కడప జిల్లాలో వీరశిలలు

ప్రాచీన కాలం నుంచి కడప జిల్లా కవులకు, కళాకారులకే గాక వీరులకు, వీర నారీమణులకు, త్యాగధనులకు కూడా పుట్టినిల్లు.

విజయనగర రాజులు వారి రాజ్యంలో పన్నులు వసూలు చేయుటకు పాళెగాండ్రను నియమించుకున్నారు. 16,17 శతాబ్దాములలో విజయనగర పతనానంతరము పాలెగాండ్రు, జమీందారుల ప్రాబల్యము పెరిగి, వీరు ప్రజాకంటకులుగా, దోపిడీదారులుగా, వర్ణనాతీతమైన దారుణాలకు పాల్పడుతూ, ప్రజల ధన, మాన, ప్రాణాలను దోచుకునేవారు. క్రీ.శ. 1800 సంవత్సరం కడప జిల్లాకు కలెక్టరుగా వచ్చిన థామస్‌మన్రో, మేజర్‌ జనరల్‌ డి.క్యాంప్‌బెల్‌ అనే సేనానిని తోడు చేసుకుని పాలెగాండ్రను అణచివేసి, కొందరిని చంపి, కొందరికి పెన్షన్‌ ఏర్పాటు చేసి జిల్లా అంతటిని ప్రశాంతత కల్గించారు.

పాలెగాండ్ర ప్రాబల్యము ఎక్కువగా ఉన్న కాలంలో ప్రజల మాన, ధన, ప్రాణాలను కాపాడు ప్రభుత్వాలు, లేక వీరి దోపిడీల నుండి, హింసల నుండి తమను తాము రక్షించుకొనుటకై ప్రజలే ముందుకు వచ్చారు. ప్రతి గ్రామంలోను బురుజులను, కోటలను ఏర్పాటు చేసుకుని అందులో నుంచి దోపిడిదారులు, దొంగల నుంచి, తమ గ్రామ సంపదను కాపాడుకునేవారు. ఈ విధంగా ప్రజల ఆస్తులను కాపాడుటకై జరుగు పోరాటాలలో వీరోచితంగా పోరాడి ప్రాణాలర్పించిన వీరులను సంస్మరించుకొనుటకు, వారి, వీరప్రతాపాలను భావితరాలు గుర్తించుటకై వీరి శిలాప్రతిమలను ఆయా గ్రామ కూడళ్ల వద్ద, దేవాలయ ప్రాంగణములలో ఉంచేవారు. వీటినే వీరశిలలు అంటారు. రానురాను దోపిడీదారులతో పోరాడి అసువులు బాసిన వీరులకే గాక, గ్రామ గౌరవ మర్యాదలను కాపాడుటకై త్యాగాలు చేసిన త్యాగధనులకు, భర్త మరణానంతరం సతీసహగమనము చేసిన స్త్రీ మూర్తుల శిలారూపాలను ఏర్పాటు చేసుకునే ఆచారం కడప జిల్లాలో ఉండేదనడానికి అనేక సాక్ష్యాలున్నాయి.

చదవండి :  కరువుసీమలో నీళ్ళ చెట్లు!

క్రీ.శ. 1810 నుంచి 1816 వరకు మదరాసు రాష్ట్ర సర్వేయరుగా పని చేసిన కల్నల్‌ కాలిన్‌ మెకంజీ సుమారు 1600 తాళపత్ర గ్రంథాలను, అనేక శిలాశాసనాలను సేకరించి, మరియు ఆనాటి గ్రామాధికారులైన రెడ్లు, కరణాల నుంచి సమాచారాన్ని సేకరించి కైఫీయత్తులను తయారు చేశారు. కైఫీయత్తు అనగా స్థానిక చరిత్ర, వివరణము, సమాచారం అని అర్థం. మెకంజీగారు తయారు చేసిన కడప జిల్లా కైఫీయత్తులో జిల్లాలోని వివిధ గ్రామాలలో ఉన్న వీర శిలలు వాటి చరిత్ర మనకు తెలియుచున్నది. ఈ విధంగా మెకంజీ మనకు సంస్మరణీయుడైనాడు.

మెకంజీ కైఫీయతులోని ఒక ఉదాహరణ:

కమలాపురం తాలూకాలోని చిలమకూరు గ్రామం చెరువు వద్ద ఉన్న గొల్లతిమ్మప్ప వీరశిల. కైఫీయతు ప్రకారం మల్లెలపాలెగాండ్రు చిలమకూరు, దాని చుట్టుప్రక్కల గల గ్రామాలపై తరచూ దాడి చేసి ప్రజల సంపదను దోచుకుని పోతుండేవారు. అది గమనించి చిలమకూరు గ్రామస్తులు ఐకమత్యంతో ఒక కోట, బురుజులను కట్టించుకుని అందులోనుంచి పాలెగాండ్ర సైన్యాన్ని ఎదిరించేవారు. ఒకసారి పాలెగాండ్రు చిలమకూరుపై దాడి చేసి అదీ వీలుగాక కోట వెలుపల ఉన్న పశు సంపదను దోచుకుని తోలుకుని పోతుండగా చిలమకూరు యువకులు వారిని వెంటాడి పోరాడి పశువులను మళ్లించుకుని వచ్చారు. ఈ పోరాటములో గొల్ల తిమ్మప్ప అనే వీరుడు బల్లెము చేతబట్టి శత్రువులను చీల్చి చెండాడి, శరీరానికి తగిలిన గాయాలచే మరణించాడు. చిలమకూరు గ్రామస్తులు తిమ్మప్ప శవాన్ని గ్రామంలో ఊరేగించి చెరువు వద్ద సమాధి చేసి అచ్చటనే తిమ్మప్ప వీరశిలను స్థాపించారు. కాలాంతరమున గుడిని కూడా నిర్మించారు.

చదవండి :  'ఉక్కు' నివేదిక ఏమైంది?
మోపూరు భైరవాలయంలోని వీరశిలలు
మోపూరు భైరవాలయంలోని వీరశిలలు

పులివెందుల తాలూకా ప్రాంతాన్ని పరిపాలించిన వినుకొండ వల్లభరాయులు, మోహనాచలంగా ఆనాడు ప్రసిద్ధిచెందిన, నేటి, మోపూరు భైరవేశ్వరాలయ ప్రాంగణంలో మహామ్మదీయుల దురాక్రమణ నుంచి దేవాలయాన్ని కాపాడి ప్రాణాలర్పించిన వీరుల, మరియు అనేక యుద్ధాలలో తన పక్షాన పోరాడి వీరమరణము పొందిన వీరుల వీరశిలలను ఏర్పాటు చేశాడు.

లింగాల మండలం వెలిదండ్ల గ్రామ సమీపంలోని దేవరకోన శ్రీవరదరాజస్వామి ఆలయ ప్రాంగణంలో దర్శనమిస్తున్న ధృత ధనుష్పాణులైన వీరశిలలు పాలెగాండ్రతో పోరాడి అమరులైన కమ్మవీరుల వీరశిలలు. రైల్వేకొండాపురం మండలం తిమ్మాపురం గ్రామ సమీపంలోని కోనలోను వీరశిలలను చూడవచ్చు. సింహాద్రిపురం మండల కేంద్రమునకు అతి సమీపంలోని పాతపల్లె గ్రామంలో ఉన్న వీరశిలలు పెడకంటికాపు కులస్థులలోని కొన్ని వంశాల మూలపురుషులుగా పూజలందుకుంటున్నాయి. కాపు, తలారి, వడ్డె కులాలలో నేటికి కొన్ని వంశాల వారు వారి ఇళ్లలో జరిగే పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు మొదలైన శుభకార్యాలకు ముందుగా వీరులకు పూజలు బోనాలు సమర్పించిగాని శుభకార్యాల పనులు మొదలుపెట్టరు. ఈ ఆచారము ఎక్కువగా పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు తాలూకాలలో కనిపిస్తుంది.

కడప జిల్లాలో పోరాటాలలో ప్రజల ధన ప్రాణ సంపదలను కాపాడిన స్త్రీ, పురుషులకే గాక సతీసహగమనము చేసిన స్త్రీ మూర్తులకు కూడా వీరశిలలను స్థాపించి పూజించు ఆచారమున్నది. అందుకు ఉదాహరణము సింహాద్రిపురం మండలం బిదినం చెర్ల గ్రామంలో ఉన్న వీర సిద్ధమ్మ ఆలయం. వీరసిద్ధమ్మ క్రీ.శ. 18వ శతాబ్దపు చివరిలో నేటి యల్లనూరు మండలం దంతలపల్లె గ్రామంలో కాపు(రెడ్డి)కులంలో పుట్టింది. లింగాల మండలం బోనాల గ్రామం వ్యక్తితో వివాహం జరిగింది. ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజులలో కాలినడకన తన తండ్రితో కలసి అత్తవారింటికి బయలుదేరింది. దారిలో బిదినంచెర్ల గ్రామం దగ్గరకు చేరగా భర్త మరణించాడనే వార్త విని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా చితిపేర్పించుకుని సహగమనము అయింది. ఆమె గుర్తుగా వీరశిలను, చితి పేర్చిన చోట ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. ఇటీవల వీరసిద్ధమ్మకు కృష్ణశిలతో శిలామూర్తిని చెక్కించి, ప్రతిష్ఠించి, గుడిని నిర్మించి పూజలు చేస్తున్నారు.

చదవండి :  నేడు జిల్లాకు ముఖ్యమంత్రి

వీరులకు, వీరవనితలకు వీరశిలలను స్థాపించుటయేగాక వారి కీర్తిని కీర్తిస్తూ జానపదులు జానపద గీతాలతో సంస్మరించుకోవడం కడప జిల్లాలో కనిపిస్తుంది. ఉదాహరణము:

కడప జిల్లాలో జమ్మలమడుగు
జగుమానా కొట్టాలపల్లి
రెడ్డిపేరు చెప్పుతూనే మెచ్చి కుర్చీ వేసినారూ!
నా కొడకో మానందరెడ్డి వచ్చీపోయే దారిలోన
దానిమ్మ చెట్టు కింద
వెండికుచ్చునేల బడితే ఏటుకే నరికిరి నిన్నూ
నా కొడకా మానందరెడ్డీ.

అంతేగాక వీరుల జ్ఞాపకార్థము వారి వారసులకు కొంత భూమిని ఇచ్చి వాటికి బలిమాన్యము పొలిమాన్యము అను పేరు పెట్టేవారు. ఇట్టి మాన్యాలు అక్కడక్కడ గ్రామాలలో కనిపిస్తున్నాయి.

– గరుడాద్రి కృష్ణప్రసాద్‌

ఇదీ చదవండి!

పోతిరెడ్డిపాడును

కడప జిల్లాలో వరి వద్దు చీనీ సాగే ముద్దు

జిల్లా రైతులకు ముఖ్యమంత్రి పరోక్ష సందేశం కడప:  రైతులు కడప జిల్లాలో వరి సాగు చేయకుండా ఉద్యాన పంటలు పండించుకోవాలని …

2 వ్యాఖ్యలు

  1. వీరశిలలను వీరగల్లులు అని కూడా అంటారు. ఇవి ఖాజీపేట మండలం పుల్లూరు , మైదుకురు మండలం ఎల్లంపల్లె , ఎకర్లపాలెం ,గంజికుంట ప్రాంతాల్లో కూడా కనిపిస్తాయి.

  2. హనుమంతప్ప

    మంచి సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: