ఎందుకింత చిన్నచూపు?

దాదాపు ఆరు దశాబ్దాలు (1953 నుంచి 2013) దాకా కోస్తాంధ్రవాసుల సాహచర్యంలో ఉన్నాం. అయితే సీమకు మిగిలింది ఏమిటి? ఒరిగింది ఏమిటి? దేశంలోనే అత్యంత దుర్భిక్షంలో ఉండే కరువు ప్రాంతంగా రాయలసీమ మిగిలిపోయింది. దేశంలోనే అత్యంత కరువుబారిన పడిన జిల్లాల్లో అనంతపురానిదే అగ్రస్థానమని 90వ దశకంలోనే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం నివేదించిన సంగతి అక్షర సత్యం. మరో పాతికేళ్లలో అనంతపురం పూర్తిస్థాయి ఎడారిగా మారిపోతుందని జలవనరుల నిపుణులు ఏకరువు పెట్టిన మాట వాస్తవం కాదా? కడప, కర్నూలు జిల్లాల పరిస్థితి కూడా దీనికి దరిదాపుల్లోనే ఉంది.

రుతుపవనాల వల్ల లభించే వర్షపాతం రాయలసీమలో సాధారణ సగటుకన్నా అత్యల్పంగా ఉంది. ఈ ప్రాంత రైతు దుస్థితి రుతుపవనాలలో జూదమాడిన చందంగా ఉంది. తాగునీటికి, సాగునీటికి కటకటలాడే పరిస్థితి దాపురించింది. కృష్ణా-పెన్నా ప్రాజెక్టును ఆటకెక్కించారు. సీమ దుస్థితిని చూపి నీటివాటా పొంది రాయలసీమకు మొండిచెయ్యి చూపి కోస్తాంధ్రకు నీటిని తరలించారు.

సీమ ప్రాంత సమస్యలు ఏకరువు పెట్టేందుకు నేతలు ఏనాడూ ప్రయత్నించలేదు. సీమలో భారీ పరిశ్రమలు లేవు. విస్తృత రైలు మార్గాలు లేవు. ఉపాధి అవకాశాలు మృగ్యం. రాయలసీమ నుంచి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతానికి ఒరిగింది మాత్రం శూన్యం. సమైక్య రాష్ట్రంలో అత్యధికంగా నష్టపోయింది రాయలసీమ ప్రాంతమే.

తెలుగువారంతా కలిసి ఉండాలనే విశాలాంధ్ర భావన మొగ్గతొడిగి 2013తో వందేళ్లు పూర్తి చేసుకొంది. యాదృచ్ఛికంగా సరిగ్గా వందేళ్లకు 2013లోనే తెలుగు నేల ముక్కలు చెక్కలయింది. సమైక్య రాష్ట్రం విచ్ఛిన్నమైంది. తెలుగుగడ్డ రెండు ముక్కలయింది. ఇంతటి కీలకదశలో రాయలసీమ దశ-దిశ ప్రస్తావన లేకుండా చేశారు. తెలంగాణ, సీమాంధ్ర అంటూ రాష్ట్రంలో రెండే ప్రాంతాలున్నట్లు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాయలసీమ అస్తిత్వాన్ని మరుగునపడేశారు. సీమ వేరు, కోస్తాంధ్ర వేరు అనే వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించాల్సి ఉంది. ఒక ప్రాంత ప్రజలను సంతృప్తి పరచేందుకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారు. మరో ప్రాంతానికి పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుకు అనుమతి ఇస్తూ జాతీయ హోదాతో నిధులు గుమ్మరించి సర్దుబాటు చేశారు. మరి రాయలసీమ పరిస్థితి ఏమిటి? ఓట్లు-సీట్లు పరమావధిగా మారిన నేటి కుటిల రాజనీతి సిద్ధాంతంలో రాయలసీమ పట్ల ఎందుకీ వివక్ష? 52 శాసనసభ స్థానాలు, 8 పార్లమెంటు నియోజకవర్గాలు, 1.5 కోట్ల జనాభా కలిగిన ఈ ప్రాంతమంటే ఎందుకింత చిన్నచూపు?

చదవండి :  నో డౌట్...పట్టిసీమ డెల్టా కోసమే!

రాయలసీమ సామాజిక జీవన విధానం తెలియని మూర్ఖపు నేతలు చేస్తున్న వితండవాదనే తాజాగా తెరమీదకు వచ్చిన రాయల తెలంగాణ ప్రతిపాదన. రాయలసీమ అస్తిత్వాన్ని నామరూపాల్లేకుండా చేసేందుకు పన్నిన కుట్ర ఇది. తమ స్వీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడుతున్న నేతల స్వార్థపూరిత యోచనకు ఇది నిదర్శనం. 1948 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణ ఒక ప్రత్యేక రాజ్యం. కాగా రాయలసీమ బ్రిటిష్ ఇండియాలో ఒక భాగం. ఏనాడూ పొంతనలేని ఈ రెండింటినీ ఏ విధంగా కలుపుతారు.

చదవండి :  రాయలసీమ మహాసభ కడప జిల్లా కమిటీ

తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల జీవన విధానాలు పూర్తి భిన్నమైనవి. కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపితే సీమ ఉనికి శాశ్వతంగా కనుమరుగవుతుంది. సీమలో ప్రస్తుతమున్న నాలుగు జిల్లాలు వేరుచేయడానికి వీలులేని పరస్పర అంగాలని చెప్పవచ్చు. మత ప్రాతిపదికన ఓట్లు కొల్లగొట్టాలని ఓ రాజకీయపక్షం ఈ స్వార్థపూరిత డిమాండ్‌ను ముందుకు తెస్తోంది. మతం ఒక్కటే అయినా… భాష వేరనే కారణంతో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు వేరు కాలేదా? ప్రాంతాల ఏకీకరణకు మతం ఎన్నడూ ప్రాతిపదిక కారాదు. ఒకవేళ మతమే ప్రాతిపదిక అయితే అది దేశ సమైక్యతకు భంగం కలిగిస్తుంది. వేర్పాటువాదానికి ఊతమిస్తుంది. రాజకీయ నేతల అవతారమెత్తిన పవర్ బ్రోకర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు రాయల తెలంగాణ అంటూ పల్లవిస్తుండడం సిగ్గుపడాల్సిన విషయం.

భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక ఉందని సాక్షాత్తు ఇందిరాగాంధీ లోక్‌సభలో పేర్కొన్నారు. అయినప్పటికీ విభజించు-పాలించు సూత్రాన్ని అవలంబించాలని నేటి సోనియాగాంధీ కాంగ్రెస్ తలపోస్తే రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే సరి? రాయలసీమను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయడమే ప్రస్తుతం అత్యంత అవశ్యకం. నాడు శ్రీబాగ్ ఒడంబడికను నిస్సిగ్గుగా ఉల్లంఘించిన కోస్తాంధ్రతో ఏ విధంగా కలిసి ఉండమని ఉపదేశిస్తారు? ఇప్పుడు కూడా గుంటూరు, విజయవాడ, ఒంగోలు, విశాఖపట్నాలను రాజధాని చేయాలని తాపత్రయపడుతున్నారా లేదా? నాటి రాజధాని కర్నూలును లేదా మరో రాయలసీమ జిల్లాను రాజధానిగా చేయాలని పెద్దన్నగా ఎందుకు ఆలోచించరు? ప్రతిపాదిత రాయలసీమ రాష్ట్రం ఏర్పడితే 8 ఈశాన్య రాష్ట్రాల కన్నా, గోవా, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల కన్నా పెద్ద రాష్ట్రమవుతుంది. 1970లో కర్నూలు జిల్లా నుంచి కొంత భూభాగాన్ని వేరుచేసి ప్రకాశం జిల్లాలో కలిపారు. దాన్ని తిరిగి కర్నూలు జిల్లాలో కలపాల్సి ఉంటుంది. నాడు కోల్పోయిన బళ్లారిని మళ్లీ రాయలసీమలో కలపాల్సి ఉంది. దీనికోసం మరో ఎస్సార్సీ కానీ, ప్రత్యేక కమిషన్ వేసినా ఫర్వాలేదు. ప్రత్యేక రాష్ట్రంగా రాయలసీమ మనగలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయాన్ని నిర్దిష్ట కాలపరిమితి వరకు మూడు ప్రాంతాలకు పంపిణీ చేయండి. ఈలోగా సీమ స్వావలంబన సాధించేందుకు అవకాశం ఉంది. తిరుపతి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, లేపాక్షి, అహోబిలం, యాగంటి, కడపదర్గా, వంటి పుణ్యక్షేత్రాలు ఉన్న ప్రాంతమిది.

చదవండి :  'సీమ ప్రజల గొంతు నొక్కినారు'

ఆధ్యాత్మిక పర్యాటకంతో సీమ స్వయం సమృద్ధి సాధిస్తుంది. సీమలో అపార ఖనిజ సంపద ఉంది. ఈ ప్రాంత స్వావలంబనకు ఈ నిక్షేపాలు ఇతోధికంగా తోడ్పడతాయి. రాయలసీమ నాడు బళ్లారిని కోల్పోయింది. రాజధాని ఉన్న మద్రాసు, కర్నూలును కోల్పోయింది. నేడు హైదరాబాద్ కూడా పరాయిదయిపోయింది. ఇకనైనా రాయలసీమ ప్రజలు జాగరూకత ప్రదర్శించాల్సి ఉంది. లేకపోతే మరోసారి బానిసత్వపు సంకెళ్లలో చిక్కుకొని బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో వలసజీవులుగా దుర్భర జీవనాన్ని భవిష్యత్ తరాలు అనుభవించాల్సి ఉంటుంది. సీమలో తరతరాలుగా అనుభవిస్తున్న గులాంగిరీకి చెల్లుచీటి రాయాల్సిన సరైన తరుణం ఇదే.

– కె. రాహుల్ సిద్ధార్థ
ప్రధాన కార్యదర్శి, రాయలసీమ జనచేతన

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: