అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు

నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా-
ఈ కవి చౌడప్ప పేరు వినని తెలుగు పద్య ప్రేమికుడు వుండడు!ఈ చౌడప్ప భాగమైన మట్ల/మట్లి రాజుల “అష్ట దిగ్గజాల” గురించి తెలిసింది మాత్రం తక్కువే!

సామంతులకంటే చక్రవర్తి బలవంతుడు,విజయనగర సామంతులైన సిద్దవటం పాలకుడు మట్ల(/మట్లి ) “అనంతరాజు” పోషించిన అష్టదిగ్గజ కవుల గురించి మెకంజి కైఫియత్తులలో రాసిన కాలానికి (1810 – 1812) శ్రీకృష్ణ దేవరాయ అష్టదిగ్గజాలను నిర్ధారించిన కడప “తిప్పలూరు” శాసనం బయటపడలేదు.

మట్ల రాజులు మొదట విజయనగర సామంతులుగా వుంటు కొన్ని గ్రామాలను పాలించారు. శ్రీకృష్ణదేవరాయ అనంతర కాలంలో సదాశివరాయలు (పేరుకు రాజు,అళియ రామరాయలు నిజమైన పాలకుడు-regent) సమయంలో గ్రామాల నుంచి పూర్తిస్థాయి రాజ్యంగా ఎదిగారు. వీరి పూర్తి చరిత్రను మరోసారి రాస్తాను.

ఒంటిమిట్టలోని రామాలయన్ని మట్లి రాజులు అభివృద్ది చేశారు. ఒంటిమిట్ట గుడి తూర్పు ద్వారాన్ని, ఆలయంచుట్టు ప్రాకారన్ని అనంతరాజే కట్టించారు,దీనికి సంబంధించిన శాసనం ఒంటిమిట్టగుడిలో దొరికింది.

ఒంటిమిట్ట గుడిలో రామ,లక్ష్మణ,సీత విగ్రహాల పక్కన హనుమంతుని విగ్రహం వుండదు.హైదరాబాద్ దగ్గరి అమ్మపల్లి,ఒంగోలు దగ్గరి చదలవాడ గుడిలో కూడ హనుమాన్ విగ్రహం రామ విగ్రహం పక్కన వుండదు. బహుశా శ్రీరాముడు ఈ ప్రాంతలలో తిరిగేటప్పటికి వానరసేన పరిచయం జరిగివుండదు. పురాణ కథల ప్రకారం వానరరాజ్యం మనదగ్గరే వున్నది.

చదవండి :  ఒంటిమిట్ట రథోత్సవ వివాదం గురించిన శాసనం !

ఈ మట్ల రాజులలో అనంతరాజు,ఎల్లమరాజులు గొప్పవారు. అనంతరాజు తన పాలనలో అందరు తెలుగు వాళ్ళైన కింది ఎనిమిది మందితో అష్టదిగ్గజాలను పోషించారు.వీరికి “భువన విజయం”లాగ ప్రత్యేకమైన పేరు ఏమివున్నట్లు చారిత్రిక ఆధారాలులేవు.

1.మంత్రి మూర్తి పాపరాజు
2.చింతలవారి కొండప్ప
3.కొఠారం మల్లెం కొండప్ప
4.గురువప్ప
5.ఉప్పుగొండూరు వెంకటకవి
6.కుందవరపు కవి చౌడప్ప
7.ఘంటయ కవి
8.నక్కలపాటి సంజీవప్ప

మొదటి నలుగురు కవులు “జంగాలు”,వీరి పేరున క్రింది గ్రామలు దానం ఇవ్వబడ్డాయి…
1.సిద్దవటం తూర్పు జంగాలపల్లె,2.గుండ్లమడక తూర్పు జంగాలపల్లె, 3.పొత్తపికి నైఋతి జంగాలపల్లె,4.కలువాయి సమ్మత చుంటు బావి జంగాలపల్లె.

మొదటి మూడు జంగాలపల్లెలు కడప జిల్లాలో వుండగా నాలుగొవది సోమశిల దిగువున నెల్లూరు జిల్లాలో వున్నది.

అనంతరాజు స్వయంగా “కుకత్ స్థ విజయం” అనే కావ్యాన్ని రచించాడు.

అనంతరాజు అష్టదిగ్గజాలలో ఉప్పుగుండూరు వెంకటకవిది అగ్రస్థానం. ఉప్పుగుండూరు అనే ఊరు ఒంగోలు దగ్గర వుంది,ఈ రెండు ఊర్లు ఒకటో కాదో తెలియదు.ఈ వెంకట కవి ఒంటిమిట్ట రాములువారి మీద “దశరధరామ” శతకాన్ని చెప్పారు.ఉదాహరణకి ఒకటి ,

నిగ నిగ మెరయు కిరీటము
ధగధగమను పట్టుదట్టి తగిన కటారున్
భుగభుగ వాసన నీకే
తగుతగురా ఒంటిమిట్ట దశరధరామా!

అనంతరాజు అష్టదిగ్గజాలలో ఎక్కువ ఖ్యాతి,ప్రచారం మాత్రం కుందవరపు కవి “చౌడప్ప”దే! 1980కి ముందు పుట్టిన వాళ్ళలో చౌడప్ప పేరు తెలియని వారు అరుదు. చౌడప్పకు బూతు కవిగా పేరు వుండటం మరియు ఆయన కవిత్వంలో ఒకింత దిగంబరత్వం వుండటం వాస్తవం.ఆయన దీని గురించి కూడ రాసుకున్నారు.

చదవండి :  1921లో కడపలో మహాత్మాగాంధీ చేసిన ఉపన్యాసం ...

నీతులకేమి యోకించక
బూతాడక దొరకు నవ్వుపుట్టదు సభలో
నీతులు బూతులు లోక
ఖ్యాతులారా కుందవరపు కవి చౌడప్పా!

సింపులుగా బూతు చెప్పకుంటే రాజుకు నవ్వురాదు! అందుకే బూతు చెప్పాను,నన్ను హాస్య కవిగానే చూడమని మరొక చోట చెప్పుకున్నారు.

చౌడప్ప కేవలం బూతు కవి కాదు బహుముఖ ప్రజ్ఞాశీలి అనటానికి అతని ఇతర రచనలు ఆధారం,అలాంటి వాటిలో ఒకటి,

శరనిధి మేర దప్పినను శంకరుడిచ్చు వరంబును దప్పినన్
సురగురు నీతిదప్పినను సూర్యుడు చంద్రుడు త్రోవ దప్పినన్
పరుస దానాన రాఘవుని బాణము దప్పిన హాస్యగాండ్రలొ
నరసుడు జాణ కుందవర చౌడుని పద్యము నీతితప్పదే!

ఒక కవి తన పద్యం గురించి ఇంత confidentగా చెప్పుకోవటం గొప్పవిషయము.

చౌడప్ప వివిధ రాజ్యాలను పర్యటించి అక్కడి స్థానిక అంశాల మీద కూడ పద్యాలు చెప్పారు. తంజావూరు రఘునాథరాయలు మీద చెప్పిన పద్యాలు చాలా దొరికాయి.

అనంతరాజు అష్ట దిగ్గజాలలొ మరో కవి “ఘంటయ కవి”,ఈయన చౌడప్ప “జంట కవులు”గా పేరుపొందారు.

ఘంటయ కవి చెప్పిన ఈ పద్యం,

అన్నిట మంచివారు విమలాత్ములు హాస్య కళాదురంధరుల్
సన్నుతనీతి పాలకుల జాణలు నైపుణ లెవ్వరంటిరా
పన్నుగ మట్లన్నంత నరపాలుని గొల్చి మహానుభావులై
వన్నెకు నెక్కినట్టి గుణవంతులు ఘంటన చౌడగాండ్లు రా.

చదవండి :  ఆ రోజుల్లో రారా..

ఈపద్యము చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది.ఈ పద్యంలోని “మట్లనంత నరపాలుని”- మట్ల అనంత రాజు యొక్క…అంటే మట్ల అనంత రాజును కొలిచి ఘంటయ కవి,చౌడప్పలు పేరు సంపాదించారు!

మరో కవి “నక్కలపాటి” సంజీవప్ప పేరు వెనుక ఆసక్తికరమైన కథవుంది. నక్కలు చెఱుకు తోటలను నక్కలు నాశనం చేస్తుంటే ఆ నక్కలని సంజీవప్ప తిడుతు పద్యాలు చెప్పటంతో ఆయన “నక్కలపాటి” సంజీవప్ప అయ్యారు.

ఈయన చెప్పిన కొన్ని పద్యాలలో “చౌడమ్మ” దేవత ప్రస్తావం వుంది. పాణ్యం దగ్గరి “నందవరం”లొ వున్న చౌడమ్మ గుడి చాలా ప్రసిద్ది.

ఆశీవిషసమమగు నా
యాశుకవిత్వంబు చేత నటువంచకముల్
నాశము గావలె చూడుము
హే శాంభవి!చౌడాంబ!హే శర్వాణీ!

మరో కవి “గురువప్ప” పేరు “గురప్ప” అయ్యివుంటుందని నా ఊహ.మార్కాపురం,నంద్యాల,ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఇప్పటికి గురప్ప పేరు వున్న వాళ్లు చాలామంది వున్నారు.

గురప్ప అనేది వెంకటేశ్వర స్వామి ఉగ్ర రూపం. మూగ గురప్ప అని కూడ అంటారు.కొందరికి “గురప్ప” ఇంటి దైవం.పెళ్ళి అయిన తరువాత “గురప్పడి”కి చేస్తారు…మూతికి గుడ్డలు కట్టుకోని వంట చెయ్యటం గురప్పను కొలిచే పద్దతులలో ఒక విధానం.

(ఈ పొస్టుకు ఆధారం “మెకంజి” కైఫియత్తుల ఆధారంగా కట్టా నరసింహులు సార్ రాసిన “కైఫియత్తు కథలు” పుస్తకం.ఈ పుస్తకం చదవటం ఖచ్చితంగా ఉపయోగం.)

శివ రాచర్ల

ఇదీ చదవండి!

బుగ్గవంక

బుగ్గవంక రిజర్వాయర్ సొగసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: