నారాయణదాసు సంకీర్తనలు

విశ్వవ్యాప్తంగా కడప నారాయణదాసు సంకీర్తనలు

కడప నారాయణదాసు సంకీర్తనలు

తొలితెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య, ప్రజాకవి వేమన , కాలజ్ఞానకర్త పోతులూరి వీరబ్రహ్మం కడప ఖ్యాతిని ప్రపంచానికి చాటారు. వారికోవకే చెందిన పండరి భజన వాగ్గేయకారుడు కడప నారాయణదాసు తాజాగా వెలుగులోకి వచ్చారు.

నారాయణదాసు సంకీర్తనలు
‘కడప నారాయణదాసు సంకీర్తనలు’ పుస్తకం

దాదాపు80- 90 ఏళ్ల కిందట తాడిపత్రిలో పుట్టి, కడపలో నివసించి ఈ నేలలో నడయాడి పండరి భజన కీర్తనలను రచించి, తానే గురువై బృందాలకు పండరి భజన నేర్పిస్తూ తమిళనాడు (చోళంగిపురం) చేరుకుని ప్రజాబాహుళ్యంలో చిరస్థాయిగా నిలిచి పోయిన వాగ్గేయకారులు కడప నారాయణదాసు. పండితులు పట్టించుకోకపోయినా పల్లె జనుల గుండెల్లో నిలిచిపోయిన పాటకాడు ఈ నారాయణదాసు.  తెలుగు భాషోద్యమకారుడు, రచయిత స.వెం.రమేశ్ గారు తాజాగా కడప నారాయణదాసు సంకీర్తనల సంకలనాన్ని వెలువరించారు. తమిళనాడులోని తెలుగు రచయితలు ఐతం దివాకర్, ఓట్ర పురుషోత్తం తమిళనాడులోని తొండనాడుగా పిలువబడే వేలూరు, తిరువన్నామలై, తిరువళ్లూర్, కాంచీపురం, కడలూరు, విల్లుపురం అనే ఆరు జిల్లాలలో కడప నారాయణదాసు సంకీర్తనలను సేకరించారు.

చదవండి :  ఘటికాద్రి హట యోగానంద భజన సంకీర్తనలు - కడప నారాయణదాసు

అనంతపురం, కడప, చిత్తూరు , నెల్లూరు, చిత్తూరు , తిరుపతి, విజయనగరం ప్రాంతాల్లో గత శతాబ్దకాలంగా జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న పండరిభజన సంకీర్తనలు మన కడప నారాయణదాసు రచించి, గానం చేసినవే అన్న విషయం వెలుగులోకి వచ్చింది. నారాయణదాసు వాసవికన్యకా పరమేశ్వరిని, పాండురంగడిని కీర్తించడమే కాకుండా కడప జిల్లాతో పాటు పొరుగు జిల్లాలలోని ఆలయాల దేవుళ్ళను కీర్తిస్తూ కీర్తనలు రాశారు.

ఈ కీర్తనలు తమిళనాట తెలుగు వారు నేటికీ తమ భజనల్లో గానం చేస్తుండటం విశేషం. కొన్ని చోట్ల తమిళులు ఈ కీర్తనలను తమిళంలోకి అనువదించుకుని పాడుకుంటున్నారని స.వెం.రమేశ్ గారు www.kadapa.info కు తెలిపారు. బంగ్లాదేశ్, మారిషస్, మలేషియా దేశాల్లో సైతం నారాయణదాసు సంకీర్తనలను అక్కడివారు నేటికీ తెలుగులో పాడుకుంటున్నారని రమేశ్ వివరించారు.

చదవండి :  మాటలు లేకుండా విషయం చెప్పగల ప్రతిభావంతుడు

“మాధవా రాధాలోలా“ అనే కీర్తనలో తూర్పున పెంచల నరసింహుడు, పశ్చిమాన పాపాగ్ని నది, పుష్పగిరి, – ఉత్తరాన అహోబిల నరసింహుడు-, దక్షిణాన పాలకొండలలో పాలకొండ్రాయుడు ఉండగా ఘటికాద్రి, పండరీపురం, ద్వారక, కంచిలలో ఉండనేల? అని మాధవుని ప్రశ్నించడంతో పాటు “ చాలామటుకు సంకీర్తనల్లో “కడప పురమున” అని కడపను ప్రస్తావించడంవల్ల వీరు కడపలో నివసించినట్లు ధృవపడుతోంది. కడప నారాయణదాసు జీవిత విశేషాలపై లోతైన పరిశోధన జరగాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: