యోగిపుంగవులు “జ్యోతి” శ్రీ కాశిరెడ్డి నాయన !

శ్రేష్టమైన సద్గురు పరంపరలో భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ దీన జనసేవ, గోసేవ, శిథిలమైన దేవాలయాల జీర్ణోద్ధరణ చేస్తూ ఆజన్మాంతం ఆధ్యాత్మిక మార్గమే శరణ్యమని ఆచరణలో చూపిన మహనీయుడు కాశిరెడ్డి నాయన. నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా బెడుసుపల్లి గ్రామంలోని మునెల్లి వంశంలో మునెల్లి సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకు రెండవ సంతానంగా జన్మించిన పుణ్యమూర్తి కాశరెడ్డి నాయన. అమావాస్యనాడు అర్ధరాత్రివేళ జన్మించిన కాశినాయన ప్రజలను అజ్ఞానాంధకారంనుంచి జ్ఞానమార్గం వైపు మళ్లించిన ఒక దివ్య జ్యోతి నృసింహాపాసకులు.

పువ్వు పుట్టగానే పరిమళించినట్టు కాశినాయన జన్మతః మహత్తర సందేశములను తన నడవడిలో, నిగూఢంగా ప్రదర్శించేవారు. ఒకరోజు తల్లి పొలంపనులకు వెళ్లినపుడు కాశీనాయనను ఎత్తుకునిపోయి ఒక చెట్టు కింద పరుండబెట్టి కూలీలకు అన్నం పెట్టడానికి వెళ్లింది. ఆ సమయంలో సమీపంలోవున్న ఒక పుట్టలోనుంచి నాగుపాము వచ్చి ఆ బాలుడి ముఖంపై ఎండపడకుండా పడగవిప్పి నీడ పట్టిందట. భర్త మరణించాక కాశమ్మ బెడుసుపల్లినుంచి పుట్టినిల్లయిన కొత్తపల్లికి చేరింది. కొలిదిరోజులకే కాశమ్మ మృతి చెందగా అవ్వయైన బాలమ్మ తన మనుమని సకల శాస్త్ర పారంగతుడైన వేమూరి రంగయ్య వద్ద చదివించింది. 16 ఏళ్ల వయసులో నాయనగారు చదువుకు స్వస్తిచెప్పి మేనమామ గారికి వ్యవసాయ పనుల్లో తోడ్పడేవాడు. ఆ రోజులలో లింగాల దొన, ఘటిక సిద్దేశ్వర ప్రాంతాలనుంచి గడ్డి తెచ్చేవాడు. కొండ దిగి రాగానే లింగాల దొనలోనున్న వేప చెట్టుకింద గడ్డిమోపు దించి కొంతసేపు సేద తీరేవాడు. కాశినాయనకు లింగాలదొనలోని వేపచెట్టుకింద మానసిక పరివర్తన ఆధ్యాత్మికతత్వం వెల్లివిరిసాయి. తర్వాత నాయన కోరికపై వేప చెట్టుకింద అరుగు నిర్మించారు.

చదవండి :  సహృదయ శిరోమణి డాక్టర్ బాలశౌరిరెడ్డి

కాశినాయనకు 20 ఏళ్లు వయసులో పెళ్లి చేయాలని అవ్వ సంకల్పించినా ఆ బంధాలనుంచి బయటపడ్డాడు. మనం ఎంత జ్ఞాన సంపన్నులమైనా మనకంటూ గురువు వుండాలన్న భావన వ్యక్తం చేసారు. కొంతా వీర రాఘవరెడ్డి సూచన మేరకు గోవుల నాగయ్యతో కలిసి ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామంలోనున్న శ్రీశ్రీశ్రీ అతిరాచ గురవయ్య స్వామి వద్ద శిష్యుడిగా చేరారు. గురువుగారి ఆజ్ఞననుసరించి కాశీనాయన 3 ఏళ్లు కాశీలో ఒక పేదవాని ఇంటనున్నారు. అతిరాచ గురవయ్య తన వద్దనున్న యోగ దండము, కమండలం, రుద్రాక్ష మాలను తన వారసుడైన కాశిరెడ్డికి అందచేయమని తన అల్లుడైన అనంతగురవయ్యకు చెప్పి 8-5-1968లో సమాధిస్థితిలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత నాయనగారు రుద్రాక్ష మాలను మాత్రమే తీసుకుని యోగదండము, కమండాలను గురువుగారి సమాధి చెంతనే వుంచమన్నారు. కంచి పరమాచార్యులు తన గురువుగారి ఆరాధనకు భక్తులు పంపిన ధనం వుపయోగించారు. నాయనగారు ఈ సాంప్రదాయాన్ననుసరించి భిక్షాటన చేయించి నంద్యాలలో ఆరుల గంగమ్మ ఇంట మూడవ ఆరాధనోత్సవాలు నిర్వహించారు. ఆళ్లగడ్డ సమీపంలో నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన గరుడాద్రి కేంద్ర బిందువుగా 35 చకిమీ నల్లమల అడవి పుణ్యక్షేత్రమని కాశినాయన పేర్కొన్నాడు. ఈ గరుడాద్రిలో 12 ఏళ్లు క్రూర మృగాల మధ్య కఠోర తపస్సు చేసారు. ఇక్కడ మైసూరమ్మ అను భక్తురాలు ఒక గోవును నాయనకు దానమివ్వగా గరుడాద్రియందు గో సంరక్షణమనే సనాతన ధర్మాన్ని ఉద్ధరించారు. ఇప్పుడు కాశినాయన ఆశ్రమాలు వెలసిన ప్రతి చోట విరివిగా గోసంపద పోషింపబడుతు నిత్యాన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఆలయాల జీర్ణోద్ధరణచేసేవారు. ఆశ్రమాలు నెలకొల్పారు. తటాకాలు, చెరువులు పూడిక తీయించి రైతుల సంక్షేమాన్ని ఆకాంక్షించేవారు. నాయనగారు వెళ్లిన ప్రతి చోటా అన్నదానం చేయించేవారు.

చదవండి :  పాలెగత్తె హొన్నూరమ్మ

1995 డిసెంబర్ 5వ తేదీ రాత్రి కాశినాయన యోగ స్థితులయ్యారు. డిసెంబర్ 6న జ్యోతి క్షేత్రానికి వచ్చిన వేలాదిమందికి అన్నదానం చేయించే ప్రక్రియను కూడా నాయనగారు ముందుగానే చేయించారు. కాశినాయన నడయాడిన ఆంధ్రదేశంలో కడప జిల్లాలోని నరసాపురం కేంద్రంగా కాశినాయన పేరిట రాష్ట్ర ప్రభుత్వం మండలాన్ని ఏర్పాటు చేసి రహదారులు ఇతర సౌకర్యాలు కల్పించింది. కాశినాయన యోగస్థితి పొందిన ప్రదేశం ఏడవ జ్యోతి క్షేత్రంగా విరాజిల్లుతోంది.

-ఆర్.నాగేశ్వర్‌రెడ్డి

ఇదీ చదవండి!

రాయలసీమ రైతన్నా

వాన జాడ లేదు – సేద్యానికి దిక్కు లేదు

18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: