sankranthi

కడప జిల్లాలో సంక్రాంతి

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.

చదవండి :  కడప జిల్లాలో ఓట్ల పండగ మే 7న

కడప  జిల్లాలో పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగను మూడు రోజులు (భోగి, మకర సంక్రమణం, కనుమ) జరుపతారు కాబట్టి దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు కాబట్టి రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది.

భోగి పండగ: ఇది సాధారణంగా జనవరి 13 లేదా 14న జరుపుతారు. ఈ రోజున తెల్లవారుజామునే, అందరూ లేచి సలి (భోగి) మంటలు వేస్తారు. పల్లెటూళ్ళలో పిల్లోళ్ళు భోగి మంటల కోసమని ముందు రోజు ఎండిపోయిన కంప పుల్లలను, చెత్తను, బోధను, పాత సామాన్లను సేకరించి పెట్టుకోవడం సాధారణంగా కనిపించే దృశ్యం. భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి స్నానం చేయించటం లేదా ఆశీర్వదించటం కనిపిస్తుంటుంది, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.

చదవండి :  ఈ రోజు నుండి పుష్పగిరి బ్రహ్మోత్సవాలు

సంక్రాంతి: రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగిస్తారు. నిప్పట్లు (అప్పచ్చులు లేదా అత్తరాసులు), ముద్దలు (లడ్లు), కార్యాలు, కజ్జికాయలు, పరమాన్నం మొదలయిన పిండివంటలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. దేవునికి కొబ్బరికాయను కొడతారు.

కనుమ: కనుమ రోజున మాంసాహారం తినడం ఆనవాయితీగా వస్తూంది. తెల్లవారుజామునే లేచి అలసంద వడలూ, సియ్యల పులుసూ, తిరువాత బువ్వ వండుకుని విందు చేసుకుంటారు. కనుమ పండుగానే పార్న పండగ లేదా పారాట అని కూడా వ్యవహరిస్తుంటారు. కనుమ పండుగ కొన్ని ఊర్లలో దేవుడిని ఊరేగిస్తారు.  అలాగే కనుమ పండుగ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం కూడా సాంప్రదాయం కింద భావిస్తారు.

చదవండి :  అల్లుడికి ఘనంగా భత్యం సమర్పించిన కడప ముస్లింలు

సంక్రాంతికి మూడు రోజులూ ఇళ్ళ ముందర పేడ నీళ్ళు చల్లి రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి పూలతో అలంకరిస్తారు. సంక్రాంతి పండుగ నాడు ఎక్కడెక్కడో ఉండే కుటుంబ సభ్యులందరూ ఒక్కచోట చేరతారు.

ఇదీ చదవండి!

కడప జిల్లా కథాసాహిత్యం

కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: