రాజధాని నడిమధ్యనే ఉండాల్నా?

శుక్రవారం (18.07.2014) నాటి సాక్షి దినపత్రికలో ‘రాజధానిగా బెజవాడే బెస్ట్’ అన్న పేరుతో కొండలరావు గారు రాసిన వ్యాసం (లంకె: http://www.sakshi.com/news/opinion/vijayawada-can-be-the-best-capital-city-for-andhra-pradesh-149336) చదివాను. అందులో రావుగారు ఇలా చెబుతున్నారు ‘వెనక బడిన తమ ప్రాంతం రాజధాని అయితేనైనా అభివృద్ధి అవు తుందని కొందరు అంటున్నారు. విభజనను సెంటిమెంట్ గా చూసినవారు రాజధాని ఏర్పాటునూ అలాగే చూస్తు న్నారు. ఆచరణాత్మకంగా, వాస్తవికంగా, తమతో పాటు మిగతా ప్రాంతాల వారి ప్రయోజనాలపరంగా చూడటం లేదు’  అని.

రాజధానిని రాయలసీమ వాసులు సెంటిమెంట్ గా చూస్తున్నారని రావు గారికి మేము చెప్పేమా? లేదే! ‘రాజధాని రాయలసీమ హక్కు!’ అది సెంటిమెంట్ ఎంతమాత్రమూ కాదు – ఎందుకంటే శ్రీభాగ్ ఒప్పందం ఆ హక్కును రాయలసీమకు కట్టబెట్టింది. ఇన్నాళ్ళూ రాయలసీమ వాసులను మభ్యపెట్టి ఒప్పందాన్ని అటకెక్కించారు. మరోసారి అటువంటి దుర్నీతికి పాలకులు తెగబడుతున్నారన్నదే సీమవాసుల బాధ.

ఇకపోతే రావు గారు చెబుతున్న విజయవాడ ఆచరణాత్మకంగా, వాస్తవిక రాజధానిగా ఉండటానికి ఎలా సాధ్యపడుతుందో వివరించి ఉంటే బాగుండేది. అన్నిటికీ మించి వారు చెబుతున్నది ‘రాజధాని నగరానికి ప్రథమ ప్రాతిపదిక రాష్ట్రంలోని అన్ని వైపులకూ సమాన దూరంలో, విస్తృత రవాణా మార్గాలతో అందుబాటులో ఉండటం’ అట.  ‘విజయవాడ నడిమధ్యన ఉందనీ, అక్కడికి అన్ని ప్రాంతాలూ సమదూరంలో ఉన్నాయనీ!- కర్నూలు, తిరుపతి పట్టణాలు ఓ మూలగానే ఉన్నాయనీ!’. మరి మొన్నటి వరకూ రాజధానిగా ఉన్న హైదరాబాదు నగరం ఎక్కడ ఉండింది? అంతకు పూర్వం మద్రాసు ప్రెసిడెన్సీలో రాజధానిగా ఉన్న చెన్నపట్టణం ఎక్కడుండేది? అపుడు రాష్ట్రంలోని ఆన్ని ప్రాంతాల వాళ్ళు అక్కడికి వెళ్ళలేదా? అంతెందుకు మహాష్ట్రకు రాజధానిగా ఉన్న ముంబయి నగరం, కర్నాటకకు రాజధానిగా ఉన్న బెంగుళూరు, కేరళ రాజధానిగా ఉన్న తిరువనంతపురం, భారతదేశానికి రాజధానిగా ఉన్న కొత్తడిల్లీ నగరాలు కూడా ఒక మూలగానే ఉన్నాయి. అంతమాత్రానా ప్రజలు అక్కడికి వెళ్ళడం లేదా? అంతెందుకు లక్షలాది మంది తెలుగువారు సైతం ఈ నగరాలకు వెళ్లి ఆక్కడికి వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు – ఎంతో మంది అక్కడ స్థిరపడ్డారు కూడా… అక్కడ ఎక్కడా లేని, రాని ఇబ్బంది ఇప్పుడు కర్నూలు లేదా తిరుపతి రాజధాని అయితే ఉంటుందని పేర్కొనడం మభ్యపెట్టడం తప్ప మరోటి కాదు.

చదవండి :  గణిత బ్రహ్మతో నా పరిచయం

ఇలాంటి వాదననే ఆంద్ర రాష్ట్ర ఏర్పాటు సమయంలోనూ, అంతకు మునుపు శ్రీభాగ్ ఒడంబడిక జరిగిన సమయంలోనూ తీసుకొచ్చారు. అప్పుడు ఆంద్ర మహాసభ ఉపసంఘంలో సభ్యుడుగా ఉన్న డా. పట్టాభి గారు ఇలా చెప్పినారు ..’పూర్వము రాజకీయ, వైజ్ఞానిక, సాంఘిక, వాణిజ్య ప్రాముఖ్యము కలిగిన నగరమే రాజధానిగా ఉండవలెననే భావన ఉండెను. కానీ ఇప్పుడలా చేయాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియాలోని ప్రధాన నగరమగు కాన్బెర్రా ఒక అడవిలో వృద్ధి చెందినది’ అని.

‘తిరుపతిపై ఇప్పటికే నిత్యం యాత్రికుల ఒత్తిడి ఉంది. కర్నూలుకు తుంగభద్ర వరద ముప్పు ఉంది’ అని చెప్పటం సాకు మాత్రమే! మరయితే విజయవాడకు ఏ ఒత్తిడీ, ఏ ముప్పూ లేదా? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి నివేదిక విజయవాడ నగారానికి పొంచి ఉన్న ప్రకృతి వైపరీత్యాల ముప్పును ఎప్పుడో తేటతెల్లం చేసింది.

చదవండి :  రాయలసీమ బిడ్డలం (కవిత) - సొదుం శ్రీకాంత్

పూర్తిగా ఖాళీ ప్రదేశంలో పద్ధతి ప్రకారం నిర్మిస్తే మంచి నగరాలు తయారవుతాయని కొత్తఢిల్లీ, చండీగడ్ ఉదంతాలు నిరూపించాయి. కొత్తఢిల్లీకి పూర్వం కలకత్తా రాజధానిగా ఉండేది. ఆ లెక్కన చూసినప్పుడు రాయలసీమలో తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించటం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అలా నిర్మించిన రాజధానికి రవాణా సౌకర్యాలను అనుసంధానించడం పెద్ద సమస్య కానే కాదు. కావాల్సిందల్లా పాలకులలో చిత్తశుద్ధి మాత్రమే. హైదరాబాదులో నగరానికి దూరంగా కొత్త విమానాశ్రయం నిర్మించలేదా? అక్కడి నుండి నగరంలోకి రాకపొకలు సాగించేందుకు అనువుగా రహదారులను వృద్ధి చేయలేదా?

రాజధాని అంటే కేవలం రాష్ట్ర పరిపాలనా కేంద్రం మాత్రమే అయితే దానికోసం ఎందుకింత చర్చ? రాజధాని అంటే పరిపాలనా కేంద్రం మాత్రమే కాదు దానితో పెనవేసుకుని ఉండే అనేకానేక ప్రయోజనాలు… మౌలికవసతుల, విద్య, వైద్యం, వ్యాపారాలు…. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి. వీటన్నిటితో పాటు ఆ ప్రాంతంలో భూములకు రెక్కలోస్తాయి. అక్కడున్న వాళ్ళ సంపద వృద్ధి చెందుతుంది. ఆ సంపద ఆయా రంగాలలో చేరగిలబడి అక్కడి వారు ఆయారంగాలలో శాసించే స్థాయికి ఎదుగుతారు. అది పారిశ్రామిక రంగం, రియల్ ఎస్టేట్ కావచ్చు లేదా మరో రంగం కావచ్చు. ఇన్ని ప్రయోజనాలుంటాయి కాబట్టే ఆర్ధికంగా బలవంతులైన కోస్తా నేతలు ఇప్పటికే అభివృద్ది చెందిన ‘విజయవాడ – గుంటూరు’ ప్రాంతాలను రాజధానిగా చేయాలని కోరుతున్నారు – ఇందుకు వారి ఆధిపత్యం కింద నలుగుతున్న సీమ నేతలు తలాడిస్తున్నారు. అందుకే కమిటీలూ…కసరత్తులతో సంబంధం లేకుండా రాజధాని రాజకీయాలు ఒక ప్రాంతం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. పైపెచ్చు రేపు రాజధాని పేరు చెప్పి పోలవరం నీళ్లన్నీ రాజధాని కోసమే – కృష్ణా జలాలూ మాకే కావాలి అందులో రాయలసీమకు వాటా ఇచ్చేది లేదు పొమ్మన్నా అనగలరు. ఇందుకు గత చరిత్రే నిదర్శనం.

చదవండి :  చిన్న క్షేత్రాలనూ ఎదగనివ్వండి

 ఇదంతా ఒక ఎత్తైతే రాజధాని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేసిన పక్షంలో హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చేయాలంటారేమోనని పాలకపక్షం వారు ముందు జాగర్తగా పరిపాలనా సౌలభ్యం కోసం అన్నీ ఒకచోటే ఉండాలని కూనిరాగం అందుకున్నారు. ఒకవేళ రాజధాని రాయలసీమలో ఏర్పాటు చేసేట్లయితే వీరు ఆ మాటకు కట్టుబడతారా?

రాజధానిని, ఆమాట కొస్తే ఆ పేర అన్నిటినీ ఒకే ప్రాంతానికి పరిమితం చేయాలనే వక్రబుద్ధ్ధితో పాలకులు తెగబడుతున్నా  రాయలసీమకు చెందిన పాలక, ప్రతిపక్ష పార్టీల నేతలు నోరు మెదపటం లేదు. ఇది రాయలసీమ ప్రజల అసంతృప్తిని ఆగ్రహజ్వాలగా మార్చడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు – మిత్రుడు సొదుం శ్రీకాంత్ తన పాటలో చెప్పినట్టు …

సినుకు సినుకే రాలి
సుక్క సుక్కే చేరి
ఊరి వంకై పారి
ఒక్కొక్కటే కూరి
పెన్నేరుగా మారి
పోరు పోరంట ఉంది
పోరు పెడతా ఉంది!

– విజయభాస్కరరెడ్డి తవ్వా

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: