రాయలసీమలో హైకోర్టు
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును కోరుతూ కర్నూలులో ఆందోళన చేస్తున్న న్యాయవాదులు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు

కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు

గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా ఒకటే అనుకోవడం ఒక పద్ధతి (రాయలసీమలోనే జిల్లాల మధ్య అభివృద్ధిలో ఉన్న అంతరాల దృష్ట్యా, అలాగే విభజనానంతర అనుభవాల దృష్ట్యా కూడా నేను దీన్ని బలంగా వ్యతిరేకిస్తాను). అభివృద్ధిలో ఎక్కువ వెనుకబడిన జిల్లాలకు ఎక్కువ అవకాశాలు కల్పించాలనుకోవడం ఇంకొక పద్ధతి.

రాయలసీమలో హైకోర్టు అంటే కర్నూల్లో హైకోర్టు అనే అభిప్రాయం ఒకటి బలంగానే వ్యాప్తిలో ఉంది. ఉదాహరణకు మార్చి 15న కడప ఎన్జీవో హోమ్‌లో జరిగిన రాయలసీమ విద్యార్థి సంఘం (రావిసం) జిల్లా కార్యవర్గ సమావేశంలో – కర్నూలులో హైకోర్టు, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్శిటీ, చిత్తూరులో మన్నవరం ప్రాజెక్టు, గుంతకల్లును రైల్వేజోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ అట. ఏ ప్రాతిపదికన ఆ డిమాండ్ చేశారు? వివరాలు తెలియవు. స్థూల దృష్టికి అది సమంజసంగానే అనిపించవచ్చుగానీ నిజానికి అది చాలా దుర్మార్గమైన/ప్రమాదకరమైన ప్రతిపాదన. గమనించాల్సిందేమిటంటే వాటిలో ఉక్కు పరిశ్రమ పరిస్థితి ఒక్కటే డోలాయమానంగా ఉంది.

ఆ డిమాండ్లలో ఒక్కొక్కదాన్ని పరిశీలిద్దాం:

కర్నూలులో హైకోర్టు: రాష్ట్రానికి హైకోర్టు ఖాయంగా వస్తుంది (విభజన చట్టంలోని PART-IV, 31(1): “there shall be a separate High Court for the State of Andhra Pradesh”). ప్రతిపాదిత స్థలం ప్రస్తుతానికి అమరావతి.

అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్శిటీ: నిధులొక్కటే రాలేదుగానీ కేంద్రీయ విశ్వవిద్యాలయం కూడా ఖాయమే (విభజన చట్టంలో THE THIRTEENTH SCHEDULE లో Education లోని మొదటి అంశం: The Government of India shall take steps to establish institutions of national importance in the 12th and 13th Plan periods in the successor State of Andhra Pradesh. This would include …, one Central University, …). ఖరారు చేసిన స్థలం అనంతపురం.

చిత్తూరులో మన్నవరం: మొదటి దశ పెట్టుబడిని రూ. 1,200 కోట్ల నుంచి రూ. 363.94 కోట్లకు కుదించడం తప్ప (https://www.thehindubusinessline.com/companies/ntpcbhel-power-gear-unit-finally-up-but-downsized/article9386966.ece) ప్రాజెక్టు ఇప్పటికే ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. వై.ఎస్.ఆర్. హయాంలో ఏర్పడిన ఈ పరిశ్రమ విశాఖ ఉక్కు తర్వాత రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద ప్రభుత్వరంగ పరిశ్రమ అని ఈనాడు పేర్కొంది.

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ: విభజన చట్టంలో THE THIRTEENTH SCHEDULE లో Infrastructure లోని మూడవ అంశం: SAIL shall, within six months from the appointed day, examine the feasibility of establishing an integrated Steel Plant in YSR District of the successor State of Andhra Pradesh;

చదవండి :  ఎర్రగుంట్లలో రజనీకాంత్ సినిమా షూటింగ్

పైన పేర్కొన్న మిగతావాటిలో లేనిది, ఒక్క స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రమే ఉన్నది – “examine the feasibility” అన్నది ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన అంశం. అది కూడా ఆర్నెల్లలో – within six months. ఇప్పటికి నాలుగేండ్లు గడిచిపోయాయి. అంటే ఆర్నెల్లకు ఎనిమిది రెట్ల సమయం గడిచిపోయింది. ఇంకా feasibility విషయం అధికారికంగా తేలలేదు. Not feasible అని తేల్చేసినా ఎవరూ చెయ్యగలిగేది ఏమీ లేదు. ప్రస్తుతానికైతే నిర్ణయం తీసుకోవలసింది మీరంటే మీరని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ తమ తమ బాధ్యతల నుంచి తప్పుకున్నాయి (http://archives.eenadu.net/03-29-2018/news/news.aspx?item=ap-main-news&no=16).

ఖాయంగా వచ్చేవేమో ఇతర జిల్లాలకు, వస్తాయో రావో తెలియక త్రిశంకు స్వర్గంలో వేలాడేవి మాత్రమే కడపకా? ఎవరిని మభ్యపెట్టడానికి ఈ పంపకాలు? కడపకు ఏమీ ఇవ్వకపోగా ఉత్త మాటలతో కడుపు నింపే ప్రయత్నమా?

రాష్ట్ర విభజన తరువాత రాయలసీమలోని మిగతా అన్ని జిల్లాల్లోనూ భారీ పరిశ్రమలొచ్చాయి, జాతీయస్థాయి విశ్వవిద్యాలయాలు/విద్యాసంస్థలొచ్చాయి, పరిశోధనాకేంద్రాలొచ్చాయి, టూరిజమ్ సర్క్యూట్లొచ్చాయి, ఇలా చాలానే వచ్చాయి. కడపకు ఒరిగిందేమిటి, ఒంటిమిట్ట తప్ప? (గాలివీడులో సోలార్ ప్లాంటొకటి పెట్టారు. దానికోసమని చెప్పి వేల ఎకరాల్లో పలకలు పరిచారు – ‘అక్కడ పలురకాల ఖనిజాలున్నాయి, ఈ సోలార్ ప్లాంటు వల్ల ఆ ఖనిజాలను వెలికితీసే అవకాశాలను శాశ్వతంగా కోల్పోతామ’ని గనుల శాఖ చెప్పిన అభ్యంతరాలను తోసిపుచ్చి మరీ. ప్రభుత్వం దగ్గర నిధులు మూలుగుతున్నట్లు ప్రయివేటు భూములు (ప్రభుత్వ భూములు 1,700 ఎకరాలైతే, డీకేటీలు 330, పట్టా భూములు 1,570) సేకరించి మరీ పెట్టారు. సౌర విద్యుత్తు కోసం వేల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ, ఇతర మానవ నిర్మిత కట్టడాల పైభాగాలను వాడుకొనే అవకాశాలు ఉండగా, కేంద్ర ప్రభుత్వమే రాష్ట్రానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నప్పుడు ఇది అవసరమా? ఇంత చేసినందుకు దానివల్ల ఎన్ని ఉద్యోగాలొచ్చాయి?

పరిశోధనాకేంద్రాల విషయంలో కూడా వలపక్షమే. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపి అయోవా విశ్వవిద్యాలయ సహకారంతో కర్నూలు జిల్లా తంగెడంచలో రూ. 670 కోట్ల అంచనాతో ప్రపంచానికి విత్తన కేంద్రంగా మెగాసీడ్‌ పార్కు ఏర్పాటు చేశారు. ఒక సంవత్సరం పాటు ఆయన అమరావతిలో ఉన్నా, అమెరికాకు పోయినా సీడ్ పార్క్ అభివృద్ధి గురించే కలవరించారు, పలవరించారు. ఆయన ఒక విషయంలో అంత శ్రద్ధచూపడం నిజంగా గొప్ప విషయం. అయితే, ఆ శ్రద్ధలో కనీసం నూరోవంతు ఏపీకార్ల్ మీద చూపినట్లైతే ఎంత బాగుండేది! ఆయన చూపకపోతే పోయాడు, రాయలసీమవాదులు గానీ, పై పంపకాలు చేసిన రాయలసీమ విద్యార్థి సంఘంవారు గానీ దాని గురించి ప్రస్తావించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కడప జిల్లాలో అది కూడా అవసరం లేదనా?)

మనకొక సామెతుంది – మబ్బుల్లో నీళ్లు చూసి కుండ నీళ్లు ఒలకబోసుకోవద్దని. ఇక్కడ పరిస్థితి చూస్తే మబ్బుల్లో నీళ్లకు ఎగజూడమని కడపకు చెప్పి కుండల్లో నీళ్లు మిగతా రాయలసీమ జిల్లాలు పంచుకున్నట్లుంది.

చదవండి :  బొత్సతో కందుల సోదరుల చర్చ

ఎప్పుడో అరవయ్యేండ్ల కిందట కర్నూలు కోల్పోయిన (తాత్కాలిక) రాజధాని హోదాకు పరిహారంగా ఇప్పుడు హైకోర్టు ఇవ్వజూపినట్లైతే, విభజనానంతరం గడచిన మూడున్నరేండ్ల నుంచి కడప జిల్లా కోల్పోయిన, ఇంకా కోల్పోతూనే ఉన్నవాటికి బదులుగా ఏమిస్తారు?

మచ్చుకు రెండు – రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు శాసనసభలో ఉర్దూ యూనివర్సిటీని కడపలో ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని కూడా కాదని, కొట్లాడి మరీ కర్నూలుకు తీసుకుపోయారే? దానికి పరిహారంగా ఏమిస్తారు? మీ పంపకాల్లోనే ఎలాగూ గుంతకల్లుకు రైల్వే జోన్ అంటున్నారు కాబట్టి అనంతపురం జిల్లాకు దాన్ని ఉంచుకుని, సెంట్రల్ యూనివర్సిటీని కడపకు ఇప్పిస్తారా?

రాష్ట్రప్రభుత్వం కుంటిసాకులతో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లాబ్ ను కడప దగ్గరున్న కొప్పర్తి నుంచి కర్నూలు దగ్గరున్న ఓర్వకల్లుకు తరలించినందుకు బదులుగా ఏమిప్పిస్తారు?

కాబట్టి ఈ మెరమెచ్చు మాటలు కట్టిపెట్టి; పాలనాపరమైన సౌకర్యాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు లాంటి ఒకదానికొకటి పొంతన లేని అంశాలను కలగలిపి అయోమయం పాలవకుండా దేనికదే ఒక ప్రత్యేకమైన ప్రాతిపదికన నిర్ధారించవలసిన అంశమని గ్రహించాలి.

హైకోర్టులాంటి పాలనాసౌకర్యాలు ఎక్కడ పెట్టినా అవి రాయలసీమ ప్రజల్లో అత్యధికులకు అందుబాటులోను, కోస్తాంధ్రులకు అనుకూలంగాను ఉండాలి. పెడితే గిడితే శాసనసభ శీతాకాల సమావేశాలు, హైకోర్టు కడపలో పెడితేనే సీమవాసుల్లో అత్యధికులకు ఉపయుక్తం.

అత్యంత వెనుకబడిన జిల్లాలు – నీతి ఆయోగ్ ప్రాతిపదిక:

ఏప్రిల్‌ 1న నీతి ఆయోగ్‌ దేశంలో సామాజిక-ఆర్థిక వెనుకబాటుతనం, కీలకమైన వైద్య-ఆరోగ్య రంగాల పనితనం, మౌలిక వనరుల స్థితిగతుల పరంగా అత్యంత వెనుకబడిన జిల్లాల (Aspirational districts) ర్యాంకులను విడుదల చేసింది. (లింకు: http://niti.gov.in/writereaddata/files/document_publication/AspirationalDistrictsBaselineRankingMarch2018.pdf) ఏ అంశాల ప్రాతిపదికన జిల్లాల వెనుకబాటుతనాన్ని నిర్ధారించారో కూడా అదే డాక్యుమెంటులో ఉంది.

వైద్యం-ఆరోగ్యం (ఐదేళ్ల లోపు పిల్లల్లో పోషకాహార లోపం, తదితర అంశాలు), విద్య (బడి మానేస్తున్న పిల్లల నిష్పత్తి, మొదలైన అంశాలు), వ్యవసాయం – జల వనరుల లభ్యత (సొంత భూమి లేని వ్యవసాయ కూలీల నిష్పత్తి, వ్యవసాయ ఉత్పాదకత, మొ.), ఆర్థిక అసమానతలు – నైపుణ్యాభివృద్ధి, మౌలిక వనరుల స్థితిగతులు – ఈ ఐదు రంగాల్లో గుర్తించిన 49 అంశాల పరంగా ఆయా జిల్లాల ప్రగతిని బట్టి ఇచ్చిన ర్యాంకులు అవి. దేశంలోనే అత్యంత వెనుకబడిన ఆ నూటొక్క జిల్లాల్లో ఆంధ్ర ప్రదేశ్ నుంచి మూడు జిల్లాలు ఉన్నాయి: విజయనగరం, కడప, విశాఖపట్నం.

1953లో రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఎంపికవడానికి గల ఏకైక కారణం వెనుకబాటుతనమే అయినప్పుడు ఇప్పుడు హైకోర్టు స్థాపనకు నీతి ఆయోగ్ ప్రాతిపదికల ప్రకారమే దేశంలోనే “అత్యంత వెనుకబడిన” 101 జిల్లాల జాబితాలో చేర్చబడిన ఏకైక రాయలసీమ జిల్లా ఐన కడప కంటే అర్హమైన జిల్లా ఏది?

చదవండి :  " సీమ" భూమి పుత్రుడు "మాసీమ"కు జోహార్..!

కడప ఉక్కు పరిశ్రమ తాజా పరిస్థితి గురించి ఈనాడులో మార్చి 29న వచ్చిన వార్త:

కడప ఉక్కుపై కేంద్రానిదే ఆలస్యం
రెండునెలల క్రితమే అన్నీ చెప్పేశాం
కేంద్రమంత్రి బీరేంద్ర వ్యాఖ్యలపై ఏపీఎండీసీ స్పష్టీకరణ

(ఈనాడు – దిల్లీ)

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి రెండు నెలల క్రితమే సంపూర్ణ సమాచారం ఇచ్చేశామని, కేంద్రం నిర్ణయం తీసుకోవడం ఒక్కటే మిగిలిందని ఆంధ్రప్రదేశ్‌ అధికారులు వెల్లడించారు. కర్మాగారం ఏర్పాటుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో వేచి చూస్తున్నట్లు బుధవారం పార్లమెంటు ఆవరణలో కేంద్ర ఉక్కుశాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌ విలేకర్లతో వ్యాఖ్యానించారు. ‘ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై టాస్క్‌ఫోర్స్‌ నివేదిక వచ్చింది. రాష్ట్రం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో వేచిచూస్తున్నాం. భూమి, విద్యుత్తు, నీరు, రవాణా సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వంతో మా మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోంది. కడప సమీపంలో ఉక్కు నిక్షేపాలు తక్కువ ఉన్నా బళ్లారి నుంచి ముడి ఖనిజం తీసుకొనేందుకు అవకాశం ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ నివేదిక చెప్పింది. కర్మాగారం ఏర్పాటుకు రూ.10వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా’ అని మంత్రి తెలిపారు.

నిర్ణయించాల్సింది కేంద్రమే: ఏపీఎండీసీ

దీనిపై ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) సీఎండీ వెంకయ్య చౌదరి స్పందించారు. ‘జమ్మలమడుగు వద్ద 3000 ఎకరాల భూమి, కర్మాగారానికి అవసరమైన ఒక టీఎంసీ నీరు, పవర్‌ గ్రిడ్‌ చూపించాం. రైలు అనుసంధానంపై స్పష్టత ఇచ్చాం. హెమటైట్‌- 62గ్రేడ్‌ ఉన్నతశ్రేణి ఇనుప ఖనిజాన్ని అనంతపురం జిల్లా డి.హిరేహాల్‌ మండలంలో చూపించాం. అక్కడ 150 మిలియన్‌ టన్నుల ఖనిజం ఉన్నట్లు అంచనా. భారీ ప్రాజెక్టులకు వచ్చే రాయితీలన్నీ ఇస్తామని హామీ ఇచ్చాం. ఉక్కు ఉత్పత్తిలో 60% ఖర్చు ఇనుప ఖనిజానిదే. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్నందున లాభదాయకత సమస్యే ఉత్పన్నం కాదు. జాతీయ ఉక్కు విధానం ప్రకారం 3 మిలియన్‌ టన్నుల కర్మాగారం పెడితేనే లాభదాయకంగా ఉంటుంది. అందుకు 4.6 మిలియన్‌ టన్నుల ముడి ఖనిజం కావాలి. డి.హిరేహాల్‌ మండలంలో చూపిన ముడిసరుకు ఉన్నత శ్రేణిది కాబట్టి పూర్తి అనుకూలంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచీ అన్నిరకాల అనుమానాలు నివృత్తి చేసినందువల్ల కర్మాగారాన్ని సొంతంగా పెట్టాలా? పీపీపీ విధానంలో చేపట్టాలా? అనేదానిపై నిర్ణయం తీసుకోవాల్సింది వారే’నని వెంకయ్యచౌదరి స్పష్టంచేశారు.

– త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. ‘ఈ-మాట’ అంతర్జాల పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్న వీరు కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

జిల్లా కేంద్రంగా కడప

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: