ముత్తులూరుపాడు

ముత్తులూరుపాడు రాముని దేవళం

ముత్తులూరుపాడు (ఆంగ్లం : Muttulurupadu or Muthulurupadu) – కడప జిల్లా ఖాజీపేట మండలంలోని ఒక ఊరు. ఈ ఊరు ఖాజీపేట, మైదుకూరుల నడుమ చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి పై నుండి 2 కి.మీల దూరంలో ఉంది. స్థానికులు ఈ ఊరి పేరును ‘ముత్తులపాడు’ లేదా ‘ముత్తులుపాడు’ అని కూడా వ్యవహరిస్తుంటారు.

ఊర్లో పోస్టాఫీసు, రెండు మండల పరిషత్ ప్రాధమిక పాఠశాలలు, పశువైద్యశాల ఉన్నాయి. ముత్తులూరుపాడులో వివిధ కులాలకు, మతాలకు చెందిన ప్రజలు కలిసిమెలిసి   జీవిస్తున్నారు. ముత్తులూరుపాడు భూమాయపల్లి గ్రామ పంచాయితీలో భాగంగా ఉంది.

ముత్తులూరుపాడు గ్రామానికి వెయ్యేళ్ళకుపైగా చరిత్ర ఉన్నట్లుగా చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది.

చరిత్ర 

ముత్తులూరుపాడు శివుడు
ముత్తులూరుపాడు శివాలయం

ముత్తులూరుపాడు ముందుగా ఒక అగ్రహారంగా ఉండేది. ఖాజీపేట సమీపంలోని నాగేశుని కొండపై ఆశ్రమం నిర్మించుకుని మరికొందరు తపష్యులతో కలిసి ఆశ్రమవాసం చేస్తున్న భరద్వాజవర్యులకు విజయనగర చక్రవర్తి బుక్కరాయలు ఈ ప్రదేశాన్ని అగ్రహారంగా ఇచ్చారు. భరద్వాజవర్యులు ప్రస్తుతం గ్రామమమున్న ప్రదేశానికి తూర్పున మూడు గంగమూర్తులను యంత్రోద్దారకంగా ప్రతిష్ట చేశారు. అందువల్ల ఆ ప్రదేశానికి ‘గంగమూర్తుల అగ్రహారం‘ అనే పేరు వచ్చింది.

కాలక్రమంలో ఇది గంగలముత్తులూరు అయింది. ఇందుకు ఆ ఊరి శివాలయం వద్ద దొరికిన శాసనం (శాలివాహన శక సంవత్సరం 1287 (క్రీ.శ. 1365) నాటిది) రుజువుగా నిలుస్తోంది. భరద్వాజవర్యులు పడమర, ఉత్తర దిశల్లో చెరువులు తవ్వించాడు. అగ్రహార ప్రాంతంలో చెన్నకేశవ, ఆంజనేయ ఆలయాలను నిర్మించారు.

శాసనం

ముత్తులూరుపాడు
శివాలయం ముఖద్వారం వద్ద వెలుపల ఉన్న శాసనం

“స్వస్తిశ్రీ శకవర్షంబులు 1287 అగు నేటి ప్లవంగ సంవత్సర అధిక ఆషాఢ శు. ద్వాదశి గురువారం శ్రీ మన్ మహామండలేశ్వర శ్రీ వీరబుక్కరాయలు పృధ్వీరాజ్యం చేయంగాను గంగల ముత్తలూరి చెన్న జియ్యల, మల్క జియ్యల ప్రజ్ఞా విరవినుగ జియ్య కొడుకు తకజియ్యలకు గంగల ముత్తలూరి మూలస్థానం మల్లికార్జునదేవర, భోగనాథ దేవరకును వృత్తి క్రయము ఇచ్చెను. ఆచంద్రార్కంగాను ఇచ్చెను. మంగళం మహాశ్రీశ్రీ .”

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 2000
ముత్తులూరుపాడు
శాసన నమోదు

( ఈ శాసనాన్ని 2010లో గుర్తించిన తెలుగుసమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి (బక్కాయపల్లె*) తమ సంస్థ ప్రతినిధులైన ధర్మిశెట్టి రమణ, అరబోలు వీరాస్వామి, సందిళ్ళ బాలసుబ్బయ్యలతో కలిసి కేంద్ర పురావస్తు సర్వేక్షణ అధికారుల ద్వారా ఈ శాసనాన్ని పురావస్తు శాఖ రికార్డులలో నమోదు చేయించారు. )

భరద్వాజవర్యులు తన అగ్రహార పరిధిలోని మాన్యాలను తన తదనంతరం శిష్యులకు ఇస్తూ తామ్రశాసనం వేయించారు. భరద్వాజవర్యుల సమాధి గ్రామానికి తూర్పున నిర్మించబడింది. అందుకు గుర్తుగా పొడవైన రాతి స్థూపం పాతబడింది.

విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత ఈప్రాంతం పాలెగాళ్ళ వశమై పోయింది. పాలెగాళ్ళు అగ్రహారంపై పడి అరాచకాలుచేయడంతో అగ్రహారీకులు నెల్లూరు జిల్లా ‘జలదంకి’ సమీపంలోని ‘బ్రాహ్మణక్రాక’ గ్రామానికి వెళ్లి స్థిరపడ్డారు. వారి వంశీకుల వద్ద రెండు వందల ఏళ్ళ కిందటివరకు ఈ అగ్రహారానికి సంబంధించిన రాగిరేకు శాసనాలు ఉండేవని బ్రిటీషు రికార్డుల్లో పేర్కొన్నారు.

ముత్తులూరుపాడు
ముత్తులూరుపాడు శివాలయంలోని నందీశ్వరుడు

ఆ తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీల తరపున గండికోట వ్యవహర్త గా ఉండిన పొదిలే లింగప్ప అగ్రహారాన్ని పునరుద్ధరించే ప్రయత్నం చేశారు. నెరియనూరి వెంకటదీక్షితులు, నెరియనూరి కొండుభట్లు, ఆలికొండ రామాభట్లు, అవధానం నాగంభట్లు అనే వారికి గంగమూర్తుల అగ్రహారాన్ని మాన్యంగా ఇచ్చారు. మొగల్ నవాబుల, కడప మయానా నవాబుల కాలంలో కూడా ఈ ప్రదేశం అగ్రహారంగా కొనసాగింది. ఆ తర్వాత ముత్తులూరుగా పిలువబడి పాలెగాళ్ళ దౌర్జన్యాలతో గ్రామం పాడైపోయింది.

చదవండి :  నంద్యాలంపేట
ముత్తులూరుపాడు
ముత్తులూరుపాడు పార్వతీదేవి

టిప్పుసుల్తాన్ పాలనాకాలంలో తిప్పిరెడ్డిపల్లె , ముదిరెడ్డిపల్లె పాలెగత్తె ‘వొన్నూరమ్మ’ (ఈమెను హొన్నూరమ్మ అని కూడా పిలుస్తారు.) ఈ ఊరు పైబడి గ్రామాన్ని దోచుకువెళ్ళింది . తర్వాత కొన్నాళ్ళకు కొందరు రైతులు ఇక్కడ ఇళ్ళు వేసుకుని బురుజు నిర్మించుకుని నివశించడంతో ‘ముత్తులూరుపాడు’ గా పేరు నిలిచిపోయింది.

దగ్గర్లోని పల్లెటూల్లు :

ముత్తులూరుపాడు ఏర్పడిన కొంత కాలానికి అన్నలూరు నుండి భూమయ్య అని పిలువబడే ‘భూమిరెడ్డి’ అనే పోకనాటి రెడ్డికులస్తుడు ముత్తులూరుపాడు గ్రామానికి తూర్పున ఒక కిలోమీటరు దూరంలో తన బంధువులతో కలిసి వూరు కట్టుకున్నాడు. అదే నేటి ‘భూమయపల్లె’.

అలాగే కడప నవాబు అబ్దుల్ నబీఖాన్ పాలనాకాలంలో ముత్తులూరిపాడుకు నైరుతి దిక్కున ఒక కిలోమీటరు దూరంలో ‘మూల చెన్నప్ప‘ అనే రెడ్డి కులస్తుడు ఒక పల్లె కట్టించాడు. అదే నేటి మూలవారిపల్లె.

ఈ ముత్తులూరుపాడు గ్రామానికి ఉత్తర వాయువ్య దిశలో ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ‘పత్తి బక్కయ్య’ అనే పెడకంటి రెడ్డికులస్తుడు పల్లె కట్టించడంతో అది ‘బక్కాయపల్లె’ అని పిలువబడుతోంది.

బక్కాయపల్లెకు ఉత్తరదిశలో అతిసమీపంలో ‘గంగిరెడ్డి తిప్పయ్య’ అనే పెడకంటి రెడ్డికులస్తుడు పల్లె కట్టించడంతో అది ‘తిప్పాయపల్లె‘ గా పిలుస్తున్నారు.

బక్కాయపల్లెకు తూర్పు ఆగ్నేయంగా ‘కొండ ఓబాయపల్లె ‘ అనే వూరు కూడా ఉండేదని చారిత్రక ఆధారాలవల్ల తెలుస్తోంది. కొండ ఓబాయపల్లె నూటా యాభై ఏళ్ళ కిందట పాడుబడి పోయింది. ఆప్రదేశంలోని చేలను ‘కొండ ఓబయ చేలు’ అని పిలుస్తారు.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1976

పండే పంటలు

ముత్తులూరుపాడు పొలంలో అప్పట్లో రాగులు, ఆరికెలు, శనగలు , గోధుములు, ఆముదాలు , కందులు, పెసలు, సోద్దలు, ఎర్రగడ్డలు, పత్తి, పొగాకు, నీలిమందు, జిలకర, గోగులు పండించేవారు.

ఇప్పుడు వరి, శనిక్కాయ (వేరుశనగ), కూరగాయలు,  జొన్నలు, మొక్కజొన్నలు మొదలైనవి కూడా ముత్తులూరుపాడులో పండిస్తున్నారు.

వనాలు 

ముత్తులూరుపాడు ఈశాన్యంలో గంగలమ్మవనం, బుచ్చిరెడ్డివనం, పడమరన కేశవరెడ్డివనం, రఘునాథభట్లు వనం, భూమయపల్లెకు పడమరన కేతకివనం అనేవి ఉండేవి.

దేవాలయాలు లేదా దేవళాలు :

  • శివాలయం, రామాలయం, గంగమ్మ దేవళం, చెన్నకేశవాలయం, కోతి సమాధి, చర్చి
ముత్తులూరుపాడు
ముత్తులూరుపాడు గంగమ్మ దేవళం

తిరునాళ్ళు / జాతర్లు :

ముత్తులూరుపాడు
కనుమ నాడు ఊరేగుతున్న ముత్తులూరుపాడు శివయ్య

యాభై ఏళ్ళ కిందటి వరకు గ్రామంలో ‘గంగమ్మ తిరునాల ‘ వైభవంగా జరిగేది. చుట్టుపక్కల గ్రామాలవారే కాకుండా దూర ప్రాంతాలనుండి కూడా తిరుణాలకు బండ్లు కట్టుకుని జనం వచ్చేవారు.

అలాగే గ్రామంలోని కోతి సమాధి వద్ద ప్రతియేటా కోతి తిరుణాల కూడా ఘనంగా జరిగేది. ఎద్దుల పందేలు నిర్వహించి డ్రామాలు వేసేవారు.

గ్రామ శివాలయం నుండి ప్రతియేటా సంక్రాంతి కనుమ నాడు శివుడు పక్కగ్రామాలకు ఊరేగింపునకు బయలుదేరతాడు. శివాలయానికి వందలాది ఎకరాల ‘శివుని మాన్యం’ కూడా ఉండేది.

శ్రీరామనవమికి రాముడు ఊరేగుతాడు.

పిన్ కోడ్ : 516203

ముత్తులూరుపాడుకు ఎలా వెళ్ళాలి ?

మైదుకూరు, ఖాజీపేటల నుండి ముత్తులూరుపాడుకు షేర్ ఆటోలు వెళుతుంటాయి.

దగ్గరి బస్ స్టేషన్ : మైదుకూరు (10 KM)

దగ్గరి రైల్వే స్టేషన్ : కడప (32 KM)

దగ్గరి విమానాశ్రయం : కడప (27 KM)

  • – తవ్వా ఓబుల్‌రెడ్డి

ఇదీ చదవండి!

పెద్దపసుపుల - దానవులపాడు

పెద్దపసుపుల – దానవులపాడు (కురుమరి) పొలిమేర కొట్లాట

దండనాయకుడిని హతమార్చిన పెద్దపసుపుల ప్రజలు పశ్చిమ చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజు కళ్యాణీ పట్టణాన్నిరాజధానిగా చేసుకుని గండికోటసీమతో సహా పాలన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: