తెలుగుతనాన్నిఆరవోసిన ‘గాథా త్రిశతి’

సామాజిక నిష్ఠ కలిగియున్న రసం ఏదైనా కావ్యాన్ని చిరస్థాయి స్థితిలో నిల్పుతుంది అనేది అలంకారికుల అభిప్రాయం. విశ్వజనీనమైన, విశ్వసృష్టికి ఆధార భూతమైన, సకల ప్రాణికోటికి సమాన ధర్మమైన శృంగారం ప్రాచీన సాహిత్యంలో ప్రధానమైన స్థానాన్ని పొందబట్టే భోజుడు శృంగార ఏవ ఏకోరసం’’ అన్నాడు. అందుకేనేమో ఒకటవ శతాబ్దిలో శాతవాహన చక్రవర్తి హాలుడు సేకరించిన ప్రాకృత గాథల సమాహారమైన “”గాధాసప్తశతి’’ లో శృంగారమే అధిక పాళ్ళలో కనిపిస్తూంటుంది. ప్రాకృత భాషలో ఉన్న ఈ గాథల్ని “ఛాయ’గా సంస్కృతంలోకి narala ప్రాచీనులు అనువదించారు.

గతంలో మన తెలుగులోకి “గాథా సప్తశతి’ పద్య -గద్య -గేయ వచన కవితా రుపాల్లోకి అనువదించిన కవుల్లో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారు ముఖ్యులు. ఇప్పుడు ప్రముఖ అవధాని, ఆశుకవి, పండితుడు అయిన “నరాల రామారెడ్డి’ మూడువందల గాథల్ని తెలుగులోకి అనువదించారు. సంస్కృతచ్ఛాయ ఇస్తూ తేటగీత ఛందస్సులో గాథల్ని అద్భుతమైన శైలితో మూలానికి ధీటుగా ఎటువంటి రసభంగం కాకుండా నిర్దిష్టమైన నిష్కర్షతో కూడిన ప్రమాణంలో రామారెడ్డిగారు అనువదించారు. గాథ సప్తశతి నుంచి గ్రహించిన 300 గాథలు, శృంగార, హాస్య, చమత్కారంతో కూడిన ప్రాపంచిక అనుభవాన్ని ఎటువంటి అశ్లీలతకు తావియ్యకుండా సరళమైన భావగాంభీర్యతతో కూడిన భాషతో చెప్పారు “నరాల’వారు. సంస్కృత పండితుడే కాకుండా రామారెడ్డిగారు తెలుగు పద్యాన్ని అలవోకగా చెప్పగల అవధాని గనుక గాథల్లోని లోతైన సంస్కృత భావాలను తేటగీతి పద్యంలో మనోహరంగా పొదగగలిగారు. ఆనాటి సామాజిక స్పృహను అందలమెక్కించి చూపగలిగారు.

చదవండి :  'సాహిత్య విమర్శ'లో రారాకు చోటు కల్పించని యోవేవి

నరాల రామారెడ్డి గారి “”గాథా త్రిశతి’’ శృంగార కరుణ హాస్యాల సమ్మేళనం. అలంకార శాస్త్రవేత్తలు ఆశించే ధ్వనికి రసాలంకారాలకు ఈ గాథలు మకుటాయమానంగా నిలుస్తాయి అనడంలో ఎట్టి సందేహమును లేదు. గాథల మూ లంలోనే మిడి మిడి జ్ఞానంతో గాథా సప్తశతి’కామతత్వాన్ని ప్రకోపింపజేసేదిగా వ్యాఖ్యానం చేసే వారికి సమాధానంగా

”అవుర! ప్రాకృత కావ్యము -అమృతమయము

ఆలకింపని చదువని వ్యర్థుమతులు

కామతత్వము గూర్చి వ్యాఖ్యాతలగుచు

సిగ్గు చెందకపోవుట చిత్రమగును’’ అంటారు.

అట్లే నిత్యజీవితంలో తారసపడే సన్నివేశాన్ని కవి ఎంత గొప్పగా అలంకార ప్రాయంగా చెప్పాడో చూడండి.

”వంటవార్పుల మునిగిన వారజాక్షి

కురుల నెగద్రోయ మలినిత కరము తోడ

ముఖము మసియంటి సకళంక పూర్ణచంద్రు

పగిది భాసింప -నాథుడు

పరిహసించె.

వంటగదిలో కురులు పైకెగదోచుకొనే సందర్భంలో ఇల్లాలి ముఖానికి “మసి’ అంటింది. కనుక “”ఆమె ముఖము మచ్చ ఉన్న చందమామలా ఉంది”” అంటూ భర్త ఆమెను చూసి నవ్వుతున్నాడు.

ఉతికి ఆరవేసిన చిరుగుపాత అం చుల నుండి కారే నీటి బొట్లను చూచి కవి ఎలా స్పందించాడో చూడండి

”ఎన్ని మారులు నన్ను మర్దింతువోయి!

ఇంక చాలును నను విసర్జింపవోయి’

అంచు జీర్ణవస్త్రము విలపించినట్లు

అంబు కణములు స్రవియించె నంచులందు.”’’

“చిరిగిన బట్టను యికనైనా మార్చవయ్యా’ అనే సూచన సూత్రప్రాయంగా యిందులో హాస్య ధోరణిలో చెప్పాడు కవి.

చదవండి :  నన్నెచోడుడు

కొన్ని పద్యాలలో ఫ్రౌఢ శృంగార భావనలు ద్యోతకమవుతుంటాయి. అయినా అమలిన శృంగారమే అన్నింటా మిన్నంటి కనిపిస్తుంటుంది. భర్తకంటే రుచికరమైన వస్తువు మరొకటి వుండదనే భార్య భావాన్ని ఎంత మనోహరంగా చెప్పాడో కవి:

మొదటిసారి గర్భిణియైన ముగ్ధగాంచి

ఇంతి! యేమి వస్తువులు నీకిష్టమనుచు

సుదతులందఱు ప్రశ్నింప చుట్టుముట్టి

నాతి చూపులు ప్రసరించె నాథువైపు.

GathaTrisatiతొలి చూలాల్ని ఇరుగుపొరుగు అమ్మలక్కలు ప్రక్కనజేరి తినడానికి యిష్టమైన పదార్థాలను అడిగి మరీ తెచ్చిపెట్టడం నేటికీ మన సమాజంలో ఆనవాయితి. అయితే ఆ చూలాలు చెప్పిన ఫ్రౌఢసమాధానం శృంగార భావంతో కూడిన ప్రేమను వ్యక్తపరుస్తుంది. ఒకటో శతాబ్దంలో రాసిన ఈ గాథ (పద్యం) ఇప్పటికి నిత్యనూతనంగానే ఉంది అంటే ఆనాటి కవుల దార్శినికత ఎంత గొప్పదో ఊహించవచ్చును.

ఆనాటి కవులు శ్రమైక సౌందర్యాన్నీఉన్నతమైన ఉపమానాలతో చెప్పడం వారి సా మాజిక దృష్టికి తార్కాణంగా పేర్కొనవచ్చును. ఒక కాపు కన్నె పిం డి దంచుతూ ఒళ్లం తా పడిన పిండివలన తెల్లగా కనిపించడాన్ని అందవికారం గా వర్ణించకుండా ఉచ్ఛమైన పోలికతో చెప్పడం ఈ పద్యం లో గమనించవచ్చును.

”పాలకడలిపై తేలిన పద్మవోలె

తండులపు పిండి తనువున నిండుకొన్న

కాపుకన్నెను కన్నుల కాంక్ష తీర

అనిమిషాక్షులై తిలకించి రధ్వాచరులు’

పాలసముద్రం కెరటాలనుండి పైకివచ్చిన లక్ష్మీదేవిని దేవతలు చూసినట్లుగా కాపు కన్నెను దారినపోయే బా టసారులు కన్నార్పకుండా చూస్తున్నారట. ఇక్కడ దేవతలకు ఎటూ రెప్పపాటు లేదు.కాని రెప్పపాటు గల బాటసారులు అనిమిషలోచనులై చూడడం కాపుకన్నె అందానికి కవి ఎక్కువ ప్రా ధాన్యత యిచ్చినట్లుగా తోస్తుంది. శృంగార రసప్రాధాన్యంగా ఈ పద్యం చెప్పినా స్పర్శతో కూడిన సందర్భాన్ని బట్టి శృంగార ప్రేరితమైన హార్మోన్సును బట్టి ఒక తీరుగా అట్లే పుత్రవాత్సల్యముతో కూడిన ప్రేరణను బట్టి హార్మోన్స్‌ విడుదల మరోతీరుగా వుంటాయి అనే శాస్త్రీయ విధానాన్ని ఈ పద్యంలో కవి ఆవిష్కరిస్తాడు.

చదవండి :  మన జయరాం, మన సొదుం

“తనయు డొకప్రక్క -ఒక ప్రక్క అనుగుమగడు

వారి యిద్దరి కరముల స్పర్శవలన

వత్సలత్వాన ఒకచన్ను పాలుచీపె

చిలిపి తలపున ఒకచన్ను పులకరించె’అంటాడు.

ఎదుటివారిని అనుమానించి అవమానిస్తున్నామనుకోకుండా నీతులు చెప్పడం కొందరికి అలవాటు.వారు పెద్దరికాన్ని ఒలకబోస్తూ వారి తప్పు లు వారు తెలుసుకోడానికి ప్రయత్నించకుండా ఎదుటివారికి నీతులు ఉపదేశించడానికి ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారికి చురక ఈ పద్యం.

“వెదురుటాకులు తలనిండ వెలసె ననుచు

నీదు కోడలి గ్రుచ్చి ప్రశ్నింతువేల?

అత్త!… చెప్పెద నొకమాట -అలుక వలదు

దుమ్ము పట్టిన నీ వీపు దులుపు కొనుము’’

దుమ్ముపట్టిన నీ వీపు దులుపుకుని నీ తలనిండ తగులుకునిన వెదురు టాకులను గురించి మాట్లాడండి అత్తగారూ! అంటూ కోడలు అత్తని ఎత్తి పొడవడం యిందులో సారాంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: