సెగమంటలు (కథ) – దాదాహయత్

సెగమంటలు కథ 

మాల ఓబులేసు నీరసంగా రిక్షా తోసుకుంటూ వచ్చి తన ఇంటి ముందాపాడు. ఇల్లంటే ఇల్లు కాదది బోద వసారా. పేరుకు మాత్రం చుట్టూ నాలుగు మట్టిగోడలుంటాయి. ఆ నాలుగు గోడలు కూడబలుక్కొని కూడా ఆ ఇంకో మంచి కొట్టం రూపైనా ఇవ్వలేక పోతున్నాయి.

ఓబులేసు ఇంటికాడ రిక్షా ఆపుతూనే బిలబిల మంటూ అతని ఆరుగురు సంతానం వచ్చి చుట్టేశారు. ”నాయన! నాయన! “ ”య్యా! యేందే సీదర పొండి” కసిరాడు ఓబులేసు. అతని భార్య లక్ష్మి ముసి ముసిగా నవ్వుకుంటూ కొట్టం లోంచి బయటి కొచ్చింది.

 “మాపిటాలైతే నువ్వు మనిషివి కావా యేందీ? పిల్లోల్లు యాల నీకాడి కొచ్చినారో గూడ్కా అడగవా?” అందీ తెచ్చి పెట్టుకున్న కోపంతో.

“యేంది సంగతి?” అన్నాడు ఓబులేసు రిక్షా చక్రంకాడ గోడవారగా కూలబడుతూ.

సాయంకాలం మసక చీకట్లు కమ్ముతున్నాయి. లక్ష్మి కొట్టంలో కెళ్ళి దీపం తెచ్చి గుమ్మం దగ్గరుంచింది ఏదో ఖాళీ మందుల సీసాలో గబ్బు నూనె పోసి అందులో పాతగుడ్డ పీలిక వేసి మాతకు రంధ్రం పెట్టి వెలిగించిన దీపము. ధగద్దగాయ మానంగా వెలుగుతోంది.

“యేందో సెప్పవ?” అన్నాడు ఓబులేసు.

లక్ష్మి చేతులు ముందుకు తెచ్చి మురిపెంగా అతనికి చూపించింది ఆ చేతుల్నిందా కొత్త గాజులున్నాయ్ .

“యాడియో చెప్పుకో.” ”యాడియి? “ అడిగాడు ఓబులేసు. ”మద్దేన్నం ఓట్లడుగుతా సంగెరెడ్డుల్లు వచ్చి పోయినారు. ఓటుకు ఇరవైరూపాయలిచ్చినారంటే! అందుకే పిల్లోల్లు గూడ్కా యీ పొద్దు వుషారుగా వుండారు” చెప్పింది లక్ష్మి.

“ఓటుకు ఇరవై రూపాయలిచ్చి నారా! లెక్కేడ బెట్టినావ?” హడావుడిగా లేవబోయాడు ఓబులేసు.

అతనింట్లో మొత్తం అయిదు ఓట్లున్నాయి. ఓబులేసు, లక్ష్మి, ఓబులేసు తల్లిదండ్రులు, ఓబులేసు పెద్దకూతురు వీరమ్మ. ఆ పిల్లకు ఇంకా పదిహేనే సరిగ్గా నిండలేదు. అయినా పద్దెనిమిది నిండినట్లు రాయించారు. ఇక ఓబులేసు తల్లిదండ్రులు చనిపోయి చాలా కాలమైంది. అయినా ఓటర్ల లిస్టు నుంచి వాళ్ళ పేర్లు తొలగించడం జరగలేదు. ఈ తిరకాసులన్నీ ఓబులేసుకి తెలిసేవుండాల్సిన అవసరం లేదు. అన్నీ నాయకులే శ్రద్ధగా చూసుకుంటారు. ఎటొచ్చి ఆ ఓటు తమకు పడాలి అంతే. ఓటుకు ఇరవై రూపాయలంటే అయిదు ఓట్లకు నూర్రూపాయలు . ఓబులేసు అంత డబ్బు ఒకేసారి కళ్ళజూసి చాలా రోజులైంది.

లక్ష్మి అతన్ని లేవనియ్యకుండా వెనక్కి తోసింది.

“పోయి దొంగసారా తాగుతావా? లెక్క నీకియ్యను” ”నా కియ్యకపోతే ఎవరికిస్తావే? ఏ రెండో మొగుని కిస్తావా?” కోపంగా అన్నాడు ఓబులేసు.

“అదో, అట్లాంటి మాటలంటేనే నాకు మండుతాది నేనేం జేస్తా లెక్క? నీమాదిరిగా దొంగసారా తాగుతానా? ఏదో నేనింత తిని పిల్లోల్ల కింత పెడ్తా అంత దానికి నాకు రెండో మొగుడుండాడంటావా?”

ఓబులేసు ఆ మాటతో కొంట తగ్గాడు సర్లేయే? లెక్క యాడిబెట్టినావ?” అన్నాడు బతిమాలుకుంటూ.

“ఉండాదిలే పెట్టిన కాడ అయినా ఇయ్యాల నీకు లెక్క పెట్టి దొంగసారా తాగాల్సిన కర్మేమి? మనకందరికి సారా సంగిరెడ్డోల్లే యేపిస్తుండారు.” ”నిజమా?” అన్నాడు ఓబులేసు నోరు తెరిచేసి. నిషేధం తర్వాతా ఓబులేసుకి సారా దొరకడం లేదు. దొరకడం లేదంటే దొరుకుతుంది. వారుణ వాహినీ మయంగా ఎంతకావాలంటే అంత దొరుకుతుంది. అయితే అందుకు డబ్బు చాలా అవుతుంది. అందుకే ఓబులేసు ఈ మధ్య సాయంకాలమైతే సచ్చిన పాయలో అన్నట్టు నీరసంగా వుంటున్నాడు. ఉచితంగా ఆరోజు సారా వస్తుందంటే అప్పటికపుడే అతని నాలుక పీకనారంభించేసింది.

“నేను అపద్దం చెప్తానా యేంది? రేత్రికి సియ్యలు గూడ్కా వుందియి” అంది లక్ష్మి వదులు బోతూ.

ఓబులేసు ఈసారి హుషారుగా లేవబోయాడు. అయితే అంతలోకే ఏదోగుర్తు కొచ్చి మళ్ళీ సాలోచనగా కూర్చుండిపోయాడు.

చదవండి :  కుట్ర (కథ) - కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి

“ఏమాయె ?” అడిగింది లక్ష్మి. ”అదికాదు సంగిరెడ్డికాడ లెక్క దీసుకుంటే దస్తగిర్రెడ్డి ఏమనడా అని”. లక్ష్మికి అతని అనుమానం అర్ధమైంది.

“దస్తగిర్రెడ్డి యాడుండాడులే రాముడుంటే దస్తగిర్రెడ్డిల్లేకుంటే లేదు. పోలీసోల్లు రామునితో పాటే దస్తగిర్రెడ్డి అల్లున్ని గుడ్కా లోపలేసి నారంట, ఈసారి దొంగ ఓట్లు పడవంటనే? పోలీసోల్లు గట్టిగా వుంటారంట” అంది.

“అంతేనంటావా? సరే సూద్దాంలే” అంటూ లేచి నిలబడ్డాడు. ఓబులేసు సారామీద ఆశ అతన్ని అంత కంటే ఎక్కువ ఆలోచించనివ్వలేదు. ఇంట్లో కెళ్ళి తప్పెట చేతితోకి తీసుకొని అది సరిగ్గా వుందో లేదో చూశాడు.

ఆ రాత్రి మాలవాడలో సెగమంటలు వేశారు. మగవాళ్ళంటా మంట చూట్టూ చేరి తప్పెట్టక సెగ చూపిస్తున్నారు. ఆడవాళ్ళూ పిల్లలూ మరో వంక బారులు తీరి కూర్చున్నారు. ప్లాస్టిక్ బకెట్లలో సారాసీసాలు సిద్ధంగా వున్నాయి. ఇంకో వైపు నిప్పుల మీద మాంసం కడ్డీలు కాలుతున్నాయి. సారా తాగే వాళ్ళు తాగుతున్నారు. చియ్యలు తినేవాళ్ళు తింటున్నారు.

“తాగండ్రా తాగండి సియ్యలు బాగా బాగా తినండి రూపు ఒక్కోడూ తక్కవంటే పదోట్లు బేసి రావాల. ఎంటకావాల్నో తాగండి,” అంటున్నాడు అడ్డోడు. సంగిరెడ్డి తరుఫున అతనే అక్కడ కార్య నిర్వాహకుడు.

అంతవరకు తన తప్పెట్లో మోత ఎలా వస్తోందో పరీక్షీంచుకుంటున్న ఓబులేసు మెల్లగా అడ్డోని పక్కలో చేరాడు.

“అది కాదన్నా అడ్డోడన్నా! ఈ సారి దొంగ ఓట్లు పడవంటనే? “ అన్నాడు. ”ఎందుకు పడవు లేరా వూకే అంటుంటారు గానీ ఈ పోలీసోల్లు. అందుకే చెప్తాండా. రేపు ఒక్కోడూ పదోట్లన్నా బేసి రావాల” అన్నాడు అడ్డోడు.

“సంగిరెడ్డికి ఓట్లేసి మండలాద్యచ్చున్ని చేస్తే మాకు పక్కా ఇండ్లు కట్టిపిస్తాడా ? బోద కొట్టాల్లోనచ్చాండా. ఎండాకాలమొస్తే అగ్గెంటుకుంటాదని గుండె సేతుల్లో పెట్టుకోని బరుకుతాండాం.”

“ఊ అందులో నీకు అనుమానం యేమిటికి, సంగిరెడ్డి మీ అందరికీ పక్కా ఇండ్లు కట్టిపిస్తాడు. మరేం భయం లేదు పో, అందరూ వెచ్చంగా పక్కా ఇండ్లల్లో బాగుందురుగాని.”
“అది కాదన్నా! పోయినసారి దస్తగిర్రెడ్డి పక్కా ఇండ్లు కట్టిపిస్తానని చెప్పినాడు ఏడీ, కట్టిపీల్యా.”

దస్తగిర్రెడ్డికీ , సంగిరెడ్డికీ ఒకటే నేందిరా? ఇప్పుడా కాలం పాయ గదా. మీకేం కావాల్నో నాకు చెప్పండి. సంగిరెడ్డికి చెప్పి నేను చేపిస్తా మీ పనులు. పక్కా ఇండ్లూ వస్తాయ్ , అన్నీ వస్తాయ్ . రూపు మీ ఓట్లు మాత్రం మర్చిపోకుండా సంగిరెడ్డికే బేయండి ఒక్కోడూ పది ఓట్లు బేయండి”

ఆ మాటతో ఓబులేసుకు హుషారొచ్చేసింది బాగా తాగేసి తప్పెట వాయిస్తూ పాటందుకున్నాడు.

“వచ్చెర వచ్చెర సంగిరెడ్డెన్న! తెచ్చెర తెచ్చెర పక్కా ఇండ్లు! వచ్చెర వచ్చెర సంగిరెడ్డెన్న! వచ్చెర వచ్చెర తెచ్చెర తెచ్చెర! ”

ఓబులేసు పాటలు వంత పాడుతూ మిగతా వాళ్ళు కూడా తప్పెట్లు వాయించడం మొదలెట్టారు. ఆడవాళ్ళు నవ్వుతున్నారు. పిల్లలు కేరింతలు కొడుతూ సెగమంటల చుట్టూ వలయాలు కట్టి తిరుగుతున్నారు. వాతావరణం పండగలా వుండి. దేవరలో గానీ అలాంటి పండగ వుండదు. ఆ రాత్రంతా తప్పెట మోతలతో మాలవాడంతా మారుమోగి పోయింది.

తెల్లారింది. ఎవరిళ్ళలో వాళ్ళు అంతా తాగి పడున్నారు.

అంటరానితనం తెలీని సూర్య కిరణాలు మిగతా లోకమంతటితో పాటు మాలవాడను కూడా ప్రేమగా స్పృశిస్తున్న సమయంలో అక్కడ ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

ఎవరో వచ్చి ఓబులేసు కొట్టం తడుపు దబదబా బాదేస్తున్నారు.

“ఓరే, ఓబులేసూ! ఇంగా పండుకున్నావా! రాముడొచ్చేసినాడ్రా ! రాముడొచ్చేసినాడ్రా ! ”

ఎవరిదో ఆక్రోశిస్తున్న ఆడగొంతు. ఓబులేసికు మెలకువొచ్చింది తల దిమ్ముగా వుంది వెళ్ళి తలుపు తీశారు.

చదవండి :  ఆపదేనా? (కథ) - రాచమల్లు రామచంద్రారెడ్డి

“ఎవరే”

నాలుగిళ్ళ అవతలుండే ముసల్ది తనని లేపినట్టే అందర్నీ తలుపులు బాది నిద్రలేపుతోంది. తన కొడుకుని రాముడు చెట్టుకు కట్టేసి కొడుతున్నాడని లబలబా మొత్తుకుంటోంది.

రాముడు వచ్చేశాడన్న మాట బుర్రలో ఇంకగానే ఓబులేసు మత్తంతా దిగిపోయింది.

“ ఓట్లయి పోయినంత వరకు పోలీసోల్లు వదలమన్నారే! ఎట్లా వదిల్నారబ్బా?” అని బిగ్గరగానే అనుకుంటూ ఆందోళనగా భార్యని సమీపించాడు.
అతనింకా లక్ష్మిని నిద్ర లేపనే లేదు.

ఎక్కడ్నించి వచ్చారో కొందరు మనుషులు ధనామంటూ తలుపు తోసుకుంటూ వచ్చి అతనింట్లో జొరబడ్డారు. అడ్డంగా నేల మీద పడుకున్న పిల్లల్ని కాళ్ళతో తన్నుకుంటూ వెళ్ళి ఓబులేసు వీపు మీద నాలుగు పిడిగుద్దులు వేశారు.

గుండె అదరినట్లనిపించి, “అమ్మా” అన్నాడు ఓబులేసు.

లక్ష్మి తత్తరపాటుతో లేచి కూర్చుంది.

పిల్లలు అప్పటికే పెద్దగా ఏడుసున్నారు.

వచ్చిన వాళ్ళు ఓబులేసుని చొక్కా పట్టుకొని ఈడ్చుకుపోనారంభించారు.

“ఓర్నాయనో! నా మొగున్నిగ్గుకుపోతాండార్రా! ” అని వెర్రిగా అరుస్తూ లక్ష్మి ఆ వెనకాలే పరిగెత్తింది. రాముడు ఒక చింత మానుకు మంచి వయసులో వున్న నలుగురు మాలకుర్రాళ్ళని కట్టేసి కర్రతో గొడ్లను బాదినట్టు బాదుతున్నాడు. అక్కడే వుండి అతన్ని ఎగదోస్తున్న దస్తగిర్రెడ్డి అల్లుడు కుల్లాయరెడ్డి శివమెత్తినట్లు మాలజాతి నంతటినీ బండబూతులు తిడుతున్నాడు.

కుల్లాయరెడ్డి మనుషులు ఓబులేసుని ఈడ్చుకొచ్చి అతనిముందు పడేశారు. ఓబులేసు గబాల్న కుల్లాయరెడ్డి కాళ్ళు పట్టుకున్నాడు.

“కొట్టాకన్నా! మమ్మల్ని కొట్టాకన్నా!” కుల్లాయరెడ్డి కాలు పైకెత్తి ఓబులేసు గుండె మీద తన్నాడు. ఓబులేసు వెనక్కిపడ్డాడు. తల ధనామంటూ నేలకేసి కొట్టుకుంది. ”ఏమిరా! సంగిరెడ్డికాడ లెక్క తీసుకుంటారా?” అన్నాడు కుల్లాయరెడ్డి ఓబులేసు మొహం మీదకి వంగులూ ”లేదన్నా!” ఏడుస్తూ అన్నాడు ఓబులేసు ”నీ సంగతేంది? సంగిరెడ్డి మిందపాట గుడ్కా పాడ్నావంటనే!” ”లేదన్నా! లేదు” ”అయితే పో సంగిరెడ్డి లెక్క యెనకిచ్చేసిరా పో మీకు లెక్క కావాల్నంటే దస్తగిర్రెడ్డి ఈనన్నాడా? సారాయేపిచ్చమంటే యేపిచ్చనన్నాడా? ఓటుకు ఇరవై ఇస్తాన్నాడు కదా సంగిరెడ్డి? వోటుకు దస్తగిర్రెడ్డి యాభై ఇస్తాడు పొండి. వోట్లు మాత్తరం దస్తగిర్రెడ్డికే పడాల పడకపోయినాయా, తోలొలిపిస్తా పో, లెక్క ఇచ్చేసి రా పో”

ఆ రోజే మాలవాడ మాలవాడంతా కదిలి అడ్డోడి ఇంటికి వెళ్ళారు. ”ఏందిరా వచ్చినారు?” అన్నాడు అడ్డోడు ఒక్కసారిగా అంతమందిని చూసి బెదిరిపోతూ. ఓబులేసు ముందుకొచ్చాడు.

“అన్నా ఏమనుకోవాకు రామున్నీ కుల్లాయరెడ్డినీ పోలీసోల్లు ఇడిసేసినారు. నీకు దండం పెడ్తాసామీ, సంగిరెడ్డెన్నని యేమనుకోవాకని చెప్పు ఇదో మీరిచ్చిన లెక్క”
ఓబులేసుతో పాటు ఒక్కొక్కరూ ముందుకొచ్చి ఎవరికిచ్చిన డబ్బు వాళ్ళు అడ్డోడి ముందర పెట్టి వెళ్ళిపోతున్నారు. లక్ష్మి ఆ డబ్బుతో తాను కొన్న గాజుల్ని కూడా వలిచేసి అడ్డోడి ముందర పెట్టేసింది. గాజులు వలుస్తుండతా ఆమెకు కన్నీరు ఆగింది కాదు. ఆ మర్నాడు పొద్దునే ఏడు గంటలకు ఎలెక్షన్ ప్రారంభమై పోయింది.
దొంగ ఓట్లు వేయడానికి వెళ్ళిన ఓబులేసు భార్యబిడ్డలు బిక్క మొహాలతో వెనక్కి తిరిగి వచ్చేశారు.

ఆ సమయంలో కుల్లాయరెడ్డి ఒకింట్లో ఓట్లు అంగడి పెట్టుక్కూర్చున్నాడు. రాముడు కూడా అక్కడే వున్నాడు. దొంగ ఓట్లేసి వచ్చిన వాళ్ళంతా అక్కడ సిరా గుర్తు తుడిపేసుకునే ప్రయత్నంలో వున్నారు. కొందరు కిరసనాయిల్తో, కొందరి స్పిరిట్ తో, ఇంకొందరు అగ్గిపుల్లల్తో తంటాలు పడుతున్నారు.

“ఏమ్మే, ఓట్లు బేసొచ్చినారా? “ గద్దించాడు రాముడు. ఆ హుంకారానికి బెదిరిపోతూ తల్లీ కూతుళ్ళిద్దరూ ఒక మాలకు ఒదికి పోయారు.

“లేదన్నా , మాయన్నీ దొంగ ఓట్లని ఆడ తరిమేస్తాండారు,” దీనంగా అంది లక్ష్మి. ”వాల్లు తరిమినారా, మాకు ఓట్లు బేయాల్సి వస్తాదని మీరే ఎల్లబారొచ్చేసినారా? డ్రామాలేస్తాండావేమే? “

చదవండి :  సీమ బొగ్గులు (ముందు మాట) - వరలక్ష్మి

“లేదన్నా, సత్తెం చెప్తాండాం” చేతులు నులుపుకుంటూ అంది లక్ష్మి.

“నీ మెగుడెవరని అడుగుతాండారాన్నా ఆడ నేను బద్రిగాడని చెప్పినా. వాల్లు నమ్మలా, “

నీ మొగుని వేను ఓబులేసుగదేమే. మాకు తెల్సులే. దొంగ ఇటు కోసం ఇంగెవర్నో మొగుడని చెప్పుకోను సిగ్గులేదేమే లంజల్లారా మీకు అనే కూడా తిట్టినారన్నా” కన్నీరు పెట్టుకుంది.

కుల్లాయరెడ్డి ఓబులేసు వంక చూశాడు. ”రేయ్, ఇలారా” ఓబులేసు చేతులు కట్టుకుని ముందుకొచ్చాడు. కుల్లాయరెడ్డి ఓటరు చీటి ఒకటి అతని చేతిలో పెట్టి. “ఈ ఓటు బేసిరాపో బేయకుండా ఎనక్కొచ్చినావా, నీ పెండ్లాం నీది కాదు” అన్నాడు.

ఓబులేసు వణికిపోతూ ఆ చీటీ పట్టుకొని బయల్దేరాడు. పోలింగ్ బూతు దగ్గర కుఊలో అరగంట నిలబడ్డాక అతని వంతొచ్చింది.

“వరుస నెంబరు రెందొందాలా పది” అరిచాడు పోలింగ్ అసిస్టెంటు. ఇందాక లక్ష్మికి అబ్జెక్షన్ చెప్పిన సంగిరెడ్తిరపు పోలింగ్ ఏజెంటే ఓబులేసుని చూసి కనుక్కున్నాడు.

“ఏమిరా ఓబులేసూ! ఎంకటయ్య ఓటు బేసేదాని కొచ్చినావా? దొంగ నా కొడకా! ఇందాకనే నీ పెండ్లాం వచ్చిపాయగదరా! ఇప్పుడు నువ్వొచ్చినావా? మీ కుటుంబం కుటుంబం అంతా దొంగ ఓటు బతుకేనేమిరా? పోరా, బయటికి పో”. ఓబులేసు కదల్లేదు. ”పొమ్మంటే పోవేమిరా?” గర్జించాడు ఏజెంటు. ఓబులేసు అప్పటికీ కదల్లేదు తల వంచుకుని నిలబడ్డాడు. డ్యూటీ కానిస్టేబుల్ అతను కదలక పోయేసరికి వచ్చి మెడ పట్టుకున్నాడు.

“కదులూ” హాలు దద్దరిల్లి పోయేటు పెను కేకవేశాడు.

ఓబులేసుని కొంతదూరం వరకు కానిస్టేబుల్ ఈడ్చుకు పోగలిగాడు. అయితే గుమ్మం ఎటుందో అతనికి చూపించక ముందే ఓబులేసు ఆ పట్టులోంచి తప్పించుకుని పరిగెత్తుకుంటూ వచ్చి పోలింగ్ ఆఫీసరు ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు.

“సామీ! మాల నాకొడుకుని సామీ! ఎవనిక్కోపం వచ్చినా కాలు ఎగ్గేసి, ఎగ్గిసి నన్నే తంతారు. ఈ ఓటు నన్ను బేయనీయండి సామీ! నిజమే సామీ, నాది దొంగ ఓటు బతుకే సంగిరెడ్డి గెల్సినప్పుడూ గొంగ ఓటే బేసినా, దస్తగిర్రెడ్డి గెల్సినప్పుడూ దొంగ ఓటుబేసినా ఇప్పుడూ దొంగ ఓటు బెయనీకే వచ్చినా నా ఒక్కన్దే దొంగ ఓటేమీ సామీ! ఈడ పెట్టెలో పడ్తాండేయన్నీ మంచి ఓట్లేనా సామీ? ఎవనికి తెల్దు సామీ! దొంగవోటు బేయకుంటే మమ్మల్ని సంపుతారు సామీ! ఈ దొంగ ఓటు బేయకుంటే నా పెండ్లాం నాదికాదు సామీ! బేయనీయండి సామీ! ఈ దొంగ ఓటు బేయనీయండి సామీ! ”

వోబులేసు ఆ మాటలంటున్నప్పుడు ఒక్కసారిగా వరదొచ్చినా పెన్నలా హొరుమన్నాడు. అనేశాక పెన్నలాగే చివర ఎండిపోయాడు. రెండు చేతులూ కడుపులో పెట్టుకున ఆఫీసరు కాళ్ళ దగ్గర లుంగ చుట్టుకుని పడిపోయాడు.

ఒక్కసారిగా అక్కడ భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది.

వోబులేసు గుండెలో సెగ మంటలు రగుల్తున్నాయి.

రచయిత గురించి

దాదా హయత్ ప్రసిద్ధ తెలుగు కథారచయిత, అనువాదకుడు, సమీక్షకుడు మరియు కవి. 1960 అక్టోబరు 10 న కడప జిల్లా ప్రొద్దుటూరులో జన్మించిన వీరు ప్రస్తుతం అక్కడే  న్యాయవాదిగా పనిచేస్తున్నారు. “మొదట్లో రాయించింది రచనా కుతూహలం – ఇప్పుడు రాయిస్తున్నది మనషి జీవితం” అనే దాదా హయత్ 1983లో ‘అహింస’ కథతో రచనావ్యాసంగం ప్రారంభించారు. ‘అహింస’ కథ ఇతరభాషల్లోకి కూడా అనువాదమైంది. సున్నితమైన భావవ్యక్తీకరణతో జీవితానుభవాలను కథలుగా మలచడంలో హయత్ సిద్ధహస్తుడు. ఇప్పటిదాకా 60 కథలు. 10 కవితలు, అనేక పుస్తక సమీక్షలు రాశారు. వీరి కథలు తెలుగులో వచ్చిన ప్రసిద్ధ కథాసంకలనాల్లో చోటుచేసుకున్నాయి – విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. మసీదు పావురం, ఎల్లువ, ఏటిగట్టు చేపలు, సెగమంటలు వాటిలో కొన్ని.

ఇదీ చదవండి!

రారా వర్ధంతి

కథానికా, దాని శిల్పమూ – రాచమల్లు రామచంద్రారెడ్డి

‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయాలనే యీ కథలలో చదివి షాక్ తింటాం.’ అని నా కథల గురించి కుటుంబరావు అన్నారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: