కడప జిల్లా కథాసాహిత్యం
ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

ఈ మట్టి పరిమళాల నేపథ్యం…కేతు విశ్వనాథరెడ్డి

విపరీతమైన ఉద్వేగ స్వభావం ఉండీ నేను కవిని ఎందుకు కాలేకపోయాను? వచన రచనే నన్నెందుకు ఆకర్షించింది? ఈ రెండు ప్రశ్నల గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. బహుశా మన సమాజంలో కవిత్వానికీ కవులకీ ఉన్న అగ్రవర్ణాధిక్యత గుర్తొచ్చినప్పుడెల్లా.

వీటిని గురించి నేను కావాలని ఆలోచించడం కాదుగానీ నాకు బాల్యంలో పాఠం చెప్పిన వొక గురువు భూతపురి నారాయణస్వామి పండితుడూ, కవి. ఆ హైస్కూల్లో స్వయంగా తన కావ్యం శివభారతం పాఠం చెప్పిన, గొప్ప కవి గడియారం వేంకటశేషశాస్త్రి. ఇంట్లోవున్న కొవ్వలి, జంపన మొదలైన వాళ్ల రచనలు చదివి చెడిపోతున్నానని చెడ తిట్టి, సంస్కృతం, తెలుగు గట్టిగా చదువుకోమని మా చిన్నబ్బ (నాన్న చిన్నాన్న) పంపితే కొన్నాళ్లు చదువుకున్నది మహాపండితుడు బడబాగ్ని నారాయణరాజు దగ్గర. (ఆయన రంగస్థల నటుడు, సినీనటుడు బడబాగ్ని నారాయణరాజు  గారి తండ్రి).

1952 పూర్వం నా చదువు కవిత్వంతో సంబంధం లేని చదువు. 52 తరువాత ప్రొద్దుటూరులో కవులూ అష్టావధానులూ కవిత్వం చర్చలూ ఉండే వాతావరణంలో చదువు. 1959-61 మధ్య కాలంలో కాలం మూఢభక్తే తనను మింగకపోతే గొప్ప కవి కావాల్సిన వజీర్ రెహమాన్‌తో స్నేహం. తరువాత తరువాత కవిత్వాలతో, కవులతో గాఢ పరిచయమూ బంధమూ స్నేహమున్నా 1952కి పూర్వం పన్నెండు పదమూడేళ్ల జీవితంలోని వొడిదుడుకులూ, పరిశీలన, అనుభవాలు, చందమామ మొదలుకొని చేతికందిన పత్రికలు, పుస్తకాలూ బహుశా నన్ను వచన రచన వైపు ఆకర్షింపచేసి వుండవచ్చు. ఇది వొకకారణం అనుకుంటే మరొక బలమైన కారణం నా ఉద్వేగ ప్రవృత్తిని మించిన మనుషుల పరిశీలన. ఆలోచనా ప్రవృత్తి. ఇవి కవిత్వరూపంలో వొదగని వస్తువులనుకుంటాను. అంతర్ముఖత్వం వ్యక్తిగతమై, బహిర్‌ముఖత్వం జీవితమైతే వచన రచయితే మిగులుతాడనుకుంటాను.

నిజానికి నా బాల్యం రాయలసీమ రైతుల సగటు కుటుంబాలలోని పిల్లల బాల్యం కంటే భిన్నమైంది. నన్ను మా తల్లిదండ్రులే పూర్తిగా సాకి చదివించలేదు. మా కుటుంబం ఒక విధంగా సంపన్న రైతు కుటుంబం. వ్యాపార కుటుంబం కూడా. స్వాతంత్య్రానికి ముందే వేరుశనగనూనె, పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలలో రెండుచోట్ల ప్రధాన భాగస్వామ్యం ఉన్న కుటుంబం. ఒక పెద్ద సమిష్టి కుటుంబం. ఈ కుటుంబంలోని ఉత్థాన పతనాలు సమాజంలోకి చూపుని ప్రసాదించాయనుకుంటాను.

నా చదువు కొంతకాలం, మా మేనమామగారి వూళ్లోనూ, మా వూళ్లోనూ 47 నుంచి 51 వరకు ఎర్రగుంట్లలో మా పెద్దబ్బ (నాన్న నాన్న) సంరక్షణలో సాగింది. ఆయన ఆధార వ్యక్తిత్వం కింద నాకు ఏ కట్టుబాట్లు ఉండేవి కావు. అప్పటి వ్యాపారులూ ఫ్యాక్టరీలోని కార్మికులూ అందరితో కలిసి మెలిసి తిరిగేవాణ్ణి. మా వూళ్లోనూ అంతే- మా ఇంట్లో దళితుల విషయంలో ఏనాడూ నేను మత, కులతత్వాన్ని చూడలేదు. ఇక దళిత పీడన గురించి విననైనా లేదు. మా పెద్దబ్బ కాంగ్రెస్‌వాది – ఆయన మొదటి భార్య చనిపోయాక బాల్య వితంతువుని పెళ్ళాడాడు. మా రెండో అబ్బ కాంగ్రెస్ రాజకీయాలలో జైలుకెళ్ళాడు. మూడో అబ్బ వేదాంతం కాస్త గట్టిగా చదువుకున్నవాడు. వ్యాపారంలో రాణించలేదు. వీళ్ల రాజకీయ ప్రభావమూ, వ్యక్తిత్వాల ప్రభావమూ దాదాపు నన్ను 1957 వరకు ప్రభావితం చేశాయని చెప్పవచ్చు – మా చిన్నాన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చేరాక నా ఆప్తమిత్రుడు నల్లపాటి రామప్పనాయుడు సన్నిహితమవుతూ వచ్చాక వామపక్ష రాజకీయాలు, వామపక్ష సాహిత్యం నాకు పరిచయమయ్యాయి.

చదవండి :  సీమ బొగ్గులు (ముందు మాట) - వరలక్ష్మి

నా మొదటి రచన ఆమె. – ఒక కథ – 1958లో కడప కాలేజిలో మూడో సంవత్సరం బియ్యేలో ఉండగా కాలేజిలో జీవితం మీద వొక గంట వ్యవధిలో కథ రాయాలని అప్పటి మా తెలుగు ట్యూటర్స్ రాధాకృష్ణమూర్తి, కనక్‌ప్రవాసి పోటీ పెట్టారు. అప్పుడు రాసిన కథలోని కథాంశం అశాంతిని భరించలేని వొక యువకుడు ఆశ్రమం చేరుకోవడం. ఈ కథాంశం ప్రభావం ఖచ్చితంగా మా అమ్మ చదివిన వేదాంత గ్రంథాలు అవి నేను చదివినా అప్పట్లో నన్ను ఆకర్షించింది వివేకానందుడేగాని రామకృష్ణపరమహంస కాదు, బుద్ధుడంటే ఆనాడూ ఈనాడూ గౌరవం, సజీవ సమాజాన్ని పట్టించుకున్నందుకు, ఆపాటికే నేను చదివిన బెర్నాడ్‌షా నాటకాలు నలభైకి పైగా, బెర్ట్రెండ్ రసెల్, జాయిస్ పొర్ట్రెయిట్ ఆఫ్ యాన్ ఆర్టిస్ట్ యాజ్ యాన్ యంగ్‌మాన్ గురజాడ, గోపిచంద్, చలం, కుటుంబరావు రచనలు నన్ను మత లోకంలోకి కాకుండా మానవలోకంలోకి తీసుకెళ్లాయి. బెర్ట్రెండ్ రసెల్ మ్యారేజ్ అండ్ మారల్స్ నీతిని గురించి కొత్తచూపు ఇచ్చింది. ఈ చూపులోనుంచే నేను మా నాన్ననీ, బంధువుల్నీ, ఇతరుల్నీ చూశాను. ఇంకాస్తా పెరిగి, సెక్సులో లేని కులం కేవలం సామాజిక స్వభావమున్న కులం రాజకీయ బలం ఎట్లా అయిందో చూశాను. స్త్రీ పురుష సంబంధాల్లో మొదట్నుంచి నన్ను కలవరపెట్టింది నీతి సమస్య కాదు. వాళ్ల మధ్య వుంటూ వస్తున్న అసమానబంధాలు – కాలు జారడం, వుంచుకోవడం, సంబంధం పెట్టుకోవడం, ప్రేమించడం – ఈ గొడవలన్నీ వ్యక్తిగత సమస్యలుగానే నాకు కనిపిస్తాయి. వాటిలో ఏ బలవంతపు శక్తి వున్నా, పీడన వున్నా నేను భరించలేను.

నా జీవితంలో పెద్ద మలుపు తిరుపతిలో ఎమ్మే చదువు. 1959 – 61 మధ్య పాఠ్యపుస్తకాలకంటే ఇతర సాహిత్య గ్రంథాల పట్ల బలమైన ఆకర్షణ కలిగించినవాడు వజీర్ రెహమాన్. అప్పటికే తెలుగు స్వతంత్రలో వ్యాసాలు రాస్తూన్న మా నల్లపాటి రామప్పనాయుడు రచన పట్ల నిద్రాణంగా వున్న ఆర్తిని వెలిగించాడు. ఆచంట జానకిరాం, ఆచంట శారదాదేవి ఇంట్లో సమావేశాలు, చిత్తూరు జిల్లా రచయితల పరిచయాలు మధురాంతకం, సభా, రాజేంద్ర, గొల్లపూడి మారుతీరావు మొదలైన వారి స్నేహాలు. రెహమాన్ ఎక్కువగా కవిత్వాన్ని, జీవిత చరిత్రల్నీ చదివేవాడు. తను రాసిన కవిత్వం, కవిత్వానువాదాలు వినిపించేవాడు. ఆ కవిత్వం నన్ను ఎంతో ఆకర్షించేది. ముఖ్యంగా అతని రూపశ్రద్ధ, ఎడిటింగ్ కౌశలం, కవిత్వం ఎంత చదివినా కథలూ, నవలలే నన్ను ఆకట్టుకునేవి. మా రామప్పనాయుడు ప్రోత్సాహంతో తెలుగు స్వతంత్రలో 1958, 1959లో మూడు వ్యాసాలు రాశాను. అవి రచయితలకు పాఠాలు, రచయిత్రులూ గమనించండి, తలకెక్కని తత్వాలు అనుకుంటా.. నా దూకుడు అప్పటి అరిగిపోయిన భావ కవుల మీదా, స్త్రీ సమస్యల్లో నిజాన్ని చూడలేకపోయినా వారి మీదా, ముఠాల సంస్కృతి మీద అని జ్ఞాపకం – ఆ తరువాత 59లోనో, 60 లోనో సంస్కృతి మీద కడప నుంచి వచ్చే సవ్యసాచిలో పెద్ద వ్యాసం అచ్చయింది. ఆ వ్యాసం అచ్చు వేసేటప్పుడు సంపాదకుడు రాచమల్లు రామచంద్రారెడ్డి వూళ్లోలేరు. వచ్చాక చదివి ఈ కుర్రాడు పనికొస్తాడయ్యా అన్నాడట. కాని ఆ వ్యాసాన్ని విమర్శించినట్టు కూడా గుర్తు. ఆ ఏడాదే రెండు కథలు తెలుగు స్వతంత్రకి పంపినట్లు గుర్తు. డాక్టర్. పి.శ్రీదేవి చాలా బాధగా ఇతని వయసెంత ఉంటుంది? ఎందుకింత ఆందోళన ఇతనిలో? అని మా రామప్పనాయుడు హైదరాబాద్‌లో కలిసినప్పుడు అందట – ఆ కథలు తిరిగి వెనక్కి తెప్పించుకున్నాను.

చదవండి :  అన్నమయ్య కథ (మొదటి భాగం)

సెలవుల్లో మా వూళ్లో నేనూ, మా రామప్పనాయుడు అప్పటి సాహిత్యాన్ని గురించి తీవ్రంగా చర్చించుకునేవాళ్లం. నాకు జీవితం మీద అసంతృప్తే. అప్పటికి వస్తున్న సాహిత్యం మీదా అసంతృప్తే. నా మార్గం ఏమిటో నాకు స్పష్టంగా ఏర్పడని రోజులవి. 1961 ఫిబ్రవరి 5 నుంచి జూన్, 9 వ తారీఖువరకు హైదరాబాద్‌లో ఆంధ్రరత్న దినపత్రికలో ఉద్యోగం చేశాను. అప్పటి రచయితల్లో నాకు పరిచయమైన వాళ్లు కొంత కాలం నాకు తన గదిలో ఆశ్రయమిచ్చిన ఇప్పటి ఇండియాటుడే రాజేంద్ర, అప్పటికి చలం పారవశ్యంలో వున్న వరవరరావు (వొకేమారు తాజ్‌మహల్ హోటల్‌లో ఆయన్నీ ఆయన మిత్రుల్నీ కలిశాను), శీలా వీర్రాజు, రేడియోస్టేషన్‌లో అప్పటి పెద్దల్ని శివశంకరశాస్త్రి, కాటూరి, గోపీచంద్ మొదలైనవాళ్లు కలిసినా వారితో పరిచయం లేదు. గోరాశాస్త్రి, కాటూరి, గోపీచంద్ మొదలైన వాళ్లు కలిసినా వారితో పరిచయం లేదు. గోరాశాస్త్రిని ఆంధ్రభూమిలో ఆయన చేరాకే ఒకే ఒక్కమారు కలిశాను. తిరుపతిలో రెహమాన్‌తో స్నేహమూ, తిరువన్నామలై సామీప్యమూ వున్నా చలాన్ని కలవలేదు.

రచయితలతో కలసి, అతి సన్నిహితంగా తిరిగే మనస్తత్వం నాకు మొదటినుంచి లేదు. గుంపు చర్చల కన్నా, ఆషామాషీగా ముగ్గురు నలుగురు మిత్రుల మధ్య చర్చలు, వాగ్వివాదాలు ఇష్టం. ఈ జబ్బు మాటెలా ఉన్నా జీవితాన్ని, సాహిత్యాన్ని, గురించి గాఢంగా పట్టించుకున్నదీ, ఆలోచించిందీ 1962 తరువాతే. సవ్యసాచీ, ఆ తరువాత ‘సంవేదన’ మిత్రులు నన్ను రచయితగా తీర్చిదిద్దారనుకుంటా – ఆ బృందంలోని రా,రా., ‘అలసిన గుండెలు‘ కథల సంపుటి అప్పటికే వచ్చింది. హైస్కూలు రోజుల నుంచి ఇంటర్మీడియెట్ వరకు నా క్లాస్‌మేట్‌గా ఉన్న సొదుం జయరాం అప్పటికే కథలు రాస్తున్నాడు. విచిత్రమేమిటంటే, నేను అప్పట్లో ఒకటి రెండు కథల జోలికి వెళ్లినా నాటక రచన మీద దృష్టి కూడా కేంద్రీకరించాను.

అప్పట్లో నన్ను తీవ్రంగా కదిలించింది ఓనీల్ నాటకాలు. జీవితం సుఖాంతమూ కాదు, విషాదంతమూ కాదు అంతర్లీనంగా వుండే విషాదసుఖచ్ఛాయలతో కూడుకున్నది అన్న జీవనసూత్రం. ఒక నాటిక ‘వలలో చేపలు’ సవ్యసాచిలో ప్రచురితమైంది. తరువాత రాసిన రెండు నాటకాల్ని రా.రా. నిర్దాక్షిణ్యంగా చీల్చిచెండాడితే వాటిని మూలపడేశాను. అప్పటినుంచి దాదాపు ఏదో ఒకటి రెండు సార్లు (రేడియో వాళ్ల కోసం) తప్ప నాటకాల జోలికి పోలేదు. నా కథలకంటే ముందు రేడియో ప్రసారం చేసిన శ్రవ్యనాటిక ‘ఏమున్నది గర్వకారణం?’ – ఎమ్మే ఫైనల్లో రాసిన నాటకం. తాజ్‌మహల్ నిర్మాణం మీద రాసిన శ్రవ్య నాటిక. అప్పట్లో యూత్ ఫెస్టివల్‌కు సిద్దం చేసిన ఆ నాటకంలో శ్రీశ్రీ గేయపాదాలు వుండడం వల్ల అనక్రానిజం అని భావించి, తిరస్కరించిన న్యాయనిర్ణేతలు ఆచంట జానకిరాం, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ.

చదవండి :  దాపుడు కోక (కథ) - డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

ఒక రకంగా మంచి కథలు రాయాలనే పోటీ మనస్తత్వం నా కంటే మంచి కథకుల నుంచి నేర్చుకున్నాను. మరొకరకంగా కథా రంగాన్ని ఏలాలనుకునే అల్పుల మీద కోపంతో రచనకి దిగాను. ఈ రెండూ ప్రోత్సాహకాలే కావచ్చు. నిజంగా నన్ను నడిపించింది. నా అనుభవ ప్రపంచం, నా సాహిత్య ప్రేరణలు – రాజకీయాలు, ఉద్యమాలూ నాకు ప్రేరణ ఇచ్చాయేగాని వాటి దైనందిన నిర్మాణ వ్యవహారాల్లో నేను ఏనాడు మమేకం కాలేకపోయాను. నిర్మాణానికి సులభంగా వొదగని ప్రశ్నించే స్వభావం ఏదో మొదటి నుంచి నాలో వుంది. అందుకే జీవితానికి సంబంధించిన గత, వర్తమాన, భవిష్యత్తుల్నే నేనెక్కువగా పట్టించుకున్నాను. అవే నన్ను కలవరపెట్టాయి. చిన్నతనంలో మా ఇళ్లల్లోనూ, చుట్టూపట్లా గమనించిన స్త్రీ, పురుష వివక్ష నన్ను తీవ్రంగా బాధించింది. కాని వాళ్ల గురించి కథలు ఎక్కువగా రాయలేకపోయాను.

దళితుల సమస్యల్ని ప్రత్యక్షంగా చూశాను. వాళ్ల మధ్య తిరిగాను, వాళ్ల స్నేహాల మధ్య పెరిగాను. కరువులూ కాటకాల వల్ల భూమి కోల్పోతూ కార్మికులుగా మారిపోతూ వచ్చిన గ్రామీణ జీవితాన్ని చూశాను. గ్రామ కక్షల్ని దగ్గిరగా గమనించాను. వ్యాపారంలో చెడిన వ్యవసాయ కుటుంబ ప్రవృత్తి చేత వ్యాపార వాణిజ్యాల్లో ముందుకెళ్లలేకపోయిన బతికిచెడ్డ కుటుంబాల్నీ గమనించాను.

నేను నగరంలోకి వచ్చి పన్నెండేళ్లు దాటుతున్నా నాదింకా పల్లెటూరితో ముడిపడిన అంతస్తత్వమే. పల్లెటూళ్లు మారుతున్నాయి. పట్టణ నగర సంస్కృతికి దగ్గరవుతున్నాయి. భౌతికంగా జరుగుతున్న ఈ మార్పులన్నీ నిజమైన సంస్కారం వైపు జరగడం లేదేమో! ఇట్లా రకరకాల అనుభవాలు అన్నీ – చరిత్రల్లో వేళ్లుండి వర్తమానంలో గిలగిల కొట్టుకుంటూ ఏ సుందర భవిష్యత్తు కోసమో తపించే రకరకాల మనుషులూ వాళ్ల సంబంధాలు – బహుశా ఇట్లాంటివే నా కథలకు మూలాలేమో!

నేను చాలా స్లోరైటర్ని. తిరగరాస్తే తప్ప, ఎడిట్ చేసుకుంటూ పోతూ తప్ప ఏ కథనూ ఏకబిగిన రాసే శక్తిలేని రచయితను. ఒక్కటి మాత్రం చెప్పగలను. నేను రాయాల్సిన కథలు మాత్రం చాలా ఉన్నాయి. నవలో, నవలలో రెండు మూడు వుండవచ్చు. ఈ కథలూ, ఈ నవలలూ నన్ను నేను ప్రశ్నించుకుంటూ, అనుభవ మూలాన్ని వితర్కిస్తూ రాసేవి. మన మనస్తత్వమూ, మన భావావేశాలూ ఏ దిశగా వుంటే నాగరికమో తెల్పడానికి మధనపడేవి.”

(2004)

రచయిత గురించి

డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సంచాలకునిగా పదవీ విరమణ పొందిన వీరు 1939 జులై 10న కడప జిల్లా కమలాపురం తాలూకాలోని రంగసాయిపురం గ్రామంలో జన్మించారు. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’,’ జప్తు’, ‘ఇఛ్చాగ్ని’ పేర్లతో వీరి కథలు సంకలనాలుగా వెలువడ్డాయి. కేంద్ర బాషల అభివృద్ది మండలి సభ్యులుగా వ్యవహరిస్తున్న వీరు ప్రస్తుతం కడప నగరంలో నివాసం ఉంటున్నారు.

ఇదీ చదవండి!

samvedana magazine

సంవేదన (త్రైమాసిక పత్రిక) – ఏప్రిల్ 1968

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, ఏప్రిల్ 1968లో ప్రచురితం. చదవండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: