హోమ్ » వార్తలు » జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక లేరు
జానమద్ది హనుమచ్ఛాస్త్రి
జానమద్ది హనుమచ్ఛాస్త్రి

జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఇక లేరు

కడప: కడప జిల్లా రచయితల సంఘానికి 4 దశాబ్దాలు అవిశ్రాంత సేవలందించిన ప్రముఖ రచయిత జానమద్ది హనుమచ్ఛాస్త్రి (88) కన్నుమూశారు. నెల రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లో ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అక్కడే పొరపాటున మంచంపైనుంచి జారిపడ్డారు. వెన్నెముక వెనుక భాగంలో కాస్త చీలిక ఏర్పడింది. దీంతో ఆయన నడవలేకపోయారు. అప్పటినుంచి ఆరోగ్యం కుదురుగా లేదు.

ఆయనకు హైదరాబాద్‌లో ఉండడం ఇష్టం లేకపోవడంతో కుటుంబసభ్యులు కడప లోని రాజీవ్ వైద్యవిజ్ఞాన సంస్థ(రిమ్స్)లో చేర్చారు.అక్కడ చికిత్స పొందుతూ గురువారం తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.   శుక్రవారం ఉదయం 6.30 గంటలకు జానమద్ది హనుమచ్ఛాస్త్రి తుదిశ్వాస విడిచారు.. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు.

ప్రజల సందర్శనార్థం జానమద్ది భౌతికకాయం బ్రౌన్ గ్రంథాలయంలో ఉంచనున్నారు. ఈ రోజు సాయంత్రం జానమద్ది భౌతికకాయానికి కడపలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి సెప్టెంబరు 5, 1926 సంవత్సరంలో అనంతపురం జిల్లా రాయదుర్గంలో జన్మించారు. 1946లో బళ్ళారిలోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. కడపలో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడ్డారు.

జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసారు. 16 గ్రంథాలు వెలువరించారు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించారు.

ఆయన మరణంతో కుటుంబ సభ్యులేకాక, సాహితీ పిపాసులు, ఆయన అభిమానులు, సహచరులు దుఃఖసంద్రంలో మునిగిపోయారు.

జానమద్ది హనుమచ్ఛాస్త్రి ఫోటో గ్యాలరీ …

ఇదీ చదవండి!

జానమద్ది హనుమచ్ఛాస్త్రి

రాయదుర్గం నుండి బ్రౌన్ దుర్గం దాక…

డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (20.10.1925-28.02.2014) ఇవాళ ఒక లెజెండ్ మాత్రమే కాదు సెలబ్రిటీ కూడా. ఈ రెండు నిర్వచనాలకు ఆయన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: