మా నాయన సన్న పిల్లోడు (కథ) – బత్తుల ప్రసాద్

మా నాయన నిజ్జంగా సన్నపిల్లోడే! లేకపోతే కుక్క కర్సిందని – నాయనా! పెద్దక్క కు శెప్పినావా నడిపోనికి శెప్పినావా శిన్నోనికి శెప్పినావా అని బోరుబోరున ఏడుచ్చాండంట.

మా నాయన పిరికోడేంగాదు మిల్టరీకి పోయి రెండో ప్రపంచయుద్ధంలో పనిచేసి వచ్చినాడు.

ఒకసారి మా బరుగొడ్డు సగిలేటి వాగులో కొట్టుకోని పోతాంటే తలుగు తీసుకుని పోయి దాని మెడకు ఏసి లాక్కోని వచ్చినాడు. మిలట్రీ నుంచి రిటైర్‌ అయి వచ్చినాంక వీవింగ్‌ట్రైనింగ్‌ చేసి వచ్చి వీవింగ్‌ టీచరుగా పనిజేసి రిటైర్‌ అయి నాడు. రిటైర్‌ అయిగూడ ఇరవై అయిదు సంవత్సరాలయింది. మా నాయన రేడియో పుట్టకముందు పుట్టిండు. సెల్‌ఫోన్‌లు శాటిలైట్లను చూసిండు, సెల్‌ఫోన్‌లో కాశ్మీరులో ఉండే మాయన్నతో మాట్లాడ్తాంటడు. అయిదు వందల మైళ్ల దూరంలో ఉండే నాతో గూడా ఫోన్‌లో మాట్లాడు తుంటాడు.

ఇన్ని జూసిన మా నాయన వయసు ఎనిమిది పదులు దాటి ఆరేండ్లు, మాయన్న కట్టిచ్చిన మిద్దె ముందు కూచ్చోని ఎవరన్నా తెలిసినోల్లు ఆ దావన పోతావుంటే పలక రిచ్చి మాట్లాడ్తాంటడు. అప్పుడప్పుడు మద్దె లో శెతురు మాటలెచ్చాంటడు. ఈన్నిండి ఆడిదాకా మాదే అని శెప్లాంటడు.

మా నాయన మిల్టరీకి పోయినప్పుడు ఉర్లగడ్డ కూరపెడితే అదిజూసి పక్కనే ఉన్నవాళ్ళ బావతో ‘ఏంది బావా ఈల్లు గెంచుగడ్డలతో కూర బో కమ్మగ జేసిండ్రు’ అన్నెడంట. ఉప్మా పెడితే ‘కోడిగుడ్డు జన చూడు ఎంత పెట్టిండ్రో’ అన్నెడంట.

అట్టనే ఒకసారి మిల్టరీలో ఉండగా వాళ్ళమ్మను సూడాలని మనసు పీకిందట. అప్పుడే మీ శిన్నమ్మ సచ్చిపోయిందని ఇంటికాన్నుండి టెలిగ్రామ్‌ వచ్చే, ఇదే సందు అని శిన్నపిల్లోని మాదిరి ఏడుచ్చాంటే ఓ మలయాళ పాయన ‘ఎందుకు ఏడుచ్చాండవు’ అనడిగితే ఇట్ట ‘మా శిన్నమ్మ సచ్చిపోయింది సార్‌నేను ఊరికి పోవాల’ అని చెపితే, ‘నీ పాసుగూల శిన్నమ్మ సచ్చిపోయిందని గాదు మీయమ్మ సచ్చిపోయిందని చెప్తే సెలవు ఇచ్చరు’ అని చెపితే అమ్మను సూడచ్చు అని అపద్దం చెప్పి సెలవు తీసుకొని ఇంటికి వచ్చి సన్నపిల్లోని మాదిరి వాళ్ళమ్మను కర్సుకొని ఏడ్సినాడంట.

పెండ్లయి తొమ్మిదిమంది పిల్లోల్లకు తండ్రి అయిన అయినంక గూడా మా నాయన మాయమ్మకుసన్నపిల్లోడే. సాలీసాలని జీతం. అది కూడా మూడు నెలలకో నాలుగు నెలలకో వచ్చది. మాయమ్మ పొలం పనులకు పొయ్యొచ్చి ఆ గింజలతో బువ్వొండినా, సంగటి జేసినా మా నాయనకు కడుపునిండా పెడ్తది. ఎందుకంటే తక్కువ పెడ్తే సన్నపిల్లోని మాదిరి అలుగుతాడని.

చదవండి :  కథకుల సందడితో పులకరించిన నందలూరు !

సంపాదన సరింగలేదే, ఒక జీతగాన్నే, ఆస్తిపాస్తులు అసలుకే లేవే ఎట్ట సాకాలబ్బా అనే ఆలోశనే లేకుండా తొమ్మిదిమంది పిల్లోళ్ళను కన్నాడు. ఆ మనిషిని సన్నపి ల్లోడు అనక ఏమనాల.గిన్నెనిండా బువ్వబెట్టి దానికి సాలేమయిన కూరాకు ఏచ్చే, గిన్నెలోదంతా తిని ఆకర్న కూరాకులో ఉప్పు తక్కువయింది అని చెపితే… ‘అదేదో నోట్లో ముద్ద పెట్టుకున్నెప్పుడే శెప్పచ్చుగదా’ అని మాయమ్మ తిడతావుంటే సన్నపిల్లోని మాదిరిగా నవ్వుతాడు మా నాయన.

ఒకసారి మేము ఇండ్లు మారినాక ఎవురో తెలిసినవాళ్లు మా నాయనకు సారాయి తాపితే, ఇంటి బయట నులకమంచం మీద పండుకొని ఆకాశం తిట్టు సూచ్చా బీడీ కాల్సుకుంటా, మిల్టరీలో ఉన్నెప్పుడు చూసిన హిందీ సినిమాలో పాట ‘ఓ చాందనీ’ అని పాడ్తాంటే మా శంద్రక్క ”ఏందీ నాయనా ఈదిలో పండుకొని పాటలు పాడ్తాండవు” అనంటే వసారలో మంచమేసుకొని పండుకొని పాడ్డం తిరుక్కుండె. మాయక్క ఊరుకోకుండా ”ఏంది నాయనా ఇంట్లో సినిమా పాటలు పాడతాండవు” అనంటే ”ఏందమ్మా ఈదిలో పాడితే వద్దంటివి, ఇంట్లో పాడితే వద్దంటివి ఇంగ నన్ను మిట్టకుపోయి పాడమంటవా” అని సన్నపిల్లోని మాదిరి గోము జేసినాడు.

పిల్లోల్లకు పిల్లోల్లయినారు. పెన్షన్‌కు పోయి వచ్చా అరటిపండ్లు తీసుకొని వచ్చి మొగపిల్లోల్ల పిల్లోళ్ళకు ఒక్కో అరటిపండిచ్చి ఆడపిల్లల పిల్లోళ్ళకు సగం సగం తుంచి ఇచ్చే మా నాయన సన్నపిల్లోడే.

నేను ఒకసారి మా ఇంటికాడుంటే శివాలయంకాడ కూచ్చోనుంటే ఒక సాధువు ఆడికి వచ్చినాడు. నన్ను బీడీకట్ట కొనియ్యమంటే కట్టబీడీలు కొనిచ్చిన. ఆయన నన్ను కూచ్చోపెట్టుకుని మాట్లాడతా వుంటే ‘నువ్వు సాధువు ఎందుకయినావు’ అనడిగినాను. అప్పుడాయన మనిషి జీవితం గురించి ఓ తత్వం జెప్పినాడు.

మనల్ని పుట్టిచ్చిన దేవుడు, ఈ సృష్టిని పుట్టించిన భగవంతుడు మనిషికి, గుర్రానికి, గాడిదకు, కుక్కకు ఒక్కొక్కరికి ఇరవై ఏండ్లు ఆయుస్సు ఇచ్చినాడు. మనిషికి మాట, ఆలోచన ఇచ్చినాడు గాబట్టి ఉదరా బదరా మనిషి దేవునికాడికి పోయ్యి ‘ఏమయ్యా దేవుడా మాకు మాట ఇచ్చివి, ఆలోచనా ఇచ్చివి. ఆయుస్సు మాత్రం ఇంత తక్కువగా గుర్రం, గాడిద, కుక్కలైన్నే ఇచ్చివి. ఇదేమన్నా న్యాయమా అని అడిగితే సరేపోండ్రా గుర్రం, గాడిద, కుక్కల ఆయుస్సు గూడా కలుపుకొని బతుకుపోండి అని చెప్పినాడంట.

చదవండి :  కడుపాత్రం (కథ) - తవ్వా ఓబుల్‌రెడ్డి

మనిషి మనిషిగా తనకోసం బతికేది ఇరవై ఏండ్లే, మరో ఇరవైఏండ్లు గుర్రంది కాబట్టి గుర్రంలాగానలభై ఏండ్ల దాకా ఉరుకుతాడు. అప్పటికల్లా పిల్లోల్లు ఎదిగుతారు ఆన్నిండి పెండ్లిజెయ్యాల, పిల్లోన్ని బాగా సదివియ్యాల అనుకుంటాడు. నలభై నుండి అరవై వరకు గాడిద మాదిరి ఈ బాధ్యతలన్నీ వెూచ్చాడు.

ఇంగ అరవై నుండి ఎనభై వరకు యాడికి తిరగలేడు కాబట్టి ఇంటికాడ బయట అరుగుమింద కూచ్చోని ఉంటాడు. కొడుకు కోడలు సినిమాకో, శికారుకో పోతా నాయనా ఇండ్లు జాగ్రత్త అని కాపలాపెట్టి పోతారు. అట్ట ఎనభై ఏండ్లు మనిషి బతుకుతాడు అని సెప్పినాడు. మరి నూరేండ్లు బతుకు అని చెపుతారు కదా అని అడుగుదామనుకునేలోపు మా నాయన నన్ను పిల్సడం అది ఇనపడి ‘మల్లా వచ్చ సాదయ్యా’ అని చెప్పి ఉరుకుతాపోతి. ఎనభై ఎండ్ల తరువాత మనిషి బతుకు ఎట్టుంటది అని అడుగుదామనుకుంటి, ఆ సాదయ్య మళ్ళీ కనపడకపాయ. నాకు అది డౌటుగానే ఉండిపాయ.

మా నాయనకు ఎనభై దాటినంక నా డౌటు ఒక్కొక్కరవ్వ కరిగిపోతావుంది. ఎందుకంటే మా నాయనకు ఎనభై రాకముందే మాయమ్మ సచ్చిపాయ. అప్పుడ్నుండి మా నాయన మా అందరికీ సన్నబిల్లోడు అయిపోయినాడు. మేము శిన్నపిల్లలప్పుడు మా నాయన ఏదన్నా ఊరికిపోతే అరిటికాయలో, శెరుకులో తెచ్చి మాకు ఇచ్చాన్నెడు. మేము ఏడుచ్చే ఓదారుచ్చాండె. మాకు కొత్త గుడ్డలు కుట్టించ్చాన్నెడు.

ఇప్పుడు ఆయన్ని మేము మా నాయనకు శేచ్చావుంటే మా నాయన సన్నపిల్లోడయిపోతడు. మా శిన్నతనాన మా నాయన మాకు ఏదన్నా కొనిచ్చే దాన్ని జూసి ఎట్ట సంబరపడితివెూ మా నాయన గూడా అట్ట సంబరపడతాండాడు. మా కండ్లకు శత్వారమొచ్చి అద్దాలు పెట్టుకుంటాండం గాని మా నాయన కండ్లు సన్నపిల్లోళ్ళ మాదిరిగానే ఉండాయి.

మాయమ్మ సావు బతుకుల మీద పోరుమామిళ్ళ ఆసుపత్రికి పోతా వాకిట్లో నిలబడుకోనున్నె మా నాయన తిట్టు జూసి పోయొచ్చ అని శెయ్యి ఊపి పోయి, ఆన్నుండి తిరుపతి ఆసుపత్రికి పోయి కట్టెగా తిరిగివచ్చె, మాయమ్మ తిట్టు జూసి పొయ్యొచ్చా అనిజెప్పి

కట్టెగా తిరిగొచ్చినావే, అపద్దం ఆడి నన్ను వెూసం జేసినావే అని సన్నపిల్లోని మాదిరే ఏడ్సినాడు.

చదవండి :  సూతకం (కథ) - తవ్వా ఓబుల్‌రెడ్డి

మాయమ్మ పోయినంక ఇంటికాడ అప్పుడిదాంక మాయమ్మ ఎనకాల,అంటే మాయమ్మ సంసారం నడుపుతాంటే గమ్మునున్నె మా నాయన మాయమ్మ పోతానే ‘ఇంత సంసారం మీయమ్మ ఎట్ట నడుపుతాన్నెది’ అని శిన్నపిల్లోని మాదిరి ఆశ్చర్యపోయినాడు.

ఇంటికి పెద్దోడై పుట్టినందుకు మాపెద్దన్న హైదరాబాద్‌లో మంచి జీతమున్న ఉద్యోగం వదులుకొని మా నాయన్ను సన్నపిల్లోని మాదిరి చూసుకోవడానికి ఊరికొచ్చి చేరినాడు.

మా నాయన ఇంటిముందు గూకొని నా రెండో కొడుకు మిలట్రీలో ఆపీసర్‌ అని చెపుతాంటడు. ఉద్యోగం వదులుకొని తనకోసం వచ్చిన పెద్ద కొడుకు గురించి చెప్పకుండా. అంత ఆలోచనా గూడా లేదు మానాయనకు సన్నపిల్లోని మాదిరి.

తొమ్మిదిమంది సంతానమయినా ఒక్కర్ని గూడా ఆస్టల్లో బెయ్యలేదు, ఉన్నదాంట్లోనే ప్రేమగా మాయమ్మ మా నాయన పెంచినారు. టౌన్‌లో మాదిరి పిల్లోల్లను హాస్టల్లో ఏసి సదివిచ్చేవాళ్ళు పెద్ద సదువులు సదువుకొని వేరే దేశాలకు ఎల్లిపోతా అమ్మ నాయన్ను వృద్దాశ్రమం హాస్టల్లో ఏచ్చారు. అట్ట ఆలోశించకుండా అమ్మ ప్రేమను, నాయన ప్రేమను మేము శిన్నపిల్లోల్లప్పుడు పూర్తిగా పొందినాము, అందుకే ఇప్పుడు మా నాయన మాకు సన్నపిల్లోడు.

నా శిన్నతనంలో మా పెద్దన్నకు కుక్కగరిచ్చే మాయమ్మ ఏడుచ్చావుంటే ‘ఏమిగాదులే’ అని మా నాయన మాయమ్మతో అంటా మాయన్న చెయ్యిపట్టుకొని ఆసుపత్రికి పిల్సకపోడం నాకు ఇంగా కండ్లముందు కదలాడ్తానే ఉంది.

ఇప్పుడు నేను హైదరాబాద్‌ నుండి మా నాయనకు ఫోన్‌ జేసి, ‘అన్నా నాయనకు కుక్క కరిసిందంటనే’ అని అడిగితే ‘అవునురా కుక్క కరిసింది నాయన ఏడ్సినాడు, భూషణమయ్య కాడికి తీసకపోయి సూదేపిచ్చలే అని అంటాండడు’ మాయన్న. నాకు అప్పుడని పించింది. అప్పుడు సన్నపిల్లోడుగా వున్న మాయన్న ఇప్పుడు పెద్దోడయినాడు (మా నాయన మాదిరి).

అప్పుడు పెద్దోడయిన మా నాయన ఇప్పుడు సన్న పిల్లోడయినాడు (మాయన్న మాదిరి). మా నాయనకు కుక్క కర్సిందని ఏడ్సే నేను (మాయమ్మ మాదిరి). మా నాయన్ను కరిసిన కుక్కకాలం. మాపెద్ద తమ్ముననని చిన్న కొడుకు బాజిగాని మాదిరి తొర్రి నోరేసుకుని నవ్వుతాన్నట్టు మా నాయన నాకు అగపడ్తాన్నెడు.

అట్టాటి మానాయన ‘నేను పోతే నా పేరు మొత్తం ఏడుచ్చారే’ అనే దాసే లేకుండా సన్నపిల్లోని మాదిరి పానమిడ్సి ఎల్లబారినాడు ఇంగ ఎప్పుడూ అగపడకుండా….!

“ఆంధ్రప్రభ” సౌజన్యంతో..!

ఇదీ చదవండి!

Yangamuni Vyavasayam

యంగముని వ్యవసాయం (కథ) – ఎన్. రామచంద్ర

యంగమునివ్యవసాయంకథ మోచేతులు దాటి ఖాకీ చొక్కా, మోకాలు దాటి ఖాకీ నిక్కరు, గడ్డపార భుజాన ఒకవైపు పికాసి, మరోవైపు చెట్లడ్డ, …

6 వ్యాఖ్యలు

  1. నా కథను పునఃప్రచురించిన ‘ కడప డాట్ ఇన్ఫో ‘ వారికి నా వందనాలు.

    • అరవింద్ కుమార్ కొల్లి

      కాస్త నీ contact నెంబర్ చెప్పు నాయనా …………. మనం గతం లో కలిసి పనిచేసాము ………………………………

  2. sagileru.com తప్పకా చూడండి

  3. manassuku hattukuneTTu raasaaru prasad gaaru…mukhyam gaa maandaleekam…abhutam gaa undi

  4. katha chadivi coment pettina jaya gariki na namaskaraalu

  5. Prasadgaru… Katha chaala bagundi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: