హోమ్ » పర్యాటకం » గుండాల కోన

గుండాల కోన

పరుచుకున్న పచ్చదనం.. పక్షుల కిలకిలా రావాలు.. గలగలపారే సెలయేరు.. నింగికి నిచ్చెన వేసినట్లున్న కొండలు.. కనువిందు చేసే కమనీయ దృశ్యాలు.. మేను పులకరించే ప్రకృతి అందాలు.. ఈ అందాలను తనివితీరా చూసి తరించాలంటే గుండాల కోనను దర్శించాల్సిందే. పచ్చని చెట్లు, ఎత్తైన కొండల మధ్యలో కొలువు దీరిన నీలకంఠేశ్వరుడు ఈ కోనకు ప్రత్యేక ఆకర్షణ.

గుండాల కోన
గుండాల కోనలోని ఒక జలపాతం

ఓబులవారిపల్లి మండలం వై.కోటనుంచి 15 కిలోమీటర్లు, రైల్వేకోడూరు నుంచి 12 కిలోమీటర్ల దూరంలో శేషాచల అడవుల్లో గుండాల కోన క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే మనసు తేలికవుతుంది. ఓ వైపు కొండలు, మరో వైపు వృక్షాలు ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్నాయా అనిపించేట్లు ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాలు ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాయి. గతంలో ఇక్కడ ఎన్నో సినిమా షూటింగులు జరిగాయి.

ఈ అటవీ ప్రాంతంలో ఆరోగ్యాన్ని కలిగించే ఔషధగుణాలున్న కరక్కాయ, జాజికాయ, ఉసిరి, కొండమామిడి, మారేడు, నేలవేము, వట్టివేళ్లు, ముష్టి తదితర వనమూలికా వృక్షాలు విస్తారంగా ఉన్నాయి. సమీప ప్రాంతాల్లోని గిరిజనులు ఈ అడవిపై ఆధారపడి జీవనయానం సాగిస్తున్నారు. ఇక్కడి ఫలసాయమే వారి బతుకు బండిని ముందుకు నెడుతోంది. పశువుల జీర్ణక్రియకు ఉపయోగపడే బిళ్లు, జిట్టంగి, సిండవ తదితర బెరడులను అందించే వృక్షాలకు కూడా ఈ అడవి నిలయం. ఇక్కడ నెలవై ఉన్న నీలకంఠేశ్వరుడు భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా భాసిల్లుతున్నాడు.

ఆక ట్టుకునే సప్తగుండాలు…

ప్రకృతి సిద్ధంగా శతాబ్దాల క్రితం ఇక్కడ ఏర్పడిన ఏడు గుండాలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడి నీటిలో మునిగి దేవుని దర్శించుకుంటే పాపాలు పోతాయని పూర్వీకుల నమ్మకం. ఒక్కసారి గుండాలలో స్నానమాచరిస్తే అప్పటివరకు ఉన్న బడలిక మటుమాయమవుతుందని అనేకమంది చెబుతారు. అడవిలో ఉన్న ఎన్నో ఔషధ మొక్కల వేర్లను తాకి నీరు రావడం వల్ల ఆ ప్రభావం ఉందని వైద్యులు సైతం అంటున్నారు. ఇక్కడ ఉన్న ఏడు గుండాల ఆకారాలను బట్టి వాటికి చదును గుండం, బూడిద గుండం, సమారాధన గుండం, అక్కదేవతల గుండం, పసుపుగుండం, గిన్నేగుండం, స్నానగుండం అనే పేర్లు పెట్టారు. చదునుగుండంగా చెప్పేచోట నుంచి నీరు గిన్నె ఆకారంలో ఉన్న బండలపై పడుతుంది. దీనినే గిన్నెగుండంగా పిలుస్తున్నారు.

ఇక్కడే స్నానగుండం ఉంది. గిన్నె గుండంలోని నీరు ఇక్కడకి చేరుతుంది. ఈ నీరు మరో గుండంలోకి పడగానే పసుపు రంగులోకి మారుతుంది. అందువల్లనే దీనికి పసుపు గుండం అని అంటారు. ఆ తర్వాత ఈ నీరు మరో గుండంలో పడగానే బూడిదరంగుగా మారడంతో దాన్ని బూడిదగుండం అంటున్నారు. ఈ నీరు సమారాధన గుండంలోకి వెళుతుంది. ఇక్కడే భక్తులు స్నానమాచరిస్తారు.

కారణాలు ఏమైనప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులు గుండాల్లో స్నానమాచరించి తమ బాధలు మరచి మానసిక ప్రశాంతత పొందుతారు. మహాశివరాత్రి రోజున ఇక్కడికి వచ్చే భక్తులకు దేవాలయం నిర్వాహకులతో పాటు రైల్వేకోడూరు ఆర్యవైశ్యులు అన్నదానం ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాంతానికి చేరేందుకు వై.కోట నుంచి రోడ్డు మార్గం కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. పర్యాటక శాఖ అధికారులు స్పందిస్తే గుండాలకోనకు ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుందనడంలో సందేహం లేదు.

(సౌజన్యం: సాక్షి దినపత్రిక)

ఇదీ చదవండి!

kadapa district map

ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ ల్యాబూ పోయే!

DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: