పెద్ద చెప్పలి అగస్తీశ్వరాలయంలోని రేనాటి చోళుల శాసనం
పెద్ద చెప్పలి అగస్తీశ్వరాలయంలోని రేనాటి చోళుల శాసనం

కడప జిల్లాలో రేనాటి చోళులు – 1

తెలుగు భాష చరిత్రలో, ఆంధ్రదేశ చరిత్ర నందు కడప జిల్లాను పాలించిన రేనాటి చోళ రాజులకు ఒక విశిష్ట స్థానముంది. కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు తాలుకాలు, చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలుకాలు ప్రాచీన ఆంధ్ర దేశమునందు రేనాడుగా పిలువబడి, ఈ రాజుల కాలంలో తెలుగు భాష శాసన భాషగా మొదటిసారిగా ఉపయోగించబడింది. అదే విధంగా రేనాటి చోళులు పాలనాపరంగా, సంస్కృతిపరముగా ప్రవేశపెట్టిన విధానాలు తరువాతి ఆంధ్రదేశ రాజులకు మార్గదర్శకంగా నిలిచాయి.

ఆదికవి నన్నయ భారత రచన కాలం నాటికి రేనాటి ప్రాంతం వారిని తెలుగు వారని కొన్ని శాసనాల్లో పేర్కొన్నారు. రేనాటి ప్రాంతం ప్రాచీనకాలంలో మహారాజవాడి లేక మార్జవాడి అని కూడా పిలువబడింది. క్రీ.శ. 6వ శతాబ్దం నుంచి 9వ శతాబ్దం వరకు చోళ వంశానికి చెందిన రాజవంశం ఒకటి రేనాటి ప్రాంతమున ప్రభుత్వం నడిపి క్రమంగా విడిపోయి ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను చోళ వంశములు ఏర్పడ్డాయి. ప్రాచీన మూల వంశం వారు రేనాటి చోళులు అని పిలువబడ్డారు. క్రీ.శ. 645వ సంవత్సరం నందు హ్యుయాన్‌త్సాంగ్ అను చైనా యాత్రికుడు కడప ప్రాంతము సందర్శించి చుళియ దేశముగా వర్ణించినది రేనాటి చోళ రాజ్యమని చరిత్రకారులు నిర్దారించారు.

రేనాడు రాజ్యము మొదట 7,000 గ్రామాదాయ పరిమితి గల దేశముగా శాసనములలో చెప్పబడింది. కాని 16వ శతాబ్ది నాటికి ఉదయగిరి, పెనుగొండ దుర్గముల మధ్య అధిక భూభాగమును ఆక్రమించి మార్జవాడిగా రెండు భాగములుగా విడిపోయింది. ఈ రాజుల చరిత్రను తెలుసుకొనుటకు నాలుగు తామ్ర శాసనములు, 50 శిలా శాసనములు ఆధారముగా ఉన్నాయి. వీటిని పరిశోధించి ఆచార్య నీలకంఠశాస్త్రి గారి మార్గదర్శకత్వమున ముట్లూరి వెంకటరామయ్య రేనాటి చోళుల చరిత్ర వ్రాశారు. నేలటూరి వెంకటరమణయ్య కూడా ఈ రాజుల చరిత్ర వెలికి తీయడం నందు కృషి చేశారు. తోకను వీపువైన తిప్పి ఎడమ వైపు నిలుచున్న అసమాన పౌరుష, పరాక్రమములను చాటుచున్న సింహము రేనాటి చోళుల రాజలాంఛనము.

చదవండి :  అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు - సొదుం గోవిందరెడ్డి

రాజధాని

రేనాటి రాజులలో ముఖ్యుడైన పుణ్యకుమారుని తిప్పలూరు శాసనములో చెప్పలియ పట్టుగా ఉన్నట్లు తెలుస్తుంది. అవగాహన లోపం వలన దానిని మదనపల్లె తాలుకాలోని చిప్పిలి గ్రామముగా గుర్తించారు. కాని నేటి పరిశోధనలు ఆధారాలను బట్టి తిప్పలూరు గ్రామ సమీపమున కమలాపురం మండలంలోని పెద్ద చెప్పలి అను ప్రాచీన గ్రామము రేనాటి చోళుల రాజధాని అని నిర్ణయించబడింది. మరియు ఈ గ్రామము నందు ప్రాచీన కాలపు కోట ఉన్నట్లు గుర్తులు ఉండుటయే కాకుండ ఈ గ్రామ పరిసర ప్రాంతముల్లో రేనాటి చోళుల తామ్ర శాసనాలు, శిలాశాసనాలు అనేకం లభించినవి.

రాజవంశము

రేనాటి చోళులకు సంబంధించి లభించిన నాలుగు తామ్ర శాసనములలో రెండు ఒక శాఖకు చెందిన రాజుల వంశావళి, మిగిలిన రెండు వేరొక శాఖకు చెందిన రాజుల గురించి తెలుపుచున్నవి. మాలెపాడు, దొమ్మరి నంద్యాలలో దొరికిన రెండు తామ్ర శాసనాలు కరికాలుడి వంశములో నందివర్మ జన్మించినట్లు, అతనికి పుట్టిన సింహ విష్ణువు, సుందరనందుడు, ధనంజయవర్మ అను ముగ్గురు కుమారులలో ధనంజయవర్మకు మహేంద్ర విక్రముడు, అతనికి గుణముదితుడు, పుణ్యకుమారులు జన్మించగా, వారిలో పుణ్య కుమారుడు తన ఐదవ, పదవ రాజ్య సంవత్సరములందు పై రెండు రాగి శాసనాలు వేయించినట్లు తెలియజేస్తున్నాయి. వీటిలో పుణ్య కుమారుడు హిరణ్య రాష్ట్రమును పాలించినట్లు తెలుపుతున్నాయి.

చదవండి :  ఢిల్లీలో మకాం వేసిన ప్రత్యర్థులు

మిగిలిన రెండు తామ్ర శాసనములు కరికాలుడు వంశమునందు నందివర్మ, అతనికి సుందరానందుడు, నవరాముడు, ఎరెయమ్మ, విజయకాముడు, వీరార్జునుడు, అగ్రణిపిడుగు, కొకిలి, మహేంద్రవర్మ, ఎళంజోలుడు, నృపకాముడు, దివాకరుడు, శ్రీకంఠచోళుడు అనువారు పుత్ర పౌత్ర పరంపరలో జన్మించారని తెలుపుతున్నాయి. వీటిలో పెద్దచెప్పలి శాసనములో దివాకరుడు పేర్కొనక శ్రీకంఠ మనోహరుడు జన్మించెనని చెప్పబడింది. పై నాలుగు తామ్ర శాసనములందు కొద్ది భేదము వుండినను సుందరనందుడి వంశములో శ్రీకంఠరాజును, ధనంజయవర్మ వంశంలో పుణ్య కుమారుడు జన్మించారని తెలుస్తుంది.

ఇంకను పుణ్య కుమారుడి తాత ధనుంజయవర్మ, తండ్రి అయిన మహేంద్ర విక్రముడు చోళమహారాజు అను పేరు మీద రాజ్యము పాలించినట్లు వారి శాసనముల నుంచి తెలుస్తుంది. అట్లే పుణ్య కుమారుని తరువాత అతని తనయుడు విక్రమాదిత్యుడు, శక్తి కుమారుడు, రెండవ విక్రమాదిత్యుడు (చోళ మహారాజు) ఉత్తమాదిత్యుడు, సత్యాదిత్యుడు, విజయాదిత్య చోళుడు రాజ్యాధికారం చేసినట్లు శాసనాధారములు కనిపించుచున్నవి.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 2001

పై ఆధారములను విశ్లేషించి, చరిత్రకారులు నందివర్మ క్రీ.శ. 550 కాలమునందు, అతని మూడవ కొడుకు ధనంజయవర్మ క్రీ.శ. 575, ఇతని కొడుకు మహేంద్ర విక్రముడు క్రీ.శ. 600, ఇతని కొడుకు పుణ్య కుమారుడు క్రీ.శ. 625 కాలమునందు రాజ్యపాలన చేసినట్లు నిర్ధారించినారు. వీరు వేయించిన శాసనముల లిపి కూడా ఇందుకు అనుకూలముగా ఉంది.

పుణ్య కుమారుని తరువాత రాజులలో బాదామి చాళుక్య రాజులైన విక్రమాదిత్యుని పేరుతో ఇద్దరు, విజయాదిత్యుడు పేరుతో ఒకరు, సత్యాశ్రయ అను పేరునకు బదులు సత్యాదిత్యుని పేరుతో ఒకరు కనిపించుట వలన ఈ రేనాటి చోళులు పల్లవ చక్రవర్తుల సామంతత్వము విడిచి బాదామి చాళుక్యుల సామంతులుగా ఉండినట్లు తెలుస్తోంది.

తరువాతి శాసనములననుసరించి రేనాటి చోళులలో మొదటి విక్రమాదిత్యుడు క్రీ.శ. 650, శక్తి కుమారుడు క్రీ.శ.675, రెండవ విక్రమాదిత్యుడు క్రీ.శ. 700 ముందుగాను, సత్యాదిత్యుడు, పృధ్వీవల్లభ విజయాదిత్యుడు క్రీ.శ.750 ముందుగాను రాజ్యపాలన చేసినట్లు తెలుస్తుంది. క్రీ.శ. 800 తరువాత శ్రీకంఠుడు రాజ్యాధిపత్యము వహించెను. పై ఆధారముల వలన రేనాటి చోళులు క్రీ.శ. 550 నుంచి క్రీ.శ. 850 వరకు సుమారు 300 సంవత్సరములు రాజ్యపాలన చేసినట్లు తెలుస్తోంది.

(ఇంకా ఉంది)

ఇదీ చదవండి!

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

7 మే  2007 : 2017 నాటికి 25 వేల కోట్ల పెట్టుబడితో 10 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: