ఆయనను మర్చిపోతే ‘‘సాహిత్య విమర్శ’’ను మరిచిపోయినట్లే !

సాహితి లోకంలో రారాగా సుప్రసిద్ధులైన రాచమల్లు రామచంద్రారెడ్డిగారి పరిచయభాగ్యం నాకు 1977లో ‘ఈనాడు’ పత్రికలో సబ్‌ఎడిటర్‌ ట్రెయినీగా పని చేస్తున్నప్పుడు కలిగింది. మా బ్యాచ్‌లో మేము పదిమంది దాకా ఉండేవాళ్ళం. వార్తల్ని ఇంగ్లీషు నుండి తెలుగులోకి ఎలా అనువదించాలో ఆర్నెల్ల పాటు మాకు శిక్షణ ఇచ్చారు. అను వాదం ఎంత సంక్లిష్టమైనదో అప్పుడే నేను తెలుసుకున్నాను. రా.రా.మాకు శిక్షణ గురువు. తాను సంపాదకీయాలు రాస్తూనే వార్తల్ని ఎలా అనువదించాలో మాకు నేర్పించారు. ఆయన నిండైన విగ్రహం నాకింకా బాగా గుర్తుంది. ఆయన కాఫీ ప్రియుడు. సిగరెట్లు బాగా తాగేవారు. మనిషి నిదానస్తుడు. అసలు కోపం వచ్చేది కాదు. మధ్య మధ్యలో సాహిత్యం మొదలు రాజకీయ సిద్ధాంతాల దాకా చర్చించేవారు. అప్పుడే నాకు ఆయన ఎంత గొప్ప సాహితీ విమర్శకులో తెలిసింది.

దేశభక్తి

రా.రా. 1922 ఫిబ్రవరి 28న కడప జిల్లా పైడిపాలెం గ్రామంలో ఆదిలక్ష్మి, భయపురెడ్డి దంపతులకు జన్మించారు. పులివెందుల హైస్కూలు చదువు ముగించి అనంతపురంలో ఇంటర్మీడియేట్‌ పూర్తిచేశారు. చెన్నైలోని ‘గిండీ ఇంజనీరింగ్‌ కాలేజీ’లో ఇంజనీ రింగ్‌లో చేరారు. 1941లో గాంధీ నిరాహారదీక్షకు మద్దతుగా కాలేజీలో జరిగిన సమ్మెలో పాల్గొని కళాశాల బహిష్కరణకు గురయ్యారు. క్షమాపణ చెప్పితే చేర్చుకుంటామని కాలేజీ యాజ మాన్యం చెప్పినప్పటికీ క్షమాపణ చెప్పడానికి ఆయన, చండ్ర పుల్లారెడ్డి నిరాకరించారు. అంతటి దేశభక్తుడాయన.

సాహిత్య విమర్శ

1944లో విశాలాంధ్రలో ఉపసంపాదకుడిగా పనిచేశారు. 1950లో మార్క్సిజం వైపు ఆకర్షితులయ్యారు. జీవితం చివరి దాకా మార్క్సిజాన్నే గాఢంగా విశ్వసించారు. 1968లో ‘సంవేదన’ పత్రికను నడిపారు. కొద్ది కాలమే నడిచినప్పటికీ, ‘సంవేదన’ అద్బుతమైన కథా సాహిత్యాన్ని, విమర్శనా సాహిత్యాన్ని వెలువరించింది. 1970 నుండి 1976 వరకు మాస్కోలోని ప్రగతి ప్రచురణాలయంలో తెలుగు అనువాదకులుగా పని చేశారు. మార్క్స్‌, ఏంగెల్స్‌ సంకలిత రచనలు, లెనిన్‌ సంకలిత రచనలు, పెట్టుబడిదారీ అర్థశాస్త్రం, గోర్కీ కథలు, చేహావ్‌ కథలు మొద లైన రష్యన్‌ గ్రంథాలను ఇంగ్లీషు నుండి తెలుగులోకి సరళమైన తెలుగులో అనువదించారు. మాస్కోలో సంపాదించిందంతా కడపలోని ‘హోచిమిన్‌’ భవన నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. తర్వాత కాలంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందు లనుభవించారు. 1977లో ఈనాడులో సంపాదకులుగా చేరారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ 1988 నవంబర్‌ 25న కన్ను మూశారు.

కథానిక, దాని శిల్పమూ

రారా గొప్ప కథకుడు. కథానికకు ఒక కొత్త ఒరవడినీ, నిర్వ చనాన్ని ఇచ్చారు. ఆయన రాసిన ‘కథానికా శిల్పం’ అన్న వ్యాసంలో కథానికా లక్షణాలను వివరించారు. ఆయన రాసిన 12 కథానికలు 1960లో ‘అలసిన గుండెలు’ పేరుతో పుస్తకరూపంలో వచ్చాయి. వాస్తవ సమాజ చిత్రం ఈ కథానికల్లో మనకు కనిపి స్తుంది. వివిధ రకాల పరిస్థితులలో వ్యక్తుల మధ్య ఏర్పడే సంఘ ర్షణ, పరిస్థితుల ఆధారంగా మారే మానవ స్వభావం, సంబం ధాలు, మానవుల జీవితాలలో వ్యవస్థలు సృష్టించే అలజడుల్ని హృద్యంగా చిత్రించారు. ‘‘జీవితంలో చూసి ఉపేక్షించే విషయా లనే ఈ కథలలో చదివి షాక్‌ తింటాం’’ అన్నారు ప్రఖ్యాత రచయిత, సాహితీ విమర్శకులు కొడవటిగంటి కుటుంబరావు. జీవితానికి సంబంధించిన ఒక సత్యాన్నో, ఒక నీతినో, నియ మాన్నో, ఒక సూత్రాన్నో పాఠకునికి తెలియ చెయ్యాలి, అదే కథానిక లక్ష్యం అంటారు రా.రా. సాహిత్యానికి, అనుభూతికి మధ్య ఉన్న సంబంధాన్ని విపులీకరిస్తూ సమస్త సాహిత్యమూ

చదవండి :  పోతన మనుమలు స్తుతించిన 'వరకవి సార్వభౌముడు'

హృదయ వ్యాపారమేననీ, అనుభూతి లేకుండా సాహిత్యం లేదని అంటారు. ఒక్క వాక్యంలో పాత్రకు రూపకల్పన చేసే శక్తి రారాకు ఉన్నది. ఈ విషయంలో ఇప్పటి కథా రచయితలకు రా.రా. మార్గ దర్శకులు.

ఒక్క కథానికలోనే కాదు రా.రా.కు అన్ని సాహిత్య ప్రక్రియలు పరిచయమే. ఆయన మంచి జర్నలిస్ట్‌ కూడా. అన్నింటికీమించి గొప్ప అనువాదకుడు, విమర్శకుడు. అనువాద ప్రక్రియను ఒక ప్రామాణిక సాహిత్య ప్రక్రియగా ఆయన తీర్చిదిద్దారు. ఆయన రాసిన ‘అనువాద సమస్యలు’ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

అనువాదంలో 

అనువాదంలో – ముఖ్యంగా ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించేటప్పుడు– ఎదురయ్యే సమస్యలను సోదాహరణంగా ఈ గ్రంథంలో వివ రించారు. ఇంగ్లీషు వాక్య నిర్మాణానికి, తెలుగు వాక్య నిర్మాణా నికి గల తేడాలను విపులంగా విశదీకరించి, సందర్భాలను, పదాలను సరిగా అర్థం చేసుకోకపోతే అర్థాలెలా మారుతాయో వివిధ రచయితల అనువాదాలను ఉదహరిస్తూ వివరించారు.

నన్నయ, తిక్కన, అల్లసాని పెద్దన, ఏనుగు లక్ష్మణ కవి వంటి ప్రాచీనుల రచనలతో పాటు గురజాడ వీరేశ లింగం, శ్రీశ్రీ, కొ.కు., విశ్వనాథ వంటి ఆధునిక యుగ మహా కవులు, రచయితలు మొదలుకొని రంగనాయకమ్మ, యద్దన పూడి సులోచనారాణి, కత్తి పద్మారావు, శేషేంద్రశర్మ, కాళీ పట్నం, బాలగోపాల్‌ వంటి సమకాలీనుల రచనలలోని అను వాద దోషాలను గ్రంథంలో ప్రస్తావించడానికి ఆయన వెను కాడలేదు.

చదవండి :  మంది బలంతో అమలౌతున్న ప్రజాస్వామ్యం

అనువాదం మూలంలోని భావాలను సంపూర్ణంగా వ్యక్తం చేయాలి. మూలంలోని శైలిని అనుకరించాలి. మూలం లాగే సుబోధకంగా ఉండాలి అంటారు రారా. ఇంగ్లీషులో నుండి తెలుగులోకి అనువదించే వ్యాపార ప్రకటనలు ఎంత హాస్యా స్పదంగా ఉంటాయో కూడా ఆయన తన గ్రంథంలో ఉదాహ రణలిచ్చారు. పనిలోపనిగా ధియోడర్‌ సేవరీ వంటి ప్రఖ్యాత అనువాదకుల సిద్ధాంతాలను కూడా రా.రా. తన గ్రంథంలో వివరించారు. అనువాదంపై తెలుగులో ‘అనువాద సమస్యలు’ లాంటి పుస్తకం మరొకటి లేదు. అనువాద రచనలు చేసే చాలామంది రచయితలకు ఇది మార్గ దర్శనం చేసింది.

గొప్ప సమీక్షకుడు

రా.రా. గొప్ప పుస్తక సమీక్షకుడు. అద్వితీయ సాహిత్య విమర్శకుడు. తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శను ఒక ప్రామాణిక సాహిత్య ప్రక్రియగా అభివృద్ధి చేసింది రారాయే అని చెప్పక తప్పదు. రా.రా. రచించిన ‘సారస్వత వివేచన’ అన్న సాహితీ విమర్శ గ్రంథానికి సాహిత్య అకాడమి అవార్డు లభించింది. ఆ పుస్తకంలో అద్దేపల్లి రామ్మోహన్‌రావు, గుర జాడ, చలం, ఆర్‌.యస్‌. సుదర్శనం, తిలక్‌, శ్రీశ్రీ రచనలపై విమర్శనా వ్యాసాలున్నాయి. మార్క్సిస్టు దృక్పథంతో రా.రా. సాహిత్య విమర్శ చేశారు.

అద్దేపల్లి రామ్మోహన్‌రావు రచించిన చారిత్రక నవల ‘కొల్లాయిగట్టితేనేమి’పై ఆయన చేసిన సమీక్ష వంటి సమీక్ష తెలుగులో ఇంత వరకూ రాలేదని సాహిత్య విమర్శకులంటారు. ‘కొల్లాయిగట్టితేనేమి’ నవలను ఆయన జార్జి లూకాస్‌ అనే హంగేరియన్‌ మార్క్సిస్టు విమ ర్శకుడు, పండితుడు చేసిన సూత్రీకరణల ఆధారంగా సమీక్షించారు. జార్జి లూకాస్‌ మార్కిస్టు విమర్శకు కొత్త నిర్వచనం ఇచ్చాడు. ఆయన వాదాన్ని ‘‘ప్రతిబింబవాదం’’ అంటారు. ‘‘క్రిటికల్‌ రియలిజం’’ కంటే ‘‘సోషల్‌ రియలిజం’’ విమర్శకు ప్రాణమని లూకాస్‌ అన్నాడు. చారిత్రాత్మక నవలా సాహిత్యంలో కథా వస్తువు ఆనాటి సమాజాన్ని, దేశకాల పరిస్థితులను ఆధారంగా చేసుకుంటుంది. అందువల్ల మార్క్సిస్టు విమర్శ కథా వస్తువు పరిశీలనకే ప్రాధాన్యమిస్తుంది. లూకాస్‌ సూత్రీకరణల ఆధారంగా రా.రా. చారిత్రక నవలా లక్షణాలను తన సమీక్షలో వివరించారు.

సుదర్శనం రచించిన ‘సాహిత్యంలో దృక్పథాల’ను విమర్శిస్తూ ‘మేర మీరిన మేధ’ అన్నారు. ‘‘ఉన్నత మానవ సంస్కృతి ప్రమాణాలు నిరూపించడం, మానవ మనః ప్రపంచపు సంకుచిత స్వార్థ దుర్గాలను బద్దలుకొట్టడం, సూత్ర సౌందర్య లోకాల దర్శనం చేయించడం, నూతన ఆనందమయ జీవిత వ్యవస్థకు మానవ హృదయాలను పరిపక్వం చేయడం ఉత్తమ సాహిత్య లక్షణాలు’’ అని రారా సాహిత్యం పట్ల తన భావనను వ్యక్తం చేశారు.

చదవండి :  ఉరుటూరు గ్రామ చరిత్ర

క్రూరుడైన విమర్శకుడు

సాహిత్య విమర్శకు, సాహిత్య సంప్రదాయాల జ్ఞానం, సమకాలిక జీవిత లక్షణాల పరిజ్ఞానంతో పాటు పాశ్చాత్య సాహిత్య సిద్ధాంతాలతో కూడా గాఢమైన పరిచయం ఉండాలని రా.రా. అభిప్రాయపడినారు. ‘వ్యక్తిగత విమర్శ’ గురించి ప్రస్తావిస్తూ విమర్శ సాహిత్య పరిధులు దాటకూడదనీ రచయిత సాహిత్య జీవితాన్ని ప్రస్తావించవచ్చు కానీ సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావిస్తే అది అక్రమమైన వ్యక్తిగత విమర్శ అవుతుందనీ ఆయన అంటారు. సాహిత్య విమర్శ చేసేటప్పుడు ఎంతటి వారి రచనలనైనా నిష్కర్శగా, నిర్మొహమాటంగా విమర్శించారు. శ్రీశ్రీ, కుటుంబరావు, విశ్వనాథ, చలం, తిలక్‌, ఆర్‌.యస్‌. సుదర్శనం, శేశేంద్ర శర్మ, సొదుం జయరాం వంటి ఉద్దండులూ ఆయన విమర్శ బారిన పడిన వారే. శ్రీశ్రీ ఆయనను ‘‘క్రూరుడైన విమర్శకుడు’’ అన్నాడు. కాని వాస్తవంగా ఆయన మృదుస్వభావుడు, సౌమ్యశీలి. ఆయనతో పరిచయం ఉన్న వారెవరైనా ఈ విషయం గ్రహించగలుగు తారు. ఆయన వ్యక్తులలోని లోపాలను, బలహీనతలను అర్థం చేసుకున్నారు తప్ప ఎవరినీ ద్వేషించలేదు.

ఆయనను మనం మరిచిపోతున్నామేమో

బాధపడవలసిన విషయమేమిటంటే ఆయనను మనం మరిచిపోతున్నామేమోనని. మన విశ్వవిద్యాలయాలు ఆయన రచించిన విశిష్ట సాహిత్య విమర్శనా గ్రంథాల్ని తెలుగు సాహి త్యం సిలబస్‌లో చేర్చలేదు. తెలుగు అకాడమీ ప్రచురించిన ‘‘విమర్శ’’ గ్రంథాలలో ఎక్కడా రారా పేరును గానీ, ఆయన రచనలను గానీ ప్రస్తావించలేదు. ‘‘మార్క్సిస్ట్‌ విమర్శ’’ అన్న విషయం వచ్చినప్పుడైనా ఆయన పేరును ప్రస్తావనకు తీసుకురాలేదు. రారాను మర్చిపోతే మనం తెలుగులో ‘‘సాహిత్య విమర్శ’’ అన్న సాహితీ ప్రక్రియను మరిచిపోయినట్టే. ఇప్పటి కైనా విశ్వవిద్యాలయాలలోని తెలుగు, ఆంగ్ల సాహిత్య విభాగాలలో ఆయన రచనల్ని సిలబస్‌లో చేర్చాలి. సాహితీ ప్రియులు ఆయన జయంతి, వర్ధంతినీ సాహిత్య సమ్మేళనాల రూపంలో నిర్వహించాలి. ప్రఖ్యాత మార్కిస్టు మేధావిగా, కథా రచనా శిల్పానికి ఒరవడి దిద్దిన వ్యక్తిగా, నిబద్ధుడైన విమర్శకుడిగా చిరస్మరణీయుడు రా.రా.

(నవంబర్‌ 25 రాచమల్లు రామచంద్రారెడ్డి వర్ధంతి)

పుల్లూరు సుధాకర్‌

98494 55843

(ఆంధ్రజ్యోతి దినపత్రిక, నవంబర్ 23, 2020)

ఇదీ చదవండి!

samvedana magazine

సంవేదన (త్రైమాసిక పత్రిక) – ఏప్రిల్ 1968

పుస్తకం : సంవేదన ,  సంపాదకత్వం: రాచమల్లు రామచంద్రారెడ్డి , ప్రచురణ : యుగసాహితి, ఏప్రిల్ 1968లో ప్రచురితం. చదవండి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: