విపక్ష నేతలూ… మా కోసం వస్తారు కదూ..!

అయ్యా.. విపక్ష నేతలూ!

కడప జిల్లా ప్రజలు దుర్భర పరిస్థితుల మధ్య ఉపాధి కరువై, ప్రభుత్వ ఆదరువు లేక, రోగాల పాలై బతుకీడుస్తున్నారు. మిమ్ములను, మీ పార్టీలని ఆదరించిన జిల్లా ప్రజలపైన ప్రభుత్వం కక్ష కట్టి వివక్ష చూపుతోంది. ఇదే విషయాన్ని మీ పార్టీల నేతలే పలు సందర్భాలలో వాక్రుచ్చినారు.

ఇదే సమయంలో గత రెండు మూడు నెలలుగా జిల్లా జ్వర పీడితమైంది. ఇప్పటికే సుమారు వంద మంది వరకూ సామాన్యులు ఈ జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రయివేటు ఆసుపత్రులలో తగిన సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు 200 కి.మీ దూరంలో ఉన్న పొరుగు జిల్లాలకు వెళుతున్న దృశ్యం. ఇటువంటి సందర్భంలో జ్వరాలకు చికిత్స చేసేదానికి అవసరమైన సౌకర్యాలు కూడా కల్పించేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

చదవండి :  జిల్లాపైన ఆరోపణలు గుప్పించిన కలెక్టర్

రాష్ట్రానికి మేలు చేస్తుందని భావిస్తున్న హోదా కోసం మీరు సాగిస్తున్న పోరాటం అభినందనీయం. అదే సమయంలో వైద్య సౌకర్యాల లేమితో మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం, అధికారులు చేష్టలుడిగిపోయారు. మీ పార్టీలకు చెందిన నేతలు కొందరు వారి పిల్లలు జ్వరాల బారిన పడితే వైద్యం కోసం హైదరాబాదు పోయినట్లు పత్రికలలో చదివినాం. మొన్నటి మొన్న మీ పార్టీకి చెందిన ప్రొద్దుటూరు శాసనసభ్యుడు జ్వరాల విషయంలో ప్రభుత్వం అలసత్వం గురించి పత్రికా ముఖంగా ఆవేదన వ్యక్తం చేసినారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

కేబినేట్ హోదా కలిగిన మీరు మీ జిల్ల్లాలో ఉన్న ఈ దయనీయ పరిస్థితులపైన ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారా? కనీసం జిల్లాకు వచ్చి ఇక్కడి ఆసుపత్రులలో వైద్యం అందుతున్న తీరును వాకబు చేశారా?

చదవండి :  వెనుకబడిన జిల్లాల మీద ధ్యాస ఏదీ?

కృష్ణా జిల్లాలో విషజ్వరాల కారణంగా మరిణించిన వారి విషయంలో ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగట్టేదానికి అక్కడి కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేసిన మీరు సొంత జిల్లాలో అంతకంటే దయనీయంగా ఉన్న పరిస్థితిని సరిదిద్దేందుకు, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తే బాగుంటుంది. అవసరమైతే ఇక్కడి ప్రజల తరపున పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచాలి.

కడప జిల్లా ప్రజలు దుర్భర స్థితిలో రోగగ్రస్తులై, ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం, అధికారగణం పండుగలు, పబ్బాలు, శంకుస్థాపనల పేరిట ఉల్లాసంగా గడుపుతుంటే… అవస్థలో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి.

చదవండి :  కడప గడప ముందు కుప్పిగంతులు!

జ్వరపీడితమైన కడప జిల్లాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు, ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చేందుకు ఇక్కడి ఆసుపత్రులను పరిశీలించండి. రోగులతో మాట్లాడండి. వీలయితే పొరుగు జిల్లాల ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారి ఘోష వినండి. అధికారులతో సమీక్షించండి. మొద్దు నిద్రలో ఉన్న జిల్లా యంత్రాంగాన్ని అదిలించండి.ఈ ఆపత్కాలంలో జిల్లా ప్రజలకు బాసటగా నిలబడి ప్రభుత్వంపైన ఒత్తిడి తీసుకురండి. జిల్లా ప్రజలకు అభయమివ్వండి.

కనీసం మీ చర్యల కారణంగానైన ప్రభుత్వంలో, అధికారయంత్రాంగంలో చలనం వచ్చినా ఇంకొన్ని ప్రాణాలు నిలబడతాయి. ఇదీ మా ఆశ! మా కోసం వస్తారు కదూ! మీ రాక కోసం ఎదురు చూస్తూ…

– కడప జిల్లా ప్రజలు

ఇదీ చదవండి!

మనమింతే

అభివృద్ధికి అంటరానివాళ్ళమా? -2

ఐజీకార్ల్: కడప జిల్లాలో ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్ లైవ్‌స్టాక్ (IGCARL) అనే పేరుతో ఒక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: