జానమద్ది విగ్రహానికి పూలదండేయడానికి అనుమతి కావాల్నా?

జానమద్ది కుమారుడి ఆవేదన

కడప కేంద్రంగా తెలుగు సాహిత్యానికి అరుదైన సేవ చేసి తెలుగు సూర్యుడిగా ప్రసిద్ధుడైన మహనీయుడు సీపీ బ్రౌన్‌ తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగి. విస్మృతి గర్భంలోకి వెళ్లిపోతున్న అలాంటి బ్రౌన్‌ సాహిత్య కృషిని మళ్లీ వెలుగులోకి తెచ్చిన అరుదైన వ్యక్తి జానమద్ది హనుమచ్ఛాస్త్రి సాహితీ సూర్యుడిగా ప్రసిద్ధి చెందారు. దాదాపు 190 ఏళ్లక్రితం బ్రౌన్‌ కడపలో నివసించిన స్థలం శిథిలావస్థలో ఉండగా గుర్తించిన జానమద్ది దాన్ని సీపీ బ్రౌన్‌ స్మారక గ్రంథాలయంగా, ఆపై సీపీ బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంగా ఎదిగించడంలో అసమాన కృషి చేశారు. మొండి గోడలున్న స్థానంలో మూడంతస్తుల మహా సౌధాన్ని నిర్మించి రాష్ట్ర స్థాయిలో దానికి గుర్తింపు తేవడానికి తాను పడిన శ్రమ అంతా ఇంతా కాదు. పట్టువదలని విక్రమార్కుడిలా ఆయన జిల్లా అధికారులను, ప్రజాప్రతినిధులను కలుసుకుని నిధులను సేకరించారు. రెండు రూపాయల నుంచి ఎవరు ఎంత ఇచ్చినా స్వీకరిం చారు. ఇటుక ఇటుక పేర్చి మూండతస్తులు నిర్మింపజేశారు.

దానిని శాశ్వతంగా తన అధీనంలో ఉంచుకుందామనే స్వార్థానికి లోను కాకుండా 2005లో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయానికి, ఆ తర్వాత యోగి వేమన విశ్వవిద్యాలయానికి అప్పగించారు. ఇవాళ కడపలోని సీపీ బ్రౌన్‌ గ్రంథాలయంలో దాదాపు 75 వేల గ్రంథాలు, 250 తాళపత్ర గ్రంథాలు, విలువైన మెకంజీ కైఫీయత్తులు, బ్రౌన్‌ రచనలు, బ్రౌన్‌ లేఖలు ఉన్నాయంటే జీవిత పర్యంతం హనుమచ్ఛాస్త్రి సాహితీ మిత్రుల సహకారంతో సాగించిన అమూల్య కృషి ఉందనడంలో సందేహమే లేదు. కానీ, బ్రౌన్‌ గ్రంథాలయం నిర్మాణానికి ఒక మేస్త్రీగా, కూలీగా, ఎంతోమంది కడుపూ, కాళ్లూ పట్టుకుని బిచ్చమెత్తుకుని, ఎన్నో కష్టాలూ, కన్నీళ్లూ అవమానాలూ దిగమింగి బ్రౌన్‌ నివాసమనే శి«థిల మొండి గోడల నుంచి గ్రంథాలయ మహా సౌధాన్నే నిర్మిం చిన బ్రౌన్‌ శాస్త్రి (హనుమచ్ఛాస్త్రి) విగ్రహానికి వారి జన్మదినం రోజున ఆయన అభిమానులు పూలదండ వేయడానికి కూడా యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ అనుమతి కావలసిన దురవస్థ ప్రస్తుతం రాజ్యమేలుతోంది. సాక్షాత్తూ బ్రౌన్‌ గ్రంథా లయ బాధ్యులు డా‘‘ మూల మల్లికార్జున రెడ్డి స్వయంగా ఈ షరతు విధించడం ఎంతవరకు న్యాయం, ధర్మమో ఆలోచించాలి.

చదవండి :  నోరెత్తని మేధావులు

జానమద్ది అభిమానులు ఆయన జన్మదినాన్ని (20–10–2018) మర్చిపోలేక తమ తమ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేయడం వారి సంస్కారానికి నిదర్శనం కాగా, బ్రౌన్‌ గ్రంథాలయంలోనే ఉన్న బ్రౌన్‌ శాస్త్రి విగ్రహానికి పూలమాల వేయడానికి వీసీ అనుమతి కావాలని చెప్పడం దేనికి సంకేతం? బ్రౌన్‌ గ్రంథాలయంలో ఎందరో కవులు, కళాకారులు, పెద్దల జయంతుల, వర్ధంతులు జరుపుతున్నా, జానమద్ది జన్మదినాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తుం డటం అధికారుల సంస్కార రాహిత్యం కాదా? కనీసం అక్కడి సిబ్బంది సైతం జానమద్ది విగ్రహానికి పూలదండ వేయడానికి జంకే పరిస్థితిని కల్పించడం దారుణం. ఆయన కుటుంబ సభ్యులను, ప్రత్యేకించి అభిమానులను, సాహితీ ప్రియులను అందరినీ తీవ్రమైన కలతకు, బాధకు గురిచేసిన ఈ పరిణామం దేనికి సంకేతం? కేవలం కులద్వేషమా? ఆయన పట్ల ద్వేషం, అసూయ, ఈర్ష్యలకు సంకేతమా?

చదవండి :  నిరాదరణకు గురైంది తెలంగాణా కాదు, రాయలసీమే -శ్రీ కృష్ణ కమిటీ

2017 అక్టోబర్‌ 5న, అదే సంవత్సరం డిసెంబర్‌ 16న లిఖితపూర్వకంగా బ్రౌన్‌ గ్రంథాలయ స్థితిగతుల గురించి, దాని అభివృద్ధి గురించి పలు సూచనలతో నేను రాసిన లేఖలకు వీసీ నుంచి ఇంతవరకు సమాధానం కూడా రాకపోవడానికి కారణం ఏమిటి? 75 వేల పైచిలుకు గ్రంథాలు, మరో 200 పైచిలుకు అపూర్వమైన తాళపత్ర గ్రంథాలు ఉన్న బ్రౌన్‌ గ్రంథాలయంలో సీసీ కెమెరాలు పనిచేయవు. కాలం చెల్లిన అగ్నిమాపక యంత్రాలను అలా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. పొరపాటున ఏదైనా అగ్నిప్రమాదం లేక షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి గ్రంథాలయం మొత్తం బూడిద కుప్ప అయితే దానికి ఎవరు బాధ్యులు? యోగి వేమన వర్సిటీ పేరుకు స్థాపించిన బ్రౌన్‌ గ్రంథాలయ వెబ్‌సైట్‌ నేటికీ అప్‌డేట్‌ కాలేదు. జిరాక్స్‌ మెషీన్‌ కూడా పనిచేయదు. చివరకు వెలగని ట్యూబ్‌ లైట్లను కూడా మార్చలేనంత హీన స్థితిలో గ్రంథాలయ నిర్వహణ ఉంది. ఇలాంటి ఎన్నో సమస్యలను లేఖల ద్వారా వీసీకి తెలిపితే ఇలాంటి లేఖలకు సమాధానం ఇవ్వడం కుదరదని వీసీ ఈ అక్టోబర్‌ 23న గట్టిగా చెప్పారు.

ఇలాంటి పరమ నిర్లక్ష్య, ఉదాసీన పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు, కొందరు ఆత్మీయుల విరాళాలతో ఏర్పాటు చేసిన బ్రౌన్‌ శాస్త్రి విగ్రహానికి రేపు ఎవరైనా మసిపూసి లేదా చెప్పులదండ వేసినా పట్టిం చుకుంటారని గ్యారంటీ ఏమిటి? అలాంటి అవమానాలు జరిగాక బాధపడటం కన్నా ముందుగానే అక్కడినుంచి ఆయన విగ్రహాన్ని తొలగించాలని మా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నా. ఈ విషయంలో మా కుటుంబ సభ్యుల మనసులు బాగా గాయపడినందున, ఎట్టిపరిస్థితుల్లో మా తండ్రి విగ్రహం అక్కడ ఉంచటం కానీ వారి పేరున ఇకపై మేము సాహితీ సభలు అక్కడ జరపడం కానీ మాకు ఏమాత్రం ఇష్టంలేదు. ఆవేశంతోనూ, ఆలోచనారహితంగానూ కాకుండా, తీవ్ర ఆవేదనతో, బాధతో తీసుకున్న మా ఈ నిర్ణయాన్ని యోగి వేమన విశ్వవిద్యాలయం వీసీకి తెలిపి, పాలకమండలితో చర్చించి వీలైనంత త్వరగా మా తండ్రి విగ్రహం తరలింపునకు అనుమతి ఇవ్వాల్సిందని అధికారులను కోరాం.

చదవండి :  ముఖ్యమంత్రి గారొచ్చారు, కొత్త బిరుదిచ్చారు

గ్రంథాలయ నిర్మాణం తొలి దశనుంచీ, చనిపోయేవరకు వారు పడ్డ తపన కష్టాలు, కన్నీళ్లు, అనుభవాలు, అవమానాల్లో వారి కుటుంబ సభ్యులుగా మేమూ పాలుపంచుకున్నందువల్లే బ్రౌన్‌ గ్రం«థాలయ అభివృద్ధి అంశంలో తపన పడుతున్నాం. బ్రౌన్‌ గ్రంథాలయ భద్రతకు చెందిన చర్యల్లో నిర్లక్ష్యం వహిస్తున్న గ్రంథాలయ నిర్వాహకులపై తగు చర్యలు తీసుకోవాలి. ఇకపై ఎలాంటి దురదృష్ట ఘట నలూ జరగకుండా జాగ్రత్త వహించాలి. గతంలో ప్రభుత్వం నుంచి రాబట్టుకోలేకపోయిన దాదాపు 37 లక్షల రూపాయల గ్రాంటు మొత్తం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కూడా తగు చర్యలు తీసుకోవాలి. గ్రంథాలయ బాధ్యుల, వీసీల బాధ్యతారాహిత్యంవల్లే, ఒకప్పుడు విశిష్ట గుర్తింపు పొందిన బ్రౌన్‌ స్మారక గ్రంథాలయం నేడు కేవలం పుస్తకాల గోదాముగా మారిపోయింది. గ్రంథాలయ భద్రత, నిర్వహణపై ప్రభుత్వ స్థాయిలో తగు నిర్ణయం, చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం.

– జానమద్ది విజయభాస్కర్

(సాక్షి దినపత్రిక, ఎడిటోరియల్ పేజి, 18 నవంబర్ 2018)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: