లక్కోజు సంజీవరాయశర్మ గారి విజిటింగ్ కార్డ్
లక్కోజు సంజీవరాయశర్మ గారి విజిటింగ్ కార్డ్

గణిత బ్రహ్మ లక్కోజు సంజీవరాయశర్మ

మన కల్లూరు వాసి లక్కోజు సంజీవరాయశర్మ

1966 డిసెంబరు ఏడో తేదీ..

హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం వేదిక

2 power 103 ఎంత?

సమాధానంలో ముప్పైరెండు అంకెలున్న సంఖ్య చెప్పారు అవధాని

*   *   *

‘క’ నుంచి ‘క్ష’ వరకు ఉన్న అక్షరాలకు వరుసగా నంబర్లు వేస్తే, ‘స, రి, గ, మ, ప, ద, ని” అక్షరాల లబ్దం ఎంత?

ఏభై రెండు కోట్ల అయిదు లక్షల ఆరువేలు…

*   *   *

కలం, కాగితం రెండూ ఉన్నా గంటల కొద్దీ సమయంలో కూడా చెప్పలేని సమాధానాల్ని ఆయన ప్రశ్న అడిగినంత సులభంగా, ఏమాత్రం తడుముకోకుండా, ఆలస్యం లేకుండా సమాధానం చెప్పేవారు! ఆయనేమన్నా విద్యావంతుడా… కాదు.

పోనీ రెండు కళ్లూ ఉండి అంకెలిలా ఉంటాయి, సంఖ్యలిలా ఏర్పడతాయని చూడగలిగిన వారా… కాదు. పుట్టుగుడ్డి! పై ప్రశ్నల వంటివి ఆయన్ని వేలల్లో అడిగారు. ఆయన చెప్పిన సమాధానాలు సరిచూడడానికి గణిత మేధావులకు గంటల తరబడి సమయం కావలసి వచ్చింది.

ఆయనే గణిత బ్రహ్మ డా. లక్కోజు సంజీవరాయశర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!

*   *   *

శ్రీపాద కథల్లో వడ్ల గింజల ప్రస్తావన తెలిసిందే. రాజుని చదరంగంలో ఓడించినందుకు బహుమానంగా… మొదటి గడిలో ఒక వడ్లగింజ, రెండో గడిలో రెండు గింజలు, మూడో గడిలో నాలుగు, నాలుగో గడిలో ఎనిమిది… ఇలా అరవై నాలుగు గళ్లు నింపి ఇమ్మంటాడతను. రాజు ఓస్ ఇంతేనా అనుకొంటారు. తీరా ఎన్ని వడ్ల గింజలో తేల్చాల్సి వచ్చేటప్పటికీ అందరూ తలలు పట్టుకుంటారు! దానికి సంజీవరాయశర్మ చెప్పిన సమాధానం… ”ఒక కోటి 84 లక్షల, 46 వేల 74 కోట్ల 40 లక్షల, 73 వేల, 70 కోట్ల, 95 లక్షల 51 వేల, 615 వడ్ల గింజలన్నమాట… (1,84,46,74,40,73,70,95,51,615!)

చదవండి :  కార్వేటినగరం ఓ మధుర జ్ఞాపకం - నటి టి.జి.కమలాదేవి

ఒక ఘనపు మీటరు పరిమాణం ఉన్న బస్తాలో దాదాపు ఒక కోటి యాభై లక్షల వడ్లగింజలు పడితే… అటువంటి బస్తాలు ఒక కోటి ఇరవై లక్షల వేల కోట్లు ఘనపు మీటర్ల బస్తాలు అవసరం! నాలుగు మీటర్ల ఎత్తు, పది మీటర్ల వెడల్పు గల ఒక గాదెలో ఆ ధాన్యం నింపాలంటే ఆ గాదె పొడవు మూడు వందల కోట్ల కిలోమీటర్లు ఉండాలి. ఈ దూరం భూమికీ సూర్యుడికీ మధ్య ఉన్న దూరానికి రెండింతలు! అంత ధాన్యం ఈ భూమండలంపై ఉండదు!

ఇదంతా అబ్బురమనిపించవచ్చు. కానీ లక్కోజు సంజీవరాయశర్మ గణితావధాన మహిమ అదంతా!

*   *   *

1907 నవంబరు నెల 22న సంజీవరాయశర్మ కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలోని కల్లూరులో నాగమాంబ, పెద్ద పుల్లయ్యల దంపతులకు జన్మించారు. . జన్మతః అంధుడు కావడంతో పురుడు పోసిన మహిళ గొంతు నులిమి దిబ్బలో పాతెయ్యమంది. కొందరు బంధువులు నోట్లో వడ్ల గింజ వేశారు. అయినా ఆయన్ని మరణం ఏమీ చేయలేకపోయింది.

అప్పట్లో బ్రెయిలీ లిపి లేదు. పోనీ అంధుల్ని చేరదీసే వ్యవస్థా లేదు. శర్మ అక్క పాఠశాలలో చదివినవి ఇంటిదగ్గర గొంతెత్తి బిగ్గరగా మననం చేస్తే అవే ఆయన విన్నారు. తల్లిదండ్రులు… ఇతరులు చెప్పే మాటలు, చేసే చిన్నలెక్కలు విన్నారు. ఒకటి, రెండు, మూడు…. ఎలా ఉంటాయో తెలియకుండానే గణితబ్రహ్మ అయ్యారు!

సంవత్సరాలు, తిధులు, నెలలు, నక్షిత్రాలు, వారాలు, పక్షాలు… గంటలు, నిముషాలు, సెకనులు ఏవీ తెలియకున్నా అన్నీ తెలుసుకొని గణితంలో అపార విజ్ఞానం సాధించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో తల్లి పెంచారు. కల్లూరులో రైతులకు ధాన్యం ధర, భూమి కొలతలు చెప్పేవారు. వారు ఆయనకి కొంత సొమ్ము చెల్లించేవారు. గణితంలో పేరు ప్రఖ్యాతులు పొందుతోన్న కాలంలోనే ఆయన వయొలిన్ పట్ల ఆకర్షితులై నేర్చుకొన్నారు.

చదవండి :  త్యాగానికి మరోపేరు ...

సంజీవరాయశర్మ తొలిసారి 1928లో గణితావధానం నిర్వహించారు. అప్పట్నించీ 1995 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహారు, ఢిల్లీ రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించి ఆరువేల ప్రదర్శనలు ఇచ్చారు. మహానగరాలైన ఢిల్లీ, ముంబాయి, చెన్నై, బెంగుళూరు, హైదరాబాదుల్లోను పలు ప్రదర్శనలిచ్చారు.

అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు 1928 నవంబరు 15న నంద్యాలలో జరిగినపుడు ప్రధాన ఆకర్షణ లక్కోజు సంజీవరాయశర్మ గణితావధానమే! ఆయన పొందిన సన్మానాలు, ప్రదర్శనలు ఒక పుస్తకం అంత ఉన్నాయి. అప్పట్లో మద్రాసు గవర్నరు, భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వంటి జాతీయ ప్రముఖులు ఆయన మేధాశక్తికి ఆశ్చర్యచకితులయ్యారు! నాలుగువేల సంవత్సరాల వరకు సరిపోయే క్యాలండరు సైతం తయారుచేశారు. అప్పటి రాష్ట్రపతి డా. రాజేంద్రప్రసాద్ శర్మ ప్రతిభకు ముగ్ధులై తన దగ్గర ఉన్న సొమ్ము ఎం.ఓ చేయడం విశేషం!

Lakkoju Sanjeevaraya Sharma
నెల్లూరులో ఒక కార్యక్రమంలో వయోలిన్ వాయిస్తూ గణితావధానం చేస్తున్న శర్మగారు

అప్పట్లో అనీబ్‌సెంట్, నెహ్రూ, రాజేంద్రప్రసాద్‌లతో పాటు, బెజవాడ గోపాలరెడ్డి, శ్రీమాలి, హుమాయూన్ కబీర్, కాశీనాధుని నాగేశ్వరరావు, పి.వి.రాజమన్నార్, గవర్నర్ సర్ జార్జి స్టాన్లే, మేధ్స్ విజార్డ్ శకుంతలాదేవి తదితరులంతా శర్మ గణితావధాన ప్రదర్శనలు స్వయంగా తిలకించి అన్యులకు సాధ్యం కాదని వేనోళ్లా కీర్తించారు.

శర్మ పలు విశ్వవిద్యాలయాల్లో, ప్రసిద్ధ కళాశాలల్లో అవధానం ప్రదర్శించి విద్యార్ధుల్ని ఉత్తేజితుల్ని చేశారు. అలాగే గ్రంధాలయాల పిలుపునందుకొని పలు గ్రంధాలయాల్లోనూ తమ గణితావధాన ప్రదర్శనలు చేశారు. అలాగే మేధమేటికల్ సొసైటీల ఆహ్వానం మేరకు వాటి సభ్యుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఆయన ప్రతిభ రాయలసీమ నుంచి అంతర్జాతీయ వేదికలకెక్కింది.

చదవండి :  కీ.శే. ఏవీఎస్ రెడ్డి ఐఏఎస్

దురదృష్టం ఏమిటంటే 1993లో అమెరికా సందర్శించాలని ఆయన్ని అక్కడి తెలుగు సంఘాలు ఆహ్వానించినా సకాలంలో వీసా రాకపోవడంతో ఆ మేదావి ఇల్లు కదలలేకపోయారు. వివిధ విశ్వవిద్యాలయాలు… ఆయన్ని సత్కరించాయి. కొన్ని ఆయన్ని బంగారు పతకాలతో సత్కరించాయి.

చిత్రమేమిటంటే 1964 అక్టోబరు పదో తేదీన శర్మ రేణిగుంట నుంచి తిరుపతికి రైల్లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఆయన 14 బంగారు పతకాల సూట్‌కేసును దొంగలు తస్కరించారు.

ప్రపంచంలో అంధులైన మహా ప్రతిభావంతుల్లో జాన్‌మిల్టన్, బ్రెయిలీ కనుగొన్న హెల్‌న్ కెల్లర్, ద్వారం వెంకటస్వామినాయుడు వంటివారు పుట్టుకతో అంధులు కారు. తదనంతర కాలంలో వారు అంధులయ్యారు. మన దేశంలో గణిత శాస్త్రజ్ఞుల్లో భాస్కరాచార్యులు, రామానుజన్, శకుంతలాదేవి వంటివారు మంచి శిక్షణ పొందారు. కానీ సంజీవరాయశర్మ అంధుడే కాక చదువు సంధ్యలు లేని వ్యక్తి. అంతా వినికిడి జ్ఞానమే… ప్రపంచంలో ఆరుగురు గణిత శాస్త్రజ్ఞుల్లో ఒకరు శర్మ.

ఆనాడే బ్రిటిష్ వైస్రాయ్ ”ఈయన మా దేశంలో పుట్టి వుంటే దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం” అని శర్మనుద్దేశించి అన్నారు.

శకుంతలాదేవి స్వయంగా నాకన్నా ప్రతిభావంతుడు అని అంగీకరించింది. అయినా ఆయన పేదరికంలోనే జీవించారు. శ్రీనివాస రామానుజన్ వంటి మేధావిని గుర్తించని దేశమిది. అలాగే సంజీవరాయశర్మని రక్షించుకోలేకపోయింది.

1997 డిసెంబరు రెండోతేదీన సంజీవరాయశర్మ అస్తమించారు. ‘అంక విద్యాసాగర’ విశ్వసాంఖ్యాచార్య, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ పొందిన శర్మ తన చివరి రోజుల్ని శ్రీ కాళహస్తీశ్వరస్వామి సన్నిధిలో వయొలిన్ మీటుతూ స్వామినర్చిస్తూ గడిపారు!

ఈ నోబెల్ బహుమతులు, మెగ్‌సెసేలు, జ్ఞాన్‌పీఠ్‌లు… ఆయన ప్రతిభ ముందు ఎంత చిన్నవో!

– చీకోలు సుందరయ్య

ముఖచిత్రం : శర్మ గారి విజిటింగ్ కార్డ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: