రాయలసీమ సంస్కృతి

‘రాయలసీమ సంస్కృతి’పై చిత్రసీమలో ఊచకోత

తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు.

తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి లు పుట్టింది కడపజిల్లా పులివెందుల తాలూకా ఎద్దులయ్యగారికొత్తపల్లెలోనే. తెలుగు చిత్రసీమ కీర్తిపతాకాన్ని ఎగురవేయడంలో వీరితోచేయికలిపిన కె.వి.రెడ్డి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి వాసి. ఇటువంటి కళాతపస్వులను సినీరంగానికి అందించిన రాయలసీమ సంస్కృతిపై అదే చిత్రసీమలో ప్రస్తుతం ఊచకోత కొనసాగుతోంది.

“సీమ ఫాక్షనిజం” పేరుతో ఇటీవల పుంఖానుపుంఖంగా విడుదలైన సినిమాలు-సీమవాసులకే దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. ఈ సినిమా రంగం ‘కర్నూలు పట్టణ నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజు (పర్యాటక ప్రాముఖ్యత ఉన్న చారిత్రక కట్టడమిది) పరిసర ప్రాంతం మనుషుల ఊచకోతలకు నిలయం‘ అనే ఒక దుర్మార్గపు భావనను సీమలోనే ఉన్న కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల యువతలోనే ముద్ర వేయగలిగింది. కక్షల సంస్కృతి వాసనే సోకని కడప జిల్లాలోని ఒంటిమిట్ట (ప్రఖ్యాత చారిత్రాత్మక కోదండరామస్వామి దేవాలయానికి ఈ ఊరు ప్రసిద్ధి)లో నిరంతరం మనుషుల ఊచకోతలున్నాయని సీమలోనే ఉన్న అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల యువత భ్రమపడుతోంది.

ఈ సినిమాలు చూసిన కర్నూలు వాసులు తక్కిన రెండు జిల్లాలైన అనంతపురం, కడప జిల్లాల్లో ఈ దుస్సంస్కృతి ఉందని భావిస్తున్నారు. అనంతపురం వాసులు కడప, కర్నూలు జిల్లాల్లో ఈ జాడ్యం ఉందని భావిస్తున్నారు. కడప వాసులు అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఈ దుర్మార్గం ఉందని భావిస్తున్నారు. అంటే సీమజిల్లాల్లో ఎక్కడా లేని ఒక క్రూరమైన హింసా దృశ్యాన్ని తెరకెక్కించి సీమసంస్కృతికి ఆపాదించడంలో సినిమా ఎంత బలంగా ముద్రవేసిందో గమనించవచ్చు. సీమజిల్లాల యువతలోనే ఈ ముద్ర పడిందంటే ఇక ఈ సినిమాలు చూసిన ఇతర ప్రాంతీయులు సీమ జిల్లాలపై ఎంతటి దురభిప్రాయం ఏర్పరచుకుని వుంటారో స్పష్టమవుతున్నది.

గ్రామకక్షల సంస్కృతి

రాయలసీమకే పరిమితమైన గ్రామకక్షల సంస్కృతి ఇక్కడ ఉన్న మాట నిజమే. ఐతే ఇది సీమకంతటికీ చెందిన సంస్కృతి కాదు. ఈ గ్రామకక్షల సంస్కృతి సీమ జిల్లాలన్నిటా విస్తరించిలేదని చరిత్ర చెపుతోంది. కేవలం కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలు కలిసే రేనాటి తాలూకాల్లో మాత్రమే ఈ గ్రామ కక్షలు కనిపించేవి. ఆనాటి ఆ గ్రామకక్షలకూ, నేడు ఆంధ్రదేశమంతటా విస్తరించిన ‘పొలిటికల్ ఫాక్షనిజం’ కూ ఏమాత్రం పోలిక లేదు. సీమలోనే ఒక ప్రాంతానికే పరిమితమైన ఆనాటి విలక్షణమైన “గ్రామకక్షలు” ప్రస్తుతం పూర్తిగా సమసిపోయాయి. ఈ విలక్షణ గ్రామకక్షలకు ఫాక్షనిజం అనే పేరు పెట్టడం కూడా అవగాహనారాహిత్యమే. ఇదొక కుట్రగా సీమవాసులు భావిస్తున్నారు.

80వ దశకంలో రాజకీయ ప్రయోజనాలకోసం కొన్ని పత్రికలు ప్రవేశపెట్టిన పదం ‘ఫాక్షనిజం’. సీమకే పరిమితమైన ఈ గ్రామకక్షలను బ్రిటిష్ కాలం నుండి కూడా వ్యవహారికంలో ‘పార్టీ’ అని పిలిచేవారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారితో “మీ ఊర్లో పార్టీ ఎలా వుంది?” అని అడగడం ఇక్కడ పరిపాటిగా ఉండేది. ఈ గ్రామకక్షల్లో ముఠాతత్వం, నేరప్రవృత్తి ఏ కోశానా కనిపించదు. ఈ కక్షల సంస్కృతిలో జరిగిన హత్యలు నేరప్రవృత్తితో జరిగినవి కావు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో లేని ఈ విలక్షణ కక్షలకు ఒక చరిత్ర ఉంది. చరిత్ర పునాదుల నుండి ఉద్భవించిన ఒక సామాజిక జాడ్యమిది. తిరుగుబాటు మనస్తత్వం కలిగిన పాలెగాళ్ళ వ్యవస్థ నుండి సంక్రమించిన భావజాలం వల్ల ఇక్కడి జనంలో పంతం, ప్రత్యర్థిపై మాత్రమే క్రౌర్యం ప్రదర్శించే మనస్తత్వం మానసికంగా రూపుదిద్దుకున్నాయి.

మరోవైపు పిలవకపోయినా వచ్చే కరువు కాటకాల వల్ల ఈ ప్రాంతంలో దైన్యమైన బతుకులు ఉండేవి. ఈ భౌతిక స్థితి, ఈ మానసిక స్థితి కలగలిపి ఒక విలక్షణ కక్షల సంస్కృతికి బీజం వేశాయని చెప్పవచ్చు. ఈ సంస్కృతి కూడా అంతో ఇంతో స్థిరమైన భూమి కలిగి ఉండి, కరువు కారణంగా అటు ఆ భూమి పండకా, ఇటు దౌర్భాగ్యమైన వలసపోయే అవకాశమూ లేని పరిస్థితులున్న రేనాటి ప్రాంతంలో పునాదులు వేసుకుంది.

చదవండి :  కడప ప్రాంత శాసనాలలో రాయల కాలపు చరిత్ర !

సీమకే పరిమితమైన ఈ గ్రామకక్షల్లో ఒక సంప్రదాయం, ఒక యుద్ధనీతి కనిపించేవి. ఆడవాళ్ళ జోలికీ, ఆస్థుల జోలికీ, పశువుల జోలికీ ఎంతమాత్రం పోయేవారు కారు. 70వ దశకంలో కడప జిల్లాలోని రైల్వే కోడూరు, చిత్తూరు జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఎక్కడో ప్రత్యర్థులు ఒక వర్గానికి చెందిన ఆవుల పొదుగులు కోసిన ఉదంతం విని, రేనాటి ప్రాంతంలోని గ్రామస్థులు ‘పార్టీ కోసం పొదుగులు కోసే నా కొడుకులు…వాళ్ళేం మనుషులు?’ అని ఈసడించుకున్న సంఘటనలున్నాయి.

అయితే ఆ తరువాత్తరువాత 80వ దశకంలో పొలిటికల్ ఫాక్షనిజం సీమజిల్లాలతో బాటు ఆంధ్రదేశమంతటా విస్తరించాక, చీని చెట్లను తెగనరకటం, వాములు తగలబెట్టడం, ఇళ్ళు పీకడం, పచ్చటి పైర్లను నాశనం చేయడం వంటి అవలక్షణాలు పొడచూపాయి. అయితే ఈ అవలక్షణాలన్నీ అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి దిగుమతి అయిన ‘పొలిటికల్ ఫాక్షనిజం’ తోబాటు ఈ ప్రాంతానికి దిగుమతైనవే. ఈ పొలిటికల్ ఫాక్షనిజం లోనే మాఫియా తత్వం, ముక్కూమొగమెరుగని వారిని కూడా ఊచకోత కోయడం వంటి అవలక్షణాలు కనిపిస్తున్నాయి.

ఇటువంటి అవలక్షణాలతో కూడిన… ఆంధ్రదేశమంతటా – ఆ మాటకొస్తే దేశమంతటా ఉన్న పొలిటికల్ ఫాక్షనిజాన్ని సినిమా తెరకెక్కించి ‘సీమ ఫాక్షనిజం’ అని పేరు పెట్టడం కన్నా దుర్మార్గమైన పని మరొకటి లేదు. సీమకే పరిమితమైన ఆనాటి గ్రామకక్షల గురించే చెప్పుకోవలసి వస్తే వాటిలో స్వార్థం, ధనదాహం మచ్చుకు కూడా కనిపించవు. కేవలం తమ మాట చెల్లుబాటు కావాలనే భూస్వామ్య భావజాలం నుండి వచ్చిన ఆధిపత్య ధోరణి మాత్రమే కనిపించేది. సీమ గ్రామకక్షల అగ్నిలో పెద్ద పెద్ద భూస్వామ్య కుటుంబాలు కూడా ఆర్థికంగా మాడిమసైన దృష్టాంతాలు సీమ జిల్లాల్లో కోకొల్లలు. ధనదాహం ఈ కక్షల్లోనే లేదనేందుకు ఇదొక బృహత్తర తార్కాణం.

గ్రామ పార్టీలు ఒక చారిత్రక దశగా 1980ల నాటికే ముగింపుకొచ్చాయి. వాటి శకలాలు ఇంకా అక్కడక్కడా ఉన్నమాట వాస్తవమే అయినా అవి కూడా పూర్తిగా సమసిపోయే దిశలో ఉన్నాయి. ఇప్పటి పొలిటికల్ ఫాక్షనిజంతో మమేకమై వికృతరూపంలో అప్పుడప్పుడూ ఎక్కడో ఒక చోట బయటపడుతున్నాయి. ముగిసిన ‘సీమపార్టీల’ చరిత్ర, వాటి మూలాలపై ఏ మాత్రం అవగాహన లేని సినీ రచయితలూ, దర్శకులూ తమ పైత్యంతో సీమ సంస్కృతికి వికృతరూపం చెక్కుతున్నారు. వ్యాపారలాభాల కోసం ఒక హింసాత్మక సినిమా కథకు సీమ ప్రాంతాల, సీమ మనుషుల పేర్లు పెట్టి సినీ పండితులు ఒక మోనోటెర్రరిజం సృష్టిస్తున్నారు. ఒక హీరో, ఒక దర్శకుడు, ఒక నిర్మాణ సంస్థ ఎప్పుడైతే లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని వారిపై తమ ప్రభావాన్ని చూపగలుగుతారో, అటువంటి హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు సామాజిక బాధ్యత తప్పనిసరి. చిత్రసీమలో బాధ్యత కలిగివుండాల్సిన అటువంటి అగ్ర నిర్మాతలూ, అగ్ర హీరోలే ఇటువంటి వక్రీకరణలు తీయడం దురదృష్టకరం.

వక్రీకరణలు సాగుతున్నదిలా…

రాయలసీమ ఫ్యాక్షనిజం పేరుతో వచ్చిన కొన్ని పదుల చిత్రాల్లో రచయితల, దర్శకుల పైత్యం యధేచ్ఛగా స్వైరవిహారం చేస్తూనే ఉంది. అగ్రహీరోల చిత్రాలనే పరిశీలిస్తే…

‘సమరసింహారెడ్డి’ అనే సినిమాలో ఒక ఫ్యాక్షనిస్టు కూతురు, మరో ఫ్యాక్షనిస్టును (హీరో బాలకృష్ణ) ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది. (ఫ్యాక్షనిస్టు, ఫ్యాక్షనిజం అనే పదాలు రచయిత ఉద్దేశ్యంలోనివి కావు. అవి సినీపండితులు ఆపాదించినవి – యధాతథంగా వాడబడ్డాయి). ఈ పెళ్ళిని కూడా ఆ ఫ్యాక్షనిస్టు తండ్రే ప్రోత్సహిస్తాడు. తీరా పెళ్లి చేసుకొని వచ్చాక – ‘ఇన్నాళ్ళూ ఆ సమరసింహారెడ్డిపై పగ సాధించలేక కుమిలిపోతున్నాను. ఇప్పుడు వాడి పెళ్ళామైన నిన్ను చంపి నా పగ తీర్చుకుంటా.’ అంటూ కన్న కూతురిని పొడిచి చంపుతాడు. ఈ క్రూర సన్నివేశం, ఒకప్పుడు సీమలో ఉన్న గ్రామ కక్షల్లో కాదుగదా… నేడు అన్నిప్రాంతాల్లో విస్తరించి ఉన్న ‘పొలిటికల్ ఫ్యాక్షనిజం’లో కూడా ఎక్కడా కనిపించదు. ఈ జిల్లాల్లో 80వ దశకంకు ముందున్న ‘గ్రామపార్టీల’ సంస్కృతిలో ప్రత్యర్థి కుటుంబానికి చెందిన యువతిని పొరపాటున ఇవతలి పార్టీలోని యువకుడు ప్రేమించి పెళ్ళి చేసుకుంటే, ఆ గ్రామంలో ఆ పెళ్ళి కారణంగా గ్రామ పార్టీయే సమసిపోయిన నైతిక-మానవతా విలువలు సాక్షాత్కరించిన సందర్భాలున్నాయి.

చదవండి :  సాహిత్యంలో నిబద్ధత అంటే ఏమిటి? ఎంతమేరకు? : 2

మరో అగ్రహీరో నటించిన ‘ఇంద్ర’ సినిమాలో ఒక ఫ్యాక్షనిస్టు కొడుకును ప్రత్యర్థి ఫ్యాక్షనిస్టు (హీరో చిరంజీవి) ఒక లారీ ప్రమాదం నుంచి కాపాడుతాడు. ఇది తెలిసిన ఆ బాలుని తండ్రి (ఫ్యాక్షనిస్టు) – ‘ప్రత్యర్థి ప్రాణభిక్ష పెట్టిన కొడుకు నాకెందుకురా!’ అంటూ కన్న కొడుకును కత్తితో తల నరికి చంపుతాడు. కన్నకొడుకును పోగొట్టుకున్న ఆ తల్లి ఏడుస్తూ వుంటే ‘ఎందుకే ఏడుస్తావు? ఇలాంటి కొడుకులను నూరుమందిని పుట్టించే సత్తా నాకుంది.’ అని, ఆ క్రూర విషాద సన్నివేశంలో జుగుప్సాకరమైన మాట అంటాడు. ఈ క్రూరాత్మకమైన సన్నివేశం కూడా సీమ పార్టీల్లోనే కాదు, ఇప్పటి ఆంధ్రదేశంలో వున్న పొలిటికల్ ఫ్యాక్షనిజంలో కూడా ఎక్కడా కనిపించదు. సీమ గ్రామపార్టీల్లో ఆడవాళ్ళ జోలికి, చిన్నపిల్లల జోలికి ప్రత్యర్థులే వెళ్ళరు. అవతలివారు జైళ్ళపాలై ఉన్నప్పుడు కూడా గ్రామంలో ఆ కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలే వ్యవసాయ పనులను నిరాటంకంగా చేసుకునే జీవనపోరాటానికి ఏ ‘పార్టీదారు’లూ అడ్డుతగలరు. అటువంటిది, కేవలం ప్రత్యర్థి రక్షించాడనే ఒక దుర్మార్గ కారణంతో కన్న కొడుకులను చంపుకునే హీనాతిహీనమైన సంస్కృతిని సృష్టించడమే ఒక పైత్యం కాగా, దాన్నిసీమవాసులకు ముడిపెట్టడం పూర్తిగా భావదారిద్ర్యమే.

మరో అగ్రదర్శకుడు నిర్మించిన ‘అంతఃపురం’ సినిమాలో ఒక ఫ్యాక్షనిస్టు కొడుకు ప్రత్యర్థుల చేతిలో హతమవుతాడు. ఫ్యాక్షన్స్‌తో సంబంధం లేని ప్రశాంత జీవితం నుండి వచ్చిన ఆ హతుని భార్య తన రెండేళ్ల కుమారుని తీసుకుని -’ఈ గ్రామం విడిచి వెళ్లిపోతా’ నంటుంది. దీనికి ఆ ఫ్యాక్షనిస్టు ససేమిరా ఒప్పుకోడు. మనవణ్ణి గుంజుకొని, కోడలును బంధించి చిత్రహింస పెడతాడు. ఆమె తప్పించుకొని కొడుకుని తీసుకుని పారిపోతూంటే, తన మందీ మార్బలాన్ని పురమాయించి ఆమెను పట్టుకుంటాడు. నడి బజారులో అందరూ చూస్తుండగా తన కోడల్ని జుట్టు పట్టుకుని ఈడ్చి, కాళ్లతో తన్ని -’కావాలంటే నువ్వు పో… మా మనవణ్ణి ఇవ్వను. వీడు పెరిగి పెద్దవాడై వీడి తండ్రిని చంపిన వాళ్లని చంపాలి’ అంటాడు. నా బిడ్డను నాకివ్వమని ఆ కోడలు ఆక్రోశిస్తే -’నీ కొడుకా?… నాకొడుకు నీ పక్కలో పడుకుంటే పుట్టినాడు ఈ బిడ్డ’ అంటాడా ఫ్యాక్షనిస్టు. సినిమా రచయితల అవగాహన లేమికి, మితిమీరిన పైత్యానికి ఈ దృశ్యం, ఈ సంభాషణలు మరో ఉదాహరణ.

సీమ గ్రామ పార్టీల్లో, పార్టీ నాయకుల్లో ప్రధానంగా వుండేది భూస్వామ్య భావజాలం. అటువంటి భావజాలం వున్న గ్రామ పార్టీ నాయకుల్లో తమ కుటుంబ సమస్యలను నడిబజారులో పెట్టి, ఇంటి కోడలును కొట్టే మామలుండడం కలికంలోకి కూడా కానరాదు.

మరో అగ్రహీరో నటించిన ‘ప్రేమించుకుందాం..రా!’ సినిమాలో ఆ గ్రామ ఫ్యాక్షన్‌కు సంబంధంలేని నగర యువకుడు (హీరో వెంకటేశ్) ఫ్యాక్షనిస్టు కూతురును ప్రేమించి తీసుకుపోతాడు. ఆ ఫ్యాక్షనిస్టు అప్పటినుండి ఆ కుటుంబంపై పడి నానా బీభత్సం సృష్టిస్తాడు. ఆ యువకుని తల్లిదండ్రులు స్వయంగా ఆ ఫ్యాక్షనిస్టు దగ్గరకు వెళ్లి -’వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దమనసు చేసుకొని పెళ్లి చేయండి’ అని అర్థిస్తే, ‘రాయలసీమలో ప్రేమలేందిరా! ఇక్కడ ప్రేమలూ గీమలూ లేవు. పగ ప్రతీకారాలే’ అంటూ వాళ్లిద్దరినీ తన ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తాడు. ‘రాయలసీమలో ప్రేమలేందిరా!’ – అనే మాట సీమ ప్రాంత గ్రామనాయకుని నోట చెప్పించడమే రచయిత అవగాహనలేమికి పరాకాష్ట. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో బతుకుపోరాటం సాగుతున్నదే మానవసంబంధాలపై ఆధారపడి. మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలుగా మారిన దుస్సంస్కృతి ఇప్పటికీ రాయలసీమలో పూర్తిగా అడుగిడనే లేదు. అలాంటి సీమ పేరు బెట్టి తీసిన ‘గ్రామ పార్టీ’ల నేపథ్యంలో ‘ఇక్కడ ప్రేమలూ గీమలూ లే’వని పలికించడం ఈ ప్రాంత విలువలను ఊచకోత కోయడమే.

చదవండి :  పాలకవర్గాలు ఏర్పడినాయి!

విభిన్న ఫ్యాక్షన్ కథ పేరుతో వచ్చిన ‘యజ్ఞం’ సినిమా సైతం ఇందుకు మినహాయింపుకాదు. ఒక క్రూరుడైన(?) ధనవంతుని కూతురును, అతని దగ్గరే జీతగాడుగా పని చేస్తున్న హీరో ప్రేమించి, ఆమెను దక్కించుకునేందుకు పోరాడే ఒక సాధారణ సినిమా ప్రేమకథకు ‘రాయలసీమ’ ముసుగు తొడిగి మరిన్ని అపార్థాలను జనంలోకి ఇంజెక్ట్ చేశారు.

ఇలా చెప్పుకుంటూ పోతే ఇటీవల ఫ్యాక్షన్ పేరుతో వచ్చిన సినిమాలన్నీ ఇలాంటి పైత్యాన్ని ఆపాదించుకున్నవే. ప్రస్తుతం సీమ జిల్లాల్లో ఎక్కడా కనిపించని క్రూరదృశ్యాలను తెరకెక్కించి సీమవాసులకే తెలియని ఒక విష సంస్కృతిని – ‘మన సంస్కృతి ఇదీ’ అని సీమవాసులే అపోహపడేంత బలంగా సాంస్కృతిక విధ్వంస సృష్టి జరుగుతోంది.

సాహిత్యంలో మూలాలను రికార్డు చేయకపోవడమే …!

రాయలసీమకే పరిమితమైన విలక్షణమైన గ్రామపార్టీల మూలాలను సృజించే రచనలు సీమరచయితల నుండి తొలినుండీ లేకపోవడమే, ఒక రకంగా ఇప్పటి వక్రీకరణలకు కారణమనిపిస్తోంది. ఆంధ్రదేశంలోని అన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఆయా విలక్షణ జీవన విధానాలను రికార్డు చేసిన రచనలు ఆయా ప్రాంత రచయితల నుండి వెలువడ్డాయి. అయితే, ఆ కొరత రాయలసీమ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి అనాదిగా పరిమితమైన కరువు, కక్షల మూలాలను విశదీకరించే రచనలు 80వ దశకం ప్రారంభం వరకూ దాదాపు లేవనే చెప్పవచ్చు. 80కి ముందు కరువును కొంతమంది సీమరచయితలు అక్కడక్కడా ఉటంకించినా, సమగ్రంగా మూలాల అన్వేషణలోకి వెళ్లలేదు. గ్రామపార్టీల అంశం విషయానికొస్తే అసలా అంశాన్నే ప్రాచీన సాహిత్యంలో సృజించిన దాఖలాలు లేవు.

వెనుకబడిన ఈ ప్రాంతంలో ఆధునిక సాహితీరంగాల ప్రవేశం చాలా ఆలస్యంగా జరిగింది. ఆధునిక కథ, కవితవంటి ప్రక్రియలు వచ్చిన తరువాత కూడా ఈ ప్రాంత రచయితలు ఈ ప్రాంతానికే పరిమితమైన ‘విలక్షణ’ సమస్యలను రికార్డు చేయలేదు. 80వ దశకానికి ముందు సీమ నుండి వచ్చిన రచనలు అభివృద్ధి చెందిన ప్రాంతాల రచనల ప్రభావంతో ఎక్కువగా మధ్యతరగతి జీవన సమస్యలనే అధికశాతం తమ రచనల్లో ప్రతిబింబించాయి.

కేతు విశ్వనాధరెడ్డి, వై.సి.వి. రెడ్డి వంటివారు ఒకటీ రెండు కథల్లో ఈ ‘గ్రామపార్టీ’లను సృజించినా, పూర్తిగా వాటిపైనే దృష్టి కేంద్రీకరించలేదు. గ్రామపార్టీలో స్వయంగా కూరుకుపోయిన సొదుం జయరాం లాంటి కథారచయిత ఈ గ్రామ పార్టీల మూలాలను తడుముతూ కథలు రాయకపోవడం తీరని కొరతే. పొలిటికల్ ఫ్యాక్షనిజంతో సంబంధాలుండి సీమ సంస్కృతిని బాగా అధ్యయనం చేసిన ఎం.వి.రమణారెడ్డి లాంటి రచయిత వీటి జోలికిపోలేదు. 80వ దశకం తరువాతనే సీమ సంస్కృతిపై కథలు వస్తున్నా, అవి కూడా ఎక్కువగా కరువును ప్రతిబింబిస్తున్నాయి. కానీ మరో కోణమైన గ్రామపార్టీలను అక్షరబద్ధం చేయడం లేదు. ఈ పరిణామం వల్లే సినీ పరిశ్రమలో నేడు సీమతో పరిచయం లేని సినీ రచయితలు, ఇక్కడ ఎప్పుడో సమసిపోయిన గ్రామ పార్టీల నేపథ్యాలను తెరకెక్కించడంలో తమ పైత్యాన్ని తమ ఇచ్ఛానుసారం వెళ్లగక్కుతున్నారు.

స్వానుభవం, అధ్యయనం ఉన్న రచయితలకే ఇక్కడి గ్రామ పార్టీల మూలాలను పట్టుకోవడం సాధ్యం. అటువంటిది, ఈ సమస్యపై కనీసం ‘సహానుభూతి’ కూడా లేని వాళ్లందరూ సీమ గ్రామపార్టీల కథలను రాసుకుని ఈ ప్రాంత సంస్కృతిని వక్రీకరించి సినిమాలు తీసి ఆంధ్రదేశమంతటా వెదజల్లడం సీమవాసులు చేసుకున్న దురదృష్టం… చిత్రసీమ ప్రముఖులు సీమకు చేస్తున్న తీరని ద్రోహం… నేరం…!

– పాలగిరి విశ్వప్రసాద్

ఇదీ చదవండి!

బుగ్గవంక

బుగ్గవంక రిజర్వాయర్ సొగసు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: