కడప జిల్లా శాసనాలు 3

భారతదేశంలోనే ఏకైక శాసనం…

నీటి పారుదల సౌకర్యాలను గురించి తెలుపుతున్న శాసనాల్లో కూడా కడప జిల్లాకు ప్రత్యేక స్థానముంది. బుక్కరాయల కుమారుడు, ఉదయగిరి రాజ్యపాలకుడు భవదూరమహీపతి (భాస్కరరాయలు) క్రీ.శ. 1369లో పోరుమామిళ్లలో అనంతరాజసాగరమనే తటాకాన్ని నిర్మించి ఆ సందర్భంలో ఒక శాసనాన్ని వేయించాడు. చెరువుకట్ట మీద రెండు బండలపై చెక్కబడి ఉన్న ఈ శాసనం మధ్యయుగాల్లోని తటాక నిర్మాణ కౌశలానికి ప్రబల సాక్ష్యంగా దర్శనమిస్తుంది. తటాక నిర్మాణానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ శాసనంలో ప్రస్తావించబడ్డాయి.

తటాక నిర్మాణానికి సంబంధించిన శాస్త్రాలు నిర్దేశించిన పన్నెండు అంగాలు, వర్ణించవలసిన ఆరుదోషాలను ఈ శాసనంలో పేర్కొన్నారు. దోషరహితము గుణరాశి శోభితము అయిన ఈ తటాకాన్ని రోజుకు నూరుబండ్లు, వెయ్యిమంది పనివాళ్లు శ్రమించి, రెండు సంవత్సరాలలో పూర్తి చేశారని, దీని నిర్మాణానికైన ధన, ధాన్య వ్యయానికి లెక్కలేదని, ఈ చెరువు కట్ట ఐదువేల రేఖాదండాల పొడవు, ఎనిమిది రేఖాదండాల వెడల్పు, ఏడు రేఖాదండాల ఎత్తు ఉందని, భూములకు నీటిని వదలడానికి తటాకానికి నాలుగువైపులా జలగతులు (తూములు) నిర్మించబడినాయని ఈ శాసనం తెలుపుతుంది. తటాక నిర్మాణాన్ని గురించి ఇంత విస్తృతంగా చర్చించిన శాసనం భారతదేశంలో ఇదొక్కటే ఉంది.

చదవండి :  పెద్దముడియం చరిత్ర

కడప జిల్లాలో మాత్రమే ….

సామాజిక చరిత్రలో అరుదుగా తారసపడే విషయాలకు సంబంధించిన శాసనాలు కడప జిల్లాలో లభిస్తున్నాయి. సదాశివరాయల కాలంలో విప్రవినోదులు, దొమ్మరులు, మంగలివారు, వీరముష్టులు అనే నాలుగు కులాల వాళ్లు తమకు గ్రామస్థుల నుండి లభించే పన్నులను, వర్తనలను ఆయా గ్రామాల్లోని దేవాలయాలకు దానమిచ్చి శాసనాలు వేయించారు. ఈ శాసనాల ప్రారంభకాలం, సదాశివరాయులు సింహాసనాన్ని అధిష్టించిన సంవత్సరంతో సంవదించడం, అతని పరిపాలనకాలం తరువాత ఇటువంటి శాసనాల ప్రాచుర్యం దాదాపు లేకపోవడం చాలా ఆసక్తికరమైన అంశం. అంతేగాక ఈ శాసనాలు కడప జిల్లాలో మాత్రమే ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో రెండుమూడు చోట్ల ఇటువంటి శాసనాలున్నా అవి వేళ్లమీద లెక్కించదగినన్ని కూడా లేవు. ఇంతవరకు చర్చించిన శాసనాలే గాక సమకాలీన సామాజిక జీవితాన్ని గురించి, ఆర్థిక వ్యవస్థను గురించి, ధార్మిక సంప్రదాయాలను గురించి తెలుపుతున్న అనేక శాసనాలు కడప జిల్లాలో లభిస్తున్నాయి.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1983

రాజులు, రాజవంశాల చరిత్రనేగాక ప్రజల చరిత్రను, మన సాంస్కృతిక వారసత్వాన్ని అధ్యయనం చెయ్యడానికి ప్రధానమైన ఆధారాలుగా ఉన్న శాసనాలు మన పూర్వీకులు మనకిచ్చిన అపురూపమైన సంపద. వీటిని ఖిలం కాకుండా రక్షించుకోవలసిన బాధ్యత మనపైన ఉంది.

అశోక చక్రవర్తి తన ధర్మలిపి శాసనాలను ప్రజలకు వినిపించడానికి అధికారులను నియమించి, వాళ్లు తిష్య నక్షత్రం రోజున శ్రోత ఒక్కడున్నా సరే శాసనపాఠాన్ని బిగ్గరగా చదివి వినిపించాలని ఆదేశించాడు. కేవలం అక్షరాస్యులకేగాక నిరక్షరాస్యులకు కూడా తన ధర్మబోధనలు తెలియడం కోసం ఆ చక్రవర్తి ఈ విధమైన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అటువంటి అవకాశం లేదు. కాని విద్యావంతులైన వాళ్లంతా శాసన పాఠాన్ని చదివి వివరించలేకపోయినా, అవి గుప్త నిధులకు సంబంధించిన సమాచారాన్ని అందించే మంత్రాక్షరాలు కావనే విషయాన్ని ప్రజలకు స్పష్టం చేయడం ద్వారా మూఢ విశ్వాసంతో ఉన్న అమాయకులు, అత్యాశాపరుల నుంచి శాసనసంపదను, ఇతర చారిత్రక, సాంస్కృతిక ఆకరాలను రక్షించవలసిందిగా విన్నవించుకుంటున్నాను.

చదవండి :  రైళ్లకూ మొహం వాచిన రాయలసీమ!

– డాక్టర్ అవధానం ఉమామహేశ్వరశాస్త్రి

ఇదీ చదవండి!

ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన శాసనం !

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం రధోత్సవం జరుగుతుంది. కోదండరాముని కల్యాణోత్సవం జరిగిన మరుసటి రోజు ఈ రధోత్సవం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: