హోమ్ » చరిత్ర » గాంధీజీ కడప జిల్లా పర్యటన (1933-34)

గాంధీజీ కడప జిల్లా పర్యటన (1933-34)

1933-34 సంవత్సరాలలో గాంధీజీ కడప జిల్లాలో పర్యటించి సుమారు మూడు రోజుల పాటు జిల్లాలోనే బస చేసి వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆ వివరాలు కడప.ఇన్ఫో సందర్శకుల కోసం ప్రత్యేకం….

గాంధీజీ , ఆయన పరివారం తిరుపతి నుండి రేణిగుంట మీదుగా రైలులో కడపకు వెళుతుండగా శెట్టిగుంట రైల్వే స్టేషన్లో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు వెంకోబారావు గారు ఆయనను కలుసుకొన్నారు. ప్రతీ రైల్వేస్టేషనులో ప్రజలు గాంధీజీని సాదరముగా ఆహ్వానించారు.

Mahatma Gandhijiరాజంపేట రైల్వే స్టేషనులో ఆ పట్టణ వాసులందరూ మహాత్ముని దర్శనం కోసం వేచి ఉన్నారు. రాజంపేట యూనియన్ బోర్డు వారు ఆయనకు పూలదండలు వేసి స్వాగత పత్రం, హరిజన నిధికి విరాళము సమర్పించినారు. యూనియన్ బోర్డు ఉపాధ్యక్షుడు సుబ్బరాయ సెట్టి స్వాగత పత్రం చదివినారు.

గాంధీజీ స్వాగత పత్రానికి సమాధానమిస్తూ…

హరిజన నిధికి విరాలమిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపి, హిందువులలో నుంచి అస్పృశ్యతను నిర్మూలించవలెనని కోరినారు. హిందూ మతానికి కళంకంగా ఉన్న అస్పృశ్యతను నాశనం చెయ్యడం నాశనం చెయ్యడం హిందువుల కర్తవ్యము అన్నారు.

ఆ తరువాత “గాంధీజీకి జై” అనే నినాదాల మధ్య రైలు కూత వేసింది.

కడపలో…

1933 డిసెంబరు 31 రాత్రి 7.40 గం.కి గాంధీజీ సపరివారంగా కడప చేరినారు. జిల్లా హరిజన సేవా సంఘ అధ్యక్షుడు వకీలు సంజీవ రెడ్డి మహాత్మునికి పూలదండ వేసి స్వాగతం చెప్పినారు. కడప రైల్వే ప్లాటుఫారం నిండా క్రిక్కిరిసిపోయిన జనం గాంధీజీని జయధ్వానాలతో ఆహ్వానించినారు. గాంధీజీ రైల్వే స్టేషను నుంచి త్రివర్ణ పతాకాలతోను, తోరణాలతోను రమ్యంగా అలంకరించిన మోటారు కారులో పోతూ ప్రజల అభినందనలను, తన సహజ మందహాసముతో అందుకుని శాంతినికేతనానికి పోయి అక్కడ బస చేసినారు.

శ్రీ డి.వేంకటగిరి రెడ్డి గాంధీజీకి రూ.116ల విరాళము సమర్పించినారు. 1934 జనవరి 2 సాయంకాలం వరకు ఆయన విశ్రాంతి తీసుకొన్నారు. జనవరి 1,2 తేదీలు ఆయన ఉత్తరాలు, హరిజన వ్యాసాలు వ్రాసుకోనేటందుకు ఉపయోగించుకొన్నారు.

స్వదీశీ ఎంపోరియం ప్రారంభోత్సవం…

1934 జనవరి 2న సాయంకాలం 6 గంటలకు గాంధీజీ కడప స్వదేశీ ఎంపోరియంకు ప్రారంభోత్సవం జరిపినారు. ఆ చుట్టు పక్కల ప్రదేశాల నుంచి జనం ఆయన దర్శనార్థం రస్తాలలోను, ఇరుగు పొరుగు ఇండ్ల మీదా నిలబడి ఉన్నారు. బారిష్టర్ కృష్ణ స్వామి గాంధీజీకి పూలదండ వేసినారు. గాంధీజీ ఎంపోరియం తలుపులను తెరిచి అది శీఘ్రంగా వర్దిల్లవలెనని ఆశీర్వదిస్తూ.. అక్కడ చేరిన వారందరినీ ఖద్దరు ధరించటం వారి ప్రధమ కర్తవ్యంగా భావించవలెనని ఉద్భోదించినారు.

అటు తర్వాత ఆయన మునిసిపల్ పాకీ వారి వాడకు వెళ్ళినారు. అక్కడ కడప పురపాలక సంఘ అధ్యక్షులు బి.సయ్యద్ సాహేబు, ఉపాధ్యక్షుడు ఎస్. కృష్ణస్వామి గాంధీజీకి స్వాగతం చెప్పి ఆయనకు ఆ వాడంతా చూపించినారు. పాకీ వారి వాడ అభివృద్దిని చూసి గాంధీజీ సంతోషించినారు.

తరువాత గాంధీజీ మునిసిపల్ హైస్కూలులోని బహిరంగ సభా సమావేశానికి వెళ్ళినారు. కడప మునిసిపాలిటీ పక్షాన చైర్మన్ శ్రీ సయ్యద్ సాహేబు, జిల్లా బోర్డు పక్షాన బి.రామసుబ్బా రెడ్డి , రాయలసీమ నిమ్నజాతుల సంఘం తరుపున డా.గంగాధర శివ గారు గాంధీజీకి స్వాగత పత్రాలు సమర్పించినారు. ప్రజల పక్షాన జిల్లా బోర్డు అధ్యక్షుడు ౧౧౨ఒ (1120) రూపాయలు హరిజన నిధికి విరాళంగా ఇచ్చినారు.

గాంధీజీ సన్మాన పత్రానికి జవాబిస్తూ.. హరిజన నిధికి సమర్పించిన విరాళానికి కృతజ్ఞతలు తెలిపినారు. కడప మునిసిపాలిటీ వారు పాకీ వారికి చక్కని ఇండ్లను కట్టించినందుకు వారిని అభినందించినారు. ఆ హరిజనవాడ చక్కగా, పరిశుబ్రంగా ఉన్నదని, దానిలో ఒక సహకార సంఘము, ఒక దేవాలయము, మంచి నీటి సౌకర్యాలు ఉన్నాయని చెప్పి మహాత్ముడు తన సంతృప్తిని వెలిబుచ్చినారు.

సరిగ్గా ఈ సమయంలో జనం వత్తిడి ఎక్కువ కావటం వల్ల సభలో అలజడి రేగింది. వెంటనే గాంధీజీ సన్మాన పత్రాన్ని వేలం వేసి సభా కార్యక్రమం ముగించినారు.

కడపలో ఆచార్య మల్కాని మొదలైన వారితో పాటు బెజవాడ గోపాలరెడ్డి, బొమ్మ శేషురెడ్డి గార్లు గాంధీజీతో అస్పృశ్యతా నివారణ గురించి ఉపన్యసించినారు.

కడప నుంచి గాంధీజీ, ఆయన బృందము జనవరి రెండవ తేదీ రాత్రి 8.25గం.కు రాయచూరు ప్యాసింజరు మూడవ తరగతి బండిలో గుత్తికి బయలుదేరినారు.

గుత్తి తోవలో..

కడప నుంచి గుత్తికి పోయే దోవలో గంగాయపల్లె స్టేషను వద్ద రాత్రి 9గం. వేళ అనేకమంది ప్రజలు మహాత్ముని దర్శనానికి వేచి ఉన్నారు. గాంధీజీ నిద్రలో ఉండటం వలన ప్రజలు ఆయనను దర్శించటానికి వీలు లేకపోయింది.

వల్లూరు గ్రామంలోని శ్రీ రామకృష్ణ శారదా పతన మందిరం, శ్రీ సీతా రామచంద్ర గ్రంధాలయం వారి పక్షాన శ్రీయుతులు పోలేపల్లి వెంకట సుబ్బయ్య శెట్టి గారు మహాత్మునికి స్వాగత పత్రాన్ని, కానుకలను గాంధీజీ కార్యదర్శి గారికి అందజేసినారు. మహాత్ముడు విశ్రమించినందున అక్కడి ప్రజలు కూడా ఆయనను దర్శించలేక పోయినారు.

గాంధీజీ జనవరి మూడవ తేదీ ఉదయం గం.3.15లకు గుత్తి రైల్వే స్టేషనుకు చేరినారు.

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: