ఓడిపోయిన సంస్కారం (కథ) – రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా )

సుందరమ్మకంతా కలలో ఉన్నట్లుంది. పెండ్లంటే మేళతాళాలూ, పెద్దల హడావుడీ, పిల్లల కోలాహలం, మొదలైనవన్నీ వుంటాయనే ఆమె మొదట భయపడింది. మూడేండ్లనాడు తన మొదటి పెండ్లి ఆ విధంగానే జరిగింది. ఈ రెండవ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా కొద్దిమంది ఆత్మీయుల సమక్షంలో నవనాగరిక పద్ధతిలో జరుగుతుందని వారం రోజులనాడు తెలిసినప్పుడు ఆమె కెంతో మనశ్శాంతి కలిగింది. పెండ్లి ఐన సంవత్సరానికే వైధవ్యభారం నెత్తిన వేసుకొని పుట్టినిల్లు జేరిన తాను తిరిగి పెండ్లికూతురు వేషం ధరించాలంటే ఆమె చాలా సిగ్గుపడింది.

పునర్వివాహానికి ఆమె మొదట తీవ్రంగా వ్యతిరేకించినా తన యిద్దరి అన్నగార్లూ యెడతెగకుండా చేసిన హితోపదేశాలవల్లా, విధవ ఐన ఈ రెండేండ్లలోనూ తాను గడించిన జీవితానుభవంవల్లా, ఆమె యీ రెండవ పెండ్లికి ఒప్పుకుంది. ఐనా ఒక సంవత్సరంపాటు భర్తతో కాపురం చేసిన తాను సిగ్గు పెండ్లికూతురుగా పదిమందిలోనూ ఎట్లా ప్రవర్తించడమా అన్న భయసంకోచాలు ఆమె మనస్సును పీడిస్తూనే వుండినాయి. అందువల్ల ఈ పెండ్లి యే ఆర్భాటమూ లేకుండా ప్రశాంతంగా జరిగిపోతుందని తెలిసినప్పుడు ఆమె సంతృప్తితో నిట్టూర్చింది. తీరా యిప్పుడు చూస్తే ఆ పాత ఆచారాల ఆర్భాటమే మేలనిపించేటట్లుంది. ఈ కొత్త వ్యవహారమంతా. పెండ్లేమో పది నిముషాల్లోనే అయిపోయింది. వచ్చిన బంధువులంతా, పురోహితునితో గూడ కలిసి యిరవై మంది కంటే యెక్కువ లేరు. తనకు సిగ్గుపడాల్సిన ఘట్టాలేమీ లేకుండానే పెండ్లి ముగిసిందని ఆమె సంతోషిస్తూ వుండగానే – అంతలోనే ఉపన్యాసాల కార్యక్రమం మొదలైంది.

Rachamallu Ramachandra Reddy1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 25న తుది శ్వాస వదిలారు.         

ఒక్కొక్కరే లేచి పెండ్లి కొడుకును అభినందించడం, అతని సంఘ సంస్కరణాభిలాషను పొగడడం, అతని ఔదార్యాన్ని మెచ్చుకోవడం, ఆఖరులో ఆశీర్వదించడం – ఆమె కంతా అయోమయంగా వుంది. సుమారు గంట నుండిఉపన్యాసాలు సాగుతున్నాయి. ఇప్పటికి ఐదారు మంది మాట్లాడినారు. ఇంకా యెంత మంది మాట్లాడుతారో? విధవను పెండ్లి చేసుకోడానికి యెవరైనా సిగ్గుపడతారని మాత్రమే ఆమెకు తెలుసు. కాకపోతే ఈ కాలంలో అదేమీ తప్పు కాదనీ, అందువలననే విధవా వివాహాలు జరుగుతున్నాయనీ ఆమె అనుకుంది. కాని ఇందులో ప్రశంసించవలసిందేముందో ఆమెకు అర్థం కాలేదు. ఇంతలో ఒక యువకుడు లేచి, అందరూ పెండ్లి కొడుకైన రామనాధాన్ని మాత్రమే మెచ్చుకోవడం అన్యాయమనీ, సుందరమ్మ ధైర్య సాహసాలే యెక్కువగా మెచ్చుకోతగినవనీ ఉపన్యాసం మొదలు పెట్టినాడు. ఇదేదో మరీ విపరీతంగా కనపడిందామెకు. ఇందులో ధైర్యసాహసాలేమున్నాయి? జీవితమంతా సుఖపడాలనే ఆశతోనే తానీ పెండ్లికి సిద్ధపడింది. అందులో తన్ను అంత పెద్దగా పొగడవలసిందేముంది? యితరుల కోసం తాను చేసిందేమీ లేదే? ఆ ఉపన్యాసం అయిపోయినంత వరకూ ఆమెకు ముండ్ల మీద కూర్చున్నట్లే ఉంది. అదృష్టవశాత్తు అది ఐన వెంటనే కాఫీ ఫలహారాల కార్యక్రమం ప్రారంభమైంది. తరువాత 20 నిముషాల్లోనే ఆమె భర్త గృహం చేరుకుంది.

చదవండి :  షాదీ (కథ) - సత్యాగ్ని

 రాత్రి భోంచేసిన వెంటనే పడక గదిలో మంచంమీద కూర్చుంది సుందరమ్మ. భర్త యెటువంటివాడా అని ఆలోచించడానికి పూనుకుంది ఆమె. కాని వెంటనే మూడేండ్లనాడు తనకు కార్యం అయిన నాటి పరిస్థితులకూ ఈనాటి పరిస్థితులకూ వున్న తేడా ఆమె మనసులో మెదలింది. ఆనాడు తన పెద్ద వదినె తన్నెంతో ఆప్యాయంగా అలంకరించి, గదివరకూ తనను పిలుచుకొని వచ్చి వాకిలి దగ్గర వదలిపెట్టి పోయింది. ఆనాడు భర్త తన కొరకు ఎదురుచూస్తూ వుండినాడు. సిగ్గుతో, వుత్సాహంతో, ఉత్కంఠతో తానానాడు పడకగదిలో ప్రవేశించింది. ఆనాడు వదినెల పరిహాసంతో తన సిగ్గు నూరంతలు పెరిగినా, యేదో అపూర్వమైన సౌఖ్యం, అనంతమైన ఆనందం తన కందబోతున్నదని అర్థంకాని ఉత్సాహం కూడా తన్నావేశించింది. ఈనాడు తన్ను అలంకరించేవాళ్ళూ లేరు, పరిహసించేవాళ్ళూ లేరు. ఆ సిగ్గూ లేదు. ఆ ఉత్సాహమూ లేదు. ఈనాడు తానే వచ్చి పడక గదిలో భర్తకొరకెదురు చూస్తూ కూర్చుంది. ఈనాడు తనకు కలగబోయే సుఖంయొక్క స్వరూపం తెలుసు. అందువలన ఆనాటి ఉత్కంఠ లేదు. ఆనాడు తన ఉద్దేశాలతో నిమిత్తం లేకుండా యితరులు తన్నొక సుఖసముద్రంలో త్రోసినారు. ఈనాడు తాను బుద్ధిపూర్వకంగా స్వప్రయత్నంతో ఆ సుఖ సముద్రాన్ని సమీపించింది. ఈ సుఖం తాను విధి నెదిరించి సంపాదించుకొన్న సుఖం. ఇది తన జన్మహక్కు. తన జన్మహక్కు కొరకు యెదురు చూడడంలో సిగ్గు పడవలసిందేమీ లేదు. తన హక్కు లభ్యమవనప్పుడు తానెవ్వరికీ కృతజ్ఞురాలు కానక్కరలేదు.

చదవండి :  సొప్పదంటు ప్రెశ్నలు (కథ) - వేంపల్లి రెడ్డినాగరాజు

 ఈ రామనాధం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఔను – భర్త గుణగణాలమీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడుతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే ? – ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి చేస్తారు! ఏమో? మొదట మంచివాళ్ళుగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను వేధించుకు తినడం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో? తన బ్రతుకంతా యితని స్వభావ సంస్కారాల మీదనే యేర్పడుతుంది.

 సుందరమ్మకు యింకో విషయం జ్ఞాపకం వచ్చింది. మూడేండ్ల నాడు యిదే పరిస్థితిలో భర్త యెటువంటివాడు అన్న ప్రశ్న తనకు తట్టనే లేదు. ఆనాడు తనకు కలగబోయే సుఖాన్ని గురించే తాను ఊహించుకుంది. తన భవిష్యజ్జీవితాన్ని గురించే గాలి మేడలు కట్టుకుంది. ఆనాడు తన భర్త అందచందాలను గురించైనా కొంతవరకు తనలో తాను వితర్కించుకుందేగాని, అతని స్వభావ సంస్కారాలను గురించిన ఆలోచనే తనకు రాలేదు. ఈ విషయం జ్ఞాపకం వచ్చి ఆమె ఆశ్చర్యపడింది. వెంటనే కారణం స్ఫురించి తనలో తాను నవ్వుకుంది. పురుషుల స్వభావ సంస్కారాలే స్త్రీల సుఖ సంతోషాలను నిర్దాక్షిణ్యంగా నిర్ణయిస్తాయని ఆ నాడు తనకు తెలియదు. ఆనాడు తెలియనివి యీనాడు తనకెన్నో తెలుసు. ముఖ్యంగా స్త్రీలు సుఖపడడానికి పురుషుల ఆకారాలకంటె పురుషుల మనస్సులే ప్రధానం అన్న విషయం తనకు బాగా తెలుసు. అందుకే యీ పెండ్లి ఖాయమైనప్పటి నుండి ఈ ప్రశ్న యెడతెగకుండా తన కెదురౌతూనే వుంది. ఈ రామనాధం యెటువంటివాడు? ఇతని మనస్సు యెటువంటిది?

 వాకిలి దగ్గర చప్పుడౌతూనే ఆమె తలయెత్తి చూసింది. భర్త కనబడగానే లేచి నిలబడింది. ”సుందరీ, పెండ్లిలో నీకేమి కష్టం కలుగలేదు గదా?” అంటూ రామనాధం ఆమెను సమీపించి, మంచంమీద కూర్చొని ఆమెను గూడా కూర్చోమన్నట్లు ఆమె భుజంమద చేయి వేసి బరువుగా నొక్కినాడు. సుందరమ్మ అతని పక్కనే కూర్చుంటూ ”లేదండీ” అన్నది.

రామనాధం ఉత్సాహంగా అందుకున్నాడు: ”ఏర్పాట్లన్నీ స్వయంగా నేనే చేయించినాను తెలుసా? నీ మనస్సు కేమీ ఆయాసం కలగకూడదని నేనెంత శ్రద్ధ తీసుకున్నాననుకున్నావ్‌?”

 ”ఊ” అన్నది సుందరమ్మ నిరుత్సాహంగా.

 రామనాధం మరింత ఉత్సాహంగా అన్నాడు : ”ఊ అనడం గాదు సందరీ! నీ సుఖం కొరకు నా జీవితమంతా ధారపోయటానికి సిద్ధంగా వున్నానంటే నమ్ము. ఈ పెండ్లిని గురించి యెంతమంది బంధువులకు దూరమైనాననుకున్నావ్‌? అంతెందుకూ – రేపు పత్రికలో చూస్తావుగా నేను నీకొర కెంత త్యాగం చేసిందీ.”

చదవండి :  సిన్నిగాడి శికారి (కథ) - బత్తుల ప్రసాద్

 ఇంతవరకూ నేలకేసి చూస్తూ వున్న సుందరమ్మ తల యెత్తి రామనాధం ముఖంలోకి చూసింది. ఆ ముఖంలో వంచన యెక్కడా కనబడలేదు. అతని కన్నుల నిండా ఆత్మ సంతృప్తి తప్ప మరే భావమూ లేదు. ఆమె మెల్లగా అడిగింది: ”నా కొరకు అంత త్యాగం చేయవలసిన పనేముంది మీకు?” అది ప్రశ్నగా కాక తన అభిప్రాయం చెప్పినట్లు శాంతంగా చెప్పబోయింది ఆమె. కానీ, మధ్యలో అప్రయత్నంగా కంఠం వణికి అది ప్రశ్నగా ధ్వనించింది. తనకు తెలియకుండానే తనలో కలిగిన ఆవేశానికి సిగ్గుపడి ఆమె మళ్ళీ తల వంచుకుంది.

 రామనాధం యివన్నీ గమనించకుండానే వెంటనే జవాబు చెప్పినాడు. ”అదేం మాట సుందరీ మానవులన్న తర్వాత ఆదర్శాల కొరకు త్యాగం చెయ్యకపోతే యెట్లా? నీబోటి యువతులందరూ నిష్కారణంగా జీవిత సౌఖ్యాలకు దూరమై ఉసూరుమంటుంటే మన సంఘం బాగుపడేదెట్లా.”

 సుందరమ్మ మౌనంగానేవుంది. అతని మనస్సును అర్థం చేసుకోడానికి ఆమె ప్రయత్నిస్తూ వుంది. ఈ మనిషికి నన్ను సుఖ పెట్టాలని యింత తాపత్రయమెందుకో? తాను సుఖపడాలనే ఆశ యితని కే కోశానా లేదా? ఆమె ఆలోచనలు రామనాధం సాగనివ్వలేదు. రెండు చేతులతోనూ ఆమె ముఖం తన వైపుకు తిప్పుకొని అతననన్నాడు: ”యిటు చూడు సందరీ యీ పెండ్లి కాకుండా వుంటే నీ జీవితమంతా యెట్లుంటుందో ఊహించుకున్నావా? నేను త్యాగం చేయకపోతే నీ బతుకులోని చీకటంతా తొలగి పొయ్యేదెట్లా?”

 అతని కన్నుల్లోకి చూస్తూ వున్న సుందరమ్మ కనురెప్పలు వాల్చి విచారంగా చిరునవ్వు నవ్వింది.

 రామనాధం ఆమె చిరునవ్వును మాత్రమే చూసినాడు. ఆ చిరునవ్వులోని విచారాన్ని గమనించే స్థితిలో లేడు అతను. ”చూడు యిప్పుడు నీ బ్రతుకంతా వెన్నెల అయింది. నా త్యాగమంతా నీ చిరునవ్వు రూపంలో ఫలించినందుకు నాకెంత ఆనందంగా వుందనుకున్నావ్‌?” అని అన్నాడు సంతృప్తీ, సంతోషం నిండిన కంఠంతో.

 సుందరమ్మకు ఒక్క సారిగా భవిష్యత్తంతా అంధకారమయమైంది. ‘ఇంత త్యాగ జీవితమంతా మోసే శక్తి నాకు లేదు’ అని బిగ్గరగా అరవాలనుకుంది. ఆమె దిగ్గున లేచి నిలబడింది. అంతలోనే తన అసహాయత మెరుపువలె ఆమె మనసులో తోచింది. కండ్లు తుడుచుకుంటూ రామనాధం పాదాల దగ్గర నేల మీద కూర్చొని ”మీ త్యాగానికి తగిన యోగ్యత నాకు కలిగేటట్లు ఆశీర్వదించండి” అని గద్గద కంఠంతో పలికింది.

(జనవరి 1958)

ఇదీ చదవండి!

ఎదురెదురు

ఎదురెదురు ! (కథ) – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్‌ సురేష్‌కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: