వైఎస్ హయాంలో

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత..

2004 లో అనుకుంటాను. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత.. గాంధీ భవన్లోనో, మరెక్కడో, వైఎస్సార్ చేసిన సుదీర్ఘ పాదయాత్రకు సంబంధించిన ఒక ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైఎస్సార్ వెళ్లారు. వందలాది ఫోటోలను అమర్చారు. అన్నింటిని శ్రద్ధగా చూస్తున్నారు ఆయన. అనేక ఫోటోలలో తన వెంట ఉన్న ఒక సామాన్య వ్యక్తి పై ఆయన దృష్టి పడింది. అతడు తనతో పాటు చాలా ఫోటోలలో ఉన్నాడు. కొన్ని ఫోటోలలో తన పక్కన, మరికొన్ని ఫోటోలలో తన పాదాలు వత్తుతూ, కొన్ని ఫోటోలలో తనకు బూట్లు వేస్తూ, మరి కొన్ని ఫోటోలలో మంచినీరు అందిస్తూ.. ఇలా కనిపించాడు.

అతను ఎవరో వైఎస్సార్ కు తెలియదు. అతను ఎవరో కాంగ్రెస్ కార్యకర్త ఏమో అనుకున్నాడు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు తీసిన అన్ని ఫోటోలలో ఆ వ్యక్తి కనిపించాడు. “ఎవరు ఇతను?” అడిగాడు పక్కనున్న కార్యకర్తలను. అందరూ తమకు తెలియదు అంటే తమకు తెలియదు అని బదులిచ్చారు. ఆశ్చర్యపోయాడు వైఎస్సార్.. తనకు తెలియదు, కార్యకర్తలకు తెలియదు… మరి ఎవరు? ఎందుకు తనను అనుసరించాడు అన్ని రోజులు? పాదయాత్ర తరువాత అతను మళ్ళీ కనిపించలేదు.

చదవండి :  కాంగ్రెస్‌ సమర్పించు.. హైప్‌ మీడియా డ్రీమ్‌ ప్రొడక్షన్స్‌.. జైల్లో జగన్‌ - 2

ఆ ఫోటోల ఆధారంగా, అతను ఎవరో, ఏ వూరో, ఎందుకు తన వెంట ఉన్నాడో, ఇరవై మూడు జిల్లాల్లో ఎక్కడున్నా ఆరా తీసి తన సముఖానికి తీసుకుని రావాల్సిందిగా ఆజ్ఞాపించాడు.

అంతే.. అతని ఫోటోలు పట్టుకుని కార్యకర్తలు వేట మొదలు పెట్టారు. ఏవూళ్ళో అడిగినా అతని ఆచూకీ దొరకలేదు. కొన్నాళ్ల తరువాత నెల్లూరు జిల్లాలో ఒక గ్రామ వాసి అతడిని గుర్తుపట్టి అతని వివరాలు చెప్పాడు. స్థానిక నాయకులు అతని ఇంటికి పరుగుతీశారు. తీరా చూస్తే అతను యాదవ కులానికి చెందిన పశువుల కాపరి. పూరిగుడెసె లో నివసించే అతి పేదవాడు.

ఎందుకు వైఎస్సార్ వెంట తిరిగావు అని ప్రశ్నించారు నాయకులు.

“నాకు చాలారోజులనుంచి వైఎస్సార్ అంటే అభిమానం. ఆయన పాదయాత్ర చేస్తున్నాడని తెలిసి ఆయనకు సాయంగా ఉండాలని నిర్ణయించుకుని ఒకరోజు ముందు చేవెళ్ల వెళ్లాను. అక్కడినుంచి గుంపులో కలిసి ఆయనతో తిరిగాను. ఆయనకు వడదెబ్బ కొట్టినప్పుడు సేవ చేసే అవకాశం లభించింది. ఆయనకు మంచినీళ్లు అందించే అదృష్టం దొరికింది. పాదయాత్ర అయిపోగానే నేను నా ఇంటికి వచ్చాను. అంతే తప్ప మరేమీ లేదు” చెప్పాడు అతను భయపడుతూ.

చదవండి :  మన కలమళ్ళ శాసనం (తొలి తెలుగు శాసనం) ఎక్కడుంది?

వెంటనే అతడిని నాయకులు హైద్రాబాద్ తీసుకుని వచ్చారు. వైఎస్సార్ ఇంటికో, లేక గాంధీ భవన్‌కో తీసుకెళ్లి వైఎస్సార్ ముందు నిలబెట్టారు. అతని ముందే అతని గూర్చి వివరాలు అందించారు వారు. అతన్ని చూడగానే వైఎస్సార్ లేచి ఎదురు వచ్చి అతడిని గట్టిగా కౌగలించుకుని అతడు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి తనను కౌగిలించుకోవడంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. దేహమంతా చిగురుటాకులా వణికి పోయింది.

తన పక్కనున్న స్నేహితుడితో ఒక ఆరు అంకెల భారీ ఎమౌంట్ ను చెప్పి “రెండు నెలల పాటు తన వృత్తి, వ్యాపారం, భార్యా పిల్లలను సైతం వదిలేసి నా వెంట తిరిగాడు. ఏమిచ్చినా అతని ఋణం తీర్చుకోలేము. ఆ అమౌంట్ అతని పేరుతో ఫిక్సెడ్ డిపాజిట్ చేసి ఆ వడ్డీ తో జీవితాంతం సుఖంగా జీవించే ఏర్పాటు చెయ్యండి” అని కోరాడు. ఆ ఆదేశం గంటల్లో అమలు అయింది.

చదవండి :  ప్రాంతాల మధ్య కాదు, ప్రాంతాలలోనే అసమానతలు

అధికారం ఉన్నప్పుడు, పదవులు ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా ప్రతి ఒక్కరూ మూగుతారు. డబ్బున్న వారికి లోకమంతా బంధువులే ఉంటారు. డబ్బు, అధికారం పోయినపుడు భార్యా పిల్లలు కూడా విలువ ఇవ్వరు. మనం నిర్భాగ్యులు గా ఉన్నప్పుడు మన వెంట ఉండేవారే మన ఆత్మీయులు. ప్రజానాయకుడికి బలం కండల్లోనూ, పిక్కల్లోనూ ఉండదు. తనకోసం ప్రాణం ఇచ్చే అభిమానుల్లో ఉంటుంది. అలాంటి అభిమానులను తయారు చేసుకోవడంలోనే నాయకుడి సమర్ధత, చాకచక్యం నిబిడీకృతంగా ఉంటాయి.

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీకోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగా పలికే
తోడొకరుండిన అదే భాగ్యము.. అదే స్వర్గము
**** అంటారు మహాకవి శ్రీశ్రీ…

రాజకీయనాయకులు నేర్చుకోవాల్సిన విలువైన పాఠం ఇది.

– ఇలపావులూరి మురళీమోహన్

(ఇరవై ఇళ్లనుంచి పాత్రికేయ వృత్తి లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక సంపాదక మిత్రుడు చెప్పిన కథనం ఆధారంగా.. అన్నట్లు ఈయన ఏ పార్టీకి చెందిన వాడు కాదండోయ్… తటస్థ మేధావి)

ఇదీ చదవండి!

ఆరోగ్యశ్రీ

హైదరాబాదు ఐఐటి ఏర్పాటు ప్రకటన

శాసనసభలో వైఎస్ ప్రసంగాలు Date: December 19, 2006 చదవండి :  నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: