గండికోట కావ్యం
వ్యాసకర్త భూతపురి గోపాలకృష్ణ

తొలి ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యం – ‘గండికోట’ – మొదటి భాగం

గండికోట కావ్యం సమీక్ష

తెలుగులో ఆధునిక క్షేత్రప్రశస్తి కావ్యాలు స్వాతంత్య్రోద్యమ కాలంలోనూ, ఆ తర్వాత చాలా వచ్చాయి. వీటిని చారిత్రక స్థలకావ్యాలని కూడా పిలువవచ్చు. ప్రాచీన తెలుగు సాహిత్యంలో కాశీఖండం, భీమఖండం వంటి క్షేత్రప్రశస్తి కావ్యాలు ఉన్నప్పటికీ అవి కేవలం ఆధ్యాత్మిక దృష్టితో భక్తి ప్రధానంగా రచింపబడ్డాయి. కానీ ఆధునిక కాలంలో వచ్చిన క్షేత్రప్రశస్తి కావ్యాల లక్ష్యం వేరు. స్వాతంత్య్రోద్యమ కాలం కావడం వల్ల ప్రజలను చైతన్యవంతులను చేయడం ఆధునిక కవుల లక్ష్యం. అందువల్లనే ‘ఓ ఆంధ్రుడా! నీకింత గొప్పచరిత్ర ఉంది. నువ్వు పుట్టిననేల చాలా విశిష్టమైంది. వీటిని గుర్తుకు తెచ్చుకుని బానిసత్వం నుండి విముక్తిని సాధించడానికి పోరాడు’ అని కవులు తమ రచనల ద్వారా తెలుగు ప్రజలలో ప్రేరణ కలిగించారు.

1905కు ముందు భారతదేశంలో జాతీయోద్యమం బలపడలేదు. తెలుగుప్రజల గుండెల్లో జాతీయాభిమానం మొలకమాత్రంగా ఉండేది. 1905లో ఆంగ్లప్రభుత్వం బెంగాల్‌ను రెండుముక్కలు చెయ్యడంతో భారతీయుల గుండె భగ్గుమంది. బెంగాల్‌లో చెలరేగిన ఆందోళనలతో ఇక్కడ తెలుగునేల అట్టుడుకిపోయింది. అంతేగాక 1907లో లాలాలజపతిరాయ్‌ని ఆంగ్లప్రభుత్వం బర్మాలో బంధించడం కూడా అగ్నిలో ఆజ్యం పోసినట్లై ఆంధ్రదేశం ఉర్రూతలూగింది. ఆధునిక ఆంధ్రకవిత్వంలో దేశభక్తి రెండుపాయలుగా ప్రవహించింది. 1.భారత జాతీయాభిమాన సంబంధి 2.ఆంధ్రాభిమాన సంబంధి. తెలుగులో వెలువడిన దేశభక్తి కవిత్వంలో ఆంధ్రాభిమాన సంబంధి కవిత్వమే ఎక్కువగా ఉంది. రాయప్రోలు సుబ్బారావు కవితల్లో ఒకటి రెండు కవితలు జాతీయదృష్టితో రచించినవే అయినప్పటికీ ఎక్కువభాగం కవితలు ఆంధ్రాభిమానాన్ని ప్రకటించినవే ఉన్నాయి. ‘నాదు జాతి నాదేశము నాదు భాష/ అను అహంకారమందు మాంధ్ర’ (ఆంధ్రావళి) అని ఆయన 20వ శతాబ్దం రెండోదశాబ్దంలో ప్రబోధించారు. రాయప్రోలు ప్రభావం తర్వాత కవులపై చాలా ఉంది. పద్యాలలో లఘుకథాకావ్యరచనకు ఆయనే మార్గదర్శకులు. దేశభక్తి కవిత్వానికి రూపుదిద్దింది ఆయనే. ఆయన ప్రభావంతోనే విశ్వనాథ ‘ఆంధ్రప్రశస్తి’, ‘ఆంధ్రపౌరుషం’, తుమ్మల సీతారామమూర్తి ‘రాష్ట్రగానం’, ‘పఱిగపంట’ (కవితా సంపుటులు), పుట్టపర్తి నారాయణాచార్యుల ‘పెనుగొండలక్ష్మి’ , కొడాలి సుబ్బారావు ‘హంపీక్షేత్రం’ మొదలైన కావ్యాలు వచ్చాయి.

రాయప్రోలు రచించిన ‘నాదుజాతి….’ పద్యంలో ప్రతిపాదింపబడిన ‘అహంకార దర్శనమే’ రాష్ట్రోద్యమ కవిత్వానికి బీజభూతమైంది. అభిమానం అహంకార లక్షణం. ఈ అహంకార దర్శనంతో తెలుగు కవులకు పూర్వచరిత్రలో ఆంధ్రులు సాధించిన విజయాలు, సంతరించుకున్న వైభవాలు తళుక్కున స్మృతిపథంలో మెరిశాయి. విషాదరేఖతో కూడిన ఒకానొక అభిమానం రాష్ట్రోద్యమ కవితగా వెలువడింది. బెంగాల్‌లో, బీహార్‌లో జరిగిన భాషా సంబంధమైన ఉద్యమాలు ఈ భావానికి జవజీవాలిచ్చాయి. సంఘసంస్కరణోద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్య్రోద్యమం ఈ భావానికి ఆవిష్కరణను కూర్చాయి. కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక ఆంధ్రోద్యమానికి ఎత్తిన పతాకలయ్యాయి. 1907లో విజ్ఞాన చంద్రికా మండలి స్థాపన, 1910లో గుంటూరులో ఆంధ్ర యువజన సాహిత్యసంఘ సమావేశంలో జరిపిన ఆంధ్రరాష్ట్రానికి సంబంధించిన తీర్మానం, 1912లో కలకత్తాకు బదులుగా ఢిల్లీ రాజధాని కావడంతో జరిగిన ఉత్సవాల సంరంభం, 1913లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభ – ఈ సంఘటనల సమష్టి ప్రభావమే ఆంధ్రరాష్ట్రోద్యమ కవిత్వంగా రూపొందింది.

విజ్ఞాన చంద్రికా మండలి స్థాపనతో మరుగునపడిన ఆంధ్రచరిత్ర ‘తవ్వకం’ మొదలై ఆంధ్రుడు, ఆంధ్రజాతి క్రమపరిణామం, ఆంధ్రసంస్కృతి నాగరికతల క్రమవికాసం, ఆంధ్రుల సామ్రాజ్య నిర్మాణాదులు, లలితకళలకు ఆంధ్రులెత్తిన నివాళులు, ఆంధ్రుల వాణిజ్యం, నౌకావ్యాపారం, ఆంధ్రుల కత్తుల తళతళలు మొదలైన అనేక విషయాలు తెలియవచ్చాయి. తెలుగు కవులు చరిత్రలోని ఉజ్వల వస్తువుల్ని, స్వర్ణఘట్టాల్ని సంగ్రహించి గొప్ప ఉద్వేగంతో గీతాలు పాడారు. ఈ ఆంధ్రాభిమానం మూడువిధాలుగా ప్రవహించింది. 1.జాతి అభిమానం 2.దేశాభిమానం 3. భాషాభిమానం. ఈ మూడింటికి గతవైభవ స్మరణ, వర్తమాన స్థితిపట్ల విచారం, భవిష్యత్‌ కర్తవ్య ప్రబోధం ముఖ్య లక్షణాలు. ఆంధ్రజాతి అభిమానంలో శౌర్యప్రశస్తి, ఐశ్వర్య ప్రశస్తి, కళాప్రశస్తి ప్రకటింపబడ్డాయి. దేశాభిమానంలో క్షేత్రప్రశస్తి, నదీప్రశస్తి కీర్తింపబడ్డాయి. భాషాభిమానంలో తెలుగుభాష గొప్పతనం కొనియాడబడింది. ఈ ఆంధ్రాభిమానం కొన్నిచోట్ల మరీ అతిశయించి వికటించింది.

తెలుగువాళ్ళ ఔన్నత్యాన్ని తెలిపే కవితా ఖండికలు వెలువడుతున్న ఇలాంటి ఉద్యమ సందర్భంలో 1920లో కడపజిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన జె.సుబ్బయ్య మొట్టమొదటగా ఆధునిక దృక్పథం కలిగిన క్షేత్రప్రశస్తి కావ్యానికి శ్రీకారం చుట్టి ‘గండికోట’ అనే క్షేత్రప్రశస్తి కావ్యాన్ని రచించారు. ఈ చారిత్రక లఘుకావ్యం 1920లోనే రచింపబడినప్పటికీ ముద్రణకు నోచుకోవడానికి అయిదేళ్ళు పట్టింది. కర్నూలు జిల్లాలోని చాగలమర్రికి చెందిన కల్వటాల జయరామారావు బాలభారతీ గ్రంథనిలయం పక్షాన ప్రచురణకు పూనుకొని తొలి గ్రంథంగా దీనిని 1925లో బెజవాడ వాణీ ముద్రాక్షరశాలలో ముద్రించి లోకానికి అందజేశారు. కడపజిల్లాలో ప్రొద్దుటూరు గొప్ప సాంస్కృతిక కేంద్రం. అందువల్ల ఈ కావ్యకర్త సుబ్బయ్య కావ్యంలో చెప్పకోకపోయినప్పటికీ సమకాలీనమైన ఆంధ్రోద్యమ కవిత్వ ప్రభావానికి లోనై ఈ రచన చేశారని చెప్పవచ్చు. అంతేగాక రచనలో చెప్పిన అంశాల ద్వారా కూడా కవికున్న ఆంధ్రాభిమానం స్పష్టంగా వ్యక్తమౌతున్నది.

చదవండి :  'రాక్షస పాలన కొనసాగుతోంది' - సిఎం రమేష్

కొడాలి వెంకట సుబ్బారావు ‘హంపీక్షేత్రం’ (1933) కన్నా తన ‘పెనుగొండలక్ష్మి’ పదహైదేళ్ళు పెద్దదని డా|| పుట్టపర్తి నారాయణాచార్యులు పెనుగొండలక్ష్మి ఉపోద్ఘాతంలో చెప్పుకున్నారు. ఇది పుట్టపర్తి 12వ ఏట (1926లో) రచింపబడింది కాబట్టి దీన్నే తొలి క్షేత్రప్రశస్తి కావ్యంగా చెప్పవచ్చని డా|| సి.నారాయణరెడ్డి ‘ఆధునికాంధ్ర సాహిత్యం : సంప్రదాయములు – ప్రయోగములు’లో (పుట-383) అభిప్రాయపడ్డారు. అయితే జె.సుబ్బయ్య 1920లోనే రచించిన ‘గండికోట’ కావ్యం పుట్టపర్తి రచన కన్నా ఒక సంవత్సరం ముందుగా 1925లోనే వెలువడడం వల్ల ఇదే తొలి క్షేత్రప్రశస్తి కావ్యం అవుతుంది.

గండికోట విశిష్టత :

గండికోట చారిత్రక ప్రసిద్ధిని కలిగిన ప్రదేశం. ఇది కడపజిల్లాలోని జమ్మలమడుగుకు 14కి.మీ దూరంలో ఉంది. సహజ సిద్ధమైన పెన్నానది గండిని, ఎత్తైన పర్వతాలను ఆధారం చేసుకుని నిర్మింపబడిన దుర్భేద్యమైన జలదుర్గం మరియు గిరిదుర్గం. దట్టమైన వనాలతో విలసిల్లిన వనదుర్గం కూడా. ఇది ఒకనాడు వీరులకు స్థానమై వీరభూమిగా, విలువైన వజ్రాలకు నెలవై రతనాల సీమగా, పాడిపంటలతో అన్నపూర్ణగా వెలుగొందింది. 64కి.మీటర్లు వ్యాపించి, గొప్ప భవన నిర్మాణాలతో, హిందూదేవాలయాలు, మసీదులతో కూడుకున్న గండికోటను క్రీ.శ.1652లో ఫ్రెంచి పర్యాటకుడు, వజ్రాల వ్యాపారి టావెర్నియర్‌ దర్శించాడు. ఆయన ఇక్కడి శిల్పసంపదకు, ప్రకృతి రమణీయతకు ముగ్ధుడయ్యాడు. తన పర్యటనలో భాగంగా ఇదివరకే హంపిని దర్శించిన టావెర్నియర్‌ గండికోటను ‘రెండవ హంపి’గా తన ‘ట్రావెల్స్‌ ఇన్‌ ఇండియా’ పుస్తకంలో అభివర్ణించడం విశేషం.

కళ్యాణీ చాళుక్యరాజు త్రైలోక్యమల్లుని సామంతుడు, కాకరాజుగా పిలువబడే చిద్దణ చోళమహారాజు క్రీ.శ.1123 జనవరి 9న గండికోటను నిర్మించినట్లు గండికోట దుర్గం కైఫియత్‌ తెలియజేస్తోంది. దీని ఘనచరిత్రను, వైభవాన్ని పలు శాసనాలు, కైఫియత్‌లు, కావ్యాలు చాటిచెపుతున్నాయి. ఈ గండికోట కాకతీయుల కాలంలో బాగా వెలుగొందినప్పటికీ తర్వాత కొంతకాలం ప్రాభవాన్ని కోల్పోయింది. మళ్ళీ విజయనగర రాజుల కాలంలో పెమ్మసానివారి అధీనంలోకి వచ్చి గొప్ప ప్రసిద్ధిని పొందింది. ఆ తర్వాత బ్రిటీష్‌వారి కాలంలో ఇది తన వైభవాన్ని కోల్పోయింది.

గండికోట అమెరికాలోని కొలరాడో నదిచే కోతకు గురైన గ్రాండ్‌ కేనియన్‌ పర్వత ప్రదేశాన్ని పోలినదై భారతదేశపు గ్రాండ్‌ కేనియన్‌గా పిలువడుతున్నది. ఎర్రమల కొండల్లో గండిపడిన ప్రాంతం 448 కిలోమీటర్ల పొడవు, 29 కిలోమీటర్ల వెడల్పు, 1800 మీటర్ల లోతు కలిగి చూపరులకు అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. ఈ కోట సముద్రమట్టానికి 1670 అడుగుల ఎత్తులో ఉంది. ఫ్రెంచ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాండిచ్చేరి వారు ముద్రించిన ‘ఫోర్‌ ఫోర్ట్స్‌ ఆఫ్‌ దక్కన్‌’ (దక్కన్‌ పీఠభూమిలోని నాలుగు కోటలు)లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి గండికోట, గుత్తి మాత్రమే స్థానాన్ని సంపాదించుకున్నాయి.

గండికోట గొప్పతనాన్ని తెలియజేసే సీసపద్యపు నడకతో కూడిన ఒక జానపదగేయం ఆ ప్రాంతంలో ఇప్పటికీ ప్రచారంలో ఉంది.

”తూర్పున వెయ్యారు నేర్పుతో గాలించి/ దక్షిణాదికోట నెక్కరాదు/ ఉత్తరమున పెన్న ఊహించి పారంగ/ శంకించి ఒక్కడైన చేరరాదు/ నాగఝరి బోగదరి నడిబావి లోపల/ రామతీర్థంబులు రమ్యమగును/నాలుగు దిడ్డీలు ఎనిమిది వాకిండ్లు/ సొంపుగా పదహారు సోర్ణగండ్లు/ ముప్పదికి పైన ఒక మూడు మునగతోట/ అరవదికి పైన ఒక ఆరు ఆకుతోట/ డెబ్బదికి పైన ఒక ఏడు దేవళములు/ కమలజనకుడు గట్టించె గండికోట”

చదవండి :  జమ్మలమడుగు పురపాలిక పీఠం వైకాపాదే

‘గండికోట’ కావ్యం అక్కడి చారిత్రక శిథిలాలను వర్ణిస్తూ రచింపబడ్డ 16 పుటల చిరుకావ్యం. తొలి ప్రయత్నంగా పద్యరచనకు పూనుకొన్నాననీ, ఏవేని దోషాలుంటే పెద్దలు వాటిని దిద్దమనీ, మున్ముందు అలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తపడతాననీ కవి వినయంగా చెప్పుకొన్నారు. కవిది తొలి ప్రయత్నమే అయినా రచన చక్కని భావపుష్టితో పాఠకులందరికీ అర్థమయ్యేలా సులభశైలిలో సాగింది. అంతేగాక ఇతర క్షేత్రప్రశస్తి కావ్యాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంది. ఈ కావ్యం కవి తండ్రి అయిన పెద్దసుబ్బయ్యకు అంకితం చేయబడింది.

గ్రంథాలయ ఉద్యమనాయకులు గాడిచర్ల హరిసర్వోత్తమరావు ఈ కావ్యానికి తొలినుడి రాస్తూ ”గండికోట సుప్రసిద్ధస్థానం. పెన్నానదిని నిరోధించే పర్వతాగ్రంలో కట్టబడిన దుర్గరాజం. జమ్మలమడుగు పట్టణానికి సమీప ప్రదేశం. చుట్టుపక్కల ఉండే ప్రజలందరికీ నిరంతరం మధురమైన పండ్లను ఇచ్చే పవిత్ర క్షేత్రం. సుబ్బయ్యగారు చూసినవీ, విన్నవీ పారవశ్యానికి లోనై చెప్పారు. వీనుల విందుగా సులభశైలిలో తమ హృదయవేదనను ప్రకటించారు” అని అభిప్రాయపడ్డారు.

ఉమర్‌ అలీషా ‘రసాత్మకమైన వాక్యాలతో వీనుల విందు చేస్తూ కావ్యకల్పనా చాతుర్యంతో రచన అలరారుతున్న’ దని ప్రశంసించారు. మంగిపూడి వెంకటశర్మ ‘రచన తొలి నుండి తుది వరకు కరుణరసంతో నిండి కఠినమైనవారి మనస్సులను కూడా కరిగించేలా ఉన్నదనీ, కవి సిరాతో కాక కన్నీటితో రచించినట్లుగా ఉంది’ అనీ శ్లాఘించారు.

ఈ కావ్యంలో కవి గండికోట చారిత్రక విషయాలను గురించి కానీ, దానిని పరిపాలించిన రాజులను గురించి కానీ చెప్పలేదు. కేవలం శిథిలమైన గండికోట స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తూ, దాని ఒకప్పటి వైభవాన్ని తలపోస్తూ తన బాధను తెలియజేశారు. ఎలాంటి శీర్షికలు లేకుండా రచనంతా తేటగీతులతో (295 పాదాలతో) సాగింది. కవి చేసిన వర్ణనల్లో ఆయన గండికోటను దర్శించి దాని దుస్థితికి పొందిన బాధతోపాటు స్థానికంగా ప్రచారంలో ఉన్న కథలు కూడా ఉన్నాయి.

గండికోట చారిత్రక ప్రసిద్ధిని కలిగి కడప జిల్లాకు విశేషమైన కీర్తిని తెచ్చిపెట్టింది. పెద్ద పట్టణాలు కూడా గండికోటకు సాటి రాలేవంటున్నారు కవిగారు.

”గండికోటరొ!
ఘనతను గాంచినావు
పేరు ప్రఖ్యాతి కెక్కగ బెరిగినావు
కడపజిల్లాకు గీర్తిని గలుగజేయు
చున్నదానవు, కొండపై నున్న నీకు
బల్లెలట్లుండ నే పెద్ద పట్టణంబు
సాటియగునె, నీ కంటెను మేటియగునె”

ఈ కోట సహజ సిద్ధమైన కొండల ఆసరాతో పునాదులు లేకుండా అక్కడి ఎర్ర శానపురాళ్ళతో కట్టబడింది. కోటలో కోనలు, నీటిబావులు, కోనేళ్ళు ఉండేవనీ పక్కనే పారే పెన్నానదివల్ల పంటలు చక్కగా పండేవనీ, కష్టించి పనిచేసేవాళ్ళు, ప్రసిద్ధికెక్కిన ప్రజలు, ముప్పొద్దులా యుద్ధం చేసే రాజులు, కోట్లతో బేరం చేయగలిగే వ్యాపారులు, తమ శక్తిని చూపే కాపులు కలిగి ఒకనాడు విలసిల్లిన గండికోట కాల ప్రభావం వల్ల నేడు శిథిలమై కనబడుతున్నదనీ కవి ఇలా దుఃఖించారు.

”చుట్టు కోట తోడనె నీవు పుట్టినావు
కోనలున్నవి నీలోన గోట్ల కొలది
నీటి బావులు కోనేళ్లు నీకు గలవు
పారుచున్నది పెన్న నీ ప్రక్కలోన
ఫలము నిచ్చును భూమి నీ ప్రజలకెల్ల
బాటుపడువారు పుట్టిరి కోటయందు
బౌరులుండిరి నీలోన బేరు వడసి
రాజులుండిరి ముప్పొద్దు రణము జేయ
బేరులుండిరి కోట్లకు బేరమాడ
కాపులుండిరి తమ శక్తి జూపుటకును
కాలదోషంబె కాకున్న గాననగునె
పాడుపడిన గృహంబు లే ప్రక్క జూడ”

ఎంత పనితనమున్న శిల్పులు ఆనాడు ఈ కోటను కట్టారో గానీ కొన్ని వందల ఏండ్లు గడచినా ఎండకూ, వానకూ తడిసి కూలిపోక ఈనాటికీ తన గొప్పతనాన్ని చాటుతోంది. ఎందరో పరాక్రమవంతులు కోట రక్షణ కోసం పోరాడి వీరస్వర్గాన్ని పొందారు. ఎందరో శత్రువీరులు కోటను వశపరచుకోవడానికి వచ్చి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలాంటి కోట కాలదోషం పట్టిన కారణం వల్ల ఆ గొప్పతనమంతా నామమాత్రమై చూసేవాళ్ళ కంట నీరు తెప్పిస్తోంది.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 2003

కాలవైపరీత్యానికి అడ్డులేదు. కనుకనే గుండెబరువుతో కవిగారు ఒకనాడు రాజులు కొలువు దీరిన రాజభవనం మొండిగోడలతో కోతిరాజులకు నెలవైందని అంటున్నారు.

”రాజసౌధమ! నీదగు రాజసంబు
చూచు భాగ్యంబునకు మేము నోచలేదు
మొండిగోడల తోడనే యుండినీవు
చెప్పుచున్నావు పూర్వపు స్థితియు గతియు
ఎట్టిరాజులు నీలోన బుట్టినారొ
ఎట్టి వైభవమందిరో యెవరి కెరుక
కాలవైపరీత్యమునకు గలదె యడ్డు?
కొలువు దీఱిన రాజులు వెడలిపోవ
గోతిరాజులు నీలోన గొలువు దీఱె”

ఇక్కడ నిర్మింపబడిన మాధవరాయల దేవాలయం కోటకంటే ఎత్తైన గాలిగోపురం కలది. ఆ స్వామి పూజించిన వాళ్ళందరినీ ఫలాలతో అనుహ్రించాడు. కాలధర్మాన్ని ఆపలేక ఆ రాజులు గతించగా చివరకు మొగలుల పరిపాలనా కాలంలో ఆ దేవాలయంలో గోవులను పట్టి గొంతుకోస్తుంటే చూడలేక ఆస్వామి గోడకు రంధ్రం చేసి అదృశ్యమయ్యాడు. ఆ రంధ్రం నేటికీ కనిపిస్తోంది. మాధవరాయ స్వామి మైదుకూరు చేరి అర్చనాదులు అందుకుంటూ ఉండగా ఆ ఆలయం నేడు పురుగుపుట్రలకు స్థానమైంది.

‘తుదకు గటాగటా మొగలాయి దొరతనాన
గోవులన్‌ బట్టి నీలోన గొంతుగోయ’

అని కవి పేర్కొన్నాడు కానీ ఈ సంఘటన కాలంలో గండికోట మొగల్‌ పాలకుల అధీనంలో కాక గోల్కొండ సుల్తాన్‌ల అధీనంలో ఉంది. గోల్కొండ సుల్తాన్‌ అబ్దుల్‌ కుతుబ్‌షా మంత్రి, సైన్యాధికారి అయిన మీర్‌జుమ్లా గండికోట కోసం దాని పాలకుడైన పెమ్మసాని చిన తిమ్మనాయుడితో మూడునెలలు యుద్ధంచేసి, జయించలేక కుట్రతో క్రీ.శ.1652 ఆగస్టు 25న గండికోటను స్వాధీనం చేసుకున్నాడు. ఆ మీర్‌జుమ్లా రాజప్రతినిధిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. ఈ ఘాతుకాన్ని ఊహించిన కొందరు భక్తులు మాధవరాయస్వామిని అక్కడి నుంచి మైదుకూరుకు చేర్చారు. ఆ తర్వాత క్రీ.శ.1687లో ఔరంగజేబు గోల్కొండను ఆక్రమించడంతో గండికోట మొగల్‌ పాలకుల అధీనంలోకి వెళ్ళింది.

యుద్ధమంటే పెండ్లిగా భావించే ఒకానొక వీరుడు శత్రువీరులకు వణకు పుట్టించడంతోపాటు తనలాంటి వీరులు తయారయ్యేలా శిక్షణ ఇచ్చాడు. కాలప్రభావంవల్ల ఆ వీరవరుడు, ఆయన తయారుచేసిన వీరులు అంతరించగా అతని భవనం గబ్బిలాలకు ఆలవాలమైంది. వాళ్ళంతా మరువదగినవాళ్ళు కాదని కవి పేర్కొన్నారు.

‘భవనమా! ఎంత దురవస్థ వచ్చె నీకు
నిన్ను జూడ గనులనిండ నీరు వచ్చు
ఉండినాడు నీయందొక్క యోధవరుడు
కయ్యమన బెండ్లియని యెంచు ఘనుడతండు
వచ్చి రణరంగమున దాను జొచ్చెనేని
వైరివీరుల గుండియల్‌ వ్క్రలగును
నిలచి యతనితో బోరంగ నలవి యగునె
కాలమతనిని దనలోన గలుపుకొనగ
గదన మందున నతడింక గానబడడు
అట్టివాడు నిన్ను విడిచి పెట్టి పోవ
గబ్బిలంబులు చేరె నీ గర్భమందు
ఇచట నుండిన యయ్య నేర్పించుచుండె
జదువు సాములు మున్నగు సకలకళలు
అతని శిక్షకు లోనైన యఖిలజనులు
యుద్ధవీరులై పోరి నిన్నుద్ధరించి
కాలవశమున వారలు రాలినారు
లేనివారు వారు మరపురానివారు”

ఒక వీరవనిత ధైర్యసాహసాలు ఇంతని చెప్పలేం. యుద్ధరంగంలో వీపుకు గాయమై వస్తున్న భర్తను చూచి నవ్వి, ఆమె కూడా కత్తి, డాలు ధరించి యుద్ధానికి బయలుదేరింది. ఆయన కూడా ఆమెతో బయలుదేరాడు. యుద్ధరంగంలో భర్త మరణించడం చూసింది. అయినా ఆమె భయపడక వీరోచితంగా పోరాడింది. ఆమెను ఎదుర్కోలేక చాలామంది శత్రుసైనికులు మరణించగా, తక్కినవాళ్ళు భయంతో పారిపోయారు. ఆమె యుద్ధరంగం నుంచి పక్కకు వచ్చి నేలలో కత్తిని పాతి, దానిపై పడి మరణించి భర్తతో వీరస్వర్గాన్ని పొందింది. భౌతికంగా ఆమె లేకపోయినా, ఆమె చరిత్ర సజీవంగా ఉందని, కవి ఆమె నివసించిన భవనాన్ని వర్ణిస్తూ అంటున్నారు.

(ఇంకా వుంది)

 – డా|| భూతపురి గోపాలకృష్ణశాస్త్రి,   

సహాయ పరిశోధకులు,

 సి.పి. బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం, కడప

సెల్‌ : 9966624276

ఇదీ చదవండి!

చెల్లునా నీ కీపనులు

చెల్లునా నీ కీపనులు చెన్నకేశా – అన్నమయ్య సంకీర్తన

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన – 2 చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: