గండికోట

యనకు ఆ స్థలం బాగా నచ్చింది. ఆ కొండ కోట నిర్మాణానికి ఎంతో అనువుగా ఉందనీ, అక్కడ కోటను నిర్మిస్తే ఆ చుట్టు పక్కల గ్రామం వెలసి సుసంపన్నంగా, ఎంతో వైభవంగా కళకళలాడుతుందనీ జ్యోతిష్కులు శెలవిచ్చారు. దాంతో కాకమహారాజులు అక్కడ కోటను నిర్మించాలని అనుకున్నాడు. వైకుంఠశుద్ధ పంచమి రోజున కోట నిర్మాణానికి శంకుస్థాపన జరిపాడు. అతితక్కువ వ్యవధిలోనే అక్కడ గండికోట ఆవిర్భవించి దుర్భేద్యమైన కోటగా పేరు తెచ్చుకుంది.

101 బురుజులతో నిర్మితమైన గండి కోట ఎంతో సుందరంగానూ, దృఢంగానూ ఉంటుంది. చుట్టూ నాలుగు మైళ్ల విస్తీర్ణంతో విశాలంగా ఉంటుంది. 40 అడుగుల ఎత్తుగల ఈ కోట అతి గంభీరంగా కనిపిస్తుంది. శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. ఈ కోటలో 15, 16 శతాబ్దాలలో నిర్మించిన అనేక దేవాలయాలు, మసీదులు ప్రాచీన శిల్పకలా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. చుట్టూ కొండలు, దట్టమైన అడవులు, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా అందంగా ఉంటుంది. తనకెవరడ్డంటూ కొండలను సైతం చీల్చుకుంటూ పెన్నా నది ఉరకలు వేసే చోట ఉన్న ఈ కోట పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.

పెన్నా నదికి కుడి ఒడ్డున ఉన్న అతి ప్రాచీన కట్టడమే గండి కోట. ఇది కడప జిల్లాలోని జమ్మలమడుగుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గండి కోట అనే చిన్న గ్రామంలో ఉంది. ఇది కడప జిల్లాలోని చారిత్రక ప్రదేశాల్లో ముఖ్యమైనది. శత్రువులు చొరబడకుండా పటిష్టంగా నిర్మించిన ఈ చోట ప్రకృతి రమణీయమైన దృశ్యాలకూ కొదవలేదు. గండి కోట అనే పేరులోనే ‘గండి’, ‘కోట’ అనే రెండు పదాలున్నాయి. అత్యంత వేగంతో, అమితమైన ఉత్సాహంతో పరిగెడుతున్న పెన్నా నది ధాటికి నిశ్చలంగా ఉన్న కొండకు గండి ఏర్పడింది. ఈ కొండమీద ఒక కోటను నిర్మించడంతో ఆ కోటకు ‘గండికోట’ అనే పేరు వచ్చింది. శరవేగంతో దూసుకుపోయే ఈ నది తీవ్రతకు ఏర్పడిన గండి దాదాపు నాలుగు మైళ్ల పొడవుంటుంది. ఈ గండి కోట నిర్మాణానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే పెన్నా నది అసలంత వేగంగా దూసుకుపోవడానికి కూడా ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది.

పెన్నా పినాకినిగా…

అగస్త్య అనే మహాముని శాపానికి గురైన పెన్నా నది కలుషితమైందట. దీంతో ప్రజలు ఆ నదిలోని నీటిని ముట్టుకోవడం మానేశారు. దీనికి కలత చెందిన పినాకిని కేశవ స్వామికి తపస్సు చేసిందట. ఆమె తపస్సుకు ప్రసన్నుడైన కేశవస్వామి ప్రత్యక్షమై నందికొండ సమీపంలోని తన పాలసన్నిధిలో పెన్నను మళ్లీ ఉద్భవించమని ఆజ్ఞాపించాడు. ఆ దిశలో ప్రవహించడం వల్ల అనేక రుష్యాశ్రమాలు ఎదురౌతాయని, అందువల్ల అగస్త్య ముని శాపానికి విమోచన కలుగుతుందని విష్ణుమూర్తి చెప్పాడట. ఆ విధంగా జమ్మలమడుగులోని కొండకు గండి కొడుతూ పెన్నా ఉత్సాహంతో ఉత్తర దిశగా పరుగులు తీస్తూ ప్రవహించి శాపవిమోచన పొందుతుంది. అప్పటి నుంచి ఈ నదిని పినాకిని నది అని కూడా అంటారు.

కాకమహారాజులు కథ 

గండి కోట నిర్మాణానికి సంబంధించి కూడా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కాకమహారాజులు ఈ కోటను నిర్మించాడనే కథ ఎక్కువగా ప్రచారంలో ఉంది. శాలివాహన శకం 1213 ప్రాంతంలో కాకమహారాజులు అనే ఆయన బొమ్మనపల్లిని పాలించేవాడు. ఆయన ఒక రోజు తన అనుచరులతో కలిసి వేట కోసం గండికోట ప్రాంతానికి వెళ్లాడు. ఆయనకు ఆ స్థలం బాగా నచ్చింది. ఆ కొండ కోట నిర్మాణానికి ఎంతో అనువుగా ఉందనీ, అక్కడ కోటను నిర్మిస్తే ఆ చుట్టు పక్కల గ్రామం వెలసి సుసంపన్నంగా, ఎంతో వైభవంగా కళకళలాడుతుందనీ జ్యోతిష్కులు శెలవిచ్చారు. దాంతో కాకమహారాజులు అక్కడ కోటను నిర్మించాలని అనుకున్నాడు. వైకుంఠశుద్ధ పంచమి రోజున కోట నిర్మాణానికి శంకుస్థాపన జరిపాడు. అతితక్కువ వ్యవధిలోనే అక్కడ గండికోట ఆవిర్భవించి దుర్భేద్యమైన కోటగా పేరు తెచ్చుకుంది.

ఆలయాలకు నెలవు

గండికోట అనేక ఆలయాలకు నిలయం. విజయనగర మహాసామాజ్య్రాన్ని హరిహర బుక్కరాయలు పాలిస్తున్న కాలంలో ఆయన కాశీ యాత్ర చేసి తిరిగి వస్తున్న సమయంలో దారిలో అనేక ఆలయాలను నిర్మించాడు. అందులో మాధవస్వామి ఆలయం ఎంతో ప్రముఖమైనది. కాశీ తిరుగు ప్రయాణంలో రాజు గండికోటలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయనకు ఒక కల వచ్చిందట. ఆ కలలో మాధవస్వామి దర్శనమిచ్చి ఈ ప్రదేశం అతి పవిత్రమైందనీ, ఇక్కడ తనకు ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించినట్టు అనిపించదట. ఆ విధంగా నిర్మించినదే ఈ మాధవస్వామి ఆలయం. ఆలయం నిర్మాణంతో పాటు, ఆ స్వామి నిత్యారాధన కోసం అర్చకులను ఏర్పాటు చేసి వారి జీవనానికి మాన్యాలు కూడా ఏర్పాటు చేసినట్టు అక్కడి శిలాఫలకాల మీద ఉంటుంది.

ఒక్క మాధవస్వామి ఆలయంతోనే ఆగక గండికోట లోపల, వెలుపల కూడా అనేక ఆలయాలను నిర్మించారు. రఘునాథ ఆలయం, శివాలయం, భైరవుని ఆలయం, వీరభద్ర దేవళం మొదలైన దేవాలయాలెన్నో ఉన్నాయి. పెన్నా నది ఒడ్డున వెంకటరమణాలయం కూడా ఉంది. ప్రస్తుతం ఈ ఆలయాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి.

మహమ్మదీయుల పరం

రాయల కాలం తర్వాత గండికోట మహమ్మదీయుల పరమైంది. ఆ సమయంలో గండికోట ఆలయాలన్నీ ధ్వంసమయ్యాయి. నేడు కొన్ని ఆలయాల్లో మూల విగ్రహాలే కనపడవు. ఈ కోటలోని శిల్పకళా వైభవం ఎంతగానో అలరిస్తుంది. ఆలయ గోడల మీద నృత్యభంగిమలలో ఉన్న స్త్రీమూర్తులు, ఇతర దేవతా శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతుంది. అవి నాటి శిల్పకళానైపుణ్యానికి నిదర్శనంగా ఉన్నాయి.

గోల్కొండ నవాబు ప్రతినిధిగా గండికోటను పాలించిన మీర్‌ జుమ్లా హయాంలో ఇక్కడి దేవాలయాల విధ్వంసకాండ నిరాటంకంగా జరిగిపోయింది. ఈ ఆలయాల స్థలంలో జమ్మా మసీదును నిర్మించారు. ఈ మసీదు నాటి సుందరమైన కట్టడాల్లో ఒకటి. దీనికి మూడు ప్రవేశద్వారాలున్నాయి. మసీదు ముందు భాగంలో భక్తులు నమాజు చేసుకోవడానికి వీలుగా విశాలమైన అరుగు ఉంది. అక్కడ అనేక యుద్ధాలు జరిగాయి. నేటికీ అక్కడ ఉన్న ఫిరంగులే అందుకు సాక్ష్యం.

అగస్త్య కోన

గండి కోట నుండి సుమారు 3 మైళ్ల దూరంలో అగస్త్య కోన ఉంది. అక్కడ అగస్త్యేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. ఈ ఆలయంలో గల లింగాన్ని అగస్త్య మహామునే ప్రతిష్టించాడని అంటారు. నేటికీ ప్రతిసంవత్సరం కార్తీక మాసంలో ఉత్సవాలు జరుగుతుంటాయి. ప్రతి కార్తీక సోమవారం రోజు చుట్టు పక్కల నుంచి అనేకమంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని, పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్తీకమాసం చివరి సోమవారం రోజు ఇక్కడ ఆలయం వారు భక్తులకు ఉచిత భోజనాలను ఏర్పాటు చేస్తారు. ఈ అగస్త్యకోన చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యాన్ని ఎంతగానో ఆస్వాదించొచ్చు. గండికోటలోనే వెలిసిన ఎల్లమ్మ జాతర ఎంతో వైభవంగా, కోలాహలంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధపాడ్యమి, విదియలలో రెండు రోజులు ఈ జాతరను నిర్వహిస్తుంటారు.

రాయల కొలను

గండికోటలో అనేక దిగుడు బావులుండేవి. అక్కడ రాయల చెరువు అని ఒక కొలను ఉండేది. అందులో ఎప్పుడూ నీరు ఉండేది. అందువల్ల చుట్టుపక్కల ప్రాంతాలు ఎల్లప్పుడూ సస్యశ్యామలంగా ఉండేవి. ఈ కోనేటి నీరు చల్లగా ఉంటాయి. అందుకే ఇక్కడికి వచ్చినవారు ఆ నీటిని తప్పక రుచి చూస్తారు.

గండికోటకు ఎలా వెళ్ళాలి?

దగ్గరి రైల్వే స్టేషన్: ముద్దనూరు (27 కి.మీ), కడప (85 కి.మీ)

రోడ్డు మార్గంలో…

దగ్గరి బస్ స్టేషన్ : జమ్మలమడుగు (14 కి.మీ)

ప్రయివేటు వాహన మార్గం:

కడప నుండి: కడప –> కమలాపురం –> ఎర్రగుంట్ల –> ముద్దనూరు –> వేమగుంటపల్లె –> గండికోట

చెన్నై నుండి: చెన్నై –> రేణిగుంట –> రాజంపేట –> కడప –> ముద్దనూరు –> గండికోట

బెంగుళూరు నుండి: బెంగుళూరు –> బాగేపల్లి –> గోరంట్ల –> పులివెందుల –> ముద్దనూరు –> గండికోట

హైదరాబాదు నుండి : హైదరాబాదు –> కర్నూలు –> బనగానపల్లి –>జమ్మలమడుగు –> గండికోట

వాయుమార్గంలో…

దగ్గరి విమానాశ్రయం: కడప (78 కి.మీ), తిరుపతి (219 కి.మీ), బెంగుళూరు (287 కి.మీ), హైదరాబాదు (35o కి.మీ), చెన్నై (360కి.మీ)

సమీపంలోని లాడ్జీలు:

గండికోట పరిసరాలలో 2009లో అం.ప్ర పర్యాటక శాఖ వారు ఒక రిసార్టు తరహా వసతి గృహాన్ని ప్రారంభించారు. ఈ వసతి గృహంలో 12 విడివిడి గదులు (ఏసి మరియు సాధారణ ), 2 సత్రాలు ఉన్నాయి.  వసతి గృహంలోనే భోజనం, స్నాక్స్ దొరుకుతాయి.

గండికోట
పర్యాటక శాఖ వారి అతిధి గృహం

కోట మొత్తం తిరగాలనుకేనే వారు లేదా అక్కడి పెన్నా లోయలో ట్రెక్కింగ్ చేయాలనుకునే వారు లేదా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించాల అనుకునేవారు పర్యాటక శాఖ వారి వసతి గృహంలో బస చేయటం ఉత్తమం.

వసతి గృహం ఫోన్ నంబర్ : +91-9010554899

gandikota front coverమరింత సమాచారం : కోటకు సంబంధించిన మరింత సమాచారం ‘గండికోట’ (రచన: తవ్వా ఓబులరెడ్డి, ప్రచురణ: తెలుగు సమాజం మైదుకూరు & www.www.kadapa.info)  పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. గండికోట చరిత్ర, కోటలోని ఆలయాల వివరాలు, పెమ్మసాని రాజుల చరిత్ర, గండికోట కైఫీయత్, శాసనాలు, గండికోట దేవుళ్ళపైన అన్నమయ్య రాసిన సంకీర్తనలు, కోటలోని సొరంగ మార్గాలు, గండికోట గురించి ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్  చెప్పిన సంగతులు …. మొదలైన వివరాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. విశాలాంధ్ర, పెన్నేటి పబ్లికేషన్స్, కినిగె ద్వారా ఈ పుస్తకం లభ్యమవుతోంది. ప్రత్యామ్నాయంగా పుస్తకం కావలసిన వారు +91-9440024471 అనే నంబర్ కు ఫోన్ చేసి కూడా తెప్పించుకోవచ్చు.

గండికోట ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

చదవండి :  కడప జిల్లాలో రేనాటి చోళులు - 1

ఇదీ చదవండి!

చెల్లునా నీ కీపనులు

చెల్లునా నీ కీపనులు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన – 2 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: