హోమ్ » వార్తలు » అభిప్రాయం » ముఖ్యమంత్రి గారొచ్చారు, కొత్త బిరుదిచ్చారు

ముఖ్యమంత్రి గారొచ్చారు, కొత్త బిరుదిచ్చారు

గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారూ!

రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రైన మీరు మొట్టమొదటిసారిగా నవంబర్ 8న కడప జిల్లాకు వస్తున్నారన్నప్పుడు పారిశ్రామిక రంగంలో మా జిల్లా రాష్ట్రంలోనే అట్టడుగున ఉంది కాబట్టీ, రాజధానిగా విజయవాడను నిర్ణయిస్తూ చేసిన ప్రకటనలో భాగంగా కడపజిల్లాలో ఖనిజాధారిత పరిశ్రమలు ఇబ్బడి ముబ్బడిగా నెలకొల్పుతామని ధారాళంగా మాట ఇచ్చారు కాబట్టీ జిల్లాను పారిశ్రామిక రంగంలో ఏ విధంగా “ముందుకు తీసుకుపోనున్నారో” మీకున్న “విజన్”తో ఒక రోడ్ మ్యాప్ ప్రకటించగలరని కొండంత ఆశతో ఎదురుచూశాం. అవేవీ ప్రస్తావించలేదు సరికదా, కనీసం ఉక్కు కర్మాగారం విషయంలో నెలకొన్న అయోమయాన్ని తొలగించే ప్రయత్నం కూడా చెయ్యలేదు.

ముఖ్యమంత్రి గారూ! కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మీరు కడప జిల్లాలో నిర్మాణంలో ఉండిన ఉక్కు పరిశ్రమను రద్దు చెయ్యాలని, రాయలసీమలోని ఇనుప గనులను విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం మాకు గుర్తుంది.

సౌరవిద్యుత్ ప్లాంటు: గాలివీడులో 500 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు నెలకొల్పుతామని ఆర్భాటంగా అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నారు (సెప్టెంబర్ 17 నాటి ఈనాడు మెయిన్ ఎడిషన్లో వార్త: అభివృద్ధిలో తారాజువ్వలా!). ఆ ప్లాంటుకు కేటాయించిన భూమిలో ఖనిజాలున్నాయి కాబట్టి ఇవ్వడం కుదరదని తర్వాత తీరిగ్గా తేల్చేశారు (అక్టోబర్ 19 నాటి ఈనాడు కడపలో వచ్చిన వార్త: సౌర వెలుగులపై చీకట్లు). అక్కడ ఉన్న ఖనిజసంపదను వినియోగించుకుని ఖనిజాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసే విషయం గురించి, అలాగే ఆ సౌరవిద్యుత్ ప్లాంటును జిల్లాలో వేరేచోట నెలకొల్పే ప్రయత్నం గురించి ఏదైనా ప్రకటనో హామీనో ఇస్తారని ఎదురుచూశాం. మీరు మాటమాత్రంగానైనా ఆ అంశాన్ని ప్రస్తావించనేలేదు.

చదవండి :  అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -2

ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్: డీఆర్డీవో వాళ్ళు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ లాబ్ ఒకటి కొప్పర్తిలోనెలకొల్పుతామని వాళ్లంతటవాళ్ళే వచ్చి అడిగారు. అదైనా కార్యరూపం దాల్చుతుందేమోనని ఆశపడ్డాం. అది కాస్తా మీ చిత్తూరు జిల్లాకు తరలిపోయిందని కొందరు, కర్నూలు జిల్లా వోర్వకల్లుకు తరలిపోయిందని కొందరు అంటున్న అయోమయ పరిస్థితుల్లో దాని గురించి మీరు స్పష్టత ఇస్తారని ఎదురుచూశాం. మీరు అదీ చెయ్యలేదు. అంటే ఆ అనుమానాలు నిజమే అని, ఏ కడప జిల్లా యొక్క పారిశ్రామికాభివృద్ధి గురించైతే మీరు మాట ఇచ్చారో ఆ వాగ్దానాలను మీరు అప్పుడే అటకెక్కించినట్లే అని భావించాలా?

చదవండి :  మన కలమళ్ళ శాసనం (తొలి తెలుగు శాసనం) ఎక్కడుంది?

విమానాశ్రయం: నిజంగా కడప విమానాశ్రయం ప్రారంభానికి అనువుగా లేనట్లైతే దాన్ని సాకుగా చూపి మీరు గత యు.పి.ఎ. ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించి ఉండేవారే (దాని నిర్మాణాన్ని పూర్తిచేసింది వాళ్ళే కదా!). విమాన సర్వీసులు నడపడానికి విమానాశ్రయం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందని, పనులేవీ మిగిలిపోలేదని, కేవలం ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ప్రారంభోత్సవాన్ని వాయిదా వెయ్యాల్సివచ్చిందని, ఎందుకు వాయిదావేయించారో తమకు తెలియదని విమానాశ్రయ అధికారులొకపక్క స్పష్టగా చెప్తూంటే (http://www.kadapa.info/విమానాశ్రయం/) చివరి నిమిషంలో ఎందుకు వాయిదావేయించారో ప్రజలకు వివరించాలనే కనీస బాధ్యతను కూడా మీరు విస్మరించారు – ఎందుకని? కడప జిల్లా అంటే మీకు అంత చిన్నచూపెందుకు ముఖ్యమంత్రి గారూ?

పైగా ఆరోజు (నవంబర్ 8న కోడూరులో) మీరు మాట్లాడిన పద్ధతి చూస్తూంటే కడప జిల్లా కూడా మీ ఏలుబడిలోనే, మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్లోనే ఉందన్న విషయం మీరు మర్చిపోయారేమోనని అనుమానం కలుగుతోంది. కడప జిల్లా శత్రుదేశంలో లేదండీ. ఆ జిల్లా బాగోగులు చూడ్డం కూడా ముఖ్యమంత్రిగా మీ బాధ్యతే. మీరేమన్నారు? కడప జిల్లా అవినీతికి చిరునామాగా మారిందనా?

చదవండి :  మండలాధ్యక్ష రిజర్వేషన్లు - 27 పురుషులకు, 23 మహిళలకు

అయ్యా! ఇప్పటికే సినిమాలు – ప్రసార, ప్రచార మాధ్యమాల పుణ్యమాని మా మీద పడిన బాంబుల గడ్డ అన్న ముద్ర చెరిపేసుకోవడానికే మావల్లగాకుండా ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా, ముఖ్యమంత్రి హోదాలో అధికారికంగా కడప జిల్లాను “అవినీతికి చిరునామా”గా నిర్ధారించేశారు. దాన్నెలా అర్థం చేసుకోవాలండీ? కడప జిల్లా వాళ్ళందరూ అవినీతిపరులే అనా? దేశంలో ఇంకెక్కడా అవినీతిపరులు లేరనా? అవినీతి అనే జాడ్యం ఇక్కడొక్కచోటే మీకు కనిపిస్తోందా? సరే, అది నిజమే అనుకుందాం. అధికారం చేతిలో ఉన్న సమర్థులైన పాలకులుగా…ఆ ముద్రను చెరిపెయ్యడానికి మీరేం చెయ్యాలో బోధపడలేదా? లేక మాజిల్లాను (మీరు ఆరోపిస్తున్నఅవినీతికి బదులు) అభివృద్ధికి చిరునామాగా మార్చడం మీకు చేతకాదా? లేక… మీకు అసలు ఆ ఉద్దేశమే లేదా?

– త్రివిక్రమ్

([email protected])

ఇదీ చదవండి!

నీటిమూటలేనా?

కడప జిల్లాకు చంద్రబాబు హామీలు

వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు… తేదీ: 30 అక్టోబర్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో …

ఒక వ్యాఖ్య

  1. This is the bad facet of current government towards Kadapa District. Situation won’t remain be same always. One day people will fight against these. Where are the so called intellectuals and politicians?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: