చంద్రన్నకు

చంద్రన్నకు ప్రేమతో …

చంద్రన్నకు రాయలసీమ ప్రజల బహిరంగ లేఖ

మేధావీ,అత్యంత ప్రతిభావంతుడూ, సంపన్నుడూ అయిన మా రాయలసీమ ముద్దుబిడ్డకు…

అన్నా! చంద్రన్నా!!

మీరు ఈ మధ్యకాలం లో పదే పదే “నేనూ రాయలసీమ బిడ్డనే” అని ప్రకటించుకోవాల్సివస్తున్నందుకు మీకెలా ఉందేమో గాని, మీ తోబుట్టువులయిన మాకేమో చాలా భాధగా వుంది. మీరాప్రకటనను గర్వంగా చేస్తున్నారో,లేక అపరాధబావంతో చేస్తున్నారో ? మీరు చేస్తున్న పద్దతిలో మాత్రం మాకు అపరాధనాభావమే కనపడుతూంది.

అయినా చంద్రన్నా! తాగునీరు,సాగునీరు కరువై,ఉపాధి లేక యితర రాష్ట్రాలకు వలసలకు వెళ్ళుతూ బిచ్చమెత్తుకొనే మాకు మా రాయలసీమ బిడ్డడయిన మీరు దేశంలోని అందరి ముఖ్యమంత్రులకన్నా ధనవంతులుగా పేరొందడం. గర్వకారణం కాదా! అంతెందుకు, దేశదేశాలలో వున్నా ప్రముఖులందరూ, ఒక బిల్ గేట్స్ కావొచ్చు, సత్య నాదెళ్ళ కావొచ్చు, అంబానీ,అధానీలు కావొచ్చు, వీరంతా మీరు నేర్పిన పాఠాల వల్ల,మీరు యిచ్చిన సలహాల వల్లనే గదా ఆయా రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అంతటి గొప్ప వ్యక్తయిన మిమ్మల్ని “మా రాయలసీమ బిడ్డ” అని మేము సగర్వంగా చెప్పుకోవాలి గాని, మీరే పదే పదే అలా చెప్పుకోవడం అంతగా సబబు అన్పించడం లేదన్నా.

అయినా మీకెందుకంత శ్రమ. మీరు కనుసైగ చేస్తే మీ గొంతును తమ గొంతులుగా విన్పించే వందిమాగాధులనేకులు మన “రాయలసీమ బిడ్డలే” వున్నారు. అంతెందుకు మీరు తానా అంటే తందాన అనే మీడియా మీ సరసనే కాచుకొని వుంది కదా. మీ పెరుగుదలను,ఉన్నతిని చూడలేక, ఈర్షతో,అసూయతో మిమ్మల్ని “రాయలసీమ ద్రోహి” ,”తల్లి పాలు తాగి,రొమ్ములు గుద్దే”రకమని కొందరు మిమ్మల్ని నిందిస్తున్న మాట నిజమే. వాళ్ళంతా శ్రీ శ్రీ అన్నట్టు “నేటి నిజం చూడలేని కీటక సన్నాసులు”. నీవు చేస్తున్న అభివృద్దిని,అది ఏ ప్రాంతంలోనయితేనేం చూడలేని కబోదులు.నీ ఉదారతను,నీ విశాల హృదయాన్ని, నీ అంతరంగాన్ని అర్థం చేసుకోలేని సంకుచిత ఉప ప్రాంతీయవాదులు. వదిలేయన్నా వాళ్ళ మానాన వాళ్ళు పోతారు. ఎటూ,ఇదే విధానం కొనసాగుతే మిమ్మల్ని విమర్శించేవారు, మీరు పుట్టినగడ్డలో,అదే రాయలసీమ లో ఒక్కరూ మిగలరు – ఉపాధి కోసం రాష్ట్రాన్ని ధాటిపోతారు,లేక యిక్కడే వుంటే ఆకలి చావులు చస్తారు.

చంద్రన్నా!

నీవొక దార్శనికునివి. నీ ఆలోచనలు, నీ విధానాలు మాలాంటి మొద్దు బుర్రలకు ఏమి అర్థమవుతాయన్నా. నీవు సీమలో తప్ప పుట్టినావు. ఏ కృష్ణా,గుంటూర్ జిల్లాలలోనో, ఉభయగోదావరి, కనీసం విశాఖలోనయినా పుట్టాల్సిన వాడివి. సీమ తల్లి అదృష్టం కొద్దీ నీవిక్కడ జన్మించావు. నేడు నీవు సీమకేం చేయలేదని అంటున్నా కోపం తెచ్చుకోక నీ గొప్పతనాన్ని సీమకూ అంటిస్తూ “నేనూసీమ బిడ్డనే” అని చెప్పుకుంటున్నావు. కనీసం దీనికైన సీమబిడ్డలం మేమంతా నీకు కృతజ్ఞత చెప్పుకోవాలి. నీ ముందుచూపుతో,నాడే “వ్యవసాయం దండగా” అని చెప్పావు. మా మొద్దు బుర్రలకు ఎక్కలేదు. అందుకే, మేము నేడు అప్పుల్లో మునుగుతూ ఆకలిచావులు చస్తున్నాం. మేమంతా ఆనాడే నీమాట విని వ్యవసాయం వదలి ఏ సాఫ్ట్ వేర్ లో చేరివుంటే బిల్ గేట్స్ లము కాకపోయినా నాదెల్లలమయినా అయ్యుందుము కదా. నీ మాటే వినివుంటే ఈ పాటికి రాష్ట్రం, నీ స్వప్నసీమ సింగపూర్గా మారేది కదా. ప్రతి యింటినిండా పిల్లలబదులు రోబోలు ఉండేవికదా.వాటికి ఆకలి,దప్పులు ఎటూ వుండవు. దాంతో సీమకు తాగు, సాగు నీటి అవసరం ఉండేదికాదు. ఎంత దూరదృష్టి అన్నా, నీది. మేమే మూర్ఖులం. నిన్నవసరంగా ఆపార్ధంచేసుకున్నాం.

చదవండి :  సీమవాసుల కడుపుకొట్టారు

“వ్యవసాయం దండగా” అని తెల్సిన నీవు, నీ ప్రాంతాన్ని, అదే రాయలసీమను వ్యవసాయరహిత ప్రాంతంగా చేయాలనుకున్నావ్. నీరు వుంటేగదా, నీవు చెప్పినా వినకుండా యిక్కడి నీ వాళ్ళు వ్యవసాయం చేస్తారు. దాంతో, అష్టకష్టాలు పడతారని నీవు ఊహించావు. అందుకే పోతిరెడ్డిపాడు నుండి కృష్ణా వరద జలాలు అందకుండా 1996 లోనే శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టాన్ని 854 అడుగులనుండి 834’ కుదించి రైతుల చేతుల, కాళ్ళ కట్టేసావు. ఏమి తెలివన్నా నీది?. ఒక్క 69 జీవోతో రాయలసీమను వ్యవసాయరహిత ప్రాంతంగా మార్చేసావు. పొరపాటున వానలొచ్చి నీటిమట్టం పెరిగి, సీమ కు నీల్లందుతే నీ వాళ్ళు సేద్యంచేసి నష్టపోతారన్న భయంతో, నీవిచ్చిన జీఓ నే ఉల్లంగిస్తూ నీటిని 769 అడుగుల వరకు తోడావు. అదేవిధంగా కేసి కాలువ రైతాంగాన్ని విముక్తం చేసేందుకు గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణాన్ని, మొత్తంసీమ ప్రజల్ని శాశ్వతంగా వ్యవసాయం నుండి విముక్తి కల్పించేందుకు మరే యితర సాగునీటి ప్రాజెక్టులనూ చేపట్టలేదు.

అవును మరి, అనంతపురం జిల్లా వాసులకు సాగునీరందిస్తే బెంగళూరు,మద్రాస్,కేరళలో పనిచేసేందుకు చౌక కూలీలెవరు దొరుకుతారు. గతంలో, కర్నూల్ జిల్లాకు చెందిన ఒక పెద్దాయన తమ ఊర్లో పాఠాశాల పెట్టమని అడిగితే ,అందరూ బడికి పొతే కూలీకి వచ్చేవారెవరని అన్నాడట. నిజమే. ఆయన కేవలం వూరి విషయం వరకే పరిమితమయితే, నీవు గొప్పవానివి గనుక మొత్తం రాష్ట్రం గురించి ఆలోచించావు. సీమ వాసులకూ అవసరమయిన ఉపాధి కల్పిస్తే, ఇతర రాష్ట్రాలు యిబ్బందిపడవూ? అందులోనూ యిప్పుడు కలల నగరం అమరావతీకీ చౌకలో, అనుభవమున్న కూలీలు అవసరమాయే. కొందరు దీన్ని సీమకు ద్రోహం అంటారు గాని..నీ నిష్పాక్షికతను అర్థం చేసుకోవడం మాలాంటి ఉప ప్రాంతియవాధులకు సాధ్యమా? అందులోనూ సీమలో అభివృద్ధి పథకాలు చేపడితే, నిన్ను స్వార్థపరుడు అని అనరూ. అది నీకే కాదు, సీమబిడ్డలమైన మాకు చెడ్డపేరు కదా! సీమకా చెడ్డ పేరు రాకునేందుకే నీవు అన్ని రాష్ట్ర,కేంద్ర ప్రభుత్వ సంస్థలనూ కోస్తాలోనే పెడుతున్నావు. యిప్పుడు ఎవరినైనా అనమను మా చంద్రన్న ప్రాంతీయ దురభిమాని అని? కనీసం ప్రాంతీయవాది అని కూడా నింద వేయలేరు కదా.

అయినా నిన్నోక్కడినే”తల్లి పాలు తాగి రొమ్ముగుద్దె”వాడివని, ”తిన్న యింటివాసాలు లెక్కపెట్టే”వానివని, అనడం ఎంత తప్పో . దశాబ్దాలుగా సీమ పెద్దలు చేస్తున్నదదే అని చరిత్ర చెబుతూంది. సీమలో పుట్టి కోస్తా అభివృద్దికి పాటుపడటం మనకు వారసత్వంగా వస్తున్నదే గదా!. తెలియక అడుగుతాగాని, మనకు మనమే చేసుకుంటే,అందులో గొప్పధనమేముంది? మెచ్చుకొనేదేవరు? అధికారపీఠం దక్కేదేలా? అంగబలం,అర్థ బలం వున్నవాళ్ళకు సేవచేయడమే మన పరమావధి అని 1953 నుండి మన పూర్వులు మనకు చెపుతూనే వున్నారు. చేసి చూపించారు కూడా. నీవివేమీ పట్టించుకోవద్దన్న. గతం లో ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు . నీవు అది తప్పని నిరూపించావు. ఇంట ఓడినా రచ్చ గెలువవచ్చని నిరూపించావు. జాతీయంగా, అంతర్జాతీయంగా మన దిన పత్రికలూ ప్రచారం చేస్తున్నట్టుగా ఖ్యాతినార్జించావు.

చదవండి :  " సీమ" భూమి పుత్రుడు "మాసీమ"కు జోహార్..!

శబాస్,చంద్రన్న… మేము కర్నాటక,తమిళనాడు,కేరళలో మురికివాడల్లోనూ, రోడ్లపైనా అడుక్కుంటూ బతుకుతున్నా, మా రాయలసీమ బిడ్డ పేరు దేశ,విదేశాలో,అంతటా మారుమోగడం మాకు గర్వకారణం కాదా!

అన్నా, నీదెంత విశాల హృదయం గాకపోతే, నీ ప్రాంత న్యాయమైన ప్రయోజనాలను విస్మరించి, శ్రీభాగ్ ఒడంబడికను తుంగలోతొక్కుతావు. రాయలసీమలో గాకపోయినా ,కనీసం దొనకొండలో రాజధాని ఏర్పాటు చేసినా, సీమకు దగ్గరగా ఉంటుందని, దాంతో నీకు సీమ పక్షపాతి అనే చెడ్డ పేరువస్తుందని, రాజధానినీ ఏకంగా అమరావతీ అంటూ గుంటూర్-విజయవాడ మద్యలో నిర్మిస్తున్నావు. అందుకే కదా శివరామకృష్ణన్ నివేదికనూ లేక్కచేయలేదు. ఇక రాజధాని లేక పోయే, కనీసం హైకోర్ట్ నయినా యివ్వమని మన వాళ్ళు ఉద్యమిస్తున్నారు. నీకు తన,మన అనే తేడా లేదుగా. నీవేం తెలివి తక్కువ వాడివా?,ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకు పవన్ కళ్యాణ్, జే పి, ఆంద్ర మేధావు లను దింపావు. ప్రత్యెక హోదా ,బడ్జెట్ కేటాయింపులు –కొత్త నినాదం, దాంతో విభజన చట్టం లోని అంశాలు, హంద్రీ-నీవ,గాలేరు –నగరి ప్రాజెక్టుల పూర్తి, బుందేల్ ఖండ్ ప్యాకేజీ,కడపలో ఉక్కు కర్మాగార ఏర్పాటు, అమరావతీని ఫ్రీ జోన్ చేయాలని గాని, జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలివ్వాలనే డిమాండ్లు మూలన పడేలా చేసారు. అందుకు నీకు అన్ని పార్టీలూ తరతమ బేధం లేకుండా చేయూతనిస్తున్నాయనుకోండి.

 అంతే కాదు నీకు ప్రాంతాల మద్య బేధం లేదని చెప్పడానికే కదా అమరావతీ చుట్టూ నవనగర నిర్మాణానికి సీమలోని యెర్ర చందనంతో పాటు అన్ని ప్రకృతి వనరులనూ అమరావతికే అంకితం చేసావు. అమరావతి-పోలవరం నీకు రెండు కళ్ళు కదన్నా! పాపం త్రినేత్రుడిలా మూడో కన్ను లేదుగా, నీకు రాయలసీమ పై దృష్టి సారించడానికి. దాంట్లో నీ తప్పేముందన్నా. అంతా మా కర్మ. మా ప్రారబ్దం. అన్నీ అమరావతీచుట్టేననేవారు, నిన్ను అర్థం చేసుకొనడం లో విఫలమవుతున్నారు. మాలాంటి కుళ్ళుబోతులకు, నీలాంటి మేధావి ఆలోచనాసరళి ఏంఅవగతమవుతుంది. కోస్తా పెద్దన్నలు దశాబ్దాలుగా సుఖాలకు అలవాటుపడినవారాయే. మరెంత సుఖాన్నయినా తట్టుకోగల శక్తి వారికుంది. కాని,రోజుల తరబడి, తరతరాలుగా కనీసం గంజి నీళ్ళకూ నోచుకోని మాకు అకస్మాత్తుగా షడ్రసోపేత భోజనాన్ని పెడితే అరగించుకోగలమా? కడుపు ఉబ్బి చావమూ…అందుకే,ముందుచూపుతో నీవు సకల సౌకర్యాలు అక్కడే కల్గిస్తూ, తరతరాలుగా మాకలవాటైన జీవితాన్ని మాకే వుంచావు. “నడిమంత్రపు సిరి” తో మన రాయలసీమ వాళ్లకు కళ్ళు నెత్తికెక్కవూ? దశాబ్దాలుగా, ఉపాధికై వలసలు, ఆకలి చావులు, రైతాంగపు ఆత్మహత్యలకు అలవాటు పడ్డ జీవితాలు కదన్నా మావి, అలవాటుపడ్డాం, కాబట్టి మేం ఈ కస్టాలు అనుభవించగలం. అవేమీ మాకు కొత్తా గాదు. కాని సుఖాలకు అలవాటు పడ్డ పెద్దన్నలు అదే దక్షిణ కోస్తా వాళ్ళు ఒక చుక్క నీరు తక్కువయినా గగ్గోలు పెట్టరూ. అయినా,అధికార పీఠంకోసం వారిపై ఆధారపడ్డ వాళ్ళం, ఆమాత్రం వాళ్ళకు సేవచేయోద్దూ. అంతా అత్తగారింటికే దోచి పెడుతున్నాడని గిట్టని వాల్లనుకుంటే నీవేమీ పట్టించుకోవని మాకు తెలుసు . దున్నపోతుపై వాన కురుస్తే ఏమవుతుందన్నా?

చదవండి :  రాయలసీమ మహాసభ కడప జిల్లా కమిటీ

చంద్రన్నా, నీవు మా సీమ బిడ్డవు అని తలుస్తూనే మా ఛాతి 54” ఉబుకుతుంది. గర్వంతో మా కష్టాలన్నీ మరచిపోతాం. సీమ నుండి AIIMS ను, కేన్సర్ ఇన్స్టిట్యూట్ ను, చివరకుఅనంతపూర్ మెడికల్ కాలేజీకి మంజూరు చేసిన రూ.9 కోట్లను కోస్తాకు తరలించావని, పద్మావతీ మెడికల్ కాలేజీలో సీమ ఆడపిల్లలకు కేటాయించిన సీట్లనూ నీవు కోస్తా ఆడపిల్లలకే యిచ్చావనీ, చివరకు సుప్రీంకోర్టు మొట్టికాయలేసినా పట్టించుకోలేదని యిక్కడ గిట్టని వారంటారు. కాని, నీ అంతరంగం వారికెలా అర్థమవుతూంది. చదువూ-సంధ్యలు కోస్తా వాళ్ళకే గాని, సీమ వాసులకెందుకన్నా, అదీ ఆడపిల్లలు డాక్టర్లా. అవ్వవ్వా! ఎవరైనా వింటే నవ్విపోరు. సీమలో మగపిల్లలనే చదివించుకోనేందుకు తలలు తాకట్టు పెడుతున్నారే ? అలాంటప్పుడు ఆడపిల్లలను చదివించడం,అదీ డాక్టర్ కోర్సు ను, ఎంత కష్టమో? ఎంతయినా సీమ బిడ్డవు కాబట్టీ, నీవు అర్థం చేసుకున్నావ్.అందుకని కోర్టును లెక్కపెట్టక కనీసం ఒక బ్యాచ్ సీమ తల్లితండ్రులను అయినా కాపాడావు.దీనికి నిన్ను మెచ్చుకోక విమర్శించడం ఎంత దుర్మార్గం?

అయినా నీవు మాకేం తక్కువ చేస్తున్నావ్? సోలార్ విద్యుత్ కర్మాగారం పెడుతున్నావు కదా! రాయలసీమలో తప్ప మరెక్కడా పెట్టే అవకాశం లేదనీ, ఎక్కువ సంఖ్యలో వుద్యోగాలుండని అనేవారంటూనే వుంటారు. ఇక, నూక్లియార్ ఫ్యూయల్ కాంప్లెక్స్ పెడుతున్నావాయే? ఆ కర్మాగారంలో ఒక్కసారి లీకేజ్ జరిగితే, నిరుద్యోగంతో, ఆకలి, ఈతిబాధలున్నసీమ ప్రజలు, వ్యవసాయం నుండే కాదు ఈ లోకం నుండీ విముక్తి పొందుతారు. అయినా, సీమ ప్రజలు ఎప్పుడూ సాగునీరు,తాగు నీరు అంటూ సణుగుతూంటే ప్రభుత్వాలకు తలనొప్పి కదా.

చంద్రన్నా! నీవు చేపట్టిన పనులు,సాధించిన విజయాలూ సీమ తల్లి గర్వపడేలా వున్నాయి. తన పిల్లలకు ఎండిన స్తన్యాలతో పాలివ్వలేని మన తల్లి, నీ ఘనకార్యాలను చూస్తూ వాటిని తలుస్తూ, భాస్పాలు కారుస్తూనే వుంది. వాటిని కన్నీటిదారలని ఎవరైనా అంటే మేము ఒప్పుకోములే, సోదరా. ”అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న” అన్నట్టు మన పుత్రరత్నం, అదే లోకేష్ బాబు తండ్రిని మించిన తనయుడయ్యాడు. నెలల క్రితమే భూమి పూజ జరుగక ముందే కియా మోటార్స్ కర్మాగారం ద్వార 5 లక్షల వుద్యోగాలిచ్చాడు. ఆ మాత్రం చెప్పక పోతే మన వాళ్ళు కించపడరూ..అయినా ఎవరి కర్మకు ఎవరు భాద్యులు?”దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?” అని నీవే ప్రశ్నించినట్టు, ఎవరైనా “మిమ్మల్ని రాయలసీమలో పుట్టమన్నారా “అని మమ్మల్నిఅడిగితే మా దగ్గర జవాబు లేదు. అయినా, మేమేమి నిన్ను యిబ్బంది పెట్టం. ప్యాకేజీ,హోదాఅంటూ కొట్టుక చస్తాం, మీ పన్లు మీరు చెసుకపొండి.

మా కోపం ఏమిటి.? పేదవాని కోపం పెదవికి చేటు అంటారు. కోస్తా పెద్దన్నలకు మాత్రంకోపం తెప్పించవద్దు.

ఆ కోపం పెదవికి గాక పదవికి చేటు తెస్తూంది.

చివరిగా…అన్నా, నీ రెండు కళ్ళనూ,అవే అమరావతీ,పోలవరంలను జాగ్రత్తగా కాపాడుకో.రెండూ బంగారు గనులు మరి.

(మా రాయలసీమ బిడ్డవు కాబట్టీ చనువుతో నీవు అని సంబోదించినందుకు క్షమించగలవు.)

ఇట్లు
నీ నుండి ఏమీ ఆశించలేని/ఆశలేని నీ రాయలసీమ బిడ్డలు

– అరుణ్

కన్వీనర్ రాయలసీమ విద్యావంతుల వేదిక

ఇదీ చదవండి!

పోతిరెడ్డిపాడు వివాదం

పోతిరెడ్డి పాడు వివాదం నేర్పుతున్న పాఠం

పోతిరెడ్డిపాడు వివాదం – రాయలసీమకు నికరజలాలు రాయలసీమ గుండెచప్పుడు మిత్తకంధాల( పోతిరెడ్డిపాడు) నేడు రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: