కవులూ..కళాకారులూ ఉద్యమానికి సన్నద్ధం కావాలి

మైదుకూరు: రాయలసీమ రచయితలు చాలామంది రాజకీయాలు మాట్లాడకుండా సీమ దుస్థితికి ప్రకృతిని నిందిస్తూ ఏడుపుగొట్టు సాహిత్యాన్ని రచించడం ఎంతమేరకు సబబు అని విరసం రాష్ట్ర కార్యదర్శి పి.వరలక్ష్మి ప్రశ్నించారు. స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్ ఆవరణలో ఆదివారం కుందూసాహితీసంస్థ ఆధ్వర్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ భవితవ్యము అనే అంశంపై సంస్థ కన్వీనర్ లెక్కల వెంకటరెడ్డి అధ్యక్షతన రచయితలు, కవులు, కళాకారుల సమావేశంలో ఆమె పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్ర విభజన తర్వాత కూడా నూతన ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రులో కూడా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాద సూచికలు కనిస్తున్నాయని, సీమ సమస్యల పరిష్కారం కోసం రచయితలు, కవులు, కళాకారులు ఉద్యమానికి సన్నద్ధం కావాలని కుందూసాహితీసంస్థ ఏకగ్రీవంగా తీర్మానించింది.

చదవండి :  తుమ్మేటి రఘోత్తమరెడ్డికి కేతు పురస్కారం ప్రధానం

లెక్కల వెంకటరెడ్డి మాట్లాడుతూ నూతన ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని ఏర్పాటు విషయమై ఏకపక్ష నిర్ణయాలు జరిగిపోతున్నాయని, రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై కమిటీని ఏర్పాటుచేశారని, కమిటీ నిర్ణయం వెలువడకముందే రాజధానిని గుంటూరు – విజయవాడ మధ్యలో ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు.

నూతన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చేపడుతున్న అనేక అభివృద్ధి పనులన్నీ కోస్తా ప్రాంత ప్రయోజనాల కోసమే రూపొందిస్తున్నట్లుగా అర్థమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల పట్ల ఆలోచన, ఐక్యత, పోరాట దృక్పథం రాయలసీమ ప్రజల్లో కొరవడిందని, సీమ అభివృద్ధి పోరాటంలో సాహితీకారులు ముందుండి నడవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధానిని కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రాంతంలో ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.

చదవండి :  అలా ఆపగలగడం సాధ్యమా?

కథా రచయిత తవ్వా ఓబుళరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సమస్యలను ప్రతిబింబించేందుకు, సీమకు జరుగుతున్న అన్యాయాలను ఎత్తిచూపేందుకు పత్రికలు, టివి ఛానళ్లు ఎంతమాత్రం ఆసక్తి చూపడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు మల్లెల భాస్కర్ మాట్లాడుతూ రాజధాని ఏర్పాటు విషయంలో రాయలసీమకు అన్యాయం చేస్తూనే రాజధాని ఏర్పాటుకు సీమలో అనుకూల వాతావరణం లేదని సీమ ప్రజలతోనే అనిపించే దురాగతానికి వడిగడుతున్నారని ఆయన విమర్శించారు.

విరసం రాష్ట్ర కార్యదర్శి పి.వరలక్ష్మి మాట్లాడుతూ సీమ సమస్యలపై అంతో ఇంతో మాట్లాడుతున్నది, కలాలు కదిలిస్తున్నది సాహితీకారులేనని, ఈ ప్రాంత రాజకీయ నాయకులకు రాయలసీమ భవితవ్యంపై ఏమాత్రం శ్రద్ధ లేదని పేర్కొన్నారు. ఆధిపత్య విద్రోహరాజకీయాలను గురించి రాయకుండా రాయలసీమకు సాహిత్యం ద్వారా ఏం వెలగబెడతారని ఆమె ప్రశ్నించారు.

చదవండి :  'తలుగు' పుస్తకావిష్కరణ అయింది

రైతు స్వరాజ్యవేదిక కన్వీనర్ పోలుకొండారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ సాహిత్యానికి సంబంధించిన సాహిత్యం ప్రజల మధ్యకు తీసుకురావడానికి కృషిచేయాలన్నారు. ఎవి.రమణ మాట్లాడుతూ రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలకు రాయలసీమకు చెందిన నేతలే నాయకత్వం వహిస్తూ, రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే వౌనం వహించడం దారుణమని విమర్శించారు.

సత్తాజ్ మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక రాష్టమ్రే శరణ్యమన్నారు. ఈ కార్యక్రమంలో దరిమిశెట్టి రమణ, సుబ్బానాయుడు, వీరనారాయణ, డి ఎన్.నారాయణ, ఎం.చెన్నారెడ్డి పాల్గొన్నారు

ఇదీ చదవండి!

సీమ బొగ్గులు

సీమ బొగ్గులు (ముందు మాట) – వరలక్ష్మి

ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: