కడప జిల్లా అంటే ముఖ్యమంత్రికి చిన్నచూపు: రఘువీరా

సీమ ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారు

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం

కడప: కడప జిల్లా అంటే ముఖ్యమంత్రికి చిన్నచూపని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ‘కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన రఘువీరారెడ్డి మాట్లాడుతూ… కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం కాంగ్రెస్ రాజీలేని పోరాటం చేస్తుందని, ఇందుకోసం ప్రజలతో మమేకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన పేర్కొన్నారు.

మోదీకి భయపడి చంద్రబాబు ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేయడంలేదని విమర్శించారు. రాష్ట్రానికి రూ.5 లక్షల కోట్లు, ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడపలో ఉక్కు పరిశ్రమ తదితర అంశాలను చట్టంలో పొందుపరిస్తే వాటిని తీసుకొచ్చేందుకు కేంద్రంతో మాట్లాడమంటే ముఖ్యమంత్రి భయపడుతున్నారన్నారు.

చదవండి :  జిల్లా అభివృద్ధికి పోరుబాటే శరణ్యం: అఖిలపక్షం

ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు జిల్లాలోనే అన్ని వసతులు, సౌకర్యాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించకపోవడంతో పరిశ్రమ దూరమవుతోందన్నారు. చట్టంలోని అంశాలను అమలు చేయడంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు.

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌లో యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రధానమంత్రిని నిలదీస్తుంటే రాష్ట్రంలోని తెదేపా, వైకాపా, భాజపా ఎంపీలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటన్నారు. రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే ముఖ్యమంత్రి చేయాల్సింది ఏమీలేదని… కాంగ్రెస్ పార్టీ చేపట్టిన, పూర్తి కావచ్చిన ప్రాజెక్టులు హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగలను పూర్తి చేస్తే చాలన్నారు.

చదవండి :  ఈ కలెక్టర్ మాకొద్దు

పట్టిసీమ చంద్రబాబు, ఆయన అనుచరులు జేబులు నింపుకునేందుకు తప్ప సీమ ప్రజలకు ఎలాంటి ఉపయోగంలేదన్నారు. తెదేపా పాలనలో రాయలసీమ ప్రజలు అభద్రతా భావంలో ఉన్నారని ఇది చాలా ప్రమాదకరమన్నారు.

శాసనమండలి ప్రతిపక్షనేత రామచంద్రయ్య మాట్లాడుతూ తెదేపా అరాచక పాలన నుంచి రాయలసీను రక్షించుకునేందుకు సమష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు.

మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ జిల్లాల మధ్య తగవులు పెట్టి ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నారని, ఆయనకు జ్ఞాపక శక్తి నశించినట్లుందని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉందని బీద అరుపులు అరుస్తున్నారని.. కేవలం 13 జిల్లాలో రూ.1.45 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు ఇలాంటి అరుపులు ఎందుకని ప్రశ్నించారు.

చదవండి :  బాబు రేపు జిల్లాకు రావట్లేదు

కేంద్ర మాజీ మంత్రి సాయిప్రతాప్, రాష్ట్ర మాజీ మంత్రులు తులసీరెడ్డి, అహ్మదుల్లా మాట్లాడుతూ రాయలసీమలో తిరుమల వేంకటేశ్వరుడు, శ్రీశైలం మల్లన్న, సహజ వనరులు ఉన్నాయని.. వాటన్నింటినీ పక్కనపెట్టి సొంత పనుల కోసం ప్రాకులాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర క్యాబినేట్‌లో ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా చోటుకల్పించలేదని, ఉర్దూ విశ్వవిద్యాలయం కోసం రిమ్స్ సమీపంలో భూ సేకరణకూడా జరిగితే కర్నూలుకు తరలించారన్నారు.

అనంతరం సీమ ద్రోహి చంద్రబాబు అంటూ పీసీసీ రూపొందించిన కరపత్రాలను నాయకులు ఆవిష్కరించారు.

ఇదీ చదవండి!

పోతిరెడ్డిపాడును

కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు

జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప:  రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: