మాలెపాడు శాసనము
ఒంటిమిట్ట కొదందరామాలయంలోని ఒక శాసనం

కడప జిల్లా శాసనాలు 1

తెలుగు శాసనాలను గురించి మాట్లాడేటప్పుడు తెలుగు భాషకు తొలి అక్షరార్చన కడప జిల్లాలో జరిగిందనే విషయాన్ని తప్పనిసరిగా స్మరించుకోవలసి ఉంటుంది. ఇప్పటివరకు లభించిన తెలుగు శాసనాల్లో రేనాటి చోళరాజు ధనుంజయుడు వేయించిన కలమళ్ళ శాసనం మొట్టమొదటిది. ఈ రాజుదే ఇంకొక శాసనం ఎర్రగుడిపాడులో కూడా లభించింది. శాస్త్రాన్ని బట్టి ఈ శాసనాలు క్రీ.శ.575 ప్రాంతానికి చెందినవిగా నిర్ణయించబడ్డాయి.

ప్రాచీన తెలుగు శాసనాల్లో ఎక్కువభాగం రేనాటి చోళులవే కావడం వల్ల ప్రాచీనాంధ్ర భాషా స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఈ శాసనాలే ఎక్కువగా ఉపయోగపడుతున్నాయి. తెలుగు భాష లిఖితరూపంలో ప్రచారం కావడానికి, బహుశ పరిపాలన భాషగా వ్యవహారంలోకి రావడానికి రేనాటిచోళ రాజులు చూపిన చొరవ శ్రీకారం చుట్టిందని చెప్పవచ్చు. అప్పటినుంచి అన్ని కాలావధుల్లోను వివిధ రాజవంశాలకు చెందిన పరిపాలకులు వేయించిన తెలుగు శాసనాలు మనకు విస్తారంగా లభిస్తున్నాయి.

శాసనం అంటే…

శాసనం అంటే రాజాజ్ఞ అని అర్థం. పరిపాలకులు తాము ఇచ్చిన దానాలను, సాధించిన ఘనకార్యాలను భావితరాల పరిపాలకులకు, ప్రజలకు తెలియజెయ్యడం కోసం శాసనాలను ప్రకటించేవారు. కొన్ని పన్నులను మినహాయించినప్పుడు, కొన్ని ప్రత్యేక విషయాలను ప్రకటించడానికి కూడా శాసనాలు జారీ చెయ్యబడేవి.
శాశ్వతంగా నిలిచే పదార్థం మీద చెక్కబడిన వ్రాతను శాసనం అని ఇప్పుడు మనం వ్యవహరిస్తున్నాం. ఇది ఒక పదం కావచ్చు, ఒక వాక్యం కావచ్చు, కొన్ని వందల పంక్తులూ కావచ్చు. సాధారణంగా శిలల మీద, లోహఫలకాల మీద శాసనాలు చెక్కబడి ఉంటాయి. ఏనుగు దంతంతో చేసిన వస్తువులు, మట్టిపాత్రలు, ఇటుకలు మొదలైన వాటిపై చెక్కిన శాసనాలు కూడా మన దేశంలో లభిస్తున్నాయి.

చదవండి :  జిల్లాల వారీ నేర గణాంకాలు 1971

ప్రాచీన శాసనాల లిపి, మధ్యయుగ శాసనాల్లో వాక్య నిర్మాణం ప్రస్తుత వ్యవహారానికి భిన్నంగా ఉండటం వల్ల సామాన్య ప్రజల్లో శాసనాలను గురించిన కొన్ని అపోహలు ఇటీవలి కాలంలో ప్రచారంలోకి వచ్చాయి. కొందరు మోసగాళ్లు, శాసనాలలో గుప్తనిధుల ఆచూకీని తెలిపే గుడికట్టులని దురాశాపరులను నమ్మించడం వల్ల ప్రజల్లో మూఢ విశ్వాసాలు వ్యాపించడంతో పాటు శాసనసంపదకు అపారమైన నష్టం వాటిల్లుతూ ఉంది. ఇటువంటి విశ్వాసాల కారణంగానే ఎన్నో తామ్ర శాసనాలు వెలుగులోకి రాకపోవడం వల్ల చరిత్ర రచనలో పూరించడానికి వీలులేని ఖాళీలు ఏర్పడ్డాయి.

ఎనిమిది వందలకుపైగా శిలాశాసనాలు…

కడప జిల్లాలో ఎనిమిది వందలకుపైగా శిలాశాసనాలున్నాయి. అధిక సంఖ్యలో ఉన్న తెలుగు శాసనాలతోపాటు  వీటిలో నూటికిపైగా తమిళ శాసనాలు, దాదాపు నూరు కన్నడ శాసనాలు, కొన్ని సంస్కృత శాసనాలు, రెండు బ్రాహ్మీలిపిలో ఉన్న ప్రాకృత శాసనాలు, ఒక మరాఠీ శాసనం ఉన్నాయి. కొన్ని శాసనాలు రెండుమూడు భాషల్లో చెక్కారు.

దొంగలసాని శాసనం: దొంగల సానిలో ఉన్న ఒకే శాసనం నాలుగు భాషల్లో ఉంది. ఇందులో కన్నడ, తమిళ, తెలుగు, మరాఠీ భాషల్లో శాసనపాఠాలున్నాయి. ఈ శాసనం నెల్లూరు తెలుగు చోళరాజు నల్లసిద్ధరస దేవుడు, పొత్తపి దేశాధీశ్వరులైన మల్లిదేవ సోమేశ్వరులను దొంగలసాని యుద్ధంలో ఓడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంది.

చదవండి :  ఔను..వీళ్ళు కూడా అంతే!

నందలూరు శాసనం: మూడవ రాజేంద్రచోళుని పదమూడవ రాజ్య సంవత్సరం (క్రీ.శ.1257-58) నాటి నందలూరులోని ఒక శాసనం సంస్కృతం తెలుగు తమిళ భాషల్లో ఉంది. ఈ శాసనంలో సంస్కృతం భాగం గ్రంథలిపిలో, తెలుగు భాగం తెలుగు లిపిలో, తమిళభాగం తమిళలిపిలో చెక్కబడివుంది.

ప్రత్యేక ప్రతిపత్తి…

విషయ వైవిధ్యంలో కూడా కడప జిల్లా శాసనాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఉంది. శాసనంలో చెప్పబడిన విషయాన్నిబట్టి చేసే వర్గీకరణలో  శాసన పరిశోధకులు పేర్కొన్న విభాగాలన్నింటికీ ఉదాహరణలు ఇక్కడి శాసనాలలో లభిస్తాయి. ఇతర ప్రాంతాలలో ఎక్కడా కనిపించని చిడికల్లు శాసనం, పొలిమాటు శాసనం, కానాపకమ్మ, నమ్మిక శాసనం వంటి విభాగాలు శాసన వర్గీకరణలో కొత్త కోణాలను ఆవిష్కరిస్తున్నాయి.

దానశాసనాలు…

మనదేశంలో లభించిన శాసనాలలో ఎక్కువభాగం దాన శాసనాలే. పరిపాలకులు బ్రాహ్మణులకు లేదా దేవాలయాలకు భూములను లేదా అగ్రహారాలను దానమిచ్చి, ఆ విషయాన్ని ప్రకటిస్తూ జారీ చేసిన శాసనాలను దానశాసనాలంటారు.

రామేశ్వరంలోని కృష్ణదేవరాయల శాసనం: ప్రజల  మీద విధించిన కొన్ని పన్నులను రద్దు చేయడాన్ని కూడా పరిపాలకులు సహిరణ్యోదక దానధారా పూర్వకంగానే నిర్వర్తించేవాళ్లు. కృష్ణదేవరాయల ఆనతి ప్రకారం అతని మంత్రి సాళువ తిమ్మరుసు ఘనగిరి, గుత్తి, కందనవోలు, గండికోట, సిద్ధవటం, చంద్రగిరి, నాగమంగళం, ముల్నాడు, రాయదుర్గం సీమల్లో  వివాహసమయంలో వధూవరులు చెల్లించవలసిన పెండ్లి సుంకాన్ని సహిరణ్యోదక ధారాపూర్వకంగా రద్దు చేసినట్లు రామేశ్వరంలోని కృష్ణదేవరాయల శాసనం తెలుపుతూంది.

చదవండి :  గండికోటను దత్తత తీసుకున్న దాల్మియా సంస్థ

ప్రశస్తి శాసనాలు…

కొన్ని శాసనాల్లో దానవిషయం చాలా కొద్దిగా ఉంది. ఆ శాసనాలను జారీ చేసిన రాజులను గురించి పొగడ్తలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి శాసనాలను ప్రశస్తి శాసనాలు అంటారు. ఈ విభాగానికి చెందిన శాసనాలలో శాసనాన్ని వేయించిన రాజుయొక్క వంశవృక్షం, ఆ రాజు, అతని పూర్వీకుల పరాక్రమాన్ని గురించి, వాళ్లు సాధించిన యుద్ధవిజయాలను గురించి, వాళ్లు చేసిన దానాలను గురించి, వాళ్ల కళా పిపాసను గురించి వర్ణనలుంటాయి. కొన్ని సందర్భాలలో ఆ రాజులకు దేవతలతో లేదా పౌరాణిక వీరులతో సామ్యాన్ని ఆపాదించడం కూడా కనిపిస్తుంది.

కడప జిల్లాలో లభిస్తున్న శాసనాలలో రాష్ట్రకూట చక్రవర్తి మూడవ కృష్ణునికి సంబంధించిన రామేశ్వరం శాసనం, రామేశ్వరంలోనే ఉన్న కృష్ణదేవరాయల శాసనం, కాకతీయ చక్రవర్తి గణపతి దేవునికి సంబంధించిన పొందలూరు శాసనం, తెలుగు చోళ వంశానికి చెందిన జగతాపి గంగయుదేవచోడరాజు వేయించిన తాళ్ల ప్రొద్దుటూరు శాసనం, కృష్ణదేవరాయల కాలంలో చెన్నూరు పోట్లదుర్తి సీమలకు నాయంకరుడైన జూపల్లి పెదసింగ మహీపాలుని ఉప్పలూరు శాసనం ఈ కోవకు చెందుతాయి. ప్రశస్తి శాసనాలు అతిశయోక్తులతో నిండి ఉన్నా రాజవంశాల చరిత్రను నిర్మించడానికి ఎంతో ఉపకరిస్తాయి. మూడవ కృష్ణుని రామేశ్వరం శాసనం రాష్ట్రకూట వంశ చరిత్ర నిర్మాణానికి ప్రధానమైన ఆకరాల్లో ఒకటిగా పరిగణనలో ఉంది.

(సశేషం)

– డాక్టర్ అవధానం ఉమామహేశ్వరశాస్త్రి

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: