సిద్ధేశ్వరం
సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమంలో పినాకపాణి

సిద్ధేశ్వరమా..! నీవెక్కడిదానవే? : పినాకపాణి

చంద్రబాబుకు కోపం వచ్చింది.

పట్టిసీమ నుంచి నీళ్లిస్తామని చెబితే వినకుండా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటామని వెళతారా? అని పోలీసుల‌ను ఉసిగొలిపాడు. వాళ్లకు చేతనైనదంతా వాళ్లు చేశారు.

మీ పట్టిసీమ మాకెందుకు? సిద్ధేశ్వరం కట్టుకుంటే చాలని అనడమే శాంతిభద్రతల‌ సమస్య అయింది.

ముందు రోజే హౌస్‌ అరెస్టులు చేశారు. నాయకుల‌ కోసం ఆరా తీసి ఆందోళన పెట్టారు. సిద్ధేశ్వరం దారుల‌న్నీ జనమయం అవుతాయని అటకాయించారు. ఇటు నందికొట్కూరు నుంచి, అటు వెలుగోడు నుంచి చెక్‌పోస్టులు తెరుచుకున్నాయి. అసలు దారులు, అడ్డ దారులు అన్నింటా సాయుధ పోలీసులే. అంతటితో ఆగారా? జేసీబీలు పెట్టి రోడ్లు తవ్విపోశారు. కందకాలు తవ్వారు. అడవి దారిన క్రిష్ణా తీరంలో తప్పించుకొని సిద్ధేశ్వరం పోతున్న వాహనాల‌ను వెంటబడి అదుపులోకి తీసుకున్నారు.

మే 31…

మండే ఎండకు క్రిష్ణమ్మ ఎండి బీటలు వారింది. సప్త నదీ సంగమ క్షేత్రమంతా నీటి గుర్రాలు దౌడు తీస్తున్నాయి. అట్లాంటి చోటికి జనం సంద్రంలా వెళ్లాలనుకున్నారు. వాడు అడ్డుకున్నాడు.. అయితేనేం.. పిల్ల‌కాలువల్లా, నీటి ఊటలా, అంతస్స్రవంతిలా రైతు జనం ఉబికి వచ్చింది. సంగమేశ్వరుడు పూరా మునిగిపోయినా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తీసుకోలేని రాయసీమ రైతులు ఎన్నెన్ని నీటి పాయలుగానో నదీ సంగమ స్థావరానికి చేరుకున్నారు. నదులన్నీ ఎండిపోయిన చోట జనమే నదుల‌య్యారు. వరదల‌య్యారు.

రాయల సీమ రైతుకు ఈ విద్య ఎలా తెలిసిందని ఒకటే ఆశ్చర్యం!

ఇంత కాలం ముఠా నాయకుల‌ కింద కొట్టుకునేవారు. బతికినా చచ్చినా వాళ్ల కోసమే కదా? వాళ్ల జెండాలు మోసీ మోసీ భుజాలు కాయలు కాసిన రైతులు ఏ జెండా లేకుండా, ఏ బేనర్‌ లేకుండా భుజం మీద, మనసు నిండా సిద్ధేశ్వరం ఆశయం మోసుకుంటూ వచ్చారు. గట్టిగా నినాదాలు ఇచ్చే అలవాటు కూడా లేని(కాని) సీమ రైతు ముఖాల్లో మాత్రం సిద్ధేశ్వరం అకాంక్ష వేల‌ కాంతుల గానమై ప్రస్పుటించింది. ఎక్కడపోయావే సిద్ధేశ్వరమా? ఇన్ని తరాల‌పాటు? ఎన్నెన్ని వంచనలను, విద్రోహాల‌ను దాటుకొని ఇప్పటికిలా నీ చరిత్రను నువ్వే అట్టడుగు నుంచి తవ్వుకుంటూ లేచి నిలిచావా? ఇన్నాళ్లకిలా రైతుల కళ్లలోంచి తిరిగొచ్చావా?

అంతా సక్రమంగా జరిగి ఉంటే 11 గంటకు శిలా ఫల‌కం వేసి ఉండాలి. రాజ్యం అంతా అస్తవ్యస్తం చేసింది. రైతు ధీశక్తి వల్ల‌ దానికీ ఓ రకమైన బ్యూటీ వచ్చింది. సామూహితకంటే సౌందర్యమేమున్నది? సమరశీల‌త ఏమున్నది? సిద్ధేశ్వరం దగ్గర చేయాల్సిన శంకుస్థాపనను తొమ్మిది గంటలకే నందికొట్కూరు వద్ద రైతుపల్లెలో బొజ్జా దశరథరామిరెడ్డి, వైఎన్‌ రెడ్డి ఓ రాతిపై సిద్ధేశ్వరం ఆశయాన్ని లిఖించి అలుగుకు శంకుస్థాపన చేశారు. అరెస్టు కాకుండా ఎలాగైనా శిలాఫకం వేయడానికి వీళ్లు ముందు రోజు నుంచీ ఎక్కడెక్కడో తిరుగుతూ అక్కడికి చేరుకున్నారు.

చదవండి :  రాయలసీమ ద్రోహం నుంచీ బయటపడటానికి మార్గం ఏమిటి?

అనేక అడ్డ దారుల్లో కపిలేశ్వరం దాకా చేరుకున్న రైతులను, ప్రజాసంఘాల‌ నాయకుల‌ను పోలీసు పట్టేశారు. వాళ్లకు తమ బలం పట్ల అంత గురి ఉన్నట్లు లేదు. అక్కడ జేసీబీతో మనిషిలోతు కందకం తవ్వించారు. కోట్లు కేటాయించి నిర్మిస్తున్న కృష్ణా పుష్కర రోడ్లను అడ్డంగా తవ్విపోశారు. నది నీళ్లలో మునకేసి పోడానికి వస్తే ఫర్వాలేదు కాని, మా వాటా మేం తీసుకోడానికి అలుగు కట్టుకుంటామంటే చంద్రబాబు ఊరుకుంటాడా? పుష్కర రోడ్లను కూడా తవ్విపోయించాడు. పుణ్యమంటే ఆయనకు భయమే లేదనడానికి ఇంతకంటే ఏం కావాలి. అలాంటి వాళ్లకు పాపమంటే ఎలాగూ భయం ఉండదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇదేమైనా యుద్ధ ప్రాంతమా? కందకం తవ్వించడానికి అని రైతులు మండిపడ్డారు. వాహనాల‌ దిగి అక్కడి నుంచి సంగమేశ్వరం దాకా, సిద్ధేశ్వరం దాకా నడిచి పోయేందుకు సిద్ధమయ్యారు.

144 సెక్షన్‌ ఉందని పోలీసులు అడ్డంపడ్డారు.

ఈ అడవిలో 144 సెక్షన్‌ ఏందని ఎదురు తిరిగారు.

నానా దొమ్మీ జరిగింది

సిద్ధేశ్వరం దగ్గర శంకుస్థాపన చేయనీయకుంటే ఈ కందకంలోనే శిలా ఫల‌కం వేస్తామని జనం సిద్ధమయ్యారు.

అన్నట్లే చేశారు.

పోలీసుల‌కు ఆగ్రహం వచ్చింది.

వాళ్ల ల‌క్ష్యం సిద్ధేశ్వరం కోసం ఎక్కడా ఒక్క రాయి కూడ పాతకుండా అడ్డుకోవడం.

రైతుల‌ ఆశయం.. ఈ నదీ తీరంలో ఎక్కడ రాయి వేసినా అది సిద్ధేశ్వరానికే అని.

రైతుల‌ది సెంటిమెంట్‌ కూడా.

పోలీసుల‌కూ అంతే సెంటిమెంట్‌ ఉన్నట్లు కనిపిస్తోంది కదూ..!. ఆ రాయిని నిబెట్టడానికి వీల్లేదని నానాయాగీ చేశారు. ఈ అడవిలో అన్నీ రాళ్లూ రప్పలే. ఈ రాయిని ఇక్కడ పెట్టేందుకు మీ అనుమతి ఏమిటని ప్రజలు ప్రశ్నించారు. అలా పెట్టేందుకు వీల్లేదని పోలీసుల‌ వాదన. అయినా రాయిని నిల‌బెట్టి శంకుస్థాపన అయిందని జనం ప్రకటించారు.

ఇంతకంటే రగడ ఎర్రమఠం దగ్గర జరిగింది. ఆ ఊరు కపిలేశ్వరానికి వెనుక ఉంటుంది. పన్నెండు గంటల‌కంతా వందలాది వాహనాలు ఆ ఊరికి చేరుకున్నాయి. కొత్తపల్లె మండ‌లం నుంచి అప్పటి దాకా ఒక్క పురుగును కూడా రాకుండా చేయాల‌నే పోలీసుల‌ ప్రయత్నం విఫల‌మైంది. జనం విరుచుకపడ్డారు. ఆత్మకూరు, పాముపాడు నుంచి పోలీసులు దిగారు. ఎర్రమఠం నిజంగానే ఎర్రబారింది. మిట్ట మధ్యాహ్నం పూట జనం రోడ్లును నింపేశారు.

చదవండి :  గణిత బ్రహ్మతో నా పరిచయం

సిద్ధేశ్వరం అలుగు సాధన కమిటీ నాయకుడు దశరథరామిరెడ్డిని అరెస్టు చేసి తీసుకుపోవడానికి పోలీసులు ప్రయత్నించారు. రాయల‌సీమ విద్యార్థులు పోలీసుల‌ వాహనాల‌కు అడ్డంగా కాలుతున్న పెన్నంలా ఉన్న రోడ్డు మీద పడుకొని అట‌కాయించారు.

రెండు గంటల‌య్యే సరికి రాయల‌సీమ దూర ప్రాంతాల‌ నుంచి కూడా వాహనాలు వచ్చాయి. అక్కడక్కడ దారి మళ్లించుకుంటూ పోలీసుల‌ కళ్లు గప్పి జనాలు చేరుకున్నారు. దీంతో పోలీసులు ఇక వెనక్కి తగ్గారు. జనబలం ఊపందుకుంది. పోలీసులు పాడు చేసిన దారుల పక్కనే కొత్త దారులు పడ్డాయి. మూడు గంటల‌కు సంగమేశ్వరుడి దగ్గరికి నాయకులు చేరుకున్నారు. అక్కడ దశరథరామి రెడ్డి రైతుల‌ను, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. పది నిమిషాలు కాకముందే ఆయన్ను అదుపులోకి తీసుకొని పోలీసులు వెళ్లిపోయారు. అయినా అక్కడ సభ కొనసాగింది. రైతుందరికీ సిద్దేశ్వరం అలుగు కట్టే ప్రదేశం చూడాల‌ని ఉండటంతో మూడు కిలోమీటర్లు పాదయాత్రగా అక్కడికి బయల్దేరారు.

ఇక్కడి దాకా వచ్చి సిద్ధేశ్వరాన్ని ముట్టుకోకుండ ఎట్ల పోతం? అదీ రైతు మాట. కొందరు రైతులు సంగమేశ్వరుడికి కొబ్బరికాయ కొట్టి నడుచుకుంటూ వెళ్లి అలుగు కట్టే చోట మరో కొబ్బరి కాయ కొట్టారు. వరద క్రిష్ణమ్మలా అలుగు కట్టే చోటికి వచ్చిన రైతులు తలా ఒక రాయి నెత్తిన మోసుకొని ఆ కొండ పక్కన అలుగులా పేర్చారు. దాని మీద సిద్ధేశ్వరం జండా నిల బెట్టారు.

మళ్లీ అక్కడ కూడా బహిరంగ సభే!

వాడు ఒక శంకుస్థాపనను, సభను అడ్డుకుందామనుకున్నాడు. కాని మూడు శంకుస్థాపనలు, రెండు సభలు జరిగాయి. రాయల‌సీమ రైతుల‌కు ఇది వింత అనుభవం. సీమ ఉద్యమంలోనే కలికితురాయి ఈ ఆందోళన. జెండాలేవీ లేకుండా సిద్ధేశ్వరమే ఎజండాగా నడిచింది. ఒక రకంగా స్మూత్‌ రిప్రెషనే అయినా పోలీసులు తమ శక్తి మేరకు అడ్డుకున్నారు. రైతులు శక్తికిమించి ప్రతిఘటించారు. ఇప్పటికి ఇది అపురూపమే.

మామూలుగా ఏదో ఒక రాజకీయ నిర్మాణం లేకుండా జనం కదల్లేరు. అది ఎలాంటి రాజకీయ నిర్మాణమైనా సరే. రాయల‌సీమలో అయితే ఊళ్లో ఎవరో ఒక నాయకుడు చెప్పకుంటే జనం కదల‌డం అయ్యే పనే కాదు. ఏం మాయోగాని అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల‌తో నిమిత్తం లేకుండా పాతిక వేల‌ మంది జనాలు సిద్ధేశ్వరానికి తరలివచ్చారు. ఇంటలిజెన్స్‌ వాళ్లయితే 30 వేల‌ని పైకి పంపించినట్లు తెలిసింది.

చదవండి :  రాయలసీమకు మిగిలేదేమిటి?

నాయకులెవరూ చెప్పకుండా, వాళ్ల వెనుక కాకుండా సిద్ధేశ్వరం వెనుక, సిద్ధేశ్వరం కోసం ఇలా రావడం ఆశావహం. ఇంకో పక్క పట్టిసీమ ఎండమావి కమ్ముకొస్తోంటే.. దాన్ని కాదని, గొంతు తడిపే నీళ్లు కావాల‌ని ఇలా కదిలి వచ్చారు. రాయల‌సీమ సోషల్‌ ఆర్డర్‌లో ఏదో మార్పు వస్తున్నదనడానికి ఇదేమైనా సంకేతమా? గత పదిహేనేళ్లలో ఫ్యాక్షనిజం సహితం పాత బంధనాల నుంచి బయటికి వచ్చిబూర్జువైజ్‌ అవుతున్నదనడానికి ఇదీ సూచికా?

ఏదైతేనేం.. తమంతకు తాము, తమ సమస్య మీద సీమ రైతులు కదల‌డం సామాజికంగా , రాజకీయంగా శుభస్కరం.

ఇంతకూ సారాంశంలో ఇదంతా ఓ కదలికే కదా? సిద్ధేశ్వరం కోసం ఆరంభమే కదా? బొట్టు బొట్టు నేల‌లో ఇంకినట్టు ఇదంతా ప్రజల‌ మనసులోకి, బుద్ధిలోకి ఇంక వల‌సి ఉన్నది. ప్రభుత్వాలు నిర్లక్ష్యం, దగా చేస్తే జనమే అసలైన పరిష్కారం చూసుకుంటారనడానికి అలుగు శంకుస్థాపన విజయవంతం కావడం కూడా ఒక దాఖలా. బహుశా మా ప్రాజెక్టులు మేమే కట్టుకుంటామని ఇలా ముందుకు రావడం ఇంకెక్కడైనా జరగలేదేమో.

చరిత్ర చదివిన వాళ్లు చెప్పాలి. ఇంతా జరిగింది కాబట్టి కాబట్టి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని నిర్మాణం ప్రారంభిస్తుందని నమ్మడానికేమీ లేదు. అందువల్ల‌ సీమ ప్రజలు.. ముఖ్యంగా రైతులు ఇంకా చాలా ఉద్యమాలు చేయడానికి అలవాటు పడాలి. మామూలుగా అయితే సిద్ధం కావాలి.. అనాలి. రాయల‌సీమలో దానికంటే ముందు దశ ఒకటి ఉన్నట్లుంది. అదేమంటే … ఉద్యమాలు అల‌వాటు కావాల్సిన దశ అని నా అనుమానం. అయినప్పటికీ ఇంతగా కదిలారంటే తమకు ఏం రావాలో.. ఆ ప్రాంత జనం తెలుసుకుంటున్నట్టుంది. ఇంకేం.. బహుశా ఆ ఒక్క కారణం వల్లే ఇది రాయల‌సీమ ఉద్యమంలో గుర్తుంచుకోవాల్సిన రోజు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ట్రిగ్గర్‌ చేసే అనుభవం. నిస్సందేహంగా సీమ ప్రజాస్వామిక ఉద్యమం పరిణత దశలోకి ఎదుగుతున్నదనడానికి సాక్ష్యం.

(1, జూన్‌ 2016)

ఇదీ చదవండి!

ఉద్యమ నేతల అరెస్టు

రాయలసీమ ఉద్యమ నేతల అరెస్టు

బరితెగించిన తెదేపా ప్రభుత్వం పోలీసుల అదుపులో బొజ్జా  గృహనిర్భందంలో భూమన్ ప్రభుత్వానికి మద్ధతుగా బరిలోకి దిగిన పచ్చ నేతలు, మీడియా కడప: …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: