హోమ్ » వార్తలు » అభిప్రాయం » రాయలసీమను వంచించారు

రాయలసీమను వంచించారు

స్వతంత్ర భారత్‌ను 50 సంవత్సరాలు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నేడు కప్పల తక్కెడగా మారిపోయింది. కేంద్రంలో, రాష్ట్రంలో తానే అధికారంలో ఉన్నా రాష్ట్ర విభజనను ఎలా చేయాలో దిక్కుతోచక చిత్ర-విచిత్ర ప్రకటనలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎక్కిరిస్తున్నది. 10 జిల్లాల తెలంగాణను ఏర్పాటు చేయాలని సీడబ్ల్యూసీ తీర్మానించింది. కేంద్ర కేబినెట్ కూడా దాన్నే అంగీకరించింది; గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్‌ను నియమించింది. జీవోఎం పదే పదే సమావేశాలు జరిపి విభజన బిల్లు తయారీకి గొప్పగా కసరత్తు చేసినట్లు కొండంత రాగం తీస్తూ ప్రజలను, పార్టీలను వంచిస్తూ రోజుకో ప్రకటనతో అజెండాలో లేని రాయల తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తున్నది. రాష్ట్రం విడిపోతే కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి రాజధాని ఎక్కడ? ప్రాంతాల మధ్య నీటి పంపిణీకి ఎలాంటి వ్యవస్థ ఉండాలి? అప్పులు-ఆదాయాల పంపకం ఎలా చేయాలి? అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేసుకోవాలి? యువత విద్యా, ఉపాధి అవకాశాలెలా పెంచాలి? ఇత్యాది విషయాల్లో స్పష్టత ఏమాత్రం లేదు.

జంతువులను ఆడించినట్లు గ్రూప్ ఆఫ్ మినిష్టర్స్ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రి పదవులు వెలగబెడుతున్నవారిని, రాష్ట్రంలో మంత్రి పదవుల్లో ఉన్నవారిని, అధికార పార్టీకి నాయకులుగా చలామణి అవుతున్న వారందరినీ ఆడిస్తున్నారు. అందువల్లే ప్రజల ఆకాంక్షలతో, అభిరుచులతో, సంస్కృతులతో సంబం ధం లేకుండా పదేపదే రాయల తెలంగాణ అయితే మాకు సమ్మతమే అని రాయలసీమతో ఏమాత్రం సంబంధంలేని కోస్తా ప్రాంత నాయకులూ సర్కస్ ఫీట్లు చేస్తున్నారు. వారి వారి నియోజకవర్గాలకే పరిమితమైన, దొంగ ఓట్లు, బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ ఓట్లతో 30 శాతం ఓట్లతో చావుతప్పి – కన్నులొట్టపోయినట్లు ఎన్నికల్లో అతికష్టం మీద గెలిచిన వారు, తెలంగాణ 10 జిల్లాలతో పాటు కర్నూలు-అనంతపురం జిల్లాలతో కలిపి 12 జిల్లాల రాయల తెలంగాణ అయినా ఇవ్వండని సోనియా, ప్రధాని మన్మోహన్, జీవోఎం దగ్గర సాగిలపడి ప్రాధేయపడుతున్నారు.

అమెరికాలో శ్వేత జాతి పాలకులు నల్లజాతి వారిపట్ల అనుసరించిన రాజనీతి నీగ్రోలను యుద్ధంలో చంపేటప్పుడు ముందు వరుసలో – ఉద్యోగాలిచ్చేటప్పుడు ఆఖరు శ్రేణిలో ‘అపాయింటెడ్ బిలాస్ట్, అండ్ బిఫైర్డ్ ఫస్ట్’ అన్నట్లు చరిత్ర పొడుగునా రాయలసీమను దోపిడీవర్గ పాలకులు ప్రత్యేకించి కాంగ్రెస్ నాయకులు అడుగడుగునా వంచించారు. నైజాం ప్రభువు రాయలసీమను బ్రిటిష్ పాలకులకు దత్తమండలాలక్రింద అమ్ముకొని అవమానించాడు. తర్వాత కాంగ్రెస్ పెద్దలు జనానికి ఇష్టం లేకున్నా ఉమ్మడి మద్రాసు నుంచి వచ్చే ఏర్పాటు చేశారు.

1937 శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమ-నెల్లూరు జిల్లాలకు 10 సంవత్సరాలు కృష్ణా నీటిలో ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వాటి అవసరాలు తీరిన తర్వాత ఇతర ప్రాంతాలకు ఇవ్వాలనే పెద్దమనుషుల ఒప్పందం కాలరాయబడింది. తత్ఫలితం కృష్ణ నీటిలో నేడు హక్కులేదనే కాడికి వచ్చింది. తెలుగుప్రజల ఐక్యత-రాష్ట్ర సువిశాల ప్రయోజనాల కొరకు 1956లో కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టును – దానివల్ల 7, 8 లక్షల ఎకరాలకు పారుదల అయ్యే నీటి సౌకర్యాన్ని తృణప్రాయంగా త్యజించి నాగార్జునసాగర్ నిర్మాణానికి తద్వారా తెలంగాణ-కోస్తాంధ్ర ప్రాంతంలో 35లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సహకరించారు. ఫలితంగా రాయలసీమ కరువులకు కాణాచిగా మారింది. ఇన్ని నష్టాలను, కష్టాలను ఓపిగ్గా భరించిన సీమ ప్రజలను ఇప్పుడు కొత్త అవమానాలకు గురిచేయ చూస్తున్నారు.

రాయలసీమవాళ్ళు మాతో వద్దే వద్దు అని తెలంగాణ వారు, వీళ్ళు ఎప్పుడెప్పుడు పోతారా? అని కోస్తా ంధ్ర నాయకులు మాట్లాడుతున్నారు. వాస్తవంగా అన్యాయానికి, దగాకు గురైన వెనకబడిన ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్య, సహానుభూతి ఉండాలి. సందట్లో సడేమియా అని తన రాజకీయ స్వార్థ చింతనను నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతున్నది. అధికారపీఠం తమ గుప్పె ట్లో అంటిపెట్టుకోవాలని రాయలసీమను చీలికలు-పేలికలు చేస్తే – కాంగ్రెసు మార్క్ రాజకీయాలపట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహం క్రోధాగ్నిగా ప్రజ్వరిల్లుతుందని గుర్తుంచుకోవాలి.

– జి. ఓబులేసు
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

ఇదీ చదవండి!

రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య

ఇది రాయలసీమ జీవన్మరణ సమస్య రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా జలాల వినియోగంలో సమస్యలు రాకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: