హోమ్ » సాహిత్యం » కవితలు » దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత)

దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు (కవిత)

పౌరుషాల గడ్డన పుట్టి పడిఉండటం
పరమ తప్పవుతుందేమో కాని ..!
కుందేళ్ళు కుక్కలను తరిమిన సీమలో
ఉండేలులై విరుచుకపడటం తప్పే కాదు

ఉరి కొయ్యలూ ..కారాగారాలూ
ఈ సీమ పుత్రులకు కొత్త కాదు
తిరుగుబాటు చేయడం ..ప్రశ్నించడం
ఇక్కడి వీరపుత్రులకు ..బ్రహ్మ విద్య కాదు
ఈభూమి చరిత్ర పుటల్ని తిరగేసి చూడు
మడమ తిప్పనితనం ఇక్కడి రక్తంలో నిక్షిప్తం
ఉయ్యాలవాడ ఉగ్గుపాలతో నేర్పిన నైజం
హంపన్న అహం హుంకరించిన చారిత్రక నిజం
పప్పూరి ..కల్లూరి..గాడిచర్ల
ఈ సీమ ధీరత్వాన్ని చాటిన వైనం

చదవండి :  ఒంటిమిట్ట కోదండరామాలయం

అమరావతులూ.. అమృత భాండాలూ
సింగావతుల శ్రీమంతపు సింగారాలూ
అరచేతిలో వైకుంఠ దృశ్యాలూ
మా ఆశలకు కొత్త మోసులు ఎత్తించలేవు
మసిపూసిన మారేడు కాయల మాటలు
ముసురుకొస్తున్న ఈ మబ్బుల్ని తేల్చలేవు
మోచేతినీళ్ళకోసం మోరలు పైకెత్తడం
ఈ భూమిపుత్రుల అభిమతం కానేకాదు !

నయవంచనలనీ..నమ్మక ద్రోహాలనీ
అమాయకత్వపు ఎదురుచూపులతో
ఏళ్ల తరబడి మోస్తున్నోళ్ళం
ఘోర కరువులతో ..బాధల బరువులతో
శ్రీబాగ్ ..కృష్ణా పెన్నార్ దింపుడు కళ్ళం ఆశల్ని
తరతరాలుగా దిగమింగుకొస్తున్నోళ్ళం

ఇది కరువు పులుముకున్న నేలే కావచ్చు
ఇక్కడ కన్నీటి ప్రవాహపు వాగులే ఉండొచ్చు
నీళ్ళో..నిప్పులో ..గుక్కెడు పారితే అంతే చాలు
కల్లో.. గంజో.. పిడికెడు గింజలు పండితే అదే పదివేలు
పాలించుకోవడానికి మా ప్రాంతం మాకున్నప్పుడు
రాజధాని కట్టుకోడానికి రాళ్ళగుట్టలకసలే కొదవలేదు
సహప్రయాణం సాంతం దోపిడీ మయమైనప్పుడు
దావలకట్టకు చేరినాక దారిమళ్ళక తప్పదు
జైరాయలసీమ..జైజై రాయలసీమ ..!

చదవండి :  సిద్దేశ్వరం ..గద్దించే స్వరం (కవిత)

 

 – తవ్వా ఓబులరెడ్డి

రచయిత గురించి

జర్నలిజం, సాహిత్యం ప్రవృత్తిగా రచనలు చేస్తున్న తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. వీరి సంపాదకత్వంలో వెలువడిన ” కడప కథ, రాయలసీమ వైభవం” సంకలనాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.వీరు రాసిన ‘గండికోట’ అం.ప్ర ప్రభుత్వం వారి ఉత్తమ పర్యాటక రచన పురస్కారానికి ఎంపికైంది.

ఇదీ చదవండి!

ముక్కొండ

ముక్కొండ కథ

“ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” –  జే. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: