కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం
అడపూరు బౌద్దారామం

కడప జిల్లాలో బౌద్ధ పర్యాటకం

బౌద్ధ ప్రదీప కడప

కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నాగనాదేశ్వరుని కొండ నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు– బుద్ధుడి మధుర జ్ఞాపకాలు, భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. కడప జిల్లాను కూడా బౌద్ధ పర్యాటకం లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేయవలసిందిగా జిల్లా ప్రజలు, పర్యాటక ప్రియులు, బౌద్ధ విశ్వాసులు కోరుతున్నారు.

కడప జిల్లాలో వేల సంవత్సరాల పాటు బౌద్ధం వైభవంగా విరాజిల్లింది. అనంతపురం జిల్లాలోని ఎర్రగుడిలోనూ, కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా లోని రాజుల మందగిరిలోనూ దొరికిన క్రీస్తు పూర్వం 274–236 కాలం నాటి అశోక చక్రవర్తి వేయించిన శాసనాల ద్వారా కడప జిల్లా చరిత్ర బోధపడుతుంది. ‘‘చు-లి-య’’ దేశపు రాజధానికి ఆగ్నేయ దిశలో అశోక చక్రవర్తిచే నిర్మించబడిన బౌద్ధ స్థూపం వున్నట్లు చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ పేర్కొన్నాడు. ఈ స్థూపమే కడప జిల్లా ఆడపూరు (నందలూరు) లో వున్న బౌద్ధ స్థూపంగా గుర్తించబడినది.

క్రీస్తు శకం 7లో హ్యూయన్‌త్సాంగ్ తన భారతదేశ పర్యటనలో భాగంగా దక్షిణ భారతదేశానికి విచ్చేసినపుడు, రేనాటి చోళుల రాజ్యం నుంచి కాంచీ పట్టణానికి వెళ్తూ, బౌద్ధ సంఘారామాలను గుర్తించారు. రాజధాని నగరానికి ఆగ్నేయ దిశలో అశోక చక్రవర్తి ఈ బౌద్ధ స్థూపం నిర్మించినట్లు ఆ చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ విశదీకరించారు. కడప జిల్లా ఆడపూరు (నందలూరు) సమీపంలోని బహుదా నదీతీరంలో కొండ మీద వున్న ఆ బౌద్ధ స్థూపాలను 1913లో గుర్తించారు.

1963లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు కొంతమేర తవ్వకాలు చేపట్టినారు. తర్వాత పురావస్తుశాఖవారు 1978–1980 మధ్యకాలంలో తవ్వకాలు జరిపించారు. ఈ తవ్వకాలలో 20 ఎకరాల స్థలంలో రాయలసీమ లోనే ఎక్కడా లేని రీతిలో అపురూపమైన స్థూపం బయల్పడినది. పురావస్తుశాఖ తవ్వకాల ఫలితంగా వెలుగులోకి వచ్చిన కట్టడాలలో చైత్య గృహం, రాళ్లతో నిర్మించబడి సున్నపు పూత కల్గివున్న అనేక వలయాకార స్థూపాలు, సోపానాలు, బుద్ధ పాదం, శాతవాహనులకు సంబంధించిన సుమారు 1600 సీసపు నాణేలు, మృణ్మయ శకలాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బుద్ధ పాదంపై బ్రహ్మీ శాసనం రాయబడివున్నది.

చదవండి :  కడపలో రాజధానితోనే రాయలసీమ సమగ్రాభివృద్ధి

భారత దేశంలో బౌద్ధులు రెండు రకాల స్థూపాలు నిర్మించారు. ఒకటి ‘శారీరక స్థూపాలు’, రెండోవి ‘ఉద్దేశిక స్థూపాలు’. గౌతమ బుద్ధుడి మహానిర్యాణం తర్వాత ఆయన శారీరక అవశేషాలపై నిర్మించి ఆవిష్కరించబడినవే ‘శారీరక స్థూపాలు’. కృష్ణా జిల్లా ఘంటసాలలోనూ, తెలుగు వారికి గర్వకారణమైన అమరావతి లోనూ ‘శారీరక స్థూపాలు’ ఉన్నాయి. ఇక ప్రత్యేక సందర్భాలలో నిర్మించబడిన స్థూపాలు ‘ఉద్దేశిక స్థూపాలు’. నందలూరులోనివి ఉద్దేశిక స్థూపాలు కావడం కడప జిల్లాకు గర్వకారణం.

కడప జిల్లాలో బౌద్ధ సూచక గ్రామాలుగా ఆడపూరు, బూదవాడ, బౌద్ధ సూచక వ్యక్తి నామ గ్రామాలుగా బొజ్జాయిపల్లి వున్నాయి. నందలూరు గుట్టపై బయల్పడిన మహాచైత్యం 156 అడుగుల చుట్టుకొలత కల్గివుండి, 8 అడుగుల ఎత్తు కలిగి, చుట్టూ ప్రదక్షిణా పదం కల్గివున్నది. దీనికి ఒక ప్రక్కన వరుసగా 15 ఉద్దేశిక స్థూపాలున్నాయి. 24×7 అడుగుల గజపృష్టాకార చైత్యము నిర్మించబడింది. స్థూపాలకు సున్నపు గారతో పూత పూయడమైనది. పర్వతంలో వాలుతలంలో తొలిచిన 5 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కల్గివున్న నాలుగు గుహ చైత్యాలు వున్నాయి. గుట్టకు దక్షిణం వైపున ప్రవహిస్తున్న చెయ్యేరు నదిలో స్నానించి, స్థూపం వద్ద ధ్యానమాచరించి, గ్రంథ పఠనం కావించి, గుహలలో బౌద్ధులు జీవనం చేసేవారు.

చదవండి :  మాకూ ఆ అవకాశం కల్పించండి

ఆంధ్రప్రదేశ్ లోనే ప్రధాన ఉద్దేశిక స్థూపాలున్న ఈ బౌద్ధారామాల ప్రాధాన్యతను బట్టి, తవ్వకాలలో బయల్పడిన సామాగ్రి, కట్టడాలు మొదలగు వాటిని బట్టి థీరవాద బౌద్ధానికి చెందిన నందలూరు బౌద్ధ క్షేత్రం క్రీస్తు పూర్వం 3 నుండి క్రీస్తు శకం 11 శతాబ్ది వరకు బహుదా నది సాక్షిగా బ్రహ్మాండంగా వర్ధిల్లిన అపురూపమైన బౌద్ధ క్షేత్రం అని తెలుస్తుంది. చెయ్యేరు ఒడ్డున వున్న నందలూరు మాత్రమే కాక, పెన్నా నదీతీరాన పుష్పగిరి లోనూ, కుందూ చెంతనవున్న పెద్దముడియంలోనూ, ఖాజీపేట మండలంలోని కొండపైన నేలమాళిగలోనూ బౌద్ధ ప్రదీప అవశేష విశేషాలున్నాయి. రాజంపేట మండలంలోని తాళ్ళపాకలోని పాటిగడ్డలో కూడా బౌద్ధ ప్రాభవ అంశాలున్నాయి.

రుద్రమదేవి సామంతుడైన అంబదేవుడు పాలించిన ఆనాటి వల్లభాపురమనే ఈనాటి వల్లూరు మండలంలోని ఆదినిమ్మాయపల్లి పంచాయతీ లోని వేల సంవత్సరాల ఆధ్యాత్మిక సిరి అయిన పుష్పగిరిలో క్రీస్తు శకం 1వ శతాబ్ది నాటి బౌద్ధ స్థూపం వెలుగులోకి వచ్చింది. ఇది ఐదు కోణాలతో పంచాకృతిలో, నక్షత్రాకరంలోని వేదికపై నిర్మించబడింది. ఈ ఐదు కోణాలు బహుశా ‘పంచశీల’కు ప్రతీక కావచ్చు. ఇలా కోణాకృతిలో నిర్మించబడిన నిర్మాణాలు కాలగమనాన్ని గణించే సాధనాలుగా ఉపయోగపడివుంటాయి. నెలలను, చంద్ర గమనాన్ని, ఉత్తరాయణాన్ని, దక్షిణాయణాన్ని లెక్కించే సాధనాలు అలనాటి బౌద్ధ పండితులు రూపొందించి వుంటారు. బౌద్ధుల కాలమాన గణన ఘనమైనది, ప్రశంసనీయమైనది. బౌద్ధుల భవ్యమైన ధార్మిక సంపదతో పాటు విశిష్ట వైజ్ఞానిక విస్తృతికి ఈ కాలమాన గణన సాధన సంపత్తి పెన్నేటి సాక్షిగా పరమోన్నతమైనది.

చదవండి :  'ఇప్పుడు స్పందించకపోతే తాగునీరూ దక్కదు'

క్రీస్తు శకం 1905–-1906 లో జమ్మలమడుగుకు దగ్గరలోని పెద్దముడియంలో పురావస్తుశాఖవారు తవ్విన తవ్వకాలలో క్రీస్తు శకం 1 లేదా -2వ శతాబ్దాలకు చెందిన బౌద్ధ స్థూపం బయల్పడినది. స్థూపం వద్ద మట్టి పాత్రలు, శాతవాహనుల సీసపు నాణేలు, మట్టి బొమ్మలు, పూసలు లభించగా చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలకు తరలించారు. ఇప్పటికీ పెద్దముడియం గ్రామంలో దక్షిణం వైపున అర్ధ కిలోమీటర్ పరిధిలో శిథిలమైన స్థూపాలు కుందూ నది సాక్షిగా సాక్షాత్కరమిస్తాయి. కడప కర్నూలు ప్రధాన రహదారిపై వున్న ఖాజీపేట మండలంలోని కొండపైన వెలసిన శ్రీ నాగనాదేశ్వర కోనకు కుడివైపున వున్న నేలమాళిగ క్రీస్తు శకం 2-, 3 శతాబ్దాల పురాతత్వ వారసత్వ గీతిక. ఈ ప్రాంతంలో శాతవాహనుల కాలంలో బుద్ధుడి త్రిశరణాలు, పంచశీల, భిక్షువుల పఠన ఘోషతో కొండలు, గుట్టలు ప్రతిధ్వనించాయి. బౌద్ధుల విహారాలు, బౌద్ధ ఉద్దేశిక స్థూపాలు, ఏకాంత ధ్యానానికి నెలవైన నేలమాళిగ నిర్మాణాల శిథిలాలు వున్నాయిఇక్కడ. నేలమాళిగ వద్ద శిథిలావస్థలో వున్న బుద్ధ భగవానుడి పాదాలు చాలా పెద్దవి. ఇంతవరకు బయల్పడిన పాదాలలో ఇవే చాలా పెద్దవిగా వున్న గౌతముడి పాదాలు. కడప జిల్లాలో నందలూరు, పాటిగడ్డ, పుష్పగిరి, పెద్దముడియం, నేలమాళిగలోని బౌద్ధ స్థూపాలు బుద్ధుడి మధుర జ్ఞాపకాలు, భావితరాలకు నిత్య స్ఫూర్తి దీపికలు. కడప జిల్లాను కూడా ‘బౌద్ధ పర్యాటకం’లో భాగం చేసి, ఇక్కడి బౌద్ధ ప్రదేశాలను అభివృద్ధి చేయవలసిందిగా జిల్లా ప్రజలు, పర్యాటక ప్రియులు, బౌద్ధ విశ్వాసులు కోరుతున్నారు.

– మొగిలిచెండు సురేశ్

(ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎడిట్ పేజీ, 5 జనవరి 2018)

ఇదీ చదవండి!

నీటిమూటలేనా?

కడప జిల్లాకు చంద్రబాబు హామీలు

వివిధ సందర్భాలలో తెదేపా అధినేత చంద్రబాబు కడప జిల్లాకు గుప్పించిన హామీలు… తేదీ: 30 అక్టోబర్ 2018, సందర్భం: ముఖ్యమంత్రి హోదాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: