‘రాయలసీమవారి అభిప్రాయానికి ఇప్పటికైనా కట్టుబడాలి’ – ఎబికె ప్రసాద్

స్వార్థ ప్రయోజనాలతో, అధికార దాహంతో తెలుగుజాతిని చీల్చిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు రాజధాని కోసం ప్రజల ప్రయోజనాలు గాలికి వదిలి కోట్లకు పడగలెత్తిన రియల్‌ఎస్టేట్ వ్యాపారులకూ, వారి ప్రయోజనాలను కాపాడే అవినీతి రాజకీయ బేహారుల కోసం గాలింపులు సాగిస్తున్నారు.

అశాతవాహన, కాకతీయ, రాయల విజయనగర యుగాలు తెలుగుజాతి సమైక్యతకూ, శతాబ్దాల తరబడి భాషా, సాంస్కృతిక వైభవ ప్రాభవాలకూ మూలవిరాట్టులుగా, కొండగుర్తులుగా నిలిచాయి. ఆనాటి సామంతరాజులైన మండల పాలకుల స్థానిక కుమ్ములాట లవల్ల తెలుగుజాతి ఐక్యత కకావికలమయ్యింది. వారికి కావల్సింది తెలుగుజాతి అభివృద్ధి, భద్రతలు కావు. ప్రజల్లో అనైక్యతా బీజాలు నాటి, శాంతిని భగ్నం చేసి ప్రజలను తమ అధికార కొట్లాటల్లోకి దించి, తమ ‘ఇలాఖా’లకు అధినాయకులుగా చలామణి కావాలని చూశారు. తెలుగుజాతి ఐక్యతకూ, ఔన్నత్యానికీ చిచ్చుపెట్టి కడకు చరిత్రహీనులయ్యారు. ఆ చరిత్రే నేడు పునరావృతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ ద్వారా తెలుగువారికి ఐక్యవేదిక ఏర్పడిన తర్వాత స్థానిక ‘అభినవ సామంత నాయకులు’ అధికార పీఠాల కోసం జాతిని విచ్ఛిన్నం చేయడంలో అగ్రభాగంలో నిలిచారు. అందులో భాగమే విడిపోయిన ‘ఆంధ్రప్రదేశ్’ నేడు తలలేని మొండెంగా, రాజధాని లేని రాష్ట్రంగా సమస్యల చిక్కుముళ్ల మధ్య తప్పిపోయిన పాపాయిలా బిక్కుబిక్కుమంటూ ఉండిపోయింది. అధికార దాహంతో తెలుగుజాతిని చీల్చిన ప్రధాన రాజకీయ పార్టీల నేతలు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారు. ఇప్పుడు రాజధాని కోసం ఊరూరా గాలిస్తున్నారు.

రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సర్కార్ దన్ను

ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోకి అత్యంత వెనుకబడిన ప్రాంతం రాయలసీమ మాత్రమేనని రాష్ట్ర విభజన సమస్యపై నివేదిక సమర్పించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తేల్చి చెప్పినప్పుడు ఆ వైపుగా పరిశీలించవలసిన శివరామకృష్ణన్ కమిటీ ఒకసారి రాజధాని విషయంలో భంగపాటుకు గురైన కర్నూలు విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందా? అన్నది తాజా ప్రశ్నగా ముందుకొచ్చింది.

చదవండి :  'సాహిత్య విమర్శ'లో రారాకు చోటు కల్పించని యోవేవి

పాలకుల ఆలోచనలు ఎంతసేపూ కోస్తా సముద్ర తీరం వెంట విశాఖ నుంచి విజయవాడ-గుంటూరుల మీదుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకూ కొనలు సాగి అనలు తొడుగుతున్నాయి. ఆ మాటకొస్తే కృష్ణా జిల్లాలోని మారుమూల ఆగిరిపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయం దాకా రాజధాని కోసం గాలింపులు సాగుతున్నాయి. అయితే ఈ అన్వేషణ ప్రజా సంక్షేమం, వారి విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రం కాదు. ప్రజలతో సంబంధం లేకుండా వందల, కోట్లాది రూపాయలకు పడగలెత్తి కూర్చున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులకూ, వారి ప్రయోజనాలను కాపాడగోరే అవినీతిపరులైన రాజకీయ బేహారుల కోసం ఈ గాలింపులు సాగుతున్నాయి. ఏపీ రాజధాని నిర్ణయం తేలకముందే ‘చెవుల కొరుకుళ్లతో’ ప్రారంభమైన గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో భూముల ధరలను స్పెక్యులేటివ్ రాజకీయ జూదం ద్వారా ఎకరా ఒక్కింటికి లక్షల సంఖ్య దాటించి పాతిక-నలభై కోట్లకు డేకించి రాజధాని నిర్ణయాన్ని పాలకులు సంకటంలోకి నెట్టారు.

నిజంగా రాజధాని ఎంపికపై శ్రద్ధ ఉన్నవారు ఎంపిక చేయదగిన ప్రాంతాలను ముందుగానే గుర్తించి, ఆ మేరకు భూముల స్పెక్యులేటివ్ వ్యాపారానికి తావులేకుండా చడీచప్పుడూ లేకుండా సదరు ప్రాంతాలలోని భూముల ధరలను నియంత్రిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసి ఉండాల్సింది. అది రాజధాని వెతుకులాట మొదలైనప్పుడే జరిగి ఉండాల్సింది. ఆ మాటకొస్తే, ప్రభుత్వ భూమిని గతంలోనే కేటాయించి కర్నూలులోనే తొలి ఆంధ్రరాష్ట్ర రాజధానిని నెలకొల్పారు. ఆ తర్వాత కారణాంతరాల వల్ల సదుద్దేశంతో దాన్ని హైదరాబాద్‌కు తరలించాల్సి వచ్చింది.

అది అత్యాశ కాదు!

ఉమ్మడి రాష్ట్రంలో ఇరు ప్రాంతాల పాలకులు, నాయకుల అష్టావక్ర పనుల వల్ల తిరిగి విడిపోవల్సి వచ్చిన నేపథ్యంలో…..రాయలసీమ ప్రజాబాహుళ్యం ఇపుడు కర్నూలు పూర్వ రాజధానినే పునఃప్రతిష్టించాలని కోరుకుంటే దాన్ని ‘అత్యాశ’గా పరిగణించరాదు. పైగా నేటి స్పెక్యులేటివ్ రాజకీయ వ్యాపారంలో నూతన రాజధాని నిర్మాణానికి ‘జాగా’ల వెతుకులాటలో జాగారణ చేసేకన్నా తక్కువ ఖర్చుతోనే కర్నూలు రాజధాని పునర్నిర్మాణం(ఎలాగూ కేటాయించిన స్థలం, కొన్ని కట్టడాలు ఉన్నాయి కాబట్టి) సుసాధ్యం చేసుకోవచ్చు గదా!

చదవండి :  ఇక సీమాంధ్ర కాంగ్రెస్ విన్యాసాలు

శ్రీభాగ్ కు కట్టుబడి ఉండాలి

ఆంధ్ర రాష్ట్రావతరణ సమయంలోనే 1937నాటి ‘‘శ్రీబాగ్ ఒడంబడిక’’ను నాయకులంతా ఏకగ్రీవంగా ఆమోదించినందున ఒప్పందంలోని నాల్గవ అంశం ప్రకారం ‘‘రాష్ట్ర రాజధా ని లేక హైకోర్టు ఉనికి విషయంపై రాయలసీమవారి అభిప్రాయమే తుది నిర్ణయంగా ఉంటుంది’’కాబట్టి, ఆ ‘తుది నిర్ణయానికి’ రాజకీయ విభేదాలతో నిమిత్తం లేకుండా ఇప్పటికైనా కట్టుబడి ఉండి యావన్మంది నాయకులూ ఏకవాక్యతను ప్రకటించడం రాష్ట్ర సమైక్యత దృష్ట్యా విజ్ఞత కాదా? అన్నది ఒకసారి ఆలోచించాలి. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా మద్రాసు నగరాన్ని ఇదే కుమ్ములాటల మధ్య ఆంధ్ర నాయకులు చేజార్చుకున్నారు. మరొకసారి కర్నూలులో స్థిరపరచుకున్న రాజధానిని మొత్తం జాతి ఉమ్మడి ప్రయోజనాల దృష్ట్యా హైదరాబాద్‌కు తరలించుకున్నాం. ఇంకోసారి ప్రధాన పార్టీల నాయకుల వి ద్రోహం కారణంగా మళ్లీ రాజధాని కోసం కొత్త రాష్ట్రం ‘స్వాతివానకు ముత్య పు చిప్ప’ ఎదురుతెన్నులు కాసినట్టుగా మోరలెత్తుకుని చూడవలసివచ్చింది!

మద్రాసు మనదే!

తెలుగువారు మరచిపోరాని ఒక ఘట్టం ఉంది. తెలుగు నాయకుల కన్నా ముందు మద్రాసు నగరం తెలుగువారిదేననీ, ఆ నగరం వారికే చెందాలనీ నాటి స్వాతంత్య్ర సమరయోధులలో ఒకరు మద్రాసు స్టేట్ కౌన్సిల్‌లో సీని యర్ తమిళ నాయకుడైన సర్ శంకరన్ నాయర్ 1926లోనే మొదటిసారిగా ఎలుగెత్తి చాటాడు. తమిళ రాష్ట్రం భౌగోళిక పరిధుల నుంచి మద్రాసు నగ రాన్ని వేరు చేయాలనీ, ‘‘మద్రాసు నగరం తమిళనాడు భూభాగంలోనిది కాదు, అందులో సగం నగరమే తమిళ ప్రాంతానిదీ, మిగతా సగం ఆంధ్రప్రాంతం వారిదీ’’ననీ, తమిళ రాష్ట్రానికి పరిపూర్ణ స్వపరిపాలనను కోరుతూ కౌన్సిల్‌లో తీర్మానం ప్రవేశపెట్టిన తొలి తమిళ నాయకుడు ఈ శంకరన్ నాయర్ అని మరవకండి.

అభివృద్ధిలో వికేంద్రీకరణ

తొలి రాజధాని కర్నూలు చరిత్ర తక్కువదా? తెలుగు చోళుల ఆదిమ నివాస కేంద్రాలలో ఒకటి కర్నూలు. ‘‘ఈ ఊరికి ఆ ఊరెంత దూరమో, ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం’’ అన్న నానుడి దూరాభారాలను బట్టే ప్రసిద్ధమయ్యింది. కోస్తాలో ఆ చివరి నుంచి ఈ చివరిదాకా ఉన్న ఏ పట్టణం లేదా ఏ ప్రధాన ప్రాంతం తీసుకున్నా… ఒకటి మరొక దానికి దగ్గరైతే, అదే ప్రాంతం మొదటి ప్రాంతానికి దూరమవుతుంది. అందుకే పాలనా విభాగాలు కూడా వికేంద్రీకృతమైతే దూరాలు చేరువవుతాయి. వందల కిలోమీటర్ల దూరంలో మద్రాసు రాజధానికి ఆంధ్ర రాష్ట్రావతరణకు ముందు వరకూ తెలుగువారు విద్యా, వ్యాపార అవసరాల కోసం వెళ్లక తప్పిందా? పనులు చేసుకోక తప్పిం దా? కర్నూలు రాజధానిని కోల్పోయి, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రావతరణతో దూరాభారాలతో నిమిత్తం లేకుం డానే అటు విశాఖ, నెల్లూరుల నుంచీ, ఇటు మచిలీపట్నం, విజయవాడల నుంచి హైదరాబాద్‌కు చేరుకుని పనులు చేసుకోలేదా? వర్తకానికి అనువైనందుననే కదా తెలివిగల మొఘలాయి, నిజాం పాలకులు కోస్తా తీరాన్ని వదలకుండా సాకుతూ గడపవలసివచ్చింది! వర్తక, వాణిజ్యాలలో ఆంధ్రతీర ప్రాంతానికున్న అసాధారణ ప్రాశస్త్యం తెలియని మూర్ఖ రాజకీయ పాలకులు మాత్రమే తెలుగు జాతి విభజనకు పాదులు తీశారు! ఇక ఆ అధ్యాయం ముగిసింది. పాలకులు ముందుగతిని తెలుసుకుని మసలుకోవలసిన పరీక్షా సమయమిది. తీరస్థ ఆంధ్రప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేసిన, దక్షిణ భారత చరిత్రలో ప్రముఖ పాత్ర నిర్వహించి చరితార్థులైన ప్రోలయ, కాపయ నాయకులను, రాణి రుద్రమ, ప్రతాపరుద్రాదులను, తెలుగువారి కీర్తిని ప్రపంచస్థాయికి చేర్చిన సమర్థుడైన నలుగురు ప్రపంచ పాలకులలో ఒకనిగా చరిత్రకారులు నిల్పిన శ్రీకృష్ణదేవరాయలను ఒక్కసారి తలచుకొనగల సత్తా అయినా నేటి పాలకులకు ఉన్నదా?

చదవండి :  చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

 – ఏబీకే ప్రసాద్

(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)

(సౌజన్యం: సాక్షి దినపత్రిక, 10 జులై 2014)

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: