సిన్నిగాడి శికారి (కథ) – బత్తుల ప్రసాద్

డమటి పక్క పొద్దు నల్లమల కొండల్లోకి సిన్నగ జారిపాయ. జంగిలిగొడ్లు కాయను మిట్టకు పోయిన ఆవుల రామన్న, మేకల్ను తోలకపోయిన చెవిటి కమాల్ అప్పుడే ఊళ్ళోకి బరుగొడ్లను, మేకల్ను తోలకచ్చిరి, సవరాలు, గడ్డాలు, చెయ్యడానికి పక్క పల్లెలకు పోయిన మంగళోల్ల రామన్న సంకకు పెట్టె,భూజాన మూటె ఎత్తుకుని వచ్చినాడు. ఏట్టో గుడ్డలుతకడానికి బొయిన సాకలోల్లు ఉతికిన గుడ్డల మూటల్ను ఈపునెత్తుకొని వర్సగా గూడ్సుబండ వచ్చినట్లు వచ్చాండిరి. చేలల్లోకి పన్లకు పోయిన ఆడోళ్ళునెత్తిన గడ్డిగంపలెత్తుకుని కొందరు, కూరాక్కు తమేటాలో, పచ్చిమిరపగాయలో, గోవాకో ఒళ్ళో పెట్టుకుని కొందరు వచ్చాండిరి.

ఆకాసంలో కొంగలు బార్లు తీరి పోతాండే. మా ఇంటికాడ చింతచెట్టు చేరుకున్న కాకులు కావ్ కావ్ అంటా పలకరిచ్చుకుంటాన్నెయి. జంగిలిగొడ్లు, మేకలు రేపుకుంటా పొయిన దుమ్ము మేక పెంటికలు, పేడ…. ఇయన్నీ గలిపి ఈదంతా సందకాడ ఎప్పుడూ వచ్చే వాసనే వచ్చాన్నెది. నేను గూడా పగులంతా బేకారు తిరుగుడు తిరిగా ఇంటికొచ్చి.

మా యమ్మ నన్నుజూచి ఆచ్చర్యపోయినట్లు మొకం పెట్టి, “ఏం నాయనా, అప్పుడే వచ్చివి! ఇంత బెరీన ఇంటికొచ్చే…. ఆడ గజిటాఫీసర్ పని ఎవురు జచ్చరు? పనిలా, పాటలా రోజురోజుకు పోరంబోకు నా బట్టయిపోతాండడు. ఇంటికాడ ఒక కట్టెపుల్లో, కంపపుల్లో కొడ్దాం, ఒక కడవ నీళ్లు తెజ్దాం అనే దాసే లేకపాయే! అలేకారి మాదిరి యాలకు రాడం, తిండం, తిరగడం! ఇంటిపట్టున కూచ్చొని సదువుకోరా నా బట్టకొడకా అని ఎంత జెప్పిన ఆ మాటే సెవిలో దూరకుండ పాయ! ఎంత తిట్టిన సిగ్గు ల్యాకపాయ! కొడ్తమంటే సిన్న పిల్లోడా.. బరుగొడ్డు మాదిరుండాడు. పోని, ఎట్టబొయ్యే నా బట్టలు అట్టపోతరు. ఈడు సిదిగి సంపాయిచ్చి నాకేమన్నా పెడ్తడా? అసలు ఈ ముసిలోనికి సిగ్గులేదు?” అని మా నాయన్ను తిట్టడం తిరుక్కుండె.

నేను మా యమ్మ తిట్లను పట్టిచ్చుకోకుండా దొడ్లోకి పొయి నాలుగు చెంబులు నీళ్లు బోసుకుంటి. అప్పటికే సీకటి పడ్డంతో దొడ్లో సబ్బు యాడందో కనిపియ్యకపాయ. సబ్బేడుందని అడిగితే మా యమ్మ ఇంగా ఏయేమి తిట్టు తిడ్తదోయని సబ్బు లేకుండానే నీళ్లు బోసుకుని ఇంట్లోకొచ్చి గుడ్డలేసుకుంటి.

సీకటి బాగా ముదిర. మా ఈదిలో పన్లకుపోయొచ్చినోళ్లు, బరుగొడ్లు కాయను పొయొచ్చి నోళ్లందరూ ఇండ్లకు జేరుకుని బువ్వలు తిండానికి తయారయితాండిరి. ఆడోళ్లు కుండకాడ కూచ్చోని మొగునికి పిల్లోల్లకు ముసిలోల్లకు బువ్వ పెడతాండిరి. ఒక్కొక్క ఇంట్టోనుండి ఒక్కోరకం కూరాకుల వాసన వచ్చాన్నెది. మా నాయన ఈదిలో నులక మంచమేస్కుని కూచ్చోని, ఎదురింటి సాతానయ్యతో మాట్లాడ్తాన్నెడు.

నేను మాయన్న మిలట్రి నుండి దెచ్చిన స్వెట్టర్, మఫ్లర్ తీసుకుని, ఒక సంచిలో బియ్యము, ఒక సీసాలో ఇంత నూనె, ఒక చిన్న కాయితంలో ఇంత కారంపొడి, దనియాల పొడి, పసుప్పొడి అన్ని పెట్టుకోని సిన్నిగానికోసం ఎదురు సూచ్చాంటి. ఇంతలో సురేస్ సైకిల్లో వచ్చిండు. ఆ మనిసి సైకిల్ కు బాట్రి తగిలిచ్చివున్నెడు. పైన స్వెటర్, మఫ్లర్ ఏసుకోనుండె. సైకిల్ కు స్టాండేసి వచ్చి నా తట్టు తిరిగి ఏదో అడగబోయి,ఆ పక్కనే వసారా బయట నులకమంచం మీద కూచ్చోని బీడి తాగుతాన్నె మా నాయన దగ్గడంతో నా సెవికాడ నోరుబెట్టి.

“బీడీ కట్టలు పెట్టుకున్నవా?” అని సరేసు.

“అంగడికి పొయి కొనక్కరావాల!” అంటి, మా నాయనకు ఇనిపియ్యకుండా.

“తొందరగ పోరా, నాయాల! టైమైతాంది!” అని నా చేతిలో బాట్రిలైటు తీసుకున్నెడు.

నే నంగడికి పొయి ఒక అరబురుజు తుల్సి బీడీల, అరడజను అగ్గిపెట్టెలు, రెండుపాకెట్ల సిజర్ సిగరెట్లు కొనుక్కోని వస్తాంటే మా ఇంటి బయట మా నాయన కూకున్న మంచంమీద మా నాయనకు శెరోపక్కన సురేస్, సిన్నిగాడు కూచ్చోని మాట్లాడ్తాండిరి. మా నాయన ఏదోచెతురు మాటన్నట్టుండాడు. ఇద్దరూ గట్టిగా నగిరి. వాళ్లకొక్క రవ్వ దూరంలో మా ఇంటి గోడకున్న అరుగు మీద ఇంగా ఇద్దరు కూకున్నట్లు అనిపిచ్చింది. ఎవురబ్బా ఈళ్లు అనుకుంటాంటేనే ఈదిలైటు ఎలిగినాయి. ఆ ఎలుగులో అరుగుమీద కూకున్న కాశీంపీర, ఎంకరెడ్డి నన్ను పలకరిచ్చినట్లు నగిరి. నేం గూడా నగితి. ఈ లైటెలుగులో మా నాయనకు నా సేతిలోవున్న బీడీలు, సిగరెట్లు కనిపియ్యకుండా పట్టుకుని సిన్నగా అరుగుకాడికి సేరుకుని సంచిలో ఎట్టపెట్టుకోవాలబ్బా అనుకుంటాంటే పుటుక్కున్న ఈదిలైటార్పాయె. అబ్బ… బతికితిరా, నాయనా! అనుకుంటా వాటిని నా సంచిలో గబుక్కున దూరిచ్చి.

“అన్ని పెట్టుకున్నవా?” అనె సిన్నిగాడునా పక్క జూసి.

“ఆ… పెటుకున్. తుపాకేది?” అనంటి.

“అద్దో… ఆ అరుగుమీద పెట్నగాని పా, పా! టయం బారయిపాయ!” అంటానే సిన్నిగాడు వాడి సంచి, తుపాకి సేతుల్లోకి తీసుకున్నెడు.

“వచ్చం, మామ!” అనె సురేశ్ మా నాయన్తొ.

“శామంగ పొయి, లాబంగా రాండోయ్!” అనె మా నాయన.

“సురేసుగా! యా దావన బోదం?” అనె సిన్నిగాడు.

“ఏటెంబడి బోదం, పారా!” అనె సురేసు.

అందరం సైకిళ్లకు సామాన్లు తగిలిచ్చుకోని కదలబోయేముందు ఎంకరెడ్డి సేతిలో వున్నె బాట్రిలైటేశ. దొంక దావ తట్టు సీకటిని సీల్సుకుంటా పాయ ఆ లైటెలుగు.

“ఎవ్వరు లేరు, పాండి!” అనె ఎంకరెడ్డి.

అందరం సైకిళ్లు తోసుకుంటా కదిల్తిమి.

దొంకలోకి వచ్చిమో, లేదో, డొంకలో వాసన గాటుగా తగిలె. “అబ్బ! ధూ! ధూ! యా నా కొడుకో చెడేరిగినట్టుండాడు కంపు!” అనె సురేసు. అట్ట అంటాండగానే కోంటోళ్ల సత్తెం చెంబు సేతపట్టుకుని చెట్ల పక్కనుండి దావలోకి వచ్చి పంచె సర్దుకుంటా, చెంబులోమిగిలిన నీళ్లు పారబోసి, మిమ్మల్ని సూసి “యాడికి? అందరూ ఈ యాలప్పుడు పోతాండరు?” అనె.

చదవండి :  మా నాయన సన్న పిల్లోడు (కథ) - బత్తుల ప్రసాద్

“మేము సరే, శెట్టీ! నీకు యాలా పాలా లేదా యారగడానికి?”అనె సురేసు. దానికందరూ నగిరి.

“సికారికి పోతాండారా?” అన్నె సిన్నిగాని సేతిలో తూపాకి జూసి.

“ఆ పోతాండం! మాసాల్నూరుకో!” అనె ఎంకరెడ్డి.

“ఎందుకు నూరుకోడు? యవడ్రా ఈ కాలంలో సియ్యలు తిన్నోడు? బాపనోళ్లు కోంటోళ్లు అందరూ బయిరంగంగా తినబట్టి కాదూ కూరాకు రేట్లట్ట పెరిగింది!” అనె కాశింపీర.

అట్టా మాట్టాడుకుంటూండగానే ఏటికాడి కిచ్చిమి. పారంసెట్ల మీదుండే కీసురాళ్లు గీ అంటా అరుచ్చాండె. ఏట్లో నీళ్ల దాపుకు పోతానే గట్టుమింద కూచ్చున్న కప్పలు ఏట్లోకి తపతపా అంటు ఎగిరి దూకె. దూరంగా ఉన్న కొన్ని కప్పలు పోటీ పడరుచ్చాండయి. బాటరీలైటు ఎలుగుకు ఏట్లో తిరుగుతున్న పురుగులన్నీ వస్తాన్నెయి. సైకిళ్లు నీళ్లల్లోకి దింపితిమి. సన్న శాపలన్నీ ఎగురుకుంటా దూరంగా పోతాండయి.

బాట్రిలైటు ఎలుగుకు కొన్ని శాపలు దిక్కు తెలియక అట్టనే లైటుతట్టు సూచ్చ నిలబడ్నయి. వాటిని జూసి, “వరేయ్! నా లైటుకు శాపలు గూడ నిలబడ్తాండయ్!” అనె సురేసు.

“ఆ.. నీ లైటుకు శాపలు గారెంటిగ నిలబడ్తాయి. ఆ ఎలుగు జూడు, గుడ్డిదానికి దడ్డు జూప్పిచ్చినట్టుంది!” అనె కాశీంపీర.

“నాకు ఇదన్నా ఉంది, నీకు అది గూడ లేదు గదోయ్!” అనె సురేసు.

“ఆ పనికిరాని మొగుడు వుంటేనేం, లేకుంటేనేం అనీ… నాకెందుకు ఇట్టాటి లైటు? నేను గొంటే అయిదు బాట్రీలదే కొంట!”అనె కాశీంపీర.

ఇట్ట చెతురు మాట్లాడుకుంటూండగానే ఏరు దాటి మెయిన్ రోడ్డెక్కితిమి.

రోడ్డుమింద నుండి మా ఊర్ని జూచ్చె. నిద్దరపోడానికి ముందు తూగుతున్న సిన్నపిల్లోని మాదిరివున్నెది. అందరం రోడ్డుమింద గూచ్చొని సిగరెట్లు, బీడీలు ఎలిగిచ్చి సైకిళ్లెక్కితిమి. పారంకంపచెట్ల మద్దెన పామ్మాదిరి మెలికలు తిరిగి వుందా రోడ్డు. ఆ పారంకంపచెట్ల మీదుండే కీరురాళ్లు మా ఊర్లో ఉండే మంగళోల్లు పీర్లపండగరోజు గిర్రున తిరుగుతాన్న సైకిల్ టైర్ల సప్పుడు, ఆడాడ సైకిళు గాన్లు గుంతలో పన్నెప్పుడు వచ్చే సప్పుడు కీసరాళ్లకు పక్కాయిద్యాల్లాగున్నెయి.

“దేవి కష్టంబు లెట్లుండనో? పుణ్యచ్చేత్రమైన వారణాసి దర్సించి వచ్చెదమా?” అంటూ పద్దెమెత్తుకుండె సిన్నిగాడు.

“జవదాటి ఎరుగదీ లతాంగి!” అంటూ సురేస్ మరో పద్దెం ఎత్తుకున్నెడు.

వాళ్లట్ట ఒకరయినంక వకరు పద్దాలు పాడతానే ఉండిరి.

మా ఊరికాన్నుండి ఒక గంటసేపు సైకిళ్లలో పోతే గాని సుగాల్దొడ్డి రాదు. నా దాస తుపాకి మీందికి పోయింది. ఈసార్నయినా సిన్నిగాడు తుపాకి పేల్చనిచ్చాడా? లేదా! అనుకుంటి. అసలు నాకీ తుపాకి పిచ్చెట్ట పట్టిందంటే, చిన్నప్పుడు ఏడో తరగతి సదువుతాన్నప్పుడు ఇంగిలీసు నాన్ టైల్ లో అడవిలో తుపాకి పట్టుకుని సెట్టుసాటు నుండి జింకను గురి జూచ్చున్న ఇంగిలీసోడి బొమ్మ నాకు తుపాకి పిచ్చి పట్టేట్టు జేసింది. దాంతోనే నేను సికారికి పోయే సిన్నిగాన్తో నేస్తం జేసుకుంటి. సిన్నిగానెంట యాటకు పోడం, వాడుతుపాకి ఈసారి పేలుజ్జువులే అండం, ఈసారి ఎట్టయినా తుపాకి పేల్చాలనుకోవడం… ఇదే వర్సయింది సమత్సరం కాన్నుండి.

ఇట్టాలోశిచ్చాండగానే సుగాల్దొడ్డి దాపుకొచ్చిమి. ఆ తాండాలోని కుక్కలు మాసైకిళ్ల సప్పుడిని “భౌ !” మంటూ అరుపులు మొదలుబెట్టినయి. కొన్ని కుక్కలు ఉరుక్కుంటా మామీదికొచ్చె. “పో నియ్య… ఈ కుక్కలు దొంగలు వచ్చినప్పుడు మొరగవు! దొంకలోకి పోయొచ్చేవాన్ని జూసి మొరుగుతయి!” అంటా కుక్కుల్ను తరుముకుండె ఎంకరెడ్డి. సుగాల్దొడ్లో కంచెల మద్య నెమరేసుకుంటూ గమ్మున పండుకున్న ఆవులు మేకలు మా సప్పుడిని బెదురుకున్నట్లాయె. కుక్కల అరుపులు, సైకిళ్ల సప్పుడుకు ఆవులు, మేకలు బెదురుకోడంతో ఇండ్లల్లో పండుకున్నోళ్లు బయల్లో పండుకున్నోల్లు మా తట్టు జూసి, “యాటగాళ్లురో!” అనుకుంటాండిరి

వాళ్లట్ట మమ్మల్ని యాటగాళ్లన్నందుకు నేను శానా సంబరపడ్తి. యాల్నంటే, యాటాడ్డము…. “యాటగాడు”అనిపించుకోడం నాకు శానా ఇట్టం.

సైకిళ్లు ఎంకటేసు ఇంటి వసార్లో పెడ్తిమి. ఎంకటేసు, సుబ్బమ్మ ఇంట్లోంచి బయటకొచ్చిరి. మమ్మల్ని జూసి, “ఏమి, లేటాయె?” అనె వెంకటేసు.

“కలసపాడు మీ ఇంటెనుకుందా? అంత దూరం నుండి రాడమంటే పిల్లకుశాలనుకున్నెవా?” అనె సిన్నిగాడు.

సంచిలో బియ్యము సుబ్బమ్మకిచ్చి బువ్వొండమని జెప్పి, సిన్నిగాడు నెత్తికి లైటు కట్టుకుని ఒక సంకకు బాట్రి తగిలిచ్చుకోని బుజంమీద తుపాకి పెట్టుకుని “తడుకు చెరువు కిందికి పోయొచ్చం!” అనె.

సురేస్, కాశింపీర, ఎంకటేసు బయల్లేరిరి. నేను, ఎంకరెడ్డి ఎంకటేసు వాళ్లింట్లోగూకోని బీడీలు ముట్టిచ్చిమి. సుబ్బమ్మ బువ్వ డేక్సా పొయిమింద బెట్టి పొయి రగల్జేసె. పొయికాడ మంట ఎలుగులో సుబ్బమ్మ సగం మొకం తల్లగా, అందంగా కనిపిచ్చాన్నెది. “అడవిలో ఉన్న ఈమెంత సోగ్గా ఉంది?” అనుకుంటి.ఆమె బువ్వ డెక్సా కలబెడ్తా ఇంగొక పక్క వట్టి మిరపకాయలకు తొడాలు వలుచ్చాంటె, ఎంకరెడ్డి సుబ్బమ్మతో మాటలు గలిపి చెతురాడబట్టె. సుబ్బమ్మ వట్టి మిరపగాయల పెంకులో బోసి ఏంచుతాంటే ఆ గాటుకు ఎంకరెడ్డి ఆపకుండ దగ్గబట్టె. “ఈమయిన దగ్గేటోనికి చెతురొకటి!” అనె సుబ్బమ్మ నా తట్టు తిరిగి నగుతా. నేను “నువ్వు సెప్పేది కరెట్టే!” అన్నట్లు నగితి.

దూరంగా తుపాకి పేల్న సప్పుడయింది. అది ఇని మసాలా సామాన్లు దీసి సుబ్బమ్మకిచ్చిమి. మళ్లీ రెండు దపాలు తుపాకి మోత ఇనిపిచ్చె. సుబ్బమ్మ బువ్వ గంజొంచి ఏంచిన వట్టి మిరపకాయలు, కాల్చిన ఉల్లిగడ్డలు…… ఇంత సింతపండు, ఉప్పు ఏసి కారం నూరి ఒక మూకిట్లోకి తోడి, మసాలా దంచడం మొదలుపెట్టె. కాసేపటికి సిన్నిగాడు, కాశీంపీర, ఎంకటేసు, సురేసు వచ్చిరి. కాశింపీర సేతిలో మూడు మెడ సొగం తెగిన కుందేళ్లున్నెయి. సిన్నిగాడు తలకుండే లైటు, సంకలో వున్న బాట్రిలైటు ఓ మూల్న బెట్టి, కుందేలు తోళ్లు ఒల్చి మాంసం తునకలు తునకలు కొట్టి సుబ్బమ్మ కిచ్చి కాళ్లు చేతులు కడుక్కుని వచ్చె. ఈలోగాసురేసు తాను తెచ్చిన మిలట్రి రమ్ము అందరికీ గ్లాసుల్లో పోసిచ్చిండు.అది తాగుతా అప్పుడే సుబ్బమ్మ ఏంచుకొని వచ్చిన కందేలు ఆయాలు నంజుకుంటిమి. మందాగడం కాంగానేసుబ్బమ్మ అందరికీ తలా ఒక గిన్నెలో అన్నం బెట్టింది. వక వర్స వట్టి మిరగాయల కారం, మరొక వర్స కుందేలు కూరాకు. తాగిన మైకం, అడివి అయినందుకేమో బోదింటిమి. అది బోకమ్మగనిపిచ్చింది. మేం బువ్వలు తిని బయటకొచ్చి సూచ్చె ఆకాసం నిండ మబ్బులు కనిపిచ్చాండయి. వానకు ముందువచ్చే సల్లగాలి తగిలె. “పాండి, పోదాం!” అని సైకిల్లు ఆన్నే పెట్టి కాలినడకన బయల్దేర్తిమి నల్లమల అడవిలోకి.

చదవండి :  రెక్కమాను (కథ) - డా|| ఎమ్‌.వి.రమణారెడ్డి

సుగాల్తాండా నుంచి తడుకు సెరువు మిందబడి గుండుబాయి దావన పోతిమి. గుండుబాయి కాడికి పొయ్యినంక వాన సినుకులు మొదలయినయి. గుండుబాయికాడ వుండే మాన్ల మొదలుకాడ కూచ్చుంటిమి . టపటపా పడ్తాన్న సినుకుల సప్పుడు, గుయ్ మంటొచ్చాన్న సలిగాలి…. నల్లగుండే మబ్బూ… ఇయన్నీ నాకొకపక్క బయంగా, ఇంగొకపక్క మాంచి సాసం సేచ్చాన్నట్లనిపిచ్చాన్నెది. చెట్టుకింద కూచ్చోని బీడీ తాగుతాంటే పొగ గట్టిగా పీలుచ్చాంటే, బీడి ఒక్క రవ్వ ఎక్కువగ ఎర్రగ కనిపిచ్చాన్నెది ఆ బీడీ ఎలుగు. వాన తగ్గినా సన్నగా తుంపర మాత్రం పడతాన్నెది – ఇంగ ఈ తుంపర తగ్గేట్టు లేదు, పోదాం పాండి అని బయల్దేరితిమి.

రెండు మైల్లు నడ్సినంక చిక్కటి అడవిలోకి పోతిమి. మాములుంగయితే వాతావర్ణం ఇట్టుంటే యాట శానా బాగా జరుగుతది. సిన్నిగాడు తలకు కట్టుకున్న లైటు ఎడంపక్క కుడిపక్క తిప్పుతాండాడు. ఏ సన్న పురుగు కన్ను మినుకుమన్నా మళ్లా మళ్లా లైటేచ్చాండాడు. అట్ట నడ్సుకుంట దెగ్గర దెగ్గర పది మైళ్లదాంక పోతిమి. ఒక్క జీవం గూడ కనిపియకపాయె. సిన్నిగాడు ఓ సెట్టు కిందాగి మా తట్టు లైటేసి దగ్గరకి రాండి అన్నట్లు పిల్సె. అందరం సిన్నిగాని కాడికి పోతిమి.

“ఇంగ మెట్టుతో కొట్టాల్సిందే!” అనె సిన్నిగాడు.

(యాటకుపొయ్యే ముందు ఎవురైనా ఎదురై పలకరిచ్చి, జీవాలు కనపడకపోతే యాటకు వచ్చినోళ్ల బొమ్మలు, ఎదురైనోని బొమ్మ రాళ్లమింద గీసి చెప్పుతో కొడితే దోషం పోతుందని యాటకు పొయ్యేవాళ్ల నమ్మకం.)

కాశింపీర, ఎంకరెడ్డి ఆరు రాళ్లు ఏరుకొచ్చిండు. మా అయిదు మంది బొమ్మల, కోంటోల్ల సత్తెం బొమ్మ (కేవలం మనిసి బొమ్మ ఆకారం) గీసె సిన్నిగాడు. అందరం ఎడంకాలి మెట్టు ఇప్పి మా బొమ్మలను, సత్తెంగాడి బొమ్మను సెడ్డ సెడ్డ తిట్లు తిట్టి తలా మూడేట్లు కొట్టి, బీడీలు తాగి, వుచ్చబోసి మళ్లా బయల్దేరితిమి.

ఒక మైలు దూరం బోతానే సిన్నిగాడు లైటు ఆకాసానికేసి జీవాలు కనిపిచ్చినట్లు సైగజేసె. బాట్రీకుండే ఆరన్ ఏసిండు. లైటు మల్లా ఆకాసానికేసి తుపాకి పైకెత్తి లైటు సుక్కలో సూపు కలిపి తుపాకికుండే గర్రాన్ని ఎనిక్కి లాగి, సిన్నిగాడులైటు మెల్లంగ కిందికి దించుతాంటే నేను సిన్నిగాని దెగ్గరిగా పొయి నిలబడ్తి. సిన్నిగాని లైటు మెల్లంగ కిందికి దిగి నిలబడి నెమరేచ్చాన్న దుప్పుల మీద పడింది. “ఇంగ కొట్టెలే! ఢామ్మని పేల్తది!”అని అనుకుంటాంటె సిన్నిగాని సేతిలో ఉన్న తుపాకి కిలుక్కమనె. తూటా పేలకపాయె. సిన్నిగాడు ఎనిక్కి చెయ్యి జాపి ఇంగొగ తూటా ఇయ్యమన్నెట్టు సైగ జేసిండు. ఇంగొక తూటా దీసిచ్చి, ఆ తూటా పెట్టి మళ్లీ టిగ్గర్ నొక్కిండు. మళ్లా తూటా పేలలేదు. ఇట్ట జరుగుతాంటే ఎంకరెడ్డి ఖళ్లుమని దగ్గిండ. ఆ దగ్గు ఇనపడి జీవాలు పెళపెళమంటా సప్పుడు సేసుకుంటా ఎల్లిపొయినయి. సిన్నిగాడు ఎంకరెడ్డిని చెడ్డ తిట్లు తిట్టె.

“నా కొడక! తూటాలు కట్టుకుందాంరా అంటే ఇనకుండా మిలట్రోడి తూటాలు అని తెచ్చివి… అవి మొ…చూపిచ్చె!”అనె సురేసు.
“అది గాదురా! నేవ గట్టినయ్ కూడా తెచ్చ. ఒక్కరవ్వ పెద్ద జీవం గదాని వుర్జనలైతే బాగుంటదనుకుంటే ఈటెక్క ఇయి పేలకపాయె!” అనె సిన్నిగాడు.

మల్లా ఆన్నుండి దారి పడ్తిమి. రెండు మైళ్లు బొయినంక రేగి మాను రేవు కాడికి సేరుకుంటిమి. అది పులులు దిరిగే సోటు కాడంతో ఆడికి పోతానే అందరం పడ్తాన్నెది. ఇంగొక్క రవ్వ ముందుకు పోతానే నీళ్లు పారతాన్న సప్పుడినిపిచ్చింది. ఆ సప్పుడెంబడి పైకి ఒక పర్లాంగు బొయినంక బండ్లబాట కనిపిచ్చింది. బండ్ల బాటెంబడి నీళ్లు పారతాన్న పక్కకు పోతాంటే తుంపరకు నానిన దుమ్ము నీళ్లుబోసి పిసికిన సొద్దపిండి మాదిరి కాళ్లకు కర్సుకొచ్చాన్నెది. సిన్నిగాడు పోతా పోతా గబుక్కున ఆగి, దగ్గరకి రాండనట్లు వాని తలకాయకున్న లైటుతో పిల్సె.”ఏంది? అనుకుంటా వానికాడికి పోతిమి. వాడు మాట్లాడకుండా కుడితట్టు లైటేసిండు. మేము అట్టజూసి ఆచ్చర్యపడ్తిమి. ఒక మనిసి మోకాళ్ల మద్దెన తలకాయ బెట్టుకోని గొంతు కూచ్చోనుండె. ఒంటిమీద గోసి తప్ప ఇంగేమి లేవు.

“ఎవురో పిచ్చోడేమో?” అనె సిన్నిగాడు.

“ఎవురైతే మనకెందుకు? పాండ్రి!” అనె సురేసు.

“ఎవుర్రా ఈడు, ఈ యాలప్పుడు ఈడుండాడు?” అంటా దగ్గరికి పొయిరి ఎంకరెడ్డి, కాశింపీర. వాళ్లెంబడి మేంగూడా బోతిమి.

“ఎవురో చెప్పరా నీయ….” అనుకుంటా సిన్నిగాడు ఆ మడిసి తలకాయకు, మోకాళ్లకు మద్దెన తుపాకి మడిమ దూర్చి ఇడగొట్టబాయె. ఆ మనిసి ఒక్క రవ్వ గూడా పలక్కుండా ఇంగొక రవ్వ బిగదీసుకున్నెడు.

సిన్నిగాడు తుపాకి కాశింపీర సేతికిచ్చి మోకాళ్ల మద్దెనుండి ఆ మనిషి తలకాయ బయటికి బీకె. పెరిగిన గడ్డం, చింపిరి జుట్టు, ఎర్రటి కండ్లు వున్న ఆ మనిసి, మా ఎవరుతట్టు సూడకుండా సిన్నిగాని ఉరింజూసి, అట్టనే మోకాళ్ల మద్దెన తలకాయ బెట్టుకోని కూచ్చున్నెడు. ఇదంతా సూచ్చాంటే అంత సలిలో కూడా నాకు చెమట్లు పోసినాయి. నా ఒల్లు సల్లబడి సాదీనం తప్పుతాంది. ఇంక కింద బడ్తనేమోనని పక్కనే పాకతాన్న నీళ్లకాడికి పొయి, గబగబ నాలుగు దోసిళ్లు నీళ్లు దాగి మోకం కడుక్కుంటి. ఇంతలో సురేసు నా కాడికి వచ్చి నన్ను రెట్టబట్టి పైకి లేపి, “ఏందోయ్….. బయపన్నావ్, అదురు నాయలా!” అంటా అదురు పోయేదానికి ఈపు తట్టిడిసిండు.

చదవండి :  అలసిన గుండెలు (కథల సంపుటి) - రాచమల్లు రామచంద్రారెడ్డి

కాలవ దాటి ఒక సెట్టుకింద కూచ్చోని మంటేసుకుని కాసేపు వుండి మళ్లా ఇంగొక పక్కకు సాగితిమి. సెట్టుకింద కూచ్చున్నప్పుడు సురేసు, సిన్నిగాడు “పులులు దిరిగే రేవులో మనిసి పగలు రాడమే కట్టం. అట్టాడ్డి ఇంత రాత్తిర్లో ఈడుండాడంటే యోగన్న అయుండాల, లేకుంటే తల రాత బాగున్న ఎర్రోడన్న అయింటడు!” అని తేల్చిరి.

ఈసారి ఏదో ఒక జీవం ఎట్టయినా కనపడ్తది, సిన్నిగాడు ఎట్టయిన కొడ్తడు అనుకుంటి. సిన్నిగాడు ఎట్టయిన కొడ్తడు అనుకుంటి. ఎందుకంటే సిన్నిగాడు మాంచి తెలివైన యాటగాడు. ఈని యాట గురించి సెప్పాలంటే…

ఒకసారి మాంచి ఎండాకాలం. అడవిలో యాడా సుక్క నీల్లు గూడా లేకుండా రేగిమాను రేవుకాడ గుండంలో మాత్రం ఒక్కరొవ్వున్ని నీళ్లున్నాయంట. సిన్నిగాడు పగులే ఒక్కడు ఆడికి పొయి సెట్లలో మాటు పెట్టుకుని కూచ్చున్నడంట. మద్దాన్నెం పన్నెండు గంటలప్పుడు ఒక అడవి పంది, ఒక పులి రెండూ గుండంకాడికి వచ్చి ఒకదాన్నొకటి తినేసేటట్టు సూసుకుంటాన్నాయంట. సిన్నిగానికి దేన్ని ముందు కొట్టాల్నో, అసలు కొట్టాల్నా వద్దా అనే ఆలోచన్లో పడెనంట. పులిని గొడ్తె పందొచ్చి నా మీదబడ్తది. పులిని కొట్టడం పేద్ద కేసు గూడ. ఏం జెయ్యాలబ్బా అని ఆలోచించి ఎట్టయితే అట్టయిందని మాంచి సీసం గండు తూటా ఎక్కిచ్చి పంది జబ్బలకు బట్టి ధనామని కొడ్తనే ఆ దెబ్బకు పంది పులి నన్నేమో జేస్తాందని.

ఎగ్గిరి పులిని మోరతో కొట్టి దెబ్బకు సంపి, అది కూడా సచ్చిందట! అంత తెలివి వున్న యాటగాడు సిన్నిగాడు. యాటగాడికి గురొక్కటే కాదు, తెలివి కూడా శానా అవుసరం అంటారు పెద్దోళ్లు.

కాలిబాట దాటుకుని ఓ రెండు పర్లాంగులు మాంచి అడవిలోకి పోతిమి. ఎవల్లకు వాళ్లు ఆలోచిచ్చుకుంటా పోతాంటిమి. సిన్నిగాడు జీవం కనిపిచ్చినట్లు సైగ జేసె. ఆకాసానికి లైటేసి అటూ ఇటూ తిప్పుతా తుపాకిలో తూటా ఎక్కిచ్చి ఒ పదడుగులు మెల్లగ అడుగులో అడుగేసుకుంటా, లైటు సుక్కలో సూపు గలపడానికన్నట్లు తలకాయ, తుపాకి ఒక్కసారె పైకి లేపె. ఈసారి ఎట్టయినా కొడ్తడు అనుకుంటా ఊపిరి బిగబట్టి రాయి మాదిరిగా నిలబడి దగ్గొచ్చినా, ఉగ్గపట్టి సూస్తాంటిమి.

ఇంతలో సిన్నిగాడు “బా… !” అంటూ చావు అరుపరిచె. వానికాడున్న లైటారిపోయింది. మాకేమీ అర్ధం కాల. “సిన్నిగా!ఏమైందిరా?” అనరిసె సురేసు. సిన్నిగాడు ఒగరిచ్చా వురుకుతా వచ్చిండు.

“ఏమైందిరా?” అని ఒకరయినంక ఒకరమడిగితిమి.

నాకేమర్ధం కాలె. ఎందుకంటె సిన్నిగాడు మహా దైర్నస్తుడు. అట్టాటోడు అట్ట అరిసేటప్పటికి గాబర గాబరాయె. సిన్నిగాడు తాపటిచ్చాండడు.”ముందు ఈన్నించి పాండ్రి ,మీకు దండం పెడత!” అన్నెడు.

అందరం సిన్నిగాన్ని తలా ఒక పక్క పట్టుకుని ఉరికినట్లు నడుచ్చాబోతిమి.

గుండుబాయి దగ్గరకు రాంగనే కాశింపీర లైటు కూడా ఏసుకోకుండా బాయిలో దిగి నీళ్లు ముంచుకోనొచ్చి సిన్నిగాడకి తాపె. అందరం బీడీలు ముట్టిచ్చిమి. సల్లగాలి రివ్వున వచ్చి తగుల్తాన్న కూడా గబగబా నడుసుకుంటా వచ్చినందుకు మాకందరికి సెమటలు పట్టినయి. సిన్నిగాడు ఒక్కరవ్వ తేరుకున్నెడు. అందరికాడ ఎవురికి సెప్పాకండని పెమాణం జెయించుకుండె.

“అదిగాదురా…” అని ఆ మబ్బులో గూడా సుట్టూ జూసె, వాడు సెప్తాంటే ఎవరన్నా ఇంటారేమోనని, వాడెంత బెదురుకున్నడో వాని మొకం సెప్తాండె.

సిన్నిగాడు సెప్పడం మొదలుపెట్టె. “రెండు మాంచి దుప్పులు కనిపిచ్చె. పోతుది నిలబడి నెమరాచ్చాన్నది. ఇంగొకటి పండుకోనుండె. నేను ముందు లైటుపైకెత్తిన కాన్నించే కొడ్దామనుకుని, తుపాకిలో ఉన్న తూటాలో పిచ్చలు తక్కువుండై. సరింగ ఏటు బడ్తదో, లేదోనని ఇంగొక్కరవ్వ ముందుకు పోయి లైటు, తుపాకి పైకెత్తితి….” అంటా ఆగిపొయిండు.

“ఏమైంది సెప్పురా….!” అనె సురేసు.

సిన్నిగాడు గొంతు తగ్గిచ్చి “పైన చెట్టుకొమ్మకు ఎవురో ఆడమనిషిని ఉత్తబిత్తల యాలాడదీసిండ్రు….. కనిగుడ్లు బయటకొచ్చిన్నెయి!” అనె సిన్నిగాడు బెదురేడు పేడ్చి. “ఇంగెప్పుడు సికారికి రాను!” అని ఒట్టుబెట్టుకున్నెడు.

అది జరిగినంక మేమందరం ఎవురి బతుకుదెరువు కోసం వాళ్లు తలా ఒకపక్క ఇడిపోతిమి. నేను అయిదరాబాదుకొచ్చి ఏడేండ్లాయి. ఆ మద్య ఒకసారి మా ఊరికి పోతే, బస్టాండు కాడ చింతచెట్ల కింద సిన్నిగాడు ఓ కట్టె చేతబట్టుకోని, దాంతో తుపాకితో జీవాల కాలుచ్చాన్నెట్టు చేచ్చాండె.

“ఏమయింది ఆ మనిసికి?” అనడిగితి.

“నీకు తెల్దా….? సిన్నిగాడికి పిచ్చెక్కింది!” అని ఎవురో అనిరి.

నాకు వాన్ని సూడగానే ఆ దినం మేము జేసిన చివరి సికారి మతికొచ్చింది.

(ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితం, ‘సగిలేటి కథలు’ సంకలనం లోనిది)

రచయిత గురించి

వృత్తి రీత్యా పాత్రికేయుడైన బత్తుల ప్రసాద్ మంచి రచయిత కూడా. కడప జిల్లాలోని కలసపాడు వీరి స్వస్థలం. వీరు రాసిన కథలను ‘సగిలేటి కథలు’ పేర సంకలనంగా వెలువరించారు.ఈ సగిలేరు వీరు పుట్టిన కలసపాడు దగ్గరున్న ఒక ఏరు. ఇటీవలే “గంజిబువ్వ” పేర వీరు మరో కథా సంకలనాన్ని కూడా వెలువరించినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: