అద్వితీయ ప్రతిభాశాలి పుట్టపర్తి

తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం.

20 సంవత్సరాల కిందట ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ వ్యాసరచయిత ఇట్లా రాశాడు. ‘‘పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో తక్కిన రచయితలకూ ఆయనకూ అటువంటి భేదం ఉంటుంది. మర్రిచెట్టుకూ, తక్కిన వృక్షాలకూ ఎటువంటి వ్యత్యాసం ఉంటుందో ప్రౌఢిలో, విస్తీర్ణతలో, ఆయనకూ ఇతర కవులకూ అటువంటి వ్యత్యాసం వుంటుంది. పది కాలాలపాటు జీవన ప్రదానం చేసేది మహానది. వర్ష్తర్తువులో నిత్య నూతనంగా అది పరవళ్లు తొక్కుతుంది. ఎక్కడోపుట్టి ఎక్కడో ప్రవహించి ఎక్కడో అది సాగరసంగమం చేస్తుంది. అంత దూరం ప్రవహించి అన్ని కాలాలు మనుగడ సాగిస్తుంది కాబట్టి తరతరాల వాళ్లు ఆ నదిని చూడడం, పుడిసెడు నీళ్లు పుచ్చుకోవడం జరుగుతుంది. ఆ విధంగా తన జాతి జనులకూ ఆ నదికీ మమత్వం ఏర్పడుతుంది.’’

అదుగో అటువంటి మహానదికి ప్రతీక నారాయణాచార్యులవారు. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆర్తుడు. ఇన్ని గొప్పతనాలు మూర్త్భీవించిన కవి కిందటి శతాబ్దంలోనే కాదు, ఏ శతాబ్దిలోనైనా ఉన్నాడా? ఉంటాడా? ఆయన ఆ శతాబ్దిలో మార్గకవుల దేశికుడు. దేశికవులలో మార్గోపదేష్ట. నిజానికి తిక్కన తర్వాత పుట్టపర్తివారే ఉభయకవి మిత్రుడు. ఆయన ఆధునికుడైన అన్నమయ్య. తన శతాబ్దంలో ఆయన ఒక పాల్కురికి సోమనాథుడు. ఒక శ్రీనాథుడు. ఒక పోతన. అప్పుడే పుట్టి వుంటే పుట్టపర్తి వారిని ఒక ధూర్జటి అనేవాళ్లు తెలుగువాళ్లు. పుట్టపర్తి వారిలో ఫ్రౌఢి, గాంభీర్యం, లాలిత్యం ముప్పేటల ముత్యాలహారంలా సొగసునిస్తాయి. సంగీతం, నృత్యం, చారుకవిత్వం ఒక్కచోట మూర్తిమంతమైనాయి వారిలో. ఏడువందల కృతులు రచించడం సామాన్యం కాదు. శంకరి, శివరంజని వంటి కొత్త రాగాలు సృష్టించారు వారు. నలభై కోట్ల సంఖ్యలో అష్టాక్షరీ మంత్రాన్ని జపించారని వారిని తెలిసిన వారు చెబుతున్నారు. 14 సంవత్సరాల వయసులోనే వారు కంచికామకోటి పరమాచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ సంయమీంద్రుల ఆశీస్సులు పొందారట. పుట్టపర్తి వారి రామాయణం పేరు జనప్రియ రామాయణం. తులసీదాస్ రామచరిత మానసం లాగా తెలుగువారికి ఎంతగానో చేరువ కావాలని ఆయన అభిలషించారు. ఆశించారు. కానీ ఆయన కోరిక నెరవేరినట్టు లేదు. తులసీదాసే కనుక ఈ కాలంలో పుట్టివుంటే ఆయన పనీ ఇంతే అయి వుండేదేమో!

చదవండి :  మా వూరి చెట్లు మతికొస్తానాయి

జనప్రియ రామాయణాన్ని గూర్చి శ్రీశ్రీ ఇట్లా అన్నాడు. ‘‘నాకు రామాయణము, భారతాలంటే సరిపోదు (సరిపడదు అనాలి న్యాయంగా) కానీ-ఈ రచన చూస్తే-యేమో చదువుదామనిపిస్తూంది’’. చదివాడో లేదో కాని మంచి అభిప్రాయం ఇచ్చాడు. ‘‘అన్ని విధములా ఉదాత్తమైన రచన నీదిగనుక ఆశ్చర్యపడలేను’’అన్నారు రాళ్లపల్లివారు. ఈ జనప్రియ రామాయణానికి పుట్టపర్తివారు రాసిన ఆశ్వాసారి ఆశ్వాసాంత పద్యాలు తిక్కన రచనను తలపింపచేస్తాయి. ‘‘నా రామాయణ రచనలో మొట్టమొదట నేను కిష్కింద కాండమే రాసినాను. ఇందులో వాల్మీకి కవితా శక్తి పరాకాష్ఠనందుకొన్నదనే నా భావం. మొదట కిష్కింధమును వ్రాయడానికి కొంత భయడినాను కూడా’’ అన్నారు పుట్టపర్తి వారు. కాని ఆయన రామాయణం తాదాత్మ్యంతో రాశారు. ‘‘కన్ను దామరల గ్రమ్మిన నీరము, గ్రన్ననదామణికట్టున దుడుచుచు, తమ్ముని చూచీ కనికెడు నూర్పుల, నెమ్మిదొలంకగ నిటులనెనూ’’-అని పంపా సరస్సును చూసిన ప్రధమ దృశ్యంగా రామచంద్రుని మనస్థితిని వర్ణించారు. ‘పాఠ్యే గేయేచ మధురం’ రామాయణం. తన రామాయం అట్లా రాయాలని ఆశించారు పుట్టపర్తివారు.

చదవండి :  కడప లోక్‌సభ ఏడుసార్లు వైఎస్ కుటుంబ హస్తగతం

ఆయన పండరి భాగవతం గొప్ప రచన. పాండురంగ విఠలుడి ఎనిమిదిమంది కూర్పుతో భక్తుల కథలు సంధించారు ఈ రచనలో. 24వేల ద్విపదుల రచన ఇది. పాల్కురికి సోమనాథుడి తర్వాత ఇంత పరిణాహంగల ద్విపద రచన పుట్టపర్తివారే చేశారు. అయితే పుట్టపర్తి వారిలో రసావేశమే కాని పాల్కురికి మతావేశం లేదు. వైష్ణవుల సత్త్వగుణ సంపదనంతా అక్షరం చేసారు రచనలో పుట్టపర్తివారు.

ఆయనకు పధ్నాలుగు భాషలలో విస్తృతమైన పరిజ్ఞానం ఉంది. ఏడెనిమిది భాషల్లో అనర్గళంగా కవిత్వం చెప్పగలిగేవారు అని వారిని బాగా తెలిసిన పెద్దలు రాశారు. నారాయణాచార్యుల వారి కవితా రచనలలో తెలుగువారి జాతీయచ్ఛందమైన ద్విపద, రగడ, అక్కర, తేటగీతి మొదలైనవి ఎక్కువ. తెలుగు దేశిరచన ఎక్కువ సృష్టించాలని వారికి మక్కువ కలిగిందేమో! వేదనాశతకం, విభూతి శతకం వంటి అంతర్మధన రచనలు ఆయన సృష్టించారు. ఈ పద్యాలు చదువుతుంటే ధూర్జటి కాళహస్తి మహాత్మ్యం, తెనాలివారి పాండురంగ మహాత్మ్యం తలపునకు వస్తాయి. పుట్టపర్తి వారి మేఘదూతం విలక్షణమైన కృతి. ఆయన అభ్యుదయ దృక్పథమంతా ఈ గేయ కృతిలో వెల్లివిరిసింది. రాళ్లపల్లివారు ఈ రచన శివతాండవం కంటే గొప్పది అన్నారు. స్వయం కృషితో ఆయన దేశీయ భాషలనే కాక విదేశీ భాషలను కూడా నేర్చుకున్నారు. ఫ్రెంచి, గ్రీకు, లాటిన్ భాషలను కూడా సాధించారు. ఇదే తర్వాత కాలమునందాయనకు పధ్నాలుగు భాషల్లో పాండిత్యాన్ని సంపాదించేందుకు చేయూతనిచ్చింది-అని కలచవీడు శ్రీనివాసాచార్యులు ఆయన చిన్ననాటి సంగతులు స్మరించుకున్నారు.

చదవండి :  'నాది పనికిమాలిన ఆలోచన'

శ్రీకృష్ణ దేవరాయల కవిత్వమంటే పుట్టపర్తి వారికి ప్రాణం. ఈ శతాబ్ది (20వ) తెలుగు సాహిత్యపరుల్లో కవి పండితులతో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన గాథలు, తబ్మీళ్లు, ఆశ్చర్యోద్దీపక పురావైభవ స్మరణ వృత్తాంతాలు, సామాజిక జీవన స్థితిగతులు నారాయణాచార్యులవారికి తెలిసినన్ని మరెవరికి తెలియవనడం అతిశయోక్తి కాదు. ఆయన రాసిన పెనుగొండ లక్ష్మి ఖండకావ్యాన్ని ఆయనే తన విద్వాన్ పరీక్షకు చదువుకున్నారు. రాళ్లపల్లి వారికి ఈ ఖండకావ్యం ఎంతో ఇష్టం. ఆయన రాసిన ఇంగ్లీషు కవితల సంపుటికి హరీంద్రనాధ చటోపాధ్యాయ చక్కటి పీఠిక రాసారు. ఆ కవితా సంకలనం పేరు ‘కివిస్ ఇన్‌ది విండ్’పుట్టపర్తివారి కవిత్వ మహత్వ వరిష్ఠ గరిష్ఠ సంపద, ‘కట్టె కొట్టె తెచ్చె‘నని రామాయణం కథను చెప్పినంత సులభం కాదు. భక్తితో భావుకతతో ఆయనని అర్ధం చేసుకోవాలి. ఆరాధించాలి. సాహిత్య దర్పణకారుడు విశ్వనాథ కవిరాజు అష్ట్భాషా విలాసినీ మనోహరుణ్ణని చెప్పుకున్నాడు. అట్లాంటివాడు శ్రీమాన్ పుట్టపర్తి అన్నారు శివశంకరస్వామి.

– అక్కిరాజు రమాపతిరావు

ఇదీ చదవండి!

పాస్‌పోర్ట్ సేవలు

ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: