‘పెన్నేటి పాట’కు రాళ్ళపల్లి కట్టిన పీఠిక

రాయలసీమ బతుకు చిత్రాన్ని ఆరవోసిన ‘పెన్నేటి పాట’ సృష్టికర్త కీ.శే.విద్వాన్ విశ్వం గారు. ఇది వారి శతజయంతి సంవత్సరం. 1956లో విశ్వం గారు కావ్యస్తం చేసిన సీమ రంగని స్థితికీ, ఇప్పటి రంగని దుస్థితికీ మధ్య వ్యత్యాసం ఏమీ లేదు. కాలం మారింది… సాంకేతికత పరుగులు పెట్టింది…పాలకుల బడాయి ఎల్లలు దాటింది…. దగాల మాటున, అమాయకత్వం చాటున సీమ బతుకు చిత్రం చిధ్రం అవుతూనే ఉంది!

సాహితీ విరూపాక్షుడి ‘పెన్నేటి పాట’కు రాళ్ళపల్లి వారు  పీఠిక కట్టినారు. విశ్వం గారి స్మృతికి గుర్తుగా ఆ  పీఠికను కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం…     

రాయలసీమ నేడు అఖండాంధ్ర దేశములోని ఒక విశిష్టఖండముగా ఏర్పడియుండుటకు దాని యిప్పటి దరిద్రావస్థ ముఖ్యకారణము. మైసూరు పర్వతాల అధిత్యకా భాగమై, అడుగడుగునను పెద్ద చిన్న కొండలు అడవులు కలిగి, ఎన్నో చిన్న పెద్ద నదుల వెల్లువలచే చల్లఁదనము కొల్ల పంటలు గలిగి, అపారమైన గోధనమును బోషించుచు సర్వసమృద్ధమై యొకానొకప్పు డుండినది. ఎన్నో చిన్నపెద్ద రాజ్యములకు రాజధానులకు చోటిచ్చిన దీ సీమ. పరిగి, హేమావతి, రాయదుర్గము, గుత్తి, పాగొండ, బళ్ళారి, మడకసిర, మధుగిరి మొదలగునవి అట్లుండగా, విజయనగరపు చక్రవర్తులకు వేసవికాలమందలి చలువరాజధానిగా ఎంతో కాల మాశ్రయ మిచ్చిన పెనుగొండ – ఘనగిరి, ఇందలిది. రామరాజభూషణుని నోరూరించిన ‘దాడిమలతా లలితాంగు’లు, ఆకాలపు ‘జటిల ద్రాక్షాగుళుచ్ఛంబులు’ నేడును అక్కడ పుణ్యవంతులు చవిచూడవచ్చును. షష్టిపూర్తి చేసుకొన్న ఆ సీమవారందరికి అక్కడి ప్రాచీన సమృద్ధిలో కొంతభాగ మైనను చిన్నతనమున అనుభవమునకు వచ్చియుండును. మఱి వారు దానిని మఱువలేరు.

penneti pata
పెన్నేటి పాట

ఆ వైభవ పరిశేషము క్రమముగా మావంటివారి కన్నుల యెదుటనే అంతర్ధానమైనది. అక్కడి లెక్కలేని చెఱువులలో ఎన్నో తెగిపోయినవి. ఉన్నవి ముప్పాతిక పూడిపోయినవి. మైసూరు రాజ్యమువారు పైనుండి దిగివచ్చు నదులకు వంకలకు చెఱువులు గట్టుకొని ఊట నడ్డగించుటచే నదులకు వాననీరు తప్ప వేఱునీరు లేకపోయినది. ‘సరవ’ అను పేర అంతర్గామినిగా శాఖోపశాఖలుగా ప్రవహించుచుండిన సరస్వతి వట్టి యిసుకపాతరగా మాఱినది. అందందు సహజముగా ఎగజిమ్ముచుండిన ‘తలపరిగలు’ – నీటిబుగ్గలు, వట్టివాయి విడుచుకొని క్రమముగ మన్నుమూసి కొన్నవి. అడవులన్నియు వంటచెఱకులై పొగబాఱి పోయినవి. పశుసంపద కటికవారి పాడైపోయినది. ఇఁక మనుష్యుల మాట చెప్పనేల? ఆంగ్లేయుల దొరతనములో ఈ సీమ యెన్నివిధముల ఎండవచ్చునో అన్నివిధములను ఎండినది; ఎండింపఁబడినది.

చదవండి :  ఎస్సైలుగా ఎంపికైనోళ్ళు రేపు కర్నూలుకు పోవాల

ప్రజల పరవశత, అధికారుల అలక్ష్యము, ఇరుగు పొరుగులవారి స్వార్థపరత, వీనికి తోడు దైవము దయదప్పుట. ఇన్ని కలిసి నేటి రాయలసీమ రూపుగొన్నది. మఱి తోడి ఆంధ్రులే అధికారము అవకాశము గలిగినప్పుడు గూడ ఈసీమ యోగక్షేమములను గమనింపలేదు. సరిగదా, మీదుమిక్కిలి ఇది రాళ్ళసీమయని, అరణ్యమని, ఇక్కడివారికి చదువుసంతలు లేవని, వారు అనాగరకులని పరిహాసమును ఆక్షేపమును జేసినవారును కొంద రుండిరి. నేడును లేకపోలేదు. ఇది ‘క్షతే క్షారమివాసహ్యం’ అన్నట్లయినది ఆ సీమవారికి. ఇది ముఖ్యకారణముగా ఈ ఆంధ్రఖండమునకు ‘రాయలసీమ’ అని విభిన్ననామమును తాము ఇతరాంధ్రులతో చేరియుండ లే మనుభావము ఇందలి ప్రజలకును గలిగి వ్యాపించినది. ఆంధ్రరాష్ట్ర సాధనకు ఇది అడ్డుదగులు నేమోయను తీవ్రభయమును ఉండెడిది. కాని కొందఱు దూరదృష్టిగల మహనీయుల ప్రయత్నముచేత అట్లు జరుగలేదు. మా రాళ్ళపల్లికి సమీపమందలి పేరూరు అను గ్రామమువద్ద మల్పుదిరుగు పెన్నేటినడ్డగించి చెఱువు కట్టవలెనను భావము సర్కారువారికి ఏ మహనీయుడో సుమారు 55 సంవత్సరాలకు ముందు కలిగింపగా, ఆ పని మొన్న మొన్నటిదాకా రూపెత్తలేదని, నేటికిని పూర్తి కాలేదని తెలిసికొన్నవారికి ఈసీమ దైన్యమును, దీని గమనించిన సహృదయులకుఁ గలుగు నిర్వేదమును కొంత అర్థము కాగలవు.

నామిత్రులు విద్వాన్‌ శ్రీవిశ్వంగారి అట్టి తీవ్రనిర్వేదమే ఈ పెన్నేటి పాటగా పరిణమించినది. వాల్మీకి తనకు గలిగిన శోకము శ్లోకమయినదని చెప్పుకొన్నాడు. కాని వాల్మీకి మనుష్యత్వపరభాగమైన మహర్షిత్వమును సాధించుకొన్న మహాతపస్వి. కనుక అతని శ్లోకములలో మూలమైన శోకము ఎక్కువగా ప్రతిఫలించలేదు. శాంతి, దాంతి, శౌర్యము, వివేకము, దయ, ధర్మము, వింతలు, వినోదములు, ఇత్యాది భావములే యెక్కువగా నుండి ఆయన రచన ప్రశాంత మధురమైనది. విశ్వంగారిది మానవహృదయము. ఊహకన్న, భావనకన్న అనుభవమే మూలాధారముగా వెడలిన పరవశ రచన వీరి ‘పాట.’ నిర్వేదము తీవ్రమైనప్పుడు అన్ని నియమాలను చెల్లాచెదరుచేయు వేసటగా పనిచేయును. అది యీ ‘పాట’లో కవిగారిని ఎన్నో ఆటలాడించినది.

చదవండి :  సీమవాసుల కడుపుకొట్టారు

ఈ దేశమునందలి ప్రాచీనవైభవము అంతయు ఒక దృశ్యముగా కన్నులకు దట్టి ఈ కావ్యతాండవమునకు నాందిగా ఒక సీసము ఒక గీతము మెఱుపు దీగవలె మిఱుమిట్లు గొల్పుచు కవిగారి కలమున మెఱసిపోయినది. ఉత్తరక్షణమందే
“కోటిగొంతుల కిన్నెర మీటికొనుచు
కోటిగుండెల కంజరి కొట్టుకొనుచు”
‘నేఁటి రాయలసీమ కన్నీటిపాట’ స్వచ్ఛందవృత్తముతో వెలువడినది. అందు ప్రతిఫలించినది ‘పీనుగులపెన్న’, ‘వట్టియెడారి’, ‘నక్కబావలు’, ‘నాగుబాములు’, ‘బొంతగద్దలు’, ‘రేణగంపలు’, ‘పల్లేరుగాయలు’, ‘తుమ్మతోపులు’ ఇత్యాది అసంఖ్యసామగ్రితో విశ్వంగారి కవితా విరూపాక్షుడు తాండవించినాడు; భాష, అర్థము, భావము, ఛందస్సు అన్నియు ఆ తాండవమునకు ప్రక్కవాద్యాలు వాయించినవి. ‘పిన్పాట’ పాడినవి; ఒక మాటలో, ఒక చేయూపులో, ఒక తలయాడింపులో, ఒక తిరుపులో ఈ నటరాజు రాయలసీమలోని భూతభవజ్జీవితమునందలి చిన్నపెద్ద ఖండికలెన్నో విసరివైచినాడు.

ఈ దృష్టికి – ఈ సృష్టికి కథ యనావశ్యకము. అసాధ్యముగూడ. రంగడు ఒక పెద్ద రైతుకు ఏకపుత్రుడు. ఆ తండ్రి ‘పెగ్గిలు’ బ్రతుకులో కొడుకుకు మిగిలిన ఆస్తిపాస్తు లన్నియు వాని శరీరమొకటే. వాని చిన్న యిల్లాలు గంగమ్మ. ఆ ‘గంతకు తగిన బొంత.’ కాని ఆ రెంటిలోను ఎంతో ఒద్దిక, మార్దవము, సామరస్యము గలదు. ఇద్దఱికిని ఆయిద్దఱు తప్ప వెనుక ముందుల వారెవరును లేరు. గడ్డియో, కట్టెలో దొరికినది అడవినుండి మోపుగట్టుకొనివచ్చి వచ్చినంత కమ్ముకొను కూలిపని రంగనిది. ఇరుగుపొరుగువారింట వడ్లో, అటుకులో దంచి నూకలో తవుడో తెచ్చుకొను నాలిపని గంగమ్మది. ఈ యిద్దరి పరస్పర ప్రేమ, పరోపకార బుద్ధి, కవుడులేని నడత, అంతులేని దారిద్ర్యము, విసుగుకొనుటకును వీలులేని కాయకష్టము. ఇరుగుపొరుగువారి నిస్సహాయత, చేతనైన వారి యుదాసీనత, ఈనడుమ గంగమ్మ గర్భము, దోహదము విశ్రాంతి లేక ఆ పిల్ల పడు కష్టములను చూచి చేయున దేమియులేక రంగడు ‘సమాధిగతుండగు యోగిబోలె స్తబ్ధుడై’ యుండుట – వారి భవిష్యత్తును గూర్చి పెద్దగా ధ్వనించు ప్రశ్న – ఇదే ఇందలి వస్తువు. కడపట

చదవండి :  కథానికా, దాని శిల్పమూ - రాచమల్లు రామచంద్రారెడ్డి

‘హృదయమా! మానవుడు నిన్‌ బహిష్కరించె!’
‘చచ్చె నీ లోకమున మనస్సాక్షి యనుచు
నెత్తి నోరిడి కొట్టుకోనిండు నన్ను!’
అని భరతవాక్యము పాడినారు కవిగారు!

కాని ఇంతనిస్సహాయమైన నిర్వేదమునందును కావ్యపు కమనీయత యెంతో యున్నది. దానికి ఆ పెన్నేటి ‘నీటిలో కమ్మదనములూరుచుండును’ అను అంతస్తత్వమును కవిగారు మఱవకుండుటయే కారణము.

“గుండె జలదరింపజేయు రండతనము డుల్చివేయు
ఖండితవాదిని జేయును దండితల్లి సు మ్మీ నది!”

“నిండుమనసు నిజాయతీ – దండిచేయి ధర్మదీక్ష
పండువయసు పట్టుదలా – పండించును గుండెలలో.”

అను నమ్మకము వీరి కావ్య కామనీయకబలమునకు చేయూత. ఇతర సీమలవారికీ గుణములు ఎంతవఱకు ఉన్నవి. ఆదేశాలలో దరిద్రదేవత ఏరీతులలో తాండవించుచున్నది, అను చింత, చర్చ, ప్రకృతవిషయము కాదు. పై గుణములు రాయలసీమవారి కేమాత్రముండినను వారు మరల చేతరించుకోగలరు. ‘సమానానా ముత్తమశ్లోకో అస్తు’ అను వైదిక మంగళాశంస యెట్లున్నను ‘సమానానాం సమాన శ్లోకో అస్తు’ అనుకో గలిగిరేని రాయలసీమవాసులు ఎవరికిని తలవంచ బనిలేదు. ఆ నారు పైరగు కాలము వచ్చినది. పంటగూడ ఎంతో దూరమున లేదు.

శ్రీ విశ్వంగారి వివిధ విస్తృత వాఙ్మయసేవను చవిచూచుచున్న తెలుగువారు ఈ చిన్నికావ్యమునందలి పెద్ద హృదయమునకు తప్పక స్వాగతమిత్తురు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: