సియ్యల పండగ (కథ) – తవ్వా ఓబుల్‌‌రెడ్డి

”మా ఉళ్ళో ఏ పండగ వచ్చినా, ఏ సంబరం జరిగినా, గవినికాడి పుల్లయ్య చేసే సందడి అంతా ఇంతా కాదు ! సిన్నప్పటి నుంచీ పుల్లయ్య యవ్వారమే అంత అని మా నాయన చెబుతా ఉంటాడు. సంకురాత్రి పండగయితే పుల్లయ్యను పట్టుకోడానికి పగ్గాలుండవ్‌! ఊళ్ళో ఇళ్ళిళ్ళూ తిరుగుతా ఉంటాడు. ఏ ఇంట్లో ఏ వంటలు సేచ్చాండారు? ఏఏ ఊర్లనుండీ చుట్టాలు వచ్చినారు? ఊళ్ళో దేవుని మేరవని  ఎట్ల జేచ్చే బాగుంటది? పార్యాట ఆపొద్దు  ఏ జామున యాటపొట్టేళ్ళు, కోళ్ళు కోయాల? దేవుని ముందర చిందులు కట్టె వరసలు ఎవరెవరు బెయ్యాల ? ఇయన్నీ మాట్లాడుతా ఉంటాడు పుల్లయ్య. ఉత్తప్పుడైతే ఊళ్ళో, చేలల్లో పద్యాలు, తత్వాలు పాడతా తిరుగుతా మొబ్బుల్లో  కూడా ఎవర్నీ  నిద్దరపోనియ్యడు.

ఒక్క పుల్లయ్యకే గాదు , సంకురాత్రి పండగంటే మా ఊరోళ్ళందరికీ బలే సంబరమనుకో.. కొత్త గుడ్డలు కట్టుకొని, ఇళ్ళలో కాల్చిన నిప్పట్లూ, కారాలు, కజ్జికాయలూ, ముద్దలూ తినొచ్చునని పిల్లోళ్ళ సంబరం. ఆరుగాలం చేసిన కట్టం మరిచి పోయి కుశాలంగా ఉండొచ్చునని పెద్దోళ్ళ సంబరం… ఆడోళ్ళకు కొత్తకోకలూ, సొమ్ములు తెచ్చుకొని కట్టుకునే సంబరం… కొత్తల్లుళ్ళకూ, కొత్త పెళ్ళి కూతుళ్ళకూ మొదటి సంకురాత్రి సంబరం… ఇంత చుక్క రోంత ముక్క చప్పరించొచ్చునని ముసిలోళ్ళ సంబరం…!

పుల్లయ్యకు  తలకాయ చెడిపపోయిందని రొండేళ్ళనుంచీ ఊళ్ళో అందరూ అనుకుంటూ ఉండారు. పుల్లయ్య చేతలూ, మాటలూ సూచ్చే నిజమేనని అనుకుంటరు ఎవరైనా. సెతుర్లాడతా, అందరినీ నవ్విచ్చా ఉండే పుల్లయ్య ఈ సమచ్చరం పండక్కు ఊళ్ళో ల్యాకుండా పోవడం బాగా దిగులేసిందనుకో !

పండక్కు వారం దినాల ముందు పుల్లయ్యను పోలీసోళ్ళు పట్టుకోని బోయినారు . పుల్లయ్య బాంబులేయల్యా ! ఖూనీ చేయల్యా! పుల్లయ్య మంచికోసమే పోలీసోళ్ళు ఆ పని సేసినారు ! ఇశాకపట్నంలో పిచ్చాసుపత్రి ఉందంటనే… ! ఆడికి తీసుకపోడానికే పుల్లయ్యను  పోలీసోళ్ళు పట్టుకోని బోయినారు ! అందుకే ఈసారి సంకురాత్రికి పుల్లయ్య ఊళ్ళో ల్యాకుండా పోయినాడు.

ఐదారేళ్ళు జరక్కుండా పోయి సామి మెరవని  ఈసారి పెద్దగా సేచ్చాండరులే సంకురాత్రి పండగొచ్చింటే పదీ, పదైదు ఏళ్ళప్పటి పండగ సంబరాలు గుర్తుకు వచ్చాయి ; పండుగకు శివుని మెరవని బెమ్మాండంగా  జరుగుతది ! ఒక్క రాత్రీ, ఒక్క పగలు కల్లా సుట్టూ పదారు పల్లెల్లో శివుడు సుడిగాలి తిరిగినట్లు తిరుక్కోని వచ్చాడు ! మా ఊరి శివుని గుడికి మూడు తరాల నుంచీ రెడ్డేరింటోళ్ళే దరమకర్తలు ! అయితే ఈ నడుమన రాజకీయాలు అందరూ తెలుసుకున్యాక దరమకర్త పని  వాళ్ళకూ, వీళ్ళకూ మారబట్టినాది ! అయితే ఎవరు దరమకర్తలైనా సంకురాత్రి సంబరాలు మాత్తరం బాగానే సేచ్చరులే !

shivuduపండగ పదినాళ్ళు ఉండగనే శివుని గుళ్లో  రోజూ పొద్దున మేళాలను వాయించడం మొదలు పెడ్తారు. గుడికి సున్నంబేయిచ్చి, ప్రభలకు రంగులు గీయిచ్చారు ! పొద్దుటూరు నుంచీ ఔట్లూ, పటాకులూ తెప్పిచ్చారు ! కోయిల కుంట్ల నుంచీ బోగమోళ్ళను తోడకొచ్చరు.. పార్యాటకు కుందేలును పట్టకచ్చరు. బోగమోళ్ళు కులుకుతా.. పాటలు పాడ్తారు… వయసొయసు మొగపిల్లోళ్లు ఇన్నూరో , నూరో  బోగమోళ్ళకు తగిలిచ్చారు. పదారు పల్లెల్లో బోగమోళ్లు డ్యాంచులేసి పాటలు పాడ్తారు. బోగమోళ్ళు ఒక టాక్టర్లో.. తప్పెట్లూ, ఔట్లూ, లైట్లోళ్ళు ఇంగొక టాక్టర్లో.. ఊళ్ళో పెద్ద మనుషులు వేరే టాక్టర్లో పదారు పల్లెల్లో తిరుగుతారు. బోగమోళ్ళు.. మేళగాళ్ళూ దేవునికంటే ముందే ఒక్కో ఊరికి చేరుకోని సందడి సేచ్చా ఉంటారు. ఒక ఊరి నుంచీ మరొక ఊరికి దేవున్ని పొలాల్లో అడ్డంబడి మోసుకోని వచ్చారు. పసుపుతోట లుండినా.. వరి పైర్లుండినా తొక్కుకుంటానే దేవున్ని తీసుకొని వచ్చారు. పైర్ల గుండా దేవుడుపోతే పంటబాగా పండుతాదని మా వూరోళ్ళు నమ్ముతారు. ఊరి గవిన్లోకి దేవుడు చేరుకుంటానే ‘ఢాం’ అని పెద్ద అవుటు పేల్చుతారు. దేవుడు ఊళ్ళోకి అడుగు పెట్టినాడనే దానికి ఇది గురుతు ! ఆడోళ్ళు దేవునికి కాయ, కప్పురం  సిద్దం చేసుకుంటారు. పెళ్ళికి ఎదిగిన ఆడపిల్లోళ్ళు ఊరేగింపు ముందర బిందెలతో నీళ్ళు పోచ్చా పోతాంటరు ! అట్ల నీళ్ళు పోసినోళ్ళకు బెరీన పెళ్ళి అయితదంట ! ఊళ్ళోకి చేరుకున్న దేవున్ని రాం సోమి గుడికాడ ఆపుతారు. దేవునికి ఒకపక్క పూజలు జరుగుతాంటే, ఇంగోపక్క బోగమోళ్ళ డ్యాంచు జరుగుతాంటది ! దేవుని కాడ జనం పలచనగా ఉంటారు. బోగమోళ్ళ కాడ మాత్రం ఇసికేచ్చే  నేల రాలనంతగా ఒకటే జనం ! డ్యాంచు అయిపోయినంక  బలే యిచిత్రమైన తంతు జరుగుతాదిలే..!  బోగమోళ్ళు పూలదండలు యేసి సంబావనలు తీసుకునే తంతు అది ! కోడెకారు మొగపిల్లోల్లకూ, ముసిలోళ్ళకూ అందరికీ మెడల్లో దండలు వేసి లెక్క ఇప్పిచుకుంటారు. ఇన్నూటా పదార్లు కొందరూ, నూట పదార్లు కొందరూ బోగమోళ్ళకు ఇయ్యాల్సిందే ! ఒకసారి పుల్లయ్యకు ఇట్లనే బోగమోళ్ళ పిల్ల మెడలో దండ యేసింది. ”ఊరికే దండ బేచ్చే లెక్క ఎందుకియ్యాల… కాపురం సేచ్చే కదా !” అంటా పుల్లయ్య లెక్క ఇయ్యకుండా రోంత సేపు సారాకం ఆడినాడు. కొందరైతే మెడలో దండపడీ పడంగానే జేబులో పెట్టుకోని ఉండే లెక్క తీసి టక్కున ఇచ్చారు…! కొందరు సిగ్గుపడతా.. సందుల్లో గొందుల్లో దూరి బోగమోళ్ళకు చిక్కకుండా పరుగులు తీసుకుంటారు. రెడ్డేరు అయితే కొందరిని ఎంటపడి పట్టుకోనోచ్చి బోగమోళ్ళతో దండలు బేయిచ్చాడు. ఈ తంతు అయిపోయేలోగా దేవునికి పూజలు కూడా అయిపోతాయి. గుమ్మడికాయలు , కొబ్బరి గిన్నెలూ, బియ్యమూ, పూజారికి ఇచ్చుకుంటారు ఊరోళ్ళు ! .. ఇట్ల జరుగుతా ఉన్నెది.. పండగ !

చదవండి :  ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించాలి...

ఈసారి బోగిపండగ బలేబాగా జరిగింది. ఊరంతా ప్యానీళ్ళు జల్లి.. రంగు రంగుల ముగ్గులు యేసుకున్నెరు.. బోగి మంటలు యేసుకున్నెరు.. రెండోరోజు పెద్ద పండగ.. ఈ పొద్దు మా ఊరోళ్ళకు సినిమాలే సందడి! కడపకో, పొద్దుటూరికో పోయి సినిమాలు జూసి వచ్చరు! సినిమాలకు పోయినోళ్ళు రాత్రి ఏ రెండుగంటలకో.. మూడు గంటలకో ఊరికి జేరుకుంటారు! సీకటి ఇచ్చితే కనుమ పండగ! ఈ పండగను మా ఊళ్ళో సియ్యల పండగ అని అంటార్లే! తూరుపున సుక్క పొడసక ముందే పొట్టేళ్ళను, కోళ్ళను, మేకపోతులను కోయబడ్తరు. నెలదినాలనుండి జొన్నలు పెట్టిన మేపిన కోడిపుంజులను ఆరోజు కూత బేయకముందే  కోసి వండుతారు. సీకటి ఇచ్చక ముందే సియ్యలు పొయ్యిమింద ఉడికిపోతాయి. తెల్లార్తాండగానే జనం పేగుల్లో పేగులూ, సియ్యల్లో సియ్యలూ కలిసిపోతాయి. సియ్యల పండగ అంటేనే ఊళ్ళో తాగుడుబోతోళ్ళ సందడి  అంతా ఇంతా కాదు. సాంపర్తాయకమైన తాగుబోతోళ్ళు నాటు సారాయి తెచ్చుకుంటే.. వయ సోయసు పిల్లోళ్ళు టౌన్లోంచి సీసాలు తెచ్చుకుంటారు. చెరువుగట్టున నాటుసారా బట్టీ గూడా పెట్టినారు. నాటుసారాయి ఇళ్ళల్లో పెట్టుకుంటే పోలీసోళ్ళు వచ్చారనే భయంతో ఊరి చుట్టూ పసుపుతోటల్లో గుంతలు తీసి నాటు సారా జగ్గులనూ, సీసాలనూ బూడ్చి పెట్టుకున్నెరు. వాటిని కనుక్కుండే దానికి పెద్ద పెద్ద గుండ్రాళ్ళతో గురుతులు పెట్టుకున్నెరు. సియ్యల పండగ రోజు సీకటి ఇచ్చక ముందే సీసాల కోసం తోటలమ్మడి తారాడబట్టినారు. దొంగ దొంగగా మందు తాగే వయసొయసు పిల్లోళ్ళు కూడా పుల్లుగా తాగడానికి ఆ తోటల్లోనే నక్కినక్కి  తిరగబట్టినారు. పసుపు తోటల్లోని ఆందెపు  చెట్లు కైపు ఎక్కినట్లుగా గాలికి తూలుడు మొదలుపెట్టినాయి. గుండెకాయలనూ, నేరెడు ముక్కలను ఉప్పూకారం వేసి వేయించుకోని పొట్లాలు గట్టుకొని తీసకపోయి మందులో నంజుకోబట్టినారు, తాగుడుబోతోల్లందరూ! ”అబ్బ ఎంత మజాగా ఉందిరా .. ఈ పొద్దు పుల్లయ్య ఉన్నింటే ఎంత సందడిగా ఉండు” అనుకున్నెరు వాళ్ళంతా !

చదవండి :  యంగముని వ్యవసాయం (కథ) - ఎన్. రామచంద్ర

అప్పుడే రోడ్డు దిక్కు ఏందో శబ్దం..  ఇజిలు వేసిన శబ్దం… పోలీసోళ్ళ ఇజిలు మాదిరిగా యినబడింది. ”పోలీసోళ్ళు.. పోలీసోళ్ళు..” అంటూ ఎవరో క్యాకలు బేసినారు. ముందుగా తోటల్లో తారాడోళ్ళకూ.. ఆ తర్వాత ఊళ్ళో జోగాడోళ్ళకూ యినబడ్నది ఆశబ్దం ! తోటల్లోని వాళ్ళు తూలుతూ పడుతూ.. లేచ్చా అట్టా ఇట్లా పరిగెత్తబెట్టినారు. ముసిలోళ్ళు, వయసోళ్ళు ఒకరినొకరు ఢీలు తగల బట్టినారు. ఊల్లొ ఉండే వాళ్ళు ఇళ్ళల్లో సీసాలు తీసుకోని వంక చెట్లలోకి, తోటల్లోకి పరుగులు తీసినారు.

పోలీసు ఇజిలు శబ్దం దగ్గరగా వచ్చింది. చేతిలైటు వేసుకుంటూ ఇజిలు వేసుకుంటూ ఎవరో ముందుకు వచ్చాండరు ! ఇంకా తెల్లవారల్యా ! ఇజిలు వేసేవాళ్ళ దిక్కు నుంచీ మాటలు కూడా వినబడ్తాండయి. ఆ మాటలు యాన్నో యినినట్లే ఉండాయి.

”పుల్లయ్య మాటల మాదిరే ఉండయే” అనుకున్నెరు కొందరు.. పోలీసోళ్ళు నాటు సారాయిని పట్టుకునేదానికి పుల్లయ్యను తోడ్కోని వచ్చాండారని అనుకున్యారు ఇంకొందరు.

చదవండి :  గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత)

పోలీసులు లేరు ఎవరూ లేరు. పుల్లయ్య ఒక్కడే ఇజిలు ఊదుకుంటా వచ్చినాడని దగ్గరికి వచ్చి నాంక తెలిసింది. కాకీ చొక్కా, కాకీ సల్లాడం యేసుకోని, వాటిపైన కోటు కుడకా తొడుక్కోని విజిల్‌ ఊదుకుంటూ, చేతిలైటు యేసుకుంటూ వచ్చినాడు, పుల్లయ్య !

వచ్చింది పోలీసోళ్ళు కాదని.. పుల్లయ్య అని తెలుసుకోని తలకాయలు బాదుకున్నెరు, తాగినోళ్ళందరూ.. !

”టేషన్లో ఎసయ్య రాజీనామా సేసినాడు. . ఈ  పొద్దు నుంచీ నేను మనూరికి ఎసయ్యను!” అంటూ ఇజిలు ఊదబట్టినాడు, పుల్లయ్య. పుల్లయ్య చేసిన పనికి అప్పటికే శానామందికి ఎక్కిన కైపు సర్రున దిగిపాయ . చెవులు సల్లబడిపాయ . పోలీసోళ్ళ గుడ్డలు తీసుకోని పుల్లయ్య టేషన్‌ నుంచి తప్పిచ్చు కోని వచ్చినాడని ఊళ్ళో అందరూ తెలుసుకున్నేరు. పుల్లయ్య ఈదమ్మడీ  నడుచుకుంటూ ఇజిలు ఊదుకుంటా ఏదోదో మాట్లాడతా.. రామసోమిదేవళం కాడికి చేరినాడు. పుల్లయ్య తెల్లవార్దులు దేవళంలోనె బజన సేసినాడు .పద్యాలు పాడినాడు. ఏవేవో రాజకీయాలు మాట్లాడినాడు.

పొద్దు పొడిచే తలికి ఊళ్ళోకి పోలీసోళ్ళు జీపు యేసుకోని వచ్చినారు. పోలీసోళ్ళను చూసిన పుల్లయ్య దేవళం  వాకిలికి గడె యేసు కున్నెడు. కిటికీ గుండా బయటికి సూచ్చా.. పోలీసోళ్ళను తిట్టబట్టినాడు.. !

పండగ అయిపోతానే ఇశాకపట్నానికి పుల్లయ్యను తీసుకుపోవాలనుకున్నామని.. రాత్రి సెంట్రీ యేమారి ఉండిన జామున, టేషన్లో ఒక మూలన బ్యాగులో ఉండిన ఎవరివో టోపీ, ఖాకీగుడ్డలు, కోటు, ఇజిలు తీసుకోని తప్పిచ్చుకోని వచ్చినాడని పోలీసోళ్ళు ఊళ్ళో పెద్ద మనుషులకు సెప్పినారు. పుల్లయ్య పైన కేసు పెట్టి జైలుకు పంపుతామని కోపంగా కేకలు యేసినారు,పోలీసోళ్ళు.  ఊరి పెద్దలు పోలీసోళ్ళను సముదాయించి, బతిమాలి పుల్లయ్య తెచ్చిన గుడ్డలూ, టోపీ ఇజిలూ అంబళ్ళ పొద్దుకల్లా ఎట్నోకట్ట తీసుకవచ్చి అప్పజెప్పుతామని సెప్పి పంపిచ్చిండ్రు.

అనవసరంగా ఎక్కిన కైపు దిగినందుకు తాగనోళ్ళందరూ పుల్లయ్య చేసిన పనికి కక్కాలేక మింగాలేక ఉండిపోయినారు. ఊళ్ళోని ఆడోళ్ళకూ, పిల్లోళ్ళకూ, కొత్త అల్లుళ్ళకూ , సారాయి తాగని వాళ్ళకూ  ఈ తంతును  బలే తమాషాగా చూసినారు.ఈ ఏడు పండక్కు  దూరమైపోయిండని అనుకుంటా ఉంటే   పుల్లయ్య పోలీసు యేసికం  లో  వచ్చి మాంచి సందడి చేసినాడు. ఈ సంకురాత్రికి ఇదే పెద్ద సందడి ! దేవుడి దయవల్ల అందరం బతికుంటే వచ్చే సమచ్చరం సంకురాత్రి పండక్కు పుల్లయ్య  మళ్ళా మాములు మనిషి అయితాడని అనుకోబట్టినారు.

రచయిత గురించి

జర్నలిజం, సాహిత్యం ప్రవృత్తిగా రచనలు చేస్తున్న తవ్వా ఓబుల్ రెడ్డి కడప జిల్లా ఖాజీపేట మండలం బక్కాయపల్లె గ్రామంలో జన్మించారు. వీరి సంపాదకత్వంలో వెలువడిన ” కడప కథ, రాయలసీమ వైభవం” సంకలనాలు విమర్శకుల ప్రశంసలను అందుకున్నాయి.వీరు రాసిన ‘గండికోట’ అం.ప్ర ప్రభుత్వం వారి ఉత్తమ పర్యాటక రచన పురస్కారానికి ఎంపికైంది.

ఇదీ చదవండి!

sodum govindareddy

అమెరికా జీవనమే సుఖమయమైనది కాదు – సొదుం గోవిందరెడ్డి

సాహితీకారుడు సొదుంగోవిందరెడ్డితో తవ్వా ఓబుల్ రెడ్డి జరిపిన ఇంటర్వ్యూ కడప జిల్లా ఉరుటూరు . చోళుల కాలంనాటి శాసనాలు, ఆలయాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: