జమ్మలమడుగు సమీపంలోని దాల్మియా సిమెంటు పరిశ్రమ
జమ్మలమడుగు సమీపంలోని దాల్మియా సిమెంటు పరిశ్రమ

దాల్మియా గనుల తవ్వకాల నిలుపుదల

జమ్మలమడుగు: మైలవరం మండలం నావాబుపేట సమీపంలోని దాల్మియా సిమెంట్ పరిశ్రమకు సంబంధించిన గనుల తవ్వకాలను కలెక్టర్ ఆదేశాల మేరకు నిలుపుదల చేశారు. స్థానిక ఇన్‌ఛార్జి తహశీల్దార్ సాయినాథరెడ్డి గురువారం మాట్లాడుతూ పెద్దకొమెర్ల, హనుమంతరాయునిపేట గ్రామాల్లో కార్బన్ వాయువు ప్రభావంచేత పంటలు నల్లగా మసకబారిపోతుండటంతో, అలాగే ప్రజల ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోందని ఫిర్యాదులు వచ్చాయన్నారు.

పరిశ్రమ కోసం కొనుగోలు చేసిన భూముల్లో మండల పరిధిలోని నవాబుపేట గ్రామానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోనే సిమెంట్ ఉత్పత్తికి అవసరమైన మైనింగ్ తవ్వకాలు చేస్తున్నారు. భారీస్థాయిలో చేపట్టిన పేలుళ్ల ధాటికి నవాబుపేటలో ఇళ్లు దెబ్బతిన్నాయి. పెద్దకొమ్మెర్ల వద్ద కార్బన్ పొడి తయారీ వల్ల పరిసరాల గ్రామాలకు, పంట పొలాలకు తీవ్రనష్టం జరుగుతోందని ప్రజలు ఫిర్యాదుల చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26న అధికారులు గ్రామాల్లో పర్యటించి సంబంధిత ప్రదేశాలను పరిశీలించారు. వీడియో తీయించి వాస్తవాలను కలెక్టర్‌కు నివేదిక పంపారు. దాని ఆధారంగా కలెక్టర్ పేలుళ్లు నిలిపేయాలని ఆదేశాలు ఇచ్చారు.

చదవండి :  రాజధాని కోసం ఈ రోజు విద్యాసంస్థల బంద్

గ్రామంలో 184 నివాసాల గోడలకు పగుళ్లు వచ్చాయని అప్పట్లో నివేదిక పంపారు. బొగ్గుతో కాకుండా పాత టైర్లతో నిప్పు అంటించడం వల్ల ఆ ధూళి గాలిలో వెళ్లి తాము సాగు చేసిన పత్తి పంటపైన పడుతోందని రైతులు ఫిర్యాదు చేశారు. నవాబుపేట పంచాయతీ సర్పంచి ఎల్.హైమావతి, గ్రామస్థుల ఫిర్యాదులు, ఆర్డీవో, తహసీల్దార్‌ల నివేదికల ఆధారంగా పనుల నిలిపివేతకు కలెక్టర్ ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. కాగా సంబంధిత విషయమై గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి, మరికొందరు హైకోర్టులో వేసిన రిట్‌పిటీషన్ కేసు ప్రస్తుతం నడుస్తోంది.

చదవండి :  884.80 అడుగులు చేరిన శ్రీశైలం నీటిమట్టం

దీంతో విచారించి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గనుల తవ్వకాలను పూర్తిగా నిలుపుదల చేసినట్లు ఆయన వివరించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం జనవరి 5వతేదీలోగా కలెక్టర్‌ను కలిసి సంజాయిషీ ఇవ్వాలని సూచించినట్లు వివరించారు.

కాలుష్య నివారణ మండలి అధికారులు ఇంతవరకూ తనిఖీలు చేయకుండా ఎందుకు వదిలేశారో? స్థానికులకు కలుగుతున్న ఇబ్బందిని పూర్తిగా నివారించేందుకు పరిశ్రమ,ప్రభుత్వ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: