తెలంగాణను జగన్ కోణంలో చూస్తారా!

కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణ సమస్యను మళ్లీ వాయిదా వేయడానికే మొగ్గు చూపింది. ట్రబుల్ షూటర్ గా పేరొందిన గులాం నబీ అజాద్ ను రంగంలో దింపి కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటనను పూర్వపక్షం చేయించింది. షిండే నిజంగానే తెలంగాణ అంశానికి ఒక ముగింపు పలకాలని అనుకున్నారో, లేక సోనియాగాందీ వద్ద వీర విదేయత చూపాలని అనుకున్నారో తెలియదు కాని ఆయన చేసిన నెల రోజుల ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది.

సీమాంద్ర నేతల లాబీయింగ్ పనిచేసిందని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఎమ్.పి మదుయాష్కి రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావుపై విరుచుకుపడుతుంటే, కాస్త సంయమనంగా ఉంటారనుకునే గుత్తా సుఖేందర్ రెడ్డి సీమాంద్ర నేతలను డిల్లీ రేపిస్టులతో పోల్చడం అంత పద్దతిగా లేదు.నిజానికి వారు ఏమైనా విమర్శ చేయదలిస్తే సోనియాగాందీమీద, అదిష్టానం పెద్దల మీద వ్యాఖ్యలు చేయవచ్చు. కాని వారికి ఆ ధైర్యం లేక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలపై పడుతున్నారు.

ఒక పోటీ వాతావరణం ఏర్పడినప్పుడు ఎవరి ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ అవకాశం ఇచ్చినవారిని తిట్టలేక, పోటీపడినవారిని వ్యాఖ్యానించడంలో వారి బలహీనత కనబడుతూనే ఉంది.అయితే ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పాలి.తెలంగాణ సాధనకోసం కొందరు, సమైక్య రాష్ట్రం కోసం మరికొందరు డిల్లీ వీధులలో చేస్తున్న విన్యాసం నిజంగానే తెలుగు జాతి పరువు మంటగలుపుతోంది.దానికి ఎవరూ బాధపడడం లేదు. తెలుగువారికి కేంద్రంలో ముగ్గురు క్యాబినెట్ హోదా కలిగిన మంత్రులు ఉన్నా ఎవరూ కూడా తెలుగువారందరిని ఒకచోటకు చేర్చి తగాదా తీర్చలేని దుస్థితిలో ఉండడం మరీ ఘోరం.

తెలంగాణ ఇవ్వనివ్వండి, సమైక్యంగా ఉండనివ్వండి . తెలుగువారంతా ఇలా గొడవపడుతున్నారేమిటన్న ఆశ్చర్యం దేశ ప్రజలలో కలిగేలా చేస్తున్నారు. ఒకరకంగా అవహేళనకు గురి అవుతున్నాం. లేకుంటే కేంద్ర మంత్రులు, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న వాయలార్ రవి కాని, గులాం నబీ అజాద్ కాని ఇతర నాయకులు కాని మన నేతలను చూసి విసుక్కుంటున్నారన్న సమాచారం బాధ కలిగిస్తుంది.తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా అందరి సమష్టి వైఫల్యం ఈ తెలంగాణ అంశం అని చెప్పక తప్పదు.గులాం నబీ అజాద్ మొన్న,మొన్నటి వరకు ఇది దేశ సమస్యఅనో, ఇంకొటనో అనేవారు.కాని ఇప్పుడు ఆయన తన చేతిలో లేదని తేల్చేశారు. వాయలార్ రవి అయితే ఉంటే ఉండండి, లేకుంటే పార్టీని వదలి పొండి.కొత్త జట్టును తెచ్చుకుంటాం అని వ్యాఖ్యానించారు. మేం చార్టు తయారు చేసి పంపుతాం . దానిని అనుసరించండి అని అజాద్ గద్దించి మరీ చెప్పారు. ఇదంతా ఎందుకు జరుగుతోంది. రెండువేల తొమ్మిదిలో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మరణించినప్పటి నుంచి రాష్ట్రం ఈ సుడిగుండంలో పడిపోయింది.ఆయన జీవించి ఇవేవి సమస్యలుగా ఉండేవి కావు.వేరే అంశాలపై చర్చ జరుగుతుండేదేమో.ఆ తర్వాత ఆయన కుమారుడు జగన్ రాజకీయ తెరపైకి ప్రముఖంగా రావడంతో సమస్య అంతా కొత్త మలుపు తిరిగింది.

ఆ తరుణంలో ఎమ్మెల్యేలు కోరిన జగన్ ను కాదని, సీనియర్ నేత రోశయ్యను ముఖ్యమంత్రిని చేయడం జరిగింది.ఆ తరుణంలో జగన్ పంచాయతీని పక్కదారి మళ్లించడానికి కూడా తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తెచ్చిందని వాదించేవారు కూడా ఉన్నారు. అందులో ఎంత నిజం ఉందో చెప్పలేము కాని,ఇటీవలి ఒక సంవత్సరంగా జరుగుతున్న పరిణామాలన్నీ మాత్రం అది కూడా ఒక కారణమేమోనన్న అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఎవరు నోటి వెంట విన్నా ఎన్ని సీట్లు వస్తాయనే ప్రశ్న.వాయలార్ రవి అడిగినా, అజాద్ ప్రశ్నించినా సీమాంధ్రలో మీకు సీట్లు రానప్పుడు మీమాట ఎందుకు వినాలి అంటున్నారట.

చదవండి :  జగన్‌కు షరతులతో కూడిన బెయిల్

జగన్ ను సిబిఐ కేసులో ఇరికించినప్పట్టికీ ఆయన తమకు లొంగలేదన్నది కాంగ్రెస్ అదిష్టానం పెద్దల ఆక్రోశంగా ఉంది. జగన్ అవినీతికి పాల్పడ్డాడా లేదా అన్న మీమాంస కన్నా ఆయనను అన్యాయంగా పెట్టారన్న సానుభూతే ప్రజలలో రావడంతో కాంగ్రెస్ నేతలకు దిమ్మదిరిగినట్లయింది. జైలులో ఉన్న జగన్ కు ఉప ఎన్నికలలో ప్రజలు ఘన విజయం సాధించి పెట్టడం వారికి జీర్ణం కాలేదు.దాంతో ఆయనకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారన్న ప్రచారం కూడా పెరిగింది.ఇప్పటికి ఎనిమిది నెలలుగా జగన్ ను జైలులో ఉంచారు. ఆయనను ఉంచడం కోసం పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణను బలి చేశారని ప్రజలు బలీయంగా నమ్ముతున్నారు.దాని గురించి జనం చర్చించుకుంటున్నారు.ఇందులో వాదోపవాదాల గురించి ఎలా ఉన్నప్పట్టికీ సిబిఐని కాంగ్రెస్ పార్టీ ,అదిష్టానం ఒక పనిముట్టుగా వాడుకుంటోందన్న భావన ఎక్కువమందిలో కలుగుతోంది.

ఇక న్యాయవ్యవస్థ సైతం విమర్శలకు గురి కావడం దురదృష్టం.జగన్ కేసులో బెయిల్ ఇవ్వండి, ఇవ్వకపోండి. .కాని బెయిల్ కు దరఖాస్తే చేసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానమే పౌరహక్కులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానిస్తే ఇక ఎవరికి చెప్పుకోవాలి.ఈ కేసు మొత్తం రాజకీయ కేసుగా మారిందని సిబిఐ తాజాగా చేసిన వాదనే తెలియచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని, నెలకు పదిహేను ఉత్తరాలు రాసినా పట్టించుకోవడం లేదని సిబిఐ చెప్పిందంటే తప్పు ఎవరిది?రాష్ట్ర ప్రభుత్వానిదా?సిబిఐదా? సిబిఐ కోరినట్లు సమాచారం ఇవ్వగలిగే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా?నిజంగా వాన్ పిక్ ప్రాజెక్టు అవసరం ప్రభుత్వానికి ఉందా?లేదా?దానివల్ల ప్రభుత్వానికి నిజంగా నష్టం వచ్చిందా?లేదా అన్నదానిపై ప్రభుత్వం ఎటూ ఎందుకు తేల్చలేదు?ఆనాటి హైకోర్టు ఛీఫ్ జస్టిస్ ప్రభుత్వాన్ని ముందుగా నిలదీయకుండా జగన్ పై కేసును సిబిఐ కి ఎందుకు అప్పగించారు? మంత్రి దర్మాన ప్రసాదరావుకు బెయిల్ లభించింది కాబట్టి ఆయన బయట ఉంటున్నారు. ఆయన రాజీనామాను నెలల తరబడి పెండింగులో ఉంచారు.సిబిఐ కోర్టు ప్రభుత్వ అనుమతితో నిమిత్తం లేకుండా మంత్రిని విచారించవచ్చని తీర్పు చెప్పినా కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించలేదు. అంటే వాన్ పిక్ కేసులో సిబిఐ తీరు వారికే నచ్చలేదు. జగన్ ఒక్కరినే ఇబ్బంది పెట్లాలనుకుంటే కాంగ్రెస్ వారికి కూడా చుడితే ఎలా అన్నది రాష్ట్ర కాంగ్రెస్ పెద్దల భావన కావచ్చు.

అయితే ఇదే సమయంలో ఈరకంగా మంత్రులు తీసుకున్న ,క్యాబినెట్ తీసుకున్న విదాన నిర్ణయాలలో కోర్టులు ఇలాంటి తీర్పులు ఇస్తే మంత్రులు ఎవరైనా కేసులలో చిక్కుకోకుండా మిగులుతారా అన్న చర్చ కూడ ఉంటుంది. మంత్రులంతా సుద్దపూసలని కాదు. కాని ప్రభుత్వంలో జరిగే అవినీతిని అరికట్టడం సంగతి ఏమోకాని ప్రభుత్వం నడవడమే కష్టం అయ్యే విదంగానో, పరిశ్రమలు రావడానికి కష్టం అయ్యే విధంగానో దర్యాప్తు సంస్థలు పనిచేస్తే ఎలా అన్న ప్రశ్న వస్తుంది.ఈ మధ్య ఒక సంగతి తెలిసింది. ఇప్పుడు అరెస్టు అయి ఉన్న అదికారి బ్రహ్మానందరెడ్డి కేవలం ఒప్పందం పై సంతకం చేసినందుకు ఇబ్బంది పడుతున్నారు. విచిత్రంగా ఒప్పందం రోజున నిజానికి ఒక ఐ ఎ ఎస్ అదికారి సంతకం చేయవలసి ఉందట. కాని ఆయన ఏదో అత్యవసర పని ఉండి తన బదులు బ్రహ్మానందరెడ్డిని సంతకం చేయమంటే ఒప్పందం కాపీలో ఆ ఐఎ ఎస్ అధికారి పేరు బదులు ఈయన పేరు పెట్టారట. ఆ రోజున ఇది పెద్ద సమస్యగా ఎవరూ అనుకోలేదు. సంతకం పెట్టినందుకు బ్రహ్మనందరెడ్డిని అరెస్టు చేసి బెయిల్ కూడా ఇవ్వనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, ఒప్పందం తయారీలో ముఖ్య పాత్ర వహించిన ఐ ఎఎస్ అదికారి మాత్రం కేసులో ఉన్నా బయట ఉండగలుగుతున్నారని తెలిసింది.ఇలాంటివాటి గురించి ప్రశ్నిస్తే జగన్ మద్దతుదారుడనో, అవినీతిని సమర్ధించారనో ముద్ర వేస్తారు. కాని ఇక్కడ అవినీతి అంశం కన్నా రాజకీయ అంశానికే ప్రాదాన్యం లబిస్తున్నదన్నది వాస్తవం.

చదవండి :  ముఖ్యమంత్రి కిరణ్ చెప్పిన రహస్యం!

నిజంగా అవినీతిని అరికట్టదలిస్తే,పట్టుకోదలిస్తే మొత్తం అందరిని బుక్ చేయకుండా కొంతమందినే ఎందుకు టార్గెట్ చేసుకుంటున్నారన్నదానికి సమాధానం దొరకదు. సిబిఐ వల్ల , కోర్టుల వల్ల కూడా రాష్ట్రం నష్టపోయే పరిస్థితి రాకూడదు. పరిశ్రమలు రాకపోతే వచ్చే పది,పదిహేనేళ్ల తర్వాత మన భావితరాలు ఎంత నష్టపోతాయో ఆలోచిస్తేనే భయం వేస్తుంది.ఒక పక్క తెలంగాణ అంశం, మరో పక్క జగన్ పేరుతో కేసుల అంశం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయి. ఈ రెండిటికి ప్రధాన బాద్యత కాంగ్రెస్ అధిష్టానానిదే. రాహుల్ గాందీ ని ప్రధానిని చేసే లక్ష్యం కాంగ్రెస్ కు ఉండడంలో తప్పు లేదు.కాని అందుకోసం రాష్ట్రాలలో ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూని చేయడానికి వెనుకాడని పరిస్థితులు వస్తే , భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు వారికి అలాంటి పరిస్థితులు రావన్న గ్యారంటీ ఏమీ లేదు.దానిని కూడా నేతలు గుర్తుంచుకోవాలి.జగన్ ను జైలులో ఉంచడం ద్వారా ఆ పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నం చేసింది.కాని అది సాధ్యం కాలేదు.

పైగా రాయలసీమ, ఆంద్ర ప్రాంతాలలోనే కాకుండా తెలంగాణలో కూడా విస్తరించడం ఆరంభమైంది. జగన్ సోదరి షర్మిల మహబూబ్ నగర్ జిల్లాలో పాదయాత్ర జరిగిన తీరు కూడా కాంగ్రెస్ కు సహజంగానే ఆందోళన కలిగించింది. ఈ దశలో చోటు చేసుకున్న వివిధ పరిణామాల నేపధ్యంలో అఖిలపక్ష సమావేశం పెట్టవలసి వచ్చింది. అందులో కేంద్ర హోం మంత్రి షిండే నెలరోజుల గడువు పెట్టడంతో అటో ,ఇటో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. నిజానికి ఎక్కువమంది రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికే కేంద్రం అనుకూలంగా ఉందని భావించారు. ఒక దశలో టిఆర్ఎస్ అదినేత కె.చంద్రశేఖరరావు కూడా ఇప్పట్లో తెలంగాణ రాదని తేల్చేశారు. రెండువేల పద్నాలుగు ఎన్నికలలో వంద శాసనసభ సీట్లు , పదహారు లోక్ సభ సీట్లు గెలుచుకుంటేకాని తెలంగాణ రాదని ప్రకటించారు.

అఖిలపక్ష సమావేశానికి ముందు అధిష్టానంలో ఉన్న భావన ఆ తర్వాత మారిందని అంటున్నారు.అందువల్లనే వాయలార్ రవి కాని, అజాద్ కాని గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేక వ్యాఖ్యలు చేసేవారి ధోరణిలోమార్పు వచ్చిందని చెబుతున్నారు.గతంలో ఆనాటి ఆర్ధిక మంత్రిగాఉన్న ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ,అలాగే అజాద్ లు వేర్వేరు సందర్భాలలో తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు మండిపడ్డారు. ఆ తర్వాత అజాద్ వారిని బుజ్జగించడానికి వివరణ కూడా ఇవ్వవలసి వచ్చింది. అప్పట్లో తెలంగాణ కు అనుకూలంగా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్.పిలు పార్లమెంటులో రగడ చేసి సస్పెండ్ అయ్యే పరిస్థితి ఎందుకు వచ్చేది. అప్పుడే వారికి అనుకూల సంకేతాలు పంపేవారు.కొందరు ఎమ్.పిలు పరోక్షంగా తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ అనుకూలంగా లేదని చెబుతుండేవారు.ఆ పరిస్థితి మారి ఇప్పుడు సీమాంద్ర నేతలను కేంద్ర నాయకులు మందలించే దశ వచ్చింది. ముఖ్యంగా సీమాంద్రలో ఎన్ని సీట్లు వస్తాయని ప్రశ్నిస్తున్నారు.తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ తో కలిసి మెజార్టీ లోక్ సభ స్థానాలు సాధించవచ్చు కదా అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

చదవండి :  ఆ ఆలోచనే వాళ్లకు లేదు ...

రాష్ట్రం సమైక్యంగా ఉంటే తమకు రాజకీయంగా వచ్చే లాభం ఏమిటని జాతీయ స్థాయిలో ఉన్న నాయకులే ప్రశ్నిస్తే , ఇలాంటి నాయకులు దేశానికి ఎలా మంచి చేయగలరన్న ప్రశ్నకు తావిస్తున్నట్లవుతుంది.తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరం లేదు. శాస్త్రీయంగా పరిశీలన చేసి,ఫలానా,ఫలానా అంశాల ఆధారంగా తెలంగాణ ఇస్తున్నామని చెబితే ఫర్వాలేదు.దానికి ఒప్పుకోవచ్చు. అలాగే సీమాంధ్రులు ఈ అంశాలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు..అంటే హైదరాబాద్, నదీ జలాలు, రాజధాని వంటివాటిపై ఆందోళనకు గురి అవుతున్నారు..వాటికి సమాధానం ఇది అని చెప్పి తెలంగాణ ఇవ్వవచ్చు. తప్పులేదు. అలా కాకుండా రాష్ట్రం సమైక్యంగా ఉంటే తెలంగాణ లో కూడా జగన్ పార్టీ పెరుగుతోంది కనుక తాము తెలంగాణ ఇవ్వదలిచామని అంటే దానికి అర్దం ఉంటుందా?

నిజమే తెలంగాణ అంశం తెరపైకి ప్రముఖంగా వచ్చాక జగన్ పార్టీలో తెలంగాణ నుంచి చేరే వారి సంఖ్య తగ్గిపోయింది. అంతకుముందు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది. కాని ఆయన కూడా వేచి చూడడానికి మొగ్గుచూపుతున్నట్లున్నారు. కోమటిరెడ్డి సోదరులు బహిరంగంగానే జగన్ ను ప్రశంసించేవారు. వారు కూడా జగన్ పార్టీలోకి వెళ్లడం లేదని చెప్పవలసి వచ్చింది. అంతవరకు కొంత సఫలం అయినట్లే. కాని కేవలం ఆ కారణాలతోనే తెలంగాణ పై నిర్ణయం తీసుకునే ఆలోచన చేయడమే అంత పద్దతిగా అనిపించదు. అంటే తెలంగాణ ఇస్తున్నది జగన్ పార్టీకి భయపడి కాని, జనం కోసం కాదని వారు చెప్పకనే చెబుతోంది.నిజంగానే రాష్ట్రం విభజన జరుగుతుందో, లేదో చెప్పజాలం.కాని జాతీయ స్థాయిలో ఉన్న వారి ఆలోచనలు ఇంత సంకుచితంగా మారడం మాత్రం దేశానికి ఏ మాత్రం మంచిది కాదు.

సోనియాగాందీ పుట్టిన రోజున ప్రకటించారనో, లేక వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ను,జగన్ ను అడ్డుకోవడానికనో కాకుండా తెలంగాణను ఆచరణాత్మకమైన పద్దతులలో , ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే రీతిలో జనం కోసం ఇస్తే మంచిది అని చెప్పకతప్పదు.గులాం నబీ అజాద్ మొత్తం ప్రకటననే వాయిదా వేయించడం ద్వారా ఈ సస్పెన్స్ ను మరికొంతకాలం పొడిగించారు.ఈ సందర్భంగా ఆయన నెల అంటే చెప్పిన లెక్కలు మాత్రం నవ్వు తెప్పిస్తాయి. జాతీయ స్థాయిలో ఉన్నవారు కూడా ఇలాంటి చిత్రమైన స్థితిలో పడడం విచిత్రం. ఈ లెక్కన వచ్చే ఎన్నికల వరకు ఇది తేలదని అనుకోవాలా?లేక తెలంగాణ కాంగ్రెస్ నేతలు నిర్దిష్టమైన కార్యాచరణకు దిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చితే అప్పుడు పరిణామాలు మరో మాదిరిగా ఉండవచ్చు. అలా జరగకపోతే ఇప్పట్లో ఈ వ్యవహారం తేలదు. ఎప్పుడు తేల్చాలనుకున్న సశాస్త్రీయంగా చేయడమే రాష్ట్రానికి , దేశానికి మేలు.

– కొమ్మినేని శ్రీనివాసరావు

(courtesy: www.kommineni.info)

ఇదీ చదవండి!

వైకాపా-లోక్‌సభ

వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్

వైకాపా శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో ఈ రోజు (బుధవారం) జరిగిన వైకాపా శాసనసభాపక్ష …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: