సిద్దేశ్వరం ..గద్దించే

శ్రుతి (కథ) – డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి

జీవితంలో ముందు ముందు ఎవరిదారి వాళ్ళదనుకున్నాము. నలుగురం ఎప్పుడైనా, ఎక్కడైనా కలవడం కూడా అంత సాధ్యం కాదేమో అని నిరుత్సాహపడ్డాము. కాన్పూరు ఐ.ఐ.టిలో బి.టెక్ చదివిన నాలుగేళ్లూ ఎంతో ఆత్మీయంగా గడిచాయి. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఒకచోట పనిచేసే అవకాశం వస్తుందని ఎవరూ కలగనలేదు. అబ్దుల్లాది జమ్ము, సేతు మాధవన్‌ది తంజావూరు, దేశపాండేది పూనా, నాదేమో తెనాలి. నలువురం ఒకే దేశంలోని వాళ్ళమే. అయినా ఉద్యోగాల విషయంగా ఎవరు ఎక్కడుంటామో తెలియదు.

అయితే, నిజం ఊహకంటే గొప్పది. మా నలువురికీ కడప జిల్లాలో ఒకమారుమూల ఉద్యోగాలు దొరికాయి. బొంబాయి పారిశ్రామికులెవరో కొత్తగా కట్టే సిమెంటు ఫాక్టరీలో ఆ మా ఉద్యోగాలు. నలువురం ఒకే బ్రాంచి చదకపోవడం మేలైంది. నేనూ, దేశపాండే మెకానికల్, అబ్దుల్లా ఎలెక్ట్రికల్, సేతుమాధవన్ సివిల్. సిమెంటు ఫ్యాక్టరీలోని వివిధ దశల్లో మేమెంతో అనుభవం సంపాదించే అవకాశం వచ్చిందనీ అది ముందు మాకెంతో తోడ్పడుతుందనే సంబరపడ్డాము. నలువురికీ మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించాము. ఒకేరోజు చేరాము. మా ప్రమోషన్లూ అవీ ఒకేరోజు రావాలి అన్నది మా కల.

మా ఉద్యోగ భూమిని చూసి ఆశ్చర్య పోయాము. అంతా నల్ల ఎడారి. నాపరాళ్ళ కీకారణ్యం. ఆ ఊరు టౌనూకాదు, పల్లేకాదు. ఇళ్ళన్నీ రాళ్ళతో కట్టినవే. మాకు దొరికిన అద్దిల్లు వేయిస్తంబాల గుడి. లెట్రిను లేదు. నీళ్ళసౌకర్యం లేదు. గాలికీ కరువే. పవర్ మాత్రం ఉంది. అక్కడున్నవి హోటళ్లు అనడం కంటే వాటిని మరే పేరుతోనో పిలిస్తే బావుంటుంది. దిన పత్రికలు కూడా అప్పుడప్పుడే ఆఊరు ముఖం చూస్తున్నట్లుంది. ఏమైనా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోని గ్రామాలకంటే నయమే. బందిపోట్ల భయం లేదు. జనం సాధువులు. భాషే వినడం కష్టం. మర్యాద తెలియదు. అందరూ అందర్నీ “నువ్వు నువ్వు” అనే వాళ్ళే. వీళ్ళ భాషలో మీరు లేదు. కడపలో మానాన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పనిచేసిన రోజుల్లో నాకు ఇది అనుభవమే; అప్పుడు ఇంటరు చదివేవాణ్ణి. మిగతా మా స్నేహితులకు తెలుగురాదు కాబట్టి ఇబ్బంది లేదు. అయితే అబ్దుల్లా కనిపెట్టాడు. అక్కడి మహమ్మదీయులు ‘తూ’ ‘తుమ్’ అనే మామూలుగా అంటారనీ, ‘ఆప్’ అనరనీ. నెలరోజుల్లో ఆ కొత్త ప్రాంతానికీ, ఉద్యోగానికీ అలవాటు పడిపోయాము.

ఒకరోజు సాయంకాలమనుకుంటాను, నలువురం ఓ దుకాణంలో భాగంగా ఉన్న కాఫీకొట్టు దగ్గర బెంచీమీద కూర్చోని కాఫీ తాగుతున్నాము. మాకెదురుగా రాతి అరుగుమీద కూర్చున్న యువకుడు నావైపే చూస్తున్నాడు. పలకరించాలని సందేహిస్తున్నాడు. నాకూ అతనెవరో జ్ఞాపకం రావడంలేదు. అతనే కాసేపు తటపటాయించి చొరవ తీసుకొని పలకరించాడు “నువ్వు… మీరు ప్రకాశం కదా! కడప కాలేజీలో ఇంటర్లో మీ క్లాస్‌మేట్ని”

జ్ఞాపకం వచ్చింది. అతను చంద్ర. ఇంటర్ చదివే రోజుల్లో నాకున్న మంచి మిత్రుల్లో ఒకడు. ఈ అయిదేళ్ళలో మరీ సన్నబడ్డం వల్ల పోలిక తెలియలేదు. బట్టలూ అవీ మాసి ఉండడం వల్ల గుర్తుపట్టలేక పోయాను. మర్యాదకొద్దీ క్షమాపణ కోరాను. ఇంటరు చదువుకునే రోజుల్లో నాకు ఇష్టమైన మిత్రుల్లో ఒకడు. మిగతా నాముగ్గురు మిత్రులను పరిచయం చేశాను.

మాటల సందర్భంలో తెలిసింది. అతనిది పక్క వూరేనట. బి.కాం చదివి చదువు మానేశాడట. సిమెంటు ఫ్యాక్టరీ కోసం తనకున్న నాలుగెకరాల భూమి పోవడం వల్ల ఫ్యాక్టరీ వాళ్ళు క్లర్కు ఉద్యోగం మొన్ననే ఇచ్చారట. రోజూ ఊరు వెళ్ళి వస్తున్నాడట. వాళ్ళ ఊరు రమ్మని మమ్మల్ని ఆహ్వానించాడు. మా స్నేహాలు కలిశాయి.

ఒక సెలవురోజు ‘చంద్ర’ ఊరికి వెళ్లాము. ఎంతో మర్యాద చూపారు. నాగరికత బలిసిన మా ప్రాంతాల్లో ఇటువంటి అమాయకత్వంతో కూడిన మర్యాదా మన్నన్నా నేను చూళ్లేదు. ఆ రాత్రి ఇంటి ముందర ఆరుబయట మంచాలు వేసుకొని వెన్నెల్లో మాట్లాడుతూ పడుకున్నాం. ఓ పది పదిహేను మంది బిలబిలా వచ్చి మమ్మల్ని పలకరించి పోయారు. వాళ్ళంతా ఫ్యాక్టరీలో పనిచేసే ఆ ఊరివాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోయాక చంద్ర అన్నాడు.

“చూశారు కదా! వీళ్ళంతా ఒకప్పుడు భూమీ పుట్రా ఉన్న రైతులే. వానల్లేక అప్పుల పాలయ్యారు. పంటల్లేక భూములమ్ముకున్నారు. యిప్పుడు కూలీలుగా మారిపోయారు. ఈఫ్యాక్టరీ పని పూర్తీ అవుతే మళ్ళీ ఏం జరుగుతుందో తెలీదు. వీళ్ళేమీ ‘స్కిల్డ్ లేబరు’కాదుకదా! మట్టిమోయగలరు, రాళ్లు కొట్టగలరు…” చంద్ర ఈ ధోరణిలో చాలా చాలా విషయాలు మాట్లాడాడు; ఆ మాటల వెనుక బాధ ఏదో ఉంది; కసి ఏదో ఉంది. అదంతా నాకు కొత్త ప్రపంచం. ఒకరకంగా కొత్త అనుభవం, దారిద్ర్యం చూసినంత మాత్రాన, సులభంగా అర్థమయ్యే సమస్య కాదు. అబ్దుల్లా, సేతు, పాండే ఎప్పుడో నిద్రపోయారు. వాళ్ళు అన్నీ మనసుకు పట్టించుకునే రకం కాదు. ఇంటరు రోజుల్లో చదువు తప్ప ఏమీ పట్టని చంద్ర యిప్పుడు మాట్లాడే మాటలు చూసి నిజంగా నాకు భయం వేసింది. నిద్ర వస్తుందని బొంకాను. చంద్ర మాట్లాడ్డం ఆపాడు. కానీ ఆ రాత్రి సరిగ్గా నాకు నిద్రపట్టలేదు.

చదవండి :  రేపు కడపలో సీమ కథల పుస్తకాల ఆవిష్కరణ

గడిచిన ఆరుమాసాల్లో చంద్ర మాకు మరింత సన్నిహితమయ్యాడు. ఎప్పుడైనా రాత్రిళ్ళు మా గదికి వచ్చేవాడు. అక్కడే పడుకునేవాడు. అతని మాటలు వినడానికి బావుండేవి. విన్న తరువాత ఆలోచిస్తే భయమేసేది. కానీ చంద్ర ముఖంలోని నిష్కాపట్యం నన్ను ఆకట్టుకునేది. మాటల్లోని నిజాయితీ నన్ను వద్దన్నా ఆలోచింపచేసేది.

ఒకరోజు సేతు నన్ను హెచ్చరించాడు, చంద్ర ప్రమాదకరమైన మనిషి అనీ, మనం కాస్త దూరంగా ఉండాలనీ. “ఏమిటా ప్రమాదం” అన్నాను. సేతు చెప్పుకొచ్చాడు. ప్రమాదకరమైన ట్రేడ్ యూనియన్‌తో సంబంధాలున్నాయని చెప్పాడు. తమిళ కార్మికుల మధ్య, తెలుగువాళ్ళ మధ్య ఏవో తగాదాలు సృష్టిస్తున్నాడని ఆరోపించాడు. నేను నమ్మలేదు. ఈ విషయం చంద్రనే అడుగుతానని చెప్పాను. అడగవద్దన్నాడు.

కానీ వారం రోజుల తర్వాత స్థానిక కార్మికులకూ, తమిళ కార్మికులకూ పెద్ద యుద్ధం జరిగింది. స్థానిక తమిళ కార్మికుల్ని చితకబాదారు. ఒకరిద్దరికి బలమైన గాయాలు తగిలాయి. వాళ్ళు వేసుస్కున్న గుడిశెల్ని పీకి పారేశారు. ఊళ్ళో రకరకాల ప్రచారం. నిజమేదో తెలియదు. తెలుగు అమ్మాయిని తమిళ కార్మికుడెవడో చెరచడానికి ప్రయత్నం చేయడం వల్ల ఇది జరిగిందని కొందరన్నారు. కార్మికుల మధ్య అప్పుల తగాదా అని కొందరన్నారు. సేతు మాత్రం మొదటి సారిగా “మీ తెలుగు వాళ్ళకు ఏమీ చేతకాక పోయినా అహంకారం ఎక్కువ. తమిళులు స్కిల్డ్ వర్కర్సు. వాళ్ళను చూసి అసూయ. మద్రాసులో అంతమంది తెలుగువాళ్ళు వుంటే తమిళులు ఇలాగే ప్రవర్తిస్తున్నారా!” అన్నాడు. చదువుకునే రోజుల్లో అయితే ఈ రకం మాటల్ని సరదా కింద తీసుకునేవాళ్ళం. ఒక మారు సేతు “మా సాహిత్యం మొత్తం భారతదేశంలోనే ప్రాచీనమైంది. మా నాగరికత గొప్పది. మేము క్రీస్తు పూర్వమే ప్రపంచంలోని ఇతరదేదేశాలతో వ్యాపారం చేసాము. మలేషియాలో చూడండి, ఇండోనేషియాలో చూడండి, శ్రీలంకలో చూడండి మాసంస్కృతి ప్రభావం” అని అన్నాడు. “నిజమే, ఇప్పటికీ ప్రాచీనులే. దానికి ఉదాహరణ సేతు వీభూది పట్టెలు పెట్టడమే. ఉదయాన్నే తన భక్తి గీతాల అరుపుల్తో మన నిద్ర చెడగొట్టడమే” అని బెంగాలీ మిత్రుడు సేన్ వ్యాఖ్యానిస్తే సేతు కాసేపు ఉడుక్కున్నా ఆరోజుల్లో ఇలాంటి వాటివల్ల మా స్నేహాలు ఏమాత్రం దెబ్బతినలేదు. ఇప్పుడు సేతు కొత్త భాష మాట్లాడుతున్నట్లు తోచింది.

చంద్ర ఒంటరిగా దొరికించు కొని వివరాలు అడిగాను. ఎందుకంటే అతడు స్థానికుడు. స్థానికులకు ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఎక్కువ రావాలని నాతో ఒకప్పుడు వాదించినవాడు. గొడవ జరిగిన చోట చంద్ర ఉన్నాడని సేతు చెప్పాడు. అతనే రెచ్చగొట్టాడని తమ వాళ్ళు తనతో అన్నట్లు కూడా సేతు చెప్పాడు. చంద్రను విషయం అడిగాను. చంద్ర మాటలు నాన్చలేదు.

“నేనక్కడ ఉన్నది అబద్ధం. నాకు ట్రేడ్ యూనియన్‌తో సంబంధాలుండేది నిజం. కార్మికుల క్షేమాన్ని కోరేవాడెవడూ ఇట్లాంటి తగాదాలను హర్షించడు. బుద్ధీ జ్ఞానం ఉన్నవాడెవ్వడూ వీటిల్లో దూరడు. అసలు కారణం ఏదో అంగడి దగ్గర ఒకరి భాషను ఒకరు సరిగా అర్థం చేసుకోక పోవడంవల్ల వచ్చిన చిల్లర తగాదా. దానికి రంగులు పులమడంతో ఇంత అనర్థం జరిగింది. ఒక తమిళుడు కొత్తగా పెట్టిన అంగడి బాగా జరుగుతోందని ఇక్కడి వ్యాపారులు చేసిన కుయుక్తి. నువ్వు గ్రహించాలసిన నిజం మాత్రం ఒకటి వుంది. సేతి తమిళులతో తనకుండే భాషా పరిచయాన్ని – తను బాగుపడడం కోసం ఉపయోగించుకుంటున్నాడు. పెద్ద పెద్ద వడ్డీలకు చిల్లర మొత్తాలు అప్పులు ఇచ్చి కూడా” అని చంద్ర అన్నాడు, కానీ నేను ఆ సమస్యను తరచి తరచి అడగలేదు. చంద్రను నేను ఎక్కువగా నమ్ముతాను. చంద్ర తమిళ కార్మికుల్తో సన్నిహితంగా ఉండడం చాలా సార్లు చూశాను. ఒక తమిళ కార్మికుడికి ప్రమాదం జరిగింది. చంద్రా, మిగతా తెలుగు కార్మికులూ అతనిపట్ల చూపిన ఆపేక్ష మాటల్లో చెప్పగలిగింది కాదు.

నెలరోజుల తర్వాత సేతు అద్దె ఇంటికి మారిపోయాడు. ఒక తమిళ స్త్రీని వంటకు కుదుర్చుకున్నానని చెప్పాడు. ఈలోగా పాండే మరో ఇద్దరు మరాఠీ ఇంజనీర్లున్న ఇంట్లోకి మారిపోయాడు. మరాఠీ బ్రాహ్మణుడెవర్నో వంటవాడుగా తెచ్చుకున్నామనీ, తెలుగు భోజనం పడలేదనీ చెప్పి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణ్యం అప్పటి వరకూ గుర్తురాలేదు మరి. పాండే మారిపోయాడు. ఫ్యాక్టరీలోని మరాఠీ పెద్ద అధికారులతోనే అతను ఎక్కువగా తిరగడం మొదలుపెట్టాడు.

చదవండి :  షాదీ (కథ) - సత్యాగ్ని

సేతూ, పాండే మాగది నుంచి పోతున్నప్పుడు అబ్దుల్లా బాధపడ్డాడు. కానీ ఏమీ అనలేదు. నేనే కాన్పూరు రోజుల్ని గుర్తుచేశాను. సిటీకి వెళ్ళాలన్నా నలుగురం వెళ్ళాల్సిందే. ఆటోలో ఇద్దరికి మాత్రమే సీట్లుంటే నలుగురికీ సీట్లు దొరికేంత వరకు ఆగే వాళ్ళం.

ఫ్యాక్టరీ పరిసరాల్లొ కట్టడాలకు తవ్వకం పని చురుగ్గా జరుగుతోంది. ఒకరోజు ఏదో దేవతా విగ్రహం బయటపడింది. ఇంకేం? చందాలు పోగయ్యాయి. యాజమాన్యం పెద్దమొత్తంలో చందా ఇచ్చింది. ఒక చిన్న గుడి నిర్మాణం మొదలైంది.

అదంతా చూసి అబ్దుల్లా విసుక్కున్నాడు. “ఈ హిందూ దేవతలు రాళ్లయి ఎక్కడ బడితే అక్కడ దొరుకుతారేం. సిమెంటు ఫ్యాక్టరీకి పనికి వచ్చే ఇక్కడ పనికివచ్చే ఇక్కడి రాళ్ళు చాలక? దొరకనీలే కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ హిందువులు కాదే, ముస్లిములున్నారు, మీ క్రైస్తవులున్నారు. ముస్లిములకు మసీదు అఖ్ఖర్లేదా? క్రైస్తవులకు చర్చి అఖ్ఖర్లేదా”

“లౌకిక రాజ్యాంగం” అంటే అబ్దుల్లా వ్యాఖ్యానించినట్లు ఉండాలా? నాకు ఆ పెద్దల భాష అర్థం కాలేదు.

అబ్దుల్లా నాతో ఈ మాటలు మాట్లాడిన నెల రోజుల తర్వాత ఒక చిన్న మసీదు నిర్మాణం కూడా మొదలైంది. యాజమాన్యం దానికీ చందా ఇచ్చింది. స్థానిక ముస్లిములు ముందుకొచ్చారు.

నాకు నవ్వొచ్చింది. నేను కూడా స్థానిక క్రైస్తవుల్ని ప్రోత్సహిస్తే అనుకున్నాను. నేను హరిజనున్ననే విషయం గుర్తుకొచ్చింది. కాదు మా ముత్తాత హరిజనుడు. మా తాత తరం నుంచీ మేము హరిజన క్రైస్తవులల్మ్. ఏం జరిగిందో ఏమో గానీ ఒక చిన్న చర్చి నిర్మాణం కూడా మొదలైంది. దానికీ ఫ్యాక్టరీ యజమానులు చందాలిచ్చారు.

హిందూ దేవత గుడి నిర్మాణం జరిగేటప్పుడే “చూడు ముందు ముందు మసీదు, చర్చి కూడా వస్తాయి. వాటికి ఈ పారిశ్రామికవేత్తలు డబ్బిచ్చి ప్రోత్సహిస్తారు. వాళ్ళక్కావల్సింది వ్యక్తిగత మతస్వేచ్ఛ కాదు. మూఢభక్తి పెరగడం. మతాల మధ్య గోడలు పెరుగుతూ పోవడం” అని చంద్ర అన్నది జ్ఞాపకం వచ్చింది.

కాన్పూరులో చదువుకునే రోజుల్లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మతకలహాలన్నీ ఆ సందర్భంలో గుర్తుకొచ్చాయి. ఆ మధ్య హైదరాబాదులో జరిగినవి గుర్తుకొచ్చాయి. అదృష్టవశాత్తు ఈ ప్రాంతంలో అవి జరగలేదు. వీళ్ళింకా అంత పతనం కాలేదు.

అబ్దుల్లా కూడా గది విడిచి మరోగది చూసుకున్నాడు. ఎవరి లోకాలు వారివి. మా నలువురి మధ్య మొదట చేరినప్పుడున్న ఆత్మీయత దాదాపు పోయినట్లే. కానీ పలకరింపలకేమీ కొదవలేదు. దీనికి కారణమేమని తెగ ఆలోచించాను. నా బుర్ర గజిబిజి అయిపోయింది.

చంద్ర వాళ్ళ పల్లెల్లో ఉండకుండా ఎక్కువభాగం నాతోనే ఉంటున్నాడు. మా నలువురి మిత్రుల వ్యవహారం ప్రస్తావనకు వచ్చినప్పుడు చంద్ర అన్నాడు.

“అసలు విషయం ఫ్యాక్టరీ అధికారుల కళ్ళలో బడి పైకి పోవాలనుకోవడం దానికోసం మనవాళ్ళు తమవంతు ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. చూసినావో లేదో గాని ఈ మధ్య స్సేతు అబ్దుల్లా దేశపాండేకు పార్టీలూ అవీ ఇచ్చి కొండ మీద కూర్చోపెడ్తున్నారు. ఈ మధ్యనే వచ్చిన మన కన్‌స్ట్రక్షన్ ఛీఫ్ ఇంజనీర్, దేశపాండే బంధువంట. ఈ రోజుల్లో స్నేహాలూ, బంధుత్వాలు అన్నీ త్రాసులో తూగేవే కదా!”

ఈ మాటల్తో నాకు దిగులు పట్టుకుంది. వాళ్ళు నాముందే పెద్ద ఉద్యోగాల్లోకి పోతారు. నేను వాళ్ళకింద పని చేయాల్సివుంటుంది. ఒకరకంగా వాళ్ళ మీద ఈర్ష్య కూడా కలిగింది. నేను చంద్ర ద్వారా స్థానికుల్ని రెచ్చగొట్టలేనా అని కూడా ఆలోచించాను. నేను అంత సమర్థుణ్ణి ఏనాడు కాలేను.

సరిగ్గా ఆ రోజుల్లోనే కూలీ రేట్ల విషయం మీదా, ఇతర కార్మిక సమస్యలమీదా ట్రేడ్ యూనియన్ సమ్మెకు పిలుపు ఇచ్చింది.

సమ్మెకు ముందురోజు రాత్రి యూనిట్ ఇన్ఛార్జి సంతోజీ నుంచి పిలుపు వచ్చింది. నేను వెళ్ళేటప్పటికి మా క్లాస్‌మేట్లు ముగ్గురూ అక్కడున్నారు. ఆశ్చర్యం వేసింది. నాతో మాట్లాడవలసింది ఉందని సేతూను, అబ్దుల్లాను, పాండేను ముందుగదిలోకి వెళ్లమన్నాడు. తలుపులు మూసుకున్నాయి. నాలో సన్నగా వణుకు మొదలైంది. భయం బయటపడనీకుండా కూర్చున్నాను. ఒక చేత్తో బట్టతల రుద్దుకుంటూ, మరో చేత్తో టేబుల్ మీద్ పేపర్ వెయిట్‌ను ఆడిస్తూ అమెరికన్ ఆక్సెంటుతో సంతోజీ లెక్చరు మొదలు పెట్టాడు:

చదవండి :  వానరాయుడి పాట (కథ) - వేంపల్లి గంగాధర్

“ఈ సమ్మె సంగతి మీకు తెలుసు కదా! ఇంత వెనుకబడిన ప్రాంతంలో లక్షలు కాదు, కోట్లు పోస్తున్నాం. ఎందుకు? ఈ సిమెంటు ఫ్యాక్టరీకి తోడు ఇక్కడే మరో ఎరువుల ఫ్యాక్టరీ మన కంపెనీ ఆలోచనలో ఉంది. ఎందుకు? కేవలం లాభాలకోసమా? కాదు. వెనుకబడిన ప్రాంతాలను మన పరిశ్రమలతో ముందుకు తీసుకుపోదామని. ఈ ఫ్యాక్టరీనే లేకపోతే చాలామంది జనం పస్తులుండేవారు. మూడువేలు చెయ్యని ఎకరా భూమికి పది వేలు ఇస్తున్నాం. మనం ఫ్యాక్టరీతో ఎంత అభివృద్ధి జరుగుతోంది? మొదట వచ్చినప్పుడు ఇక్కడ మంచి బ్లేడు కూడా దొరికేది కాదు, ఇప్పుడు స్మగుల్డు గూడ్సు దొరుకుతున్నాయి. యిప్పుడు మన వుద్యోగులకున్న సౌకర్యాలు ప్రభుత్వ సంస్థల్లో వున్నాయా? మన కంపెనీ లాంటి ప్రైవేటు సంస్థల లక్ష్యాలు ప్రభుత్వానికి తెలుసు కాబట్టే మనకు లైసెన్సులిస్తోంది. ఇక ఒక సంవత్సరంలో సిమెంటు ప్రొడక్షను మొదలవుతుంది. మీకెంతో భవిష్యత్తు ఉంది. ఏమంటారు?”

నేనేమంటాను? నీరసంగా ఒక నవ్వు నవ్వాను. రహస్యంగా మాట్లాడే ధోరణిలో సంతోజీ చెప్పాడు:

“మీకు చంద్ర మంచి మిత్రుడు కదా! ఈ స్ట్రయికు వెనుక అతనూ, అతన్ని ప్రోత్సహించే ట్రేడ్ యూనియన్ లీడరూ ఉన్నారు. ఆ ట్రేడ్ యూనియన్ లీడరుకు పనీపాటా లేదు. చంద్ర మన ఉద్యోగి అయివుండి వీటిలో తల దూరుస్తున్నాడు. నాలుగు రూపాయలు పెంచడం ఒక సమస్య కాదు.

ఈ సమస్యకు మనం తలవంచామంటే ఇక ట్రేడ్ యూనియన్ బలపడి తీరుతుంది. ఆ తర్వాతే అసలు తలనొప్పి. చంద్ర మనవైపు వచ్చాడంటే స్ట్రయికు వీగిపోతుంది. ఊళ్ళోనూ, చుట్టుపక్కలా ఎక్కువగా అతనికి పలుకుబడి ఉంది. చంద్రతో మీరు మాట్లాడాలి. మీరిద్దరూ తెలుగువాళ్లు. పైగా నీ రూంలోనే ఉంటాడని విన్నాను. అది మంచిదేలే. ఈ పని చేశారంటే మీ ప్రమోషన్ రికమెండ్ చేస్తాను. ముందు ముందు ఫారిన్ ఛాన్సు కూడా…”

నాకంతా అయోమయంగా ఉంది. చంద్రకు కార్మికుల్లో ఎంత పలుకుబడి వుందో నాకటే ఇన్ఛార్జికే బాగా తెలిసినట్లుంది. అతని ప్రయోజనం తెలిసినట్లుంది. అయితే చంద్ర నా మాట వింటాడా? అదే మాట అడిగాను.

“వినేట్లు చేయాలి. ఈ వంద మంది హరిజన కార్మికుల్ని చీలిస్తే వింటాడు. ఆపని మీరు సులభంగా చెయ్యవచ్చు.”

సంతోజీ పథకం అర్థమైంది. గట్టి బట్టతల. ఏం చెప్పాలో దిక్కుతోచలేదు. “ప్రయత్నిస్తాను” అని గొణిగాను. “ఓ.కే. గుడ్‌బాయ్” అంటూ భుజం తట్టి “గుడ్ నైట్” చెప్పాడు.

మిగతా ఇద్దరితో ఏంచెప్పి వుంటాడో ఊహించాను. సేతును తమిళ కార్మికులతో మాట్లాడమని ఉంటాడు. అబ్దుల్లాను ముస్లింలతో మాట్లాడమని ఉంటాడు. మా ముగ్గురికి ఒకేరకం ఎరలు ప్రమోషనూ, ఫారిన్ ఛాన్సు. మొదటిసారిగా అసహ్యం వేసింది. ఎంత కక్కుర్తి! ఎన్ని కుయుక్తులు! ఎంత వంచన! ఈ విషయమంతా చంద్రకు చెబుదామనుకున్నాను. ఎంత అపరాత్రి అయినా గదికి వచ్చే చంద్ర ఆ రోజు రాత్రి రాలేదు.

ఉదయం వర్క్‌స్పాట్ దగ్గరకు వెళ్ళేవేళకు సమ్మె చేస్తున్న జనం. ఇన్నాళ్లు దరిద్రం ఓడుతూ అమాయకంగా కన్పించిన వాళ్ళలో పట్టుదల. ఒకేపాట, ఒకే మాట “కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి” అంటూ. ఎవరో తమిళుడు “సేతు మాధవన్” అని అరిచాడు. యువకుల గొంతులు “డౌన్ డౌన్” అన్నాయి. ఎవరో ముస్లిం “అబ్దుల్లా” అన్నాడు. కొన్ని గొంతులు “ముర్దాబాద్” అన్నాయి. ముక్త కంఠంగా మరి కొన్ని నినాదాలు. ఆ నినాదాల మధ్య తెలుగు కార్మికులూ, తమిళ కార్మికులూ అనే భేదం లేదు. కులాల్లేవు. వాళ్ళందరూ రెండు రూపాయల కూలీ పెంచడం కోసమే ఆ నినాదం చేస్తున్నారా? నేను నమ్మను గాక నమ్మను. అవి సుందరమైన భవిష్యత్తు కోసం సామూహికంగా తెగిస్తున్న నినాదాలు. సమైక్యంగా సాగుతోన్న జనం.

మరి పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళూ, పదవుల్లో ఉన్నవాళ్ళూ చేస్తున్న పని ఏమిటి? వాళ్ళ మధ్య ఏ విలువలు రాజ్యమేలుతున్నాయి? నా ఆలోచనలు ఇప్పుడిప్పుడే తెగుతున్నాయి.

రచయిత గురించి

డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి గారు ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1996) గ్రహీత. డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ సంచాలకునిగా పదవీ విరమణ పొందిన వీరు 1939 జులై 10న కడప జిల్లా కమలాపురం తాలూకాలోని రంగసాయిపురం గ్రామంలో జన్మించారు. ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’,’ జప్తు’, ‘ఇఛ్చాగ్ని’ పేర్లతో వీరి కథలు సంకలనాలుగా వెలువడ్డాయి.

(జ్యోతి మాసపత్రిక జనవరి 1984 సంచికలో ప్రచురితం)

ఇదీ చదవండి!

islam

ముస్లింల పేర్లు కలిగిన ఊర్లు

కడప జిల్లాకు ఇస్లాం మత సంపర్కం 14వ శతాబ్దిలో జరిగినట్లు ఆధారాలున్నాయి (APDGC, 143). కుతుబ్ షాహీ, మొగల్, మయాణా, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: