కృష్ణా జలాలపై ఆధారపడ్డ రాయలసీమ పరిస్థితి ఏమిటి?

కేటాయింపులున్న రాయలసీమ పరిస్థితి పట్టదా?

పోలవరం ద్వారా ఆదా అయ్యే 45 టీయంసీల నీటిని, పులిచింతల నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 54 టీయంసీల నీటిని, కృష్ణా డెల్టాలో పంటల మార్పిడి ద్వారా ఆదా అయ్యే నీటిని తక్షణమే గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నికర జలాలు పొందేలాగా బ్రిజేష్‌ ట్రిబ్యునల్‌కు నివేదికలు ఇవ్వాలి. రాష్ట్ర విభజన బిల్లులో పూర్తిచేస్తామన్న పై ప్రాజెక్టులు అన్నింటికీ బడ్జెట్‌ కేటాయింపులు ఇచ్చి ఒకటి రెండేళ్ళలో పూర్తిచెయ్యాలి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన జరిగిపోయింది. రాష్ట్ర విభజన బిల్లులో గానీ, కొత్త రాష్ట్రం ఏర్పాటైన తరువాత వినిపిస్తున్న వార్తలలో గానీ రాయలసీమ తీవ్ర నిర్లక్ష్యానికి గురైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఇది రాజధాని ఏర్పాటులో గానీ, నీటి పారుదల విషయంలో గానీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలలో గానీ రాయలసీమ అనాథ అయినట్లుగా ప్రస్ఫుటంగా కళ్ళకు కనబడుతుంది. ఈ నేపథ్యంలో నీటి పారుదల రంగంలో రాయలసీమపై ఉన్న వివక్షను సభ్య సమాజం ముందుంచే చిరు ప్రయత్నమిది.

రాష్ట్రంలో రెండు జిల్లాలకు ప్రాధాన్యతనివ్వడం వలన సహజన్యాయానికి తూట్లు పడుతున్నాయి. కృష్ణా డెల్టా తాగునీటి కోసం 10 టీయంసీల నీటిని తీసుకొనిపోవడాన్ని తెలంగాణ వారు ఆక్షేపించారు. వర్షాకాలంలో కూడా తాగునీటికి తీవ్రంగా ఇబ్బందిపడుతున్న రాయలసీమ, కనీసం మా తాగునీటి పరిస్థితి ఏమిటని కూడా స్పందించలేదు. తెలంగాణ వారు నీటి కేటాయింపులు లేని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా తాగునీరు తీసుకుంటున్నారు. కేటాయింపుల కంటే అధికంగా హైదరాబాద్‌ తాగునీరు తీసుకుంటున్నారు. మాకు కేటాయింపులు వుండి నీరు తీసుకుంటే తప్పేమిటి అని కృష్ణా డెల్టా వారు వాదించారు. అయితే మీరు తీసుకోండి మేము తీసుకుంటాం అని ఈ నెల 10న జరిగిన కృష్ణా జలాల యాజమాన్య బోర్డు సమావేశంలో ఒక అంగీకారానికి వచ్చారు. అంతేకాకుండా నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలవలకు కూడా చెరి పది టీయంసీలు నీరు తీసుకోవడానికి నిర్ణయించారు. శ్రీశైలం కనీస నీటిమట్టం 854 అడుగుల (ప్రాజెక్టు నిర్మాణంలో నిర్ణయించిన కనీస నీటి మట్టం ఇది. దీనిని కూడా గత ప్రభుత్వాలు 834 అడుగులకు తగ్గించాయి. ఈ కనీస నీటి మట్టం తగ్గింపువల్ల బ్రిజేష్‌కుమార్‌ కమిటీ మిగులు జలాలు పంపిణీలో కూడా ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగింది) నుంచి 788 వరకు నీటిని తీసుకొనిపోవడానికి బోర్డు సమావేశంలో నిర్ణయించారు. మరి నికర జలాలు వున్న యస్‌ఆర్‌బీసీ పరిస్థితి ఏమిటి? మానవ హక్కు అయిన తాగునీటికై కృష్ణా జలాలపై ఆధారపడ్డ ఒక కోటీ యాభైలక్షల రాయలసీమ పరిస్థితి ఏమిటి? శ్రీశైలం రిజర్వాయరులో నీటి మట్టాన్ని అధఃపాతాళానికి తీసికొనిపోతే వారికి తాగునీరు అందించాలనే ఆలోచన కూడా లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు.

చదవండి :  ఉత్తుత్తి వాగ్దానాలతో మళ్ళా కడప నోట మట్టికొట్టిన ప్రభుత్వం

బ్రిజేష్‌ కుమార్‌ అవారు ్డప్రకారం కృష్ణా మిగులు జలాలపై ఉన్న స్వేచ్ఛ ఆధారంగా కరువు సీమలో నిర్మిసున్న ప్రాజెక్టులు: గాలేరు -నగరి, హంద్రీనీవా, వెలిగొండ. బ్రిజేష్‌కుమార్‌ నివేదిక ప్రకారం కృష్ణా నదిలోని మిగులు జలాలనూ కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లకు పంచి కరువుసీమలోని పై ప్రాజెక్టులకు చుక్కనీరు కేటాయింపు లేకుండా చేశారు. రాష్ట్ర విభజన బిల్లులోని ఈ ప్రాజెక్టులను పూర్తిచేస్తామన్నారు కానీ, దానికి నిధుల గురించి మాట్లాడలేదు. నీటి కేటాయింపుల గురించి మాట్లాడలేదు. రాష్ట్రం ఏర్పడిన తరు వాత లోటు బడ్జెట్‌లో ఉన్న ప్రభుత్వం ఈ నీటి ప్రాజెక్టులను ఏ విధ ంగా పూర్తిచేస్తారో, నీటికేటాయింపులు ఎలాచేస్తారో చెప్పడం లేదు.

చదవండి :  సదువుకుంటే వైకాపాకు ఓటేయొద్దా!

జూన్‌ 15నాటికి నీరు ఇస్తేనే కృష్ణా డెల్టాలో వరి తుఫాన్ల భారిన పడకుండా ఉంటుందని, శ్రీశైలం, సాగర్‌లకు నీరు వచ్చినా రాకపోయినా కృష్ణా డెల్టాకు నీరు తీసుకొని పోతున్నారు. గతంలో నారుమళ్లకు అని తీసుకొనిపోయేవారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్ప డింది కావున తాగునీటికని నీరు తీసుకొని పోతున్నారు. అయితే ఇప్పుడు 10 టీయంసీల నీరు ఇస్తే చాలు. తరువాత సాగర్‌ దిగువున ప్రకాశం బ్యారేజ్‌ వరకు కురిసే వర్షాలతోనే మా పంటలు పండుతాయి అంటున్నారు. మరీ పంటలు పండించాల్సిందే. దేశ అవస రాలు తీర్చాల్సిందే. అయితే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నా యా? కరువు సీమకు నీటిని అందించడానికి ఏమైనా సాధ్యాలున్నాయా? దానికి ఏ విధంగా సహకరించాలో పెద్దలు ఆలోచించాలి.

పులిచింతల ప్రాజెక్టునిర్మాణం నాలుగు నెలల్లో పూర్తికాబోతుంది. దానిలో నిల్వ ఉంచుకున్న నీటితో కోస్తాలో జూన్‌ నెలలో నారుమళ్లు వేసుకునేలాగా కార్యాచరణ చెయ్యండి. సాగర్‌, శ్రీశైలంనుంచి నీటిని తీసుకుపోకుండా వాటి కనీస నీటి మట్టాలు వుండేలాగా సహకరించండి. దేశంలో వరి అత్యధికంగా పండుతుంది. వర్షపు నీటి ఆధా రంగా కూడా వరి సాగు ఉత్తర భారతదేశంలో జరుగుతుంది. కావున వరి ఉత్పత్తిని తగ్గించి, నీటి అవసరం తక్కువ ఉండే, దేశ అవసరాలకు కావలసివున్న పప్పు దినుసుల, నూనెగింజల ఉత్పత్తికి గల మార్గాలను ఆలోచించండి. దీర్ఘకాలిక వరి రకాలు పోయి స్వల్పకాలిక, మధ్యకాలిక వరిరకాలు వచ్చాయి. వాటిద్వారా నీటిని ఆదా చేసి కరువు ప్రాంతాలకు కేటాయించడానికి సహకరించండి. పోలవరం ప్రాజెక్టుతో పాటు దుమ్ముగూడెం-నాగార్జునసాగర్‌ టైల్‌పాండ్‌ ప్రాజెక్టును కూడా జాతీయప్రాజెక్టుగా ప్రకటించడానికి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. తక్షణం పోలవరం ద్వారా ఆదా అయ్యే 45 టీయంసీల నీటిని, పులిచింతల నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 54 టీయంసీల నీటిని, కృష్ణా డెల్టాలో పంటల మార్పిడి ద్వారా ఆదా అయ్యే నీటిని గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నికర జలాలు పొందేలాగా బ్రిజేష్‌ కమిటీకి నివేదికలు ఇవ్వాలి.

చదవండి :  ప్రకృతీ అంతే! ప్రభుత్వాలూ అంతే!

రాష్ట్ర విభజన బిల్లులో పూర్తిచేస్తామన్న పై ప్రాజెక్టులు అన్నింటికి బడ్జెట్‌ కేటాయింపులు ఇచ్చి ఒకటిరెండేళ్ళలో పూర్తిఅయ్యేలా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచెయ్యాలి. సమధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రాంతాల అవసరాలను తీర్చడానికి ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో విజ్ఞులు ఆలోచించి, కార్యాచచరణ చేపట్టడానికి సిద్ధం కావాలి. అలాకాకుండా సానుభూతితో శ్రీశైలంలో ఆవిరయ్యే నీటి వాటాతో రాయలసీమ వాసుల గొంతులు తడపాలని, నెర్రెలు వారిన భూమిలో మొక్కలు ప్రాణం పోసేలాగా ప్రయత్నిస్తే సహనానికైనా ఒక హద్దు వుంటుంది. తక్షణమే మేల్కొనండి. నిర్దిష్ట ప్రణాళికతో కార్యాచరణ చేపట్టండి. సీమకు న్యాయం చేయండి.

– బొజ్జా దశరాథరామిరెడ్డి
కార్యదర్శి, రాయలసీమ ఐక్యకార్యాచరణ సమితి

(ఆంధ్రజ్యోతి దినపత్రిక, ౨౩ జూలై)

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: