రాయలసీమ ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే వెనుకబడిన రాయలసీమ అదే వెనుకబాటుతనాన్ని నేటిదాకా భరించక తప్పింది గాదు. ఈ సమైక్య ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?… సీమాంధ్ర కాదు. రాయల తెలంగాణ కాదు. మరి ప్రత్యేక రాయలసీమా? ఔను! మూడు వందల టీఎంసీల జల రాయలసీమ మాత్రమే!!

సమైక్యాంధ్ర ఉద్యమం తెలంగాణ వేర్పాటువాదానికి వ్యతిరేకమైన ఉద్యమం. ప్రపంచంలో ఉద్యమాలు అనేకం ఉన్నాయి గానీ సమైక్యాంధ్ర వంటి ప్రతి ఉద్యమం ఎక్కడా కనబడదు. సమైక్యాంధ్ర ఉద్యమం లేకుండా, తెలంగాణ ఉద్యమం ఉంటుందిగానీ, తెలంగాణ ఉద్యమం లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమానికి అస్తిత్వం లేదు. స్వీయ అస్తిత్వమున్న తెలంగాణ ఉద్యమానికీ స్వీయ అస్తిత్వం లేని సమైక్యాంధ్ర ఉద్యమానికీ మధ్య చాలా అంతరాలున్నాయి.

తెలంగాణ ఉద్యమంలో విడిపోవాలనే ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష వెనుక ఆత్మగౌరవ సమస్య ఉంది. తెలంగాణ ఉద్యమం గతకాలపు నేలమాళిగల్లో దాగిన తెలంగాణ చారిత్రక ఘటనలెన్నిటినో వెలికితీసింది. రైతాంగ సాయుధ పోరాటం, పటేల్ పట్వారీలూ, రజాకార్లూ, నిజాం పాలన, హైదరాబాద్ స్టేట్ మీద పోలీసు చర్య మొదలైన అనేక చారిత్రక అంశాల్ని కొత్త వెలుగులో పునర్మూల్యాంకనం చేసింది. ఆధునిక విద్య విస్మరిస్తున్న స్థానిక సంస్కర్తల్నీ, కవుల్నీ, పోరాట యోధుల్నీ తెలంగాణ ప్రజలకు పునఃపరిచయం గావించింది. భాగ్యరెడ్డి వర్మ, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, కొమురం భీం, సమ్మక్కసారక్క వంటి చరిత్రాత్మక వ్యక్తుల్ని, వారి జ్ఞాపకాల్నీ పచ్చపచ్చగా చిగుర్లెత్తించింది. తెలంగాణ కవుల్నీ, రచయితల్నీ, కళాకారుల్నీ, సామాజిక వాగ్గేయకారుల్నీ కదం తొక్కించింది. తెలంగాణ భాష, యాస, సంస్కృతి, పండగలూ పబ్బాలూ అన్నిటినీ గర్వంగా తలెత్తి చాటుకుంది.

చదవండి :  సీమపై విషం కక్కిన తెలంగాణా మేధావి - 2

ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే తెలంగాణ ఉద్యమ కాలాన్ని తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనంగా అంచనా వేయొచ్చు. (ప్రత్యేక తెలంగాణలో కూడా ఈ పునరుజ్జీవనం కొనసాగేనా?)

సమైక్యాంధ్ర ఉద్యమంలో కలిసుండాలనే ఆకాంక్ష ఉంది. ఆ ఆకాంక్ష వెనుక సెంటిమెంటు ఉన్నా అంతకంటే అమితంగా విడిపోవడంలో ఎదురయ్యే నష్టాలే ఉద్యమ ప్రాధాన్యం వహించాయి. సమైక్యాంధ్ర ఉద్యమంలో స్థానికత సున్నా కావడం వల్ల గాంధీ నెహ్రూల వేషధారణలకు పరిమితం కావడం తప్ప మనదైన స్థానిక ఉద్యమ సంస్కృతిని నిర్మించుకోలేకపోయింది. అటు రాయలసీమ ముఖమూ తొడుక్కోలేక ఇటు కోస్తాంధ్ర ముఖమూ తొడుక్కోలేక రెండిటికీ చెడిన రేవడిగా మారి, స్థానికంగా ఆర్థిక చారిత్రక సాంస్కృతిక లోతుల్ని కోల్పోయింది. సమైక్య ఉద్యమానిది ప్రాదేశిక ప్రత్యేకత లేని టోకు దృష్టి మాత్రమే! ఒక్కమాటలో చెప్పాల్సివస్తే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని యథాతథవాద ఉద్యమంగా అంచనా వేయొచ్చు.

సమైక్య ఉద్యమం ఒక గుంజ చుట్టూ తిరిగే విసర్రాయి మాదిరి హైదరాబాదు చుట్టూనే గిరగిరా తిరుగుతూ వచ్చింది. ఇందులో కోస్తా మధ్యతరగతి, సీమ మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కాంక్ష వ్యక్తమైనప్పటికీ, బైటికి వ్యక్తంకాని రాయలసీమ గ్రామీణ సమస్య ఒకటుంది. అది నీళ్ళ సమస్య! రాయలసీమలోని డెబ్బై శాతం గ్రామీణ ప్రజల జీవిక సమస్య!! ఈ సమస్య కోస్తా రైతాంగ ప్రజలకు లేదు (కోస్తా ప్రాంతాలకు కూడా నీటి కష్టాలు లేవా అని తర్కించే వాళ్ళను చూస్తే ఆకులోడూ ఏడ్చేదే! ఉప్పోడూ ఏడ్చేదే అనే సామెత గుర్తుకొస్తుంది). సమైక్య ఉద్యమంలోని సీమ, కోస్తాలు ఈ సాగునీటి సమస్య దగ్గరే మౌలికంగా విడిపోతాయి.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సీమ, కోస్తాలు మానసిక ఆవరణంలో కూడా విడిపోతున్నాయి. రాయలసీమ నాయకులు జరిగిపోయిన చరిత్రను కెలికి శ్రీబాగ్ ఒడంబడిక(1937, నవంబర్ 16)లోని రాయలసీమ రాజధాని జిల్లాను బైటికి తీసి చూపేసరికి కోస్తా నాయకులు ఎగతాళిగా నవ్వి పక్కకు తప్పుకున్నారు. పైగా రాయలసీమలోని రాజధాని గురించి చారిత్రక వాగ్దానాన్ని తప్పించుకోవడానికి (అట్లా తప్పుకోవడం వాళ్ళకు మామూలే) ఎత్తులు వేయడం కూడా ప్రారంభించారు. సీమలోని నీటి సమస్యను మిషగా చూపి, అందుకు విరుగుడు అన్నట్లు అనంతపురం, కర్నూలు రెండు జిల్లాలనూ తెలంగాణలో కలిపేయడాన్ని బలపరిచారు. ఇంక రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాల్సిన చారిత్రక బాధ్యత కోస్తాకు ఉండదు కదా అని వారి పన్నాగం. ఇది అత్త సొమ్మును అల్లుడు దానం చేసినట్లుంది గానీ, తాము రెండు పంటలకు మారుగా ఒక పంటకు పారబెట్టుకుని, మరో పంటకు భూగర్భ జలాల మీద ఆధారపడితే రాయలసీమకు కనీసం తాగు నీరు ఇవ్వొచ్చు కదా అన్న బాధ్యతా బుద్ధి మాత్రం వీళ్ళకుండదు.

చదవండి :  కదంతొక్కిన విద్యార్థులు

రాయలసీమలోని పట్టణ మధ్యతరగతికీ, పల్లెల రైతాంగానికీ ఆసక్తులలో తేడా ఉంది. పట్టణ మధ్యతరగతి సమైక్య ఉద్యమం హైదరాబాదు దగ్గర ఆగిపోతే, పల్లెల్లోని రైతాంగం మాత్రం సాగునీటి పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉంది. తమకు సాగునీరు రావడానికి ఎవరైతే అడ్డుపడరో వాళ్ళతో కలిసి ఉండడానికి మాత్రమే సిద్ధపడుతున్నారు.

అది సీమాంధ్ర అయితేనేంగాక!

రాయల తెలంగాణ అయితేనేంగాక!!

… కానీ విషాదమేమిటంటే రాయలసీమ ఆసక్తులను మన్నించి కలుపుకోవడానికి అటు కోస్తాంధ్ర సిద్ధంగా లేదు ఇటు తెలంగాణ కూడా సిద్ధంగా లేదు. ఆశ్చర్యకర పరిణామమేమిటంటే; తుంగభద్ర నీళ్ళు వస్తాయంటే అనంతపురం రైతు ప్రజలు కర్ణాటకలో కలిసిపోవడానికైనా సిద్ధపడుతున్నారు. తెలంగాణ పోరాటానిది స్థానిక సంస్కృతిని రక్షించుకునే ఆత్మగౌరవ పోరాటమైతే; కేవలం బతకడం కోసమే తమ సంస్కృతిని ఫణంగా పెట్టడానికైనా సిద్ధపడిన జీవికపోరాటం రాయలసీమ రైతులది!

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

సమైక్యాంధ్రలో రాయలసీమ మాత్రమే ఎక్కువ వెనకబడటానికి గల కారణాల్లో వర్షాభావమూ, భూగర్భ జలాలే కాకుండా ఒక రాజకీయ కారణం కూడా ప్రధానంగా ఉంది.

తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల కంటే, రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు తక్కువ. కోస్తాంధ్రలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల కంటే రాయలసీమలో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు ఇంకా తక్కువ. ఈ క్రమంలో; ఆంధ్రప్రదేశ్‌ను ఏ ముఖ్యమంత్రి పరిపాలించినా ఎమ్మెల్యే స్థానాలు అధికంగా ఉన్న ప్రాంతపు ఆసక్తులకే తన రాజకీయ లబ్ధి కోసం పెద్దపీట వెయ్యక తప్పదు. అదే జరిగింది. నీలం సంజీవరెడ్డి పరిపాలించినా, చంద్రబాబు నాయుడు పరిపాలించినా, రాజశేఖర రెడ్డి పరిపాలించినా, ఇంకా ఏ రాయలసీమ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఉండినా; కోస్తాంధ్ర తెలంగాణ ప్రయోజనాలవైపే వాళ్ళు మొగ్గు చూపక తప్పింది గాదు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే వెనుకబడిన రాయలసీమ అదే వెనుకబాటుతనాన్ని నేటిదాకా భరించక తప్పింది గాదు. ఈ సమైక్య ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

మైనారిటీ రాయలసీమ – సీమాంధ్రలో చేరినా మళ్ళీ అదే వివక్షే!

రాయల తెలంగాణలో చేరినా మళ్ళీ అదే వివక్షే!!

అందుకే ఇప్పుడు కావలసింది

సీమాంధ్ర కాదు.

రాయల తెలంగాణ కాదు.

మరి ప్రత్యేక రాయలసీమా?
ఔను!
మూడు వందల టీఎంసీల జల రాయలసీమ మాత్రమే!!

– బండి నారాయణస్వామి

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

ఒక వ్యాఖ్య

  1. అయ్యా , ఏదైనా నిర్మాణాత్మకమైన విశ్లేషణ లేదా సూచనలు చేయగలిగితే చేయండి. అంతే కానీ ఇలా తెలబాన్ల మాదిరి విషపు రాతలు రాసి తెలుగు జాతిని ఇంకా ముక్కలు చేయొద్దు. ఒక దరిద్రాన్ని చూశాం. ఈ జీవితానికి ఇది చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: