్పుడీ గొడవంతా యెందుకు వచ్చినట్లు? యెప్పుడో పావు శతాబ్దం క్రితం రాసిన పాత కథలను అడ్డం పెట్టుకుని యింత ఆర్భాటం చేయడం యెందుకని యెవరైనా అడగవచ్చు. వ్యాపార పత్రికల ఉక్కు కౌగిట్లో చిక్కి కథానిక రూపురేఖలే కోల్పోయి, శల్యావశిష్టంగా బతుకుతున్నది. కథానికకు కాలక్షేపమే పరమాశయమై పోయింది. అంత మాత్రమే అయితే భరించవచ్చు. అది దురభిరుచులను ప్రోత్సహించే సాధనమైంది. కుసంస్కారాన్ని పెంచే పరికరమైంది. యీ దుష్పరిణామాన్ని ఎదిరించాలనే ఉద్దేశంతోనే యీ గొడవ చేస్తున్నాను. కథానిక స్వభావమేమిటో, దాని లక్షణాలేమిటో వివరిస్తే, కొందరికైనా మంచి అభిరుచి కలగవచ్చుననే ఆశతోనే యిదంతా రాస్తున్నాను.

యింతకూ కథానిక అంటే యేమిటి? కథానిక ఒకే ఒక అనుభూతిని కలిగించాలని పైన అన్నాను. కథానికకు ఒకే ఒక లక్ష్యం (పాయింటు ) వుండాలని అందరూ చెప్తారు. యెవరు రాసినా కథానికలో అంతో యింతో అనుభూతి యెలాగూ వుంటుంది కనుక, కాథరిన్ మాన్స్‌ఫీల్డు స్థాయిలో రాసే వాళ్లు యెలాగూ అరుదు కనుక, అనుభూతి ప్రస్తావన వదలిపెట్టి, ప్రస్తుతం లక్ష్యానికే పరిమితమౌదాం. కథానికకు ఒకే ఒక లక్ష్యం వుంటూ, దాన్ని సాధించడానికే పాత్రలూ, సన్నివేశాలూ మొదలైన అంగాలన్నీ వినియోగపడాలి. దీన్ని కథానికా నిర్వచనంగా స్వీకరించవచ్చు. నిర్వచనంగా బాగున్నా, కథానికను అర్థం చేసుకోవడానికి యిది చాలదు. కనుక కథానికా లక్షణాలేమిటో కాస్త వివరంగా చూడాలి.

నార్ల వెంకటేశ్వరరావుగారు కేంద్ర సాహిత్య అకాడెమీ కొరకు గురజాడ అని ఇంగ్లీషులో చిన్న గ్రంథం రాసినారు. అది 1979లో ప్రచురించబడింది. అందులో ఆయన కథానికకు మూడు ముఖ్య లక్షణాలు వున్నాయంటూ, పాఠకుని ఆకట్టుకునే ప్రారంభమూ, ఆశ్చర్యకరమైన అంతమూ, మధ్యలో సందులూ, గొందులూ పట్టకుండా సూటిగా ముందుకు పోవడమూ, అని ఆ మూడింటినీ పేర్కొన్నాడు. నిజానికి చివరిదొక్కటే కథానికా లక్ష్యాన్ని బట్టీ, దానికి అవసరమైన శిల్పాన్ని బట్టీ వుంటే వుండవచ్చు. అంటే, అవసరమైతే వుంటాయి. లేకపోతే వుండవు. అంతేగానీ, అవి తప్పక వుండవలసిన లక్షణాలు కాదు. నార్లగారు పరిశీలించిన గురజాడ కథల్లోనే ‘దిద్దుబాటు’ అనే దానిలో ఆకట్టుకునే ఆరంభమూ, ఆశ్చర్యకరమైన అంతమూ వున్నాయనవచ్చు. ‘పెద్ద మసీదు’ అనే కథానికలో (అది అసంపూర్ణం కాదనుకుంటే ) ఆశ్చర్యకరమైన ముగింపు వుంది. తక్కిన కథల్లో నార్లగారు చెప్పే ఆరంభమూ, అంతమూ లేవు. ఆయన మరొక కథానికను గురించి రాస్తూ, దేవుడు చేసిన మనుషులారా, మనుషులు చేసిన దేవుళ్లారా, మీ పేరేమిటి? అన్న వాక్యంతో అది మహా ఆసక్తికరంగా ప్రారంభమవుతుందని అన్నాడు. ఇక్కడ కూడా నార్లగారిది పొరపాటే. అది ఆ కథానికలో ప్రారంభ వాక్యం కాదు – కథానిక యొక్క పేరు. ఆ కథానిక ఉత్తమ పురుషలో ప్రారంభం కావడం గమనిస్తే ఆ వాక్యం శీర్షికకు సంబంధించిందే అని సులభంగా అర్థమౌతుంది.

చదవండి :  సంవేదన (త్రైమాసిక పత్రిక) - అక్టోబర్ 1968

నార్లగారు ఓ.హెన్రీ కథల చేత అతిగా ప్రభావితులైనట్లుంది. అందువల్లనే ఆశ్చర్యకరమైన అంతానికి అంత ప్రాముఖ్యం యిచ్చినారు. నిజానికి అలాంటి అంతాన్ని మెచ్చుకోవడం మంచి అభిరుచి కాదు. అలాంటి అంతం గల కథానికలు తరచుగా చౌకబారుగా వుంటాయి.

కుటుంబరావుగారి ‘సాహిత్య ప్రయోజనం’ అన్న వ్యాస సంకలనంలో ‘నవల – చిన్న కథ’ అనే వ్యాసంలో ఒక వాక్యం యిలా వుంది. ‘కథ అంతా చెప్పాలి, కథ తప్ప మరేమీ చెప్పకూడదు. కథలో ఏకత్వమూ, పరిపూర్ణత్వమూ వుండాలి. కథ చెప్పవలసిందేమిటంటే, అంతా చెప్పాలి, కథకు అవసరమైనదంతా, కథకు సంబంధించినదంతా, కథ చెప్పకూడనిదేమిటంటే, అనవసరమైనదేమీ చెప్పకూడదు. కథకు సంబంధంలేనిదేమీ చెప్పకూడదు. కథ తప్ప మరేమీ చెప్పకూడదు. అంతా చెప్పడం వల్ల యేకత్వమూ కథకు సిద్దిస్తాయి. కుటుంబరావుగారు అదే వాక్యంలో organic unity అనే ఇంగ్లీషు మాట కూడా వాడినారు. సజీవ ఏకత్వం అని దాని అర్థం. యేకత్వమనేది సజీవమైన యేకత్వంగా వుండాలి. కథలోని వివిధ సన్నివేశాలూ, పాత్రలూ ఒకదానికొకటి యాంత్రికంగా అతికించినట్లు గాకుండా, శరీరంలోని వివిధ అంగాలూ, రక్తమూ, చర్మమూ, నరాలూ మొదలైనవన్నీ పరస్పరాధారాలుగా, పరస్పర పోషకాలుగా వున్నట్లు సజీవ (organic) సంబంధం కలిగి వుండాలి. అలా వున్నప్పుడు అన్నిటికీ కలిసి సజీవ యేకత్వం సిద్ధిస్తుంది.

అయితే, కొకు యీ విషయాన్ని కథానికా లక్షణాలు అనకుండా, కథాశిల్పంలో సూత్రప్రాయంగా గమనించవలసిన అంశం అన్నాడు. ఒకే ఒక జీవిత సత్యాన్ని చెప్పడం కథానికా లక్షణమనుకుంటే, కొ కు చెప్పే యేకత్వమూ, పరిపూర్ణత్వమూ శిల్పానికి సంబంధించినవౌతాయి. అలా కాక యేకత్వ పరిపూర్ణతలను కథానికా లక్షణాలుగా గ్రహిస్తే, శిల్పమనేది వేరుగా వుండాలి. యీ లక్షణాలను సాధించే పద్ధతి శిల్పమౌతుంది. కథానికకు ప్రాణభూతమైన యేకత్వ పరిపూర్ణత్వ సూత్రాన్ని అర్థం చేసుకుంటే, దాన్ని శిల్పమన్నా నష్టమేమీ లేదు గాని, నా మట్టుకు నాకు దాన్ని కథానికా లక్షణమని, ఆ లక్షణాన్ని సాధించే పద్ధతిని శిల్పమనీ ఆనడం ఉచితంగా తోస్తున్నది.

అయితే యిక శిల్పమనేది యెలా ఉంటుంది?

వేలమంది కథానికలు రాస్తున్నారు గనుక, కథానిక రాయడం సులభమే అని రుజువైంది. కానీ, దాని లక్షణాలు చెప్పమంటే గొప్ప మేధావులు కూడా పొరపాటు పడవచ్చునని పైన వెల్లడైంది. కథానికా శిల్పాన్ని వివరించడం అంతకంటె కష్టమైన పని. యెందుకంటే, శిల్పమనేది అనేక రకాలుగా వుంటుంది. రచయిత వ్యక్తిత్వాన్ని బట్టి శిల్పం మారుతుంది. అలాగే రచనను బట్టి కూడా శిల్పం మారవచ్చు. అంటే, ఒక రచయిత రాసిన కథానికల్లో కూడా అన్నిటిలోనూ ఒకే శిల్పం వుండదు. గురజాడ రాసిన అయిదు కథానికల్లోనూ రెండు ఉత్తమ పురుషలో నడుస్తాయి. తక్కినవి ప్రథమ పురుషలో నడుస్తాయి. యిది శిల్పభేదం.

రచయిత గురించి

1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 25న తుది శ్వాస వదిలారు.

ఇదీ చదవండి!

సాహిత్య ప్రయోజనం

సాహిత్య ప్రయోజనం – రాచమల్లు రామచంద్రారెడ్డి

నిత్యజీవితంలో సాధారణంగా యెంతో సహజమైన వ్యావహారిక భాషే మాట్లాడుతూంటారు. కానీ, వాళ్ళే కలం పట్టుకొనేటప్పటికి, శైలి కొరకు చేసే ప్రయత్నంలో, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: