Meghnadh Reddy Family

‘కాబోయే కలెక్టర్ అమ్మానాన్నలు’

పిల్లల్ని బడికి పంపడానికిపెద్దలు తాయిలం పెడతారు.

అయితే మేఘనాథ్ తండ్రికి..

బడే తాయిలం అయింది!

‘పశువుల పని పూర్తి చేస్తేనే…

ఇవాళ నీకు బడి…’ అని తండ్రి పెట్టే ఆశకు, చదువుపై ఉన్న ఇష్టానికి మధ్య…

గొడ్ల చావిడిలో ఆయన బాల్యం నలిగిపోయింది!

అదిగో అలా పడింది ఈశ్వర్‌రెడ్డి మనసులో…

తన పిల్లల చదువు…

తన చదువులా తాయిలం కాకూడదని.

చదువే సర్వస్వం అన్నాడు.

చక్కగా చదివించాడు.

అందుకే…

సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించిన మేఘనాథ్ సక్సెస్‌స్టోరీలో సగం అతడి తండ్రిది!

ఆ సగంలో సగం… మేఘనాథ్ తల్లిది.

*  *  *

జోగిరెడ్డి ఈశ్వర్‌రెడ్డి, లక్ష్మీదేవి దంపతులు సాధారణమైన రైతు కుటుంబీకులు. గడచిన మే నెలతో వారి పరిచయం ‘కాబోయే కలెక్టర్ మేఘనాథ్ అమ్మానాన్నలు’గా మారిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి రెండు వాక్యాల్లో ఇంత సింపుల్‌గా కనిపిస్తోంది. కానీ ఈ సింపుల్ అనే మాట వెనుక ఈ దంపతుల కఠోర శ్రమ ఉంది, పిల్లల మీద పెట్టుకున్న నమ్మకం ఉంది. ఆ వివరాలను చెప్పమన్నప్పుడు మేఘనాథ్ తండ్రి ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ…

‘‘మాది అనంతపురం జిల్లా వెన్నపూసపల్లి. దిగువ మధ్య తరగతి కుటుంబం కావడంతో ఇంట్లో అందరం పని చేయాల్సిందే. నాకు చదువు బాగా వచ్చేది, కానీ మా ఊర్లో ఐదవ తరగతి వరకే ఉండేది. సిక్స్త్ క్లాస్‌కి ఎలనూరు వెళ్లాలి. అప్పుడు ఇంట్లో ‘బడికి పోవాలంటే ఉదయాన్నే పశువుల పని చేసిన తర్వాతే వెళ్లాలి’ అని కండిషన్ పెట్టారు. పనులన్నీ చేసి స్కూలుకెళ్లేవాడిని. అది కూడా రెండేళ్లే. ఎయిత్ క్లాస్ సెలవుల్లో వ్యవసాయ పనులు చూసుకోకపోతే కష్టమని పట్టుబట్టారు మా అమ్మానాన్న, అయిష్టంగానే బడి మానేశాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నా పిల్లలను చదివించడానికి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోవాలన్న కసి, పట్టుదల రావడం వెనుక ఇంత కథ ఉంది. పెళ్లయిన తర్వాత మా అత్తగారి ఊరు పైడాల గ్రామంలో పొలం కొనుక్కుని ప్రొద్దుటూరులో కాపురం పెట్టి, పిల్లలిద్దరినీ ఎల్‌కేజీ నుంచి కాన్వెంట్ స్కూల్‌లో చదివించాను ’’ అన్నారు.

మా కష్టాన్ని తెలుసుకుని చదివారు!

లక్ష్మీదేవి పిల్లల బాల్యాన్ని తలుచుకుంటూ ‘‘వ్యవసాయం పనులు ఏడాదంతా ఒకేరకంగా ఉండవు. నాలుగు నెలలు పగలురాత్రి అనుకోకుండా పనిచేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఆయన పైడాలలోనే ఉండేవారు. నేను రాత్రి రెండుగంటలకు లేచి వంట చేసుకుని ఉదయాన్నే పిల్లలను తయారు చేసి, వాళ్లకు బాక్సులు సర్ది స్కూల్లో దించి, ఆయనకు భోజనం తీసుకుని పైడాలకు పోయేదాన్ని. పొలం పనులు చూసుకుని తిరిగి ప్రొద్దుటూరు వచ్చేసరికి సాయంత్రం ఆరయ్యేది. వ్యవసాయ పనులు లేనప్పుడు పిల్లల్ని ఆయన సైకిల్ మీద స్కూల్లో దించేవారు. భోజనం నేను తీసుకెళ్లేదాన్ని. సాయంత్రం వెళ్లి ఇంటికి తీసుకువచ్చి, మళ్లీ ట్యూషన్‌లో దించేదాన్ని. మేము చేతి నిండా డబ్బు ఉండి చదివించడం లేదు, చదివించడం కోసం కష్టపడుతున్నామని మా పిల్లలిద్దరికీ తెలుసు. శాంతికి 85 శాతం మార్కులు వచ్చేవి, మేఘ ఇంకా మంచి మార్కులు తెచ్చుకునేవాడు. మేఘ జాతకం చూపిస్తే గుణవంతుడు, బుద్ధిమంతుడు అవుతాడని చెప్పారు. ఎంత అణకువైన పిల్లవాడంటే… ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే చెప్పి వెళ్తాడు, పని మీద వెళ్లేటప్పుడు మా పాదాలకు మొక్కుతాడు’’ అన్నారామె పక్కనే ఉన్న మేఘనాథ్‌ని మురిపెంగా చూసుకుంటూ.

చదవండి :  ప్రొద్దుటూరు కోడెద్దులు రంకేసి బండ లాగితే...

ఐఏఎస్ అవుతానంటే మేం కాదంటామా!

పిల్లల్ని చదివించడం, వాళ్లు బాగా చదువుకోవడం ఒక కోణం. అయితే పోటీ పరీక్షల్లో రాణించడానికి మార్గదర్శనం తప్పనిసరి. లక్ష్మీదేవి ఇదే విషయం చెబుతూ ‘‘మాకు పిల్లల్ని మంచిగా చదివించుకోవాలన్న తపన తప్ప ఎప్పుడు ఏ పరీక్షలు రాయించాలనేది తెలియదు. ప్రొద్దుటూరులో ఆదిత్య స్కూలు టీచర్లు ఎక్కడ కాంపిటీషన్ జరుగుతున్నా తీసుకెళ్లేవారు. మేఘ టెన్త్‌లో 551 మార్కులు తెచ్చుకున్నాడు. ఎపిఆర్‌జెసి పరీక్షలో రాష్ట్రంలో ఆరవ ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇంటర్ విజయవాడ చైతన్య కాలేజ్‌లో చదువుతూనే ఎన్‌డిఎ పరీక్ష రాశాడు. మంచి రిజల్ట్ వచ్చింది, కానీ మేఘ మనసు ఐఎఎస్ మీదనే ఉండేది. విజయవాడలో ఉండగానే ఒకసారి వాళ్ల నాన్నను పిలిపించుకుని ‘ఎంసెట్, ఇంజనీరింగ్ కాదు, ఐఎఎస్ అవుతా’నని తన కోరికను బయటపెట్టాడు’’ అన్నారామె.

అక్షరమే ఆయుధం!

కెరీర్ ప్లానింగ్ అంతా మీదేనా అన్నప్పుడు ‘‘నేను చదువు విలువ చెప్పాను, విజ్ఞానవంతులు కావడం ద్వారానే ప్రసిద్ధులైన ప్రముఖులను ఉదాహరణగా చూపించేవాడిని. స్వామి వివేకానంద, ఎపిజె అబ్దుల్‌కలాం, ప్రధాని మన్‌మోహన్ సింగ్‌లను గుర్తు చేసేవాడిని. చేయి పట్టుకుని నడిపించింది నిజాం కాలేజ్‌లో డిగ్రీలో చేర్చే వరకే. తర్వాత తన దారిని తనే ఎంచుకున్నాడు. డిగ్రీలో చేరగానే సివిల్స్ కోచింగ్ కూడా మొదలు పెట్టాలని ఆర్‌సి రెడ్డి కోచింగ్ సెంటర్‌కెళ్లాం. అందరూ ఇంజనీరింగ్ చదువుతున్న రోజుల్లో సివిల్స్ కోసమే డిగ్రీలో ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్న సంగతి తెలిసి ఆర్‌సి రెడ్డిగారు ‘సివిల్స్ మిస్సయితే ఎలా’ అన్నారు. అప్పుడు మేఘనాథ్ ‘మిస్ కాను’ అని స్థిరంగా చెప్పాడు. అప్పుడాయన ఫీజు అక్కర్లేదు, క్లాసులకు రావచ్చన్నారు. కానీ అంతదూరం వెళ్లడం కుదరక హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో చేరాడు’’ అని వివరించారు ఈశ్వర్‌రెడ్డి.

చదవండి :  రాయలసీమకు ఏం చేసింది?

తొలి సంపాదనతో..!

సివిల్స్ కోసం మేఘనాథ్ పడిన శ్రమను గుర్తుచేసుకుంటూ లక్ష్మీదేవి ‘‘డిగ్రీ చదివిన మూడేళ్లు చాలా కష్టపడ్డాడు మేఘ. రెడ్డి హాస్టల్ నుంచి కాచిగూడకు నడిచి వచ్చి బస్సెక్కి అశోక్‌నగర్‌లో దిగి, కొంతదూరం నడిచి ఉదయం ఆరుకే కోచింగ్ సెంటర్‌కి చేరేవాడు. కాంపిటీషన్‌లలో పాల్గొని ప్రైజ్‌లు తెచ్చుకున్నాడు. బిఎలో నిజాం కాలేజ్ టాపర్ కూడ. ఆర్‌బిఐ వాళ్లు పెట్టిన పరీక్షలో పాసయి బెంగుళూరులో రెండు నెలలు ఇంటర్న్‌షిప్ చేశాడు. ఆ ఇంటర్న్‌షిప్‌కి ఇరవై వేలిచ్చారు. అదే మేఘ మొదట సంపాదన’’ అని చెప్తుండగా ఈశ్వర్‌రెడ్డి ‘‘ఆ డబ్బుతో వాళ్లమ్మకి, చెల్లికి బట్టలు తెచ్చాడు. తోటి విద్యార్థులు కష్టపడుతుంటే చూడలేకపోయేవాడు మేఘనాథ్. ఎంఎ చదివేరోజుల్లో ఒక ఒరిస్సా అబ్బాయికి చదువాపేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి ‘మంచి స్టూడెంట్, చదువు మానేసి వెళ్తానంటున్నాడు, ఆ అబ్బాయి ఫీజులు కడతావా నాన్నా’ అని అడిగాడు. అప్పటికే ఫ్రెండ్స్‌ని తలా కొంత వేసుకుని చదివిద్దాం అని అడిగాట్ట. వాళ్లు ముందుకు రాకపోవడంతో నా చేత ఫీజు కట్టించాడు’’ అన్నారు.

పరిధి విస్తరించాలంటే..!

కాలేజ్ చదువుకి విజయవాడకు పంపించడంలో ఆంతర్యాన్ని వివరించారు లక్ష్మీదేవి. ‘‘పెద్ద ప్రపంచాన్ని చూస్తే ఆలోచన విస్తరిస్తుందనేవారు మావారు. కొంతమంది ఈ వయసులో బయటకు పంపిస్తే దురలవాట్లు నేర్చుకుంటారని భయపెట్టారు. వాళ్లతో ‘నా పెంపకం మీద నమ్మకం ఉంది. మేఘ అలా మారడు’ అన్నాను. నా నమ్మకాన్ని నిలబెట్టాడు. పాప బిఎస్సీ, ఎంబిఎ హైదరాబాద్‌లో చదివింది. పిల్లలిద్దరూ ప్రొద్దుటూరు నుంచి వెళ్లేటప్పుడు నాతో ఎలా ఉండేవాళ్లో ఇప్పుడూ అలాగే ఉన్నారు. నేనెప్పుడైనా ‘చెడు సావాసాలు చేయొద్దని’ జాగ్రత్త చెప్పబోతే ‘అమ్మా నీ పెంపకం మీద నమ్మకం లేదా’ అనేవాడు మేఘ. ఇద్దరికీ దైవభక్తి ఎక్కువ. మేఘ ఢిల్లీలో కోచింగ్ తీసుకుని పరీక్షలు రాస్తుంటే శాంతి చిలుకూరు బాలాజీ గుళ్లో వాళ్ల అన్నయ్య కోసం పూజలు చేసేది. మా ఊళ్లో అందరూ ‘మీ కష్టం వృథా కాలేదు. పిల్లలు వృద్ధిలోకి వచ్చారు’ అని పొగుడుతుంటే చాలా సంతోషంగా ఉంటోంది’’ అన్నారామె ఆనందంగా.

చదవండి :  మన పోలీసుకుక్కలకు బంగారు, రజత పతకాలు

ఆ క్షణం నోట మాట రాలేదు!

సివిల్స్ ర్యాంకు వార్త విన్న సందర్భాన్ని గుర్తుచేసినప్పుడు… లక్ష్మీదేవి ‘‘జాకెట్ కుట్టుకుందామని మిషన్ దగ్గర కూర్చున్నాను. ఇంతలో మేఘ నుంచి ఫోన్… ‘మంచి ర్యాంకు వచ్చిందమ్మా’ అన్నాడు. ఆ మాటకు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. నోట మాట రాలేదు’’ అంటుండగా ఈశ్వర్ రెడ్డి ‘‘మే నెల మూడవతేదీ, మధ్యాహ్నం 3:45 నిమిషాలకు ఫోన్ వచ్చింది, గంటలోపే విలేకరులు, బంధువులతో ఇల్లు నిండిపోయింది’’ అని గుర్తు చేసుకున్నారు. దేవుడిచ్చే రత్నాలు పిల్లలు. ఆ రత్నాలను పదిలంగా కాపాడడంతోపాటు వాటికి సానబెడుతూ మెరుగులు విరజిమ్మే వరకు శ్రమించడం అమ్మానాన్నల బాధ్యత. ఆ శ్రమలో ఆనందం పొందుతూ తమ బాధ్యత నిర్వర్తించడంలో సఫలీకృతులైన తల్లిదండ్రులు ఈ దంపతులు.

మేఘనాథ్‌కి జ్ఞాపకశక్తి ఎక్కువ. జనరల్‌నాలెడ్జ్ పుస్తకాలు తెచ్చి సెలవుల్లో చదివించేవాడిని. పుస్తకమహల్ బుక్స్ ఎన్ని కొన్నానో లెక్కేలేదు. చదివిన ప్రతి విషయాన్నీ గుర్తుపెట్టుకుని, ఎప్పుడడిగినా చెప్పేసేవాడు. జ్ఞాపకశక్తి ఇంత అని చెప్పడం నాకు తెలియదు, ఒక ఉదాహరణ మాత్రం చెప్పగలను. మేఘకు చదువు చెప్పిన టీచర్ రామిరెడ్డిసార్‌కి కూడా ఒకసారి ఇదే సందేహం కలిగింది. క్లాసులో పాఠం చెప్పి వెంటనే అదే పాఠాన్ని తిరిగి చెప్పమన్నప్పుడు పొల్లు పోకుండా తిరిగి చెప్పాడు. మేఘనాథ్‌తో సివిల్స్ రాయించమని ప్రోత్సహించింది కూడా ఆయనే.

– ఈశ్వర్‌రెడ్డి, మేఘనాథ్ తండ్రి

– వాకా మంజులారెడ్డి

(courtesy: సాక్షి దినపత్రిక, ఫ్యామిలీ పుట – 15/07/2013)

ఇదీ చదవండి!

varadarajula reddy

వరదరాజులురెడ్డి అందుకే దేశంలోకి వచ్చారా!

రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ చిరునామా గల్లంతవుతున్న నేపథ్యంలో గౌరవమైన రాజకీయ ప్రస్థానం కోసం మళ్లీ తెదేపాలోకి వచ్చినట్లు వరదరాజులురెడ్డి చెబుతున్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: