chennai

చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

గుడికూలును నుయి పూడును

వడి నీళ్లం జెఱువు తెగును వనమును ఖిలమౌ

చెడనిది పద్యం బొక్కటి

కుడియెడమల చూడకన్న గువ్వలచెన్నా!

వంటి పద్యాలతో గువ్వల చెన్న శతకం శతకసాహిత్యంలో వన్నె కెక్కింది. ఆ నాటి సామాజికాంశాలను ప్రస్ఫుటంగా ప్రకటించి అధిక్షేపశతకాల్లో ఒకటిగా నిలిచింది. ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాల చరిత్రలు వందల వేల సంవత్సరాలవి కాగా మద్రాసు లేదా చెన్నపట్టణం అని పిలువబడుతూ ఉండిన నేటి ‘చెన్నయ్‌’ నగర చరిత్ర క్రీస్తు శకం పదిహేడో శతాబ్దం మధ్య కాలం నుంచే మొదలయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అయినా గువ్వల చెన్న శతకంలోని ఈ రెండు పద్యాలు చెన్న పట్టణం పుట్టుకను తెలియజేస్తున్నాయి.

1.చెన్నయను పదము మునుగుల

చెన్నగు పురమొకటి నీదు చెంతను వెలయున్‌

సన్నుతులు వేల్పునుతులును

గొన్నాతని కరుణచేత గువ్వల చెన్నా!

2. ధర నీ పేర పురంబును

గిరిజేశ్వర పాదభక్తి కీర్తియు నీయు

ర్వర నుతులు గాంతు విదియొక

గురువరముగ నెంచుకొమ్ము గువ్వల చెన్నా!

మొదటి పద్యంలోని తాత్పర్యం గమనిద్దాం. పండితులు, దేవతలు, పొగడిన వాని కరుణ చేత చెన్న పదం ముందుగా ఉంటూ అందమైన పట్టణం ఒకటి నీ సమీపంలో వెలుస్తుంది.

రెండోపద్యం. ”నీ పేరిట ఒక పట్టణం నిర్మాణ మవుతుంది. నీకు ఈశ్వర పదభక్తి, కీర్తి లభిస్తుంది. నీకు పొగడ్తలు అందుతాయి. దీనిని గురువరంగా భావించు”.

ఈ రెండు పద్యాలలోని మూలాంశం ఒక్కటే. అది ‘చెన్న’ పేరు మీద పురం ఒకటి తయారౌతుందని. ఈ శతకం మీద వెలువడ్డ వ్యాసాలు, పరిశోధనలు, అతి తక్కువగా ఉన్నా ఈ రెండు పద్యాలమీద దృష్టి సారించిన వారు లేరు. టాగూర్‌ పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాదు వారు ప్రచురించిన గువ్వల చెన్న శతకానికి పీఠిక వ్రాసిన పాతూరి రామాంజనేయులు ఈ పద్యాలు ప్రస్తావించారు గాని ఆ నగరం ఫలానా అని ప్రకటించలేకపోయారు. ఈ రెండు పద్యాల్లో పేర్కొన్న నగరం చెన్నపురి తప్ప మరొక్కటి కాదు. శతకంలోని కొన్ని పద్యాలు చెన్న పట్టణం (చెన్నయ్‌) చుట్టూ అల్లుకొన్న ఆనాటి సామాజికాంశాలను బహిర్గతం చేస్తాయి.

చదవండి :  రచయితకు "స్పిరిచ్యువల్ శాటిస్పాక్షన్' అవసరం

చెన్నయ్‌ నగరాన్ని ఆనాడు మదరాసు, చెన్నపట్టణం అని రెండు పేర్లతో పిలిచేవారు. ఆ రెండు పేర్లతో నగరం విస్తృతి అవుతున్న తొలినాళ్లలోనే ఈ రెండు పేర్లు ఆ ప్రాంతాలకు వచ్చాయి. ఆంగ్లేయులు సెయింట్‌ ఫోర్టు జార్జి కోటను నిర్మించుకొన్నాక కోట ఉన్న ప్రాంతాన్ని మదరాసు పట్నం అనేవారు. బయటి భాగాన్ని చెన్న పట్టణం అనేవారు. ఆంగ్లేయులు తమ వ్యవహారాల్లో మదరాసు పట్నం అని వాడుతుండగా తమిళులు, తెలుగులు చెన్నపట్టణం అని ఉపయోగించేవారు. మదరాసు అని పేరు రావడానికి చాలా వాదాలు ప్రచారంలో ఉన్నాయి కాని, చెన్న పట్టణం అని పేరు రావడానికి కేవలం రెండు వాదాలు ప్రచారంలో ఉన్నాయి. అవి అంకరాజు రచించిన ఉషాపరిణయం పీఠికలో ఉన్నది ఒకటి కాగా మరొకటి ఆ ప్రాంతంలో వెలసిన చెన్నకేశవ పెరుమాళ్ల కోవెల ఉన్నచోటు చెన్నకుప్పం అని పిలువబడటం.

క్రీ.శ. 1522లో మైలాపూర్‌ వద్దనున్న ఒక రేవులో గిడ్డంగినీ, కోటను కట్టుకొని బుడతకీచులు దానికి ‘శాంతోము’ అని పేరు పెట్టుకొన్నారు. ఆ తరువాత ఈ ప్రాంతానికి వచ్చిన డచ్చివారికి బుడతకీచులకు తగాదాలు వచ్చాయి. ఆ తగాదాలు మాన్పడానికి దామెర్ల అయ్యప్పరాజు చెన్నపట్టణాన్ని నిర్మించినట్లు, ఆ చెన్న పట్టణానికి తన తండ్రి పేరు పెట్టినట్లు ఉషాపరిణయం చెబుతూ ఉంది. ఆనందరంగ విజయ చంపువు ఒక సంస్కృత కావ్యం. తిరువేంగడం పిళ్లె, ఆనందరంగ పిళ్లె తండ్రి కొడుకులు. వీరి జీవిత చరిత్ర యిది. ఈ తండ్రికొడుకులు ఫ్రెంచి వారికి వకీళ్లుగా పనిచేశారు. ఈ కావ్యంలో చెన్నపట్ణం యొక్క అసలుపేరు చెన్నకేశవపురమన్నారు. చెన్నకేశవపెరుమాళ్ల దైవం మీదుగా చెన్నకేశవపురం ఏర్పడిందని అందలి సారాంశం.

ఉషా పరిణయం రచయిత అంకరాజు, అయ్యపరాజు, వెంకటరాజు – ఈ ముగ్గురు చెన్నరాజు కుమారులు. అయ్యపరాజు పూనమల్లిని పాలిస్తున్నాడు. వెంకటరాజు వందవాసిని పాలిస్తున్నాడు. ఈ వెంకటరాజు చంద్రగిరి ప్రాంతాన్ని పాలిస్తున్న పెద్ద వేంకటపతి రాయల బావమరిది. ఈయన విజయనగర సామ్రాజ్యాధిపతి. ఈయన అధీనంలోని ప్రాంతాలే ఇవన్నీ కూడా! బావగారి ఆజ్ఞానుసారం వెంకటరాజు రాయలవారికి ప్రధానమంత్రిగా ఉంటున్నాడు. పదివేల సైన్యానికి అధిపతి. ఈ వెంకటరాజు వెంకటపతిరాయల అనుమతితో ఆంగ్లేయులు గిడ్డంగి, కోట కట్టుకోడానికి ఒడంబడిక కుదుర్చుకొన్నాడు. ఈ ప్రాంతంలో కట్టే నగరానికి తమ తండ్రి చెన్నప్ప పేరు పెట్టమని కోరాడు. చిన్నబజారు రోడ్డులో చెన్నకేశవస్వామి ఆలయం కట్టించి ఆంగ్లేయులు చెల్లించే పన్నెండువందల వరహాల కప్పం ఆలయ నిర్వహణకు వినియోగించవలసిందిగా కోరాడు. ప్రస్తుతం సెయింట్‌ జార్జి కోట ఉన్న ప్రాంతంలో చెన్న పట్టణం ఉండేది. కోటలోపలి తెల్లవారి బస్తీ, కోటబయటి నల్లవారి బస్తీ అభివృద్ధి చెందింది. లోపలి బస్తీని ఆంగ్లేయులు మద్రాసు పట్టణం అన్నారు. బయట చెన్నపట్టణం అయింది.

చదవండి :  బండీరా..పొగబండీరా... జానపదగీతం

క్రీ.శ. 1626 ప్రాంతానికే అక్కడ జాలరులు గుడిసెలు వేసుకొని ఉండేవారని, ఆ ప్రాంతాన్ని చెన్నకుప్పం అని పిలిచే వారని దాఖలాలు ఉన్నాయి. ఆ చెన్నకుప్పం ప్రాంతాన్నే స్థానిక పాలకులు అయ్యప్పరాజు, వెంకటరాజులు చెన్నపట్టణంగా తమ తండ్రిపేరుమీద పలిచే ఏర్పాట్లు చేసుకొన్నట్లు పై సమాచారం ప్రకారం ఊహించవలసి వస్తున్నది. ఈ సోదరులందరు కాళహస్తి సంస్థానానికి చెందిన దామెర్లవారు.

గువ్వలచెన్నా శతకంలోని ఆ రెండు పద్యాల్లో మొదటి పద్యం స్పష్టంగా దైవాన్ని సంబోధిస్తూ చెప్పిందే. రెండో పద్యంలో ”చెన్నని పేరుమీద పురం, ఆయనకు గిరిజేశ్వర పాదభక్తి, కీర్తి, పొగడ్తలు లభిస్తాయి. ఇదొక గురువరంగా ఎంచుకో” అనడంలో ఈ పద్యం మానవమాత్రుడిమీద చెప్పినట్లు స్పష్టమవుతూ ఉంది. రెండు పద్యాలకు పొందికలేదు. ఇందులో ఏదో ఒక పద్యమే అసలైనది. రెండో పద్యం చేర్చింది అయి ఉండాలి. మొదటి పద్యంలో పురప్రస్తావన ఒకటే ఉంది. రెండో పద్యంలో ఇతరాంశాలూ చోటుచేసుకున్నాయి. పైగా పద్యకర్త – ఇదొక గురువరంగా భావించుకో అని దూకుడుగానూ చెప్పినట్లుంది. రెండో పద్యం ప్రకారం గువ్వల చెన్నడు అయ్యపరాజు సోదరుల తండ్రే కావాలి. ఆయన గువ్వల చెన్నడు ఎలా అవుతాడు. గువ్వల అన్నది ఆయన యింటి పేరైనా కావాలి, బిరుదవాచకమైనా కావాలి.

కాక, చెన్నకుప్పంలోని వెలసిన చెన్నకేశవ పెరుమాళ్లను సంబోధిస్తూ ఈ రచన సాగిందా? శ్రీకారపద్యం శ్రీ పార్థసారథీ – అన్న సంబోధనంతో మొదలవుతుంది. చెన్నకేశవ పెరుమాళ్లకు సమీపంలో తిరువళ్లిక్కేణిలోని దైవం శ్రీ పార్థసారథి. చెన్నకేశవుడైనా, పార్థసారథి అయినా ఒక్కరే. చెన్నకేశవ పెరుమాళ్లు కొలువున్న చెన్నకుప్పం ప్రాంతమే చెన్నపట్టణంగా తొలుత అయింది. ఆ పట్టణం అభివృద్ధి నోచుకొంటున్న తరుణంలో శతక కర్త అక్కడ వెలసిన దైవాన్ని సంబోధిస్తూ ఈ రచన చేశాడు, అయితే చెన్నకుప్పంలోని చెన్నకేశవుడు గువ్వల చెన్నడు ఎలా అయ్యాడు. ఆలోచించ వలసిందే! కడప సమీపంలోని గువ్వలచెరువు మొదటి రూపం గోవుల చెరువు. ఇక్కడ కూడా గోవుల చెన్నకేశవుడేమైనా గువ్వల చెన్నడయ్యాడా?

చదవండి :  ఈ రోజు నుంచి అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ జాతర

గువ్వలచెన్నశతకం చెన్నపట్టణం కేంద్ర బిందువుగా వెలువడిందే! ఈ శతకంలోని పద్యాల్లో అక్కడక్కడా ఆంగ్ల పదాలు చోటుచేసుకొన్నాయి. ఆంగ్లేయుల నాశ్రయించి జీవించే వకీళ్లు, ఆ వకీళ్లు ఆంగ్లేయుల ననుకరించి వేషాలు, కుక్కల్ని ఇండ్లలో పెంచుకొనే అలవాటు వగైరా విశేషాలు ఉన్నాయి. ఆంగ్లేయుల సంపర్కం కారణంగా మనవాళ్లలో చొచ్చుకొంటున్న అలవాట్లను ఎద్దేవా చేస్తూ చెప్పిన పద్యాలు ఈ శతకంలో అధికంగా కనిపిస్తాయి. ఈ శతకం క్రీ.శ. 1700 ప్రాంతంలో జరిగిన రచనగా సురవరం ప్రతాప రెడ్డిగారూహించారు.

మదరాసు పట్టణమనీ, చెన్నపట్టణమనీ రెండుపేర్లతో 1639 నుంచి పిలువబడుతూ వచ్చిన ఒకనాటి చిన్న పల్లె క్రమంగా మద్రాసు మహానగరంగా విస్తరించి – 1996 ఆగష్టు నెల నుంచి ఆధికారికంగా ‘చెన్నై’ అని పిలువబడుతూ గతవైభవాన్ని గుర్తుకు తెస్తూ ఉంది.

ఆధార గ్రంథాలు :

1. ఆ నాటి చెన్నపురం – శ్రీ కాసల నాగభూషణం.

2. మద్రాసు గ్రామనామాల చరిత్ర – డా|| ఎస్‌. అక్కిరెడ్డి.

3. Historians’ views on the origin of Madras.

4. History of Chennai from Wikipedia, the free encyclopedia.

రచయిత గురించి

భాషాపండితుడుగా ఉద్యోగ విరమణ పొందిన విద్వాన్ కట్టా నరసింహులు గారు కడపలోని సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్ర బాధ్యతలు నిర్వహించారు. సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం – ప్రకటిస్తున్న మెకంజీ కైఫీయత్తులుకు సంపాదకత్వం వహిస్తున్నారు.ఇప్పటి వరకు వీరు ఆరు సంపుటాలకు సంపాదకత్వం వహించారు. కడప జిల్లా చరిత్ర సాహిత్యాల వికాసానికి కృషిచేస్తున్న వీరు ప్రసుతం కడపలో నివసిస్తున్నారు. ఫోన్ నంబర్: 9441337542 

ఇదీ చదవండి!

సిద్దవటం కోట

జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాల

కడప: పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అనేక ఆదాయ వనరులు ఉన్నాయని, జిల్లా సంస్కృతిని అందరికీ తెలపాలని ఏజేసీ ఎం.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: