రాయలసీమలో హైకోర్టు
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటును కోరుతూ కర్నూలులో ఆందోళన చేస్తున్న న్యాయవాదులు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర ప్రాబల్యం గురించిన అభిప్రాయాలు ఇప్పటికీ అలాగే ఉండడం వల్ల అప్పటి శ్రీభాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయటం ఇప్పుడు అనివార్యతగా మారింది. ఐతే ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి ప్రాంతంలోనే జస్టిస్ సిటీ పేరుతో హైకోర్టు ఏర్పాటుచెయ్యబూనడంతో హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చెయ్యాలనే డిమాండుతో దీక్షలు, ఆందోళనలు జరుగుతున్నాయి….

పైకి ఉద్యమకారులు అందరూ ‘రాయలసీమలో’ అనే అంటున్నప్పటికీ లోపల్లోపల ఎవరికి వాళ్ళు రాయలసీమలో అంటే తమ జిల్లా/ఊర్లోనే అని కోరుకుంటే అది సహజమే అనుకోవచ్చు. కానీ జరుగుతున్నది వేరు.

కర్నూలు:

కర్నూలువాసులు రాయలసీమ సింహద్వారం కర్నూలు నగరమేనని, నగరంలోని కొండారెడ్డి బురుజే రాయలసీమ చిహ్నమని, పైగా గతంలో రాజధానిగా కూడా ఉండడం వల్ల సహజంగానే రాయలసీమ ప్రాంతంలో పాలనాకేంద్రంగా అర్హతకలిగిన నగరం కర్నూలు తప్ప ఇంకేదీ లేదని భావిస్తారు.

ఇప్పుడు హైకోర్టు కూడా రాయలసీమలోని మిగతా జిల్లాల వాళ్ళు తమ తమ జిల్లాల్లో ఏర్పడాలనే ఒక ప్రచ్ఛన్నమైన కోరిక/ఆశతో ఉద్యమిస్తున్నప్పటికీ కర్నూలు జిల్లాకు చెందిన ఉద్యమకారులు మాత్రం మొక్కుబడిగా రాయలసీమలో అంటున్నప్పటికీ కొన్నిసార్లు బాహాటంగానే రాయలసీమలోని కర్నూలులో అనే అంటున్నారు (జత చేసిన ఫోటో చూడండి. కర్నూలు వాళ్ళ బానర్లో “We demand High Court in Rayalaseema at Kurnool” అని స్పష్టంగా ఉంది). కర్నూలులో అన్నది వాళ్ళ కోరికైనప్పుడు దానికి మళ్ళా రాయలసీమ అనే ముసుగెందుకు? రాయలసీమ ప్రస్తావన లేకుండా కర్నూలులో అని సూటిగా చెబితే రాయలసీమలోని మిగతా జిల్లాల వాళ్ళు దానికి అంగీకరించరేమోనని సందేహమా? ఇది “కుంజరః” టైపు నయవంచన.

అదలా ఉంచి ఒకసారి కర్నూలు నగరానికి ఉన్న అనుకూలతలు, అర్హతలు ఒకసారి పరిశీలిద్దాం.

గతంలోరాజధాని: ఈ అంశాన్ని ప్రస్తావించే వాళ్ళు తమ చారిత్రిక హ్రస్వదృష్టిని వదిలి 1953కు పూర్వపు చరిత్రను చూసినట్లయితే అప్పటి రాయలసీమ ఆంధ్ర ప్రదేశ్ (ఇప్పటి) , కర్నాటక రెండు రాష్ట్రాల్లో వ్యాపించి ఉండేదని, తెలుగు ప్రాంతాల్లో ఇప్పటి

1. ప్రకాశం జిల్లాలోని కంభం, మార్కాపురం తాలూకాలు,
2. కర్నూలు జిల్లాలో అధిక భాగం (నంద్యాల, కోయిలకుంట్ల మొదలైన ప్రాంతాలు),
3. కడప జిల్లా,
4. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, వాయల్పాడు తాలూకాలు

ఇవన్నీ కలిపి ఒకే జిల్లా అని, దానికంతటికీ పాలనాకేంద్రంగా కడప (1807 మొదలు) భాసిల్లేదని, అలాగే ఇప్పటి కర్నూలు జిల్లాలోని ఆదోని, ఎమ్మిగనూరు, ఆలూరు, అనంతపురం జిల్లాతో కలుపుకుని కన్నడ ప్రాంతంలోని రాయలసీమ ప్రాంతానికి పాలనాకేంద్రం బళ్ళారి  అని గుర్తొస్తుంది. 1858లో కర్నూలు నవాబును కుట్ర పేరుతో తరిమేసిన బ్రిటీషు వారు, తదనతరం కర్నూలు కేంద్రంగా (కడప జిల్లాలోని ప్రాంతాలనూ, బనగానపల్లి నవాబు పాలన కింద ఉన్న ప్రాంతాలను మినహాయించి)ఒక చిన్న జిల్లాను ఏర్పరిచినారు. ఆ తరువాత 1910-11 ప్రాంతంలో బ్రిటీషు వారు పరిపాలనా సౌలభ్యం కోసం అనంతపురం, చిత్తూరు పట్టణాలు పాలనా కేంద్రాలుగా రెండు జిల్లాలను ఏర్పరిచినారు. అట్లానే కర్నూలు జిల్లా పరిధిని విస్తరించినారు. ఇందుకోసం కడప, బళ్ళారి, ఉత్తర ఆర్కాటు (తమిళనాడు) జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను (తాలూకాలను) తీసి కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలలో కలిపినారు.

చదవండి :  మనమింతే!

మరి కర్నూలు 1953లో అకస్మాత్తుగా రాష్ట్ర రాజధానిగా ఎలా ఎంపికయింది? అప్పటి రాజధాని విషయంలో నిర్ణయాధికారం కలిగిన ప్రకాశం పంతులు గారు అందరి వాదనలు విన్న తర్వాత ఒక తెల్ల కాగితమ్మీద కర్నూలు అనే పేరు రాయించి అదే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని నిర్ణయం చేశారు. ఏ పరిస్థితుల్లో, ఏ కారణాల వల్ల ఆ నిర్ణయం తీసుకున్నారో కూడా తెలుసుకోవలసిన అవసరముంది.

అప్పటికారణాలు:

1. కర్నూలు, అప్పటికి ఇంకా ఏర్పడని విశాలాంధ్రకు కాబోయే రాజధాని హైదరాబాదుకు వెళ్ళే త్రోవలో ఉంది.

2. తెలంగాణతో కలిపి విశాలాంధ్ర ఏర్పడేవరకు ఒకటి రెండు సంవత్సరాలు తాత్కాలికంగా రాజధాని అక్కడ ఉండినట్లయితే, రాయలసీమ జిల్లా కేంద్రాలన్నిటిలోనూ చాలా వెనుకబడ్డది కావడం చేత, రాజధాని ఉన్న రెండు మూడు ఏండ్లయినా అది అభివృద్ధి పొందడానికి వీలు కల్పించినవాళ్ళమవుతాము. (ఆధారం: ప్రకాశం పంతులు గారి ఆత్మకథ “నా జీవిత యాత్ర”)

అప్పటి రాయలసీమలోని ఇతర పట్టణాల విషయానికి వస్తే అనంతపురం అసలు పోటీలోనే లేదు (ప్రకాశం పంతులు గారు నీలం సంజీవరెడ్డి గారిని అనంతపురం గురించి మాట్లాడనివ్వకుండా ముందరి కాళ్ళకు బంధం వేశారట). తిరుపతిని రాజధాని చెయ్యకపోతే చిత్తూరు జిల్లా తమిళనాడులోనే ఉండిపోతుందని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన గౌతు లచ్చన్న గారు వాదించారు. వేరే కారణమేమీ చెప్పలేదు గానీ పేరుకు మాత్రమే రాయలసీమలో ఉన్న తిరుపతి కోస్తాంధ్రుల రాకపోకలకు మిక్కిలి అనుకూలంగా ఉండే నగరం. ఇక వివరాలు ఇవ్వలేదుగానీ కడప అనుకూలతల గురించి కోటిరెడ్డి గారు చాలాసేపు చెప్పారని మాత్రం పేర్కొన్నారు. సుదీర్ఘంగా వివరించదగినన్ని అనుకూలతలు కడప నగరానికి ఇప్పటికీ ఉన్నాయి.

పై కారణాలను బట్టి చూస్తే కర్నూలును ఎంపిక చేసింది అభివృద్ధిలో వెనుకబాటు ప్రాతిపదికన, అది కూడా తాత్కాలిక ఏర్పాటు కిందనే తప్ప శాశ్వత/దీర్ఘకాలిక పాలనాకేంద్రంగా ఎంతమాత్రమూ కాదని స్పష్టమవుతుంది. పైగా హైదరాబాదుకు వెళ్ళే దో(త్రో)వలో ఉంది అన్నది ఒక అసంబద్ధమైన కారణం. ఎక్కడి నుంచి హైదరాబాదుకు వెళ్ళే త్రోవ? ఐనా హైదరాబాదుకు వెళ్ళే త్రోవతో పనేమిటి? బహుశా హైదరాబాదుకు దగ్గరగా ఉంది కాబట్టి, రాజధానిని హైదరాబాదుకు మార్చేటప్పుడు సులువౌతుందని భావించి ఉండొచ్చు.

చదవండి :  ఆ రాజధాని శంకుస్థాపనకు హాజరుకాలేను

ఉనికి/రాయలసీమసింహద్వారంఇది నిజానికి కర్నూలు నగరానికి ఉన్న పెద్ద ప్రతికూలత (రాయలసీమకు సంబంధించినంతవరకూ తిరుపతికి కూడా ఇదే ప్రతికూలత ఉన్నప్పటికీ కనీసం తిరుపతి “రాయలసీమలో” కోస్తాంధ్ర వాళ్ళ రాకపోకలకు మిక్కిలి అనువైన నగరం అనే అభిప్రాయం ఉంది). కర్నూలు నగరం రాయలసీమకు ఒక మూలన, ఇతర రాయలసీమ జిల్లాలకు చాలా దూరంలో ఉందన్నది వాస్తవం. ఉదాహరణకు ఏ చిత్తూరు నుంచో లేక తిరుపతి నుంచో చూసినట్లయితే కర్నూలు చాలా దూరం.

తిరుపతి – కర్నూలు: 341 కి.మీ. (టోల్ గేట్లున్న దారి) / 360 కి.మీ. (టోల్ గేట్లు లేని దారి),
చిత్తూరు – కర్నూలు: 367 కి.మీ. (టోల్ గేట్లున్న దారి) / 417 కి.మీ. (టోల్ గేట్లు లేని దారి)
కుప్పం – కర్నూలు: 427/440 కి.మీ.

పై దారుల సగటు దూరమే కర్నూలు-హైదరాబాదు (213 కి.మీ.) కంటే దాదాపు రెండింతలు ఎక్కువ! పొరుగునే ఉన్న అనంతపురం జిల్లాలోని హిందూపురం కూడా కర్నూలుకు 254 కి.మీ. దూరంలో ఉంది.

ఒకసారి రాయలసీమ చరిత్రను పరిశీలించినట్లయితే రవాణా సౌకర్యాలు పెద్దగా అభివృద్ధిచెందని రోజుల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని రాయలసీమలో నెలకొల్పకపోతే తాము మద్రాసు యూనివర్సిటీ స్థానికులుగా ఉండడానికే మొగ్గుచూపుతామని సీమవాసులు పట్టుబట్టడానికి కారణం దూరమే అయి ఉండవచ్చు. అలాగే విజయవాడ రాయలసీమలో భాగం కాకపోయినప్పటికీ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాత్కాలిక కార్యక్షేత్రమైన విజయవాడ (బందరు రోడ్డులోని విక్టోరియా జూబిలీ భవనం) నుంచి విశాఖపట్టణానికి తరలించడం రాయలసీమవాసుల్లో మరింత తీవ్రమైన అసంతృప్తికి, కోస్తాంధ్రుల మీద అపనమ్మకానికి కారణమైంది – విజయవాడతో పోలిస్తే విశాఖపట్టణం రాయలసీమకు ఎక్కువ దూరంలో ఉంది కాబట్టి, సామాన్య ప్రజలకు దూరమే భారం కాబట్టి.

నీట్కేంద్రాలుకంగాళీ :

ఈ అంశాన్ని పరిగణించక మొదటే గుడ్డిగా తిరుపతిలో పెట్టడం వల్ల సీమవాసుల్లో అత్యధికులకు దూరం కావడం, దాన్ని దిద్దుకోవడానికి పడుతున్న పాట్లతో పాలనాపరంగా ఎంత కంగాళీగా తయారయిందో తెలుసుకోవడానికి నీట్ పరీక్షాకేంద్రాల ఏర్పాటే కళ్ళ ముందు కనిపిస్తున్న దృష్టాంతం.

మొదట తిరుపతిలో పెట్టారు. అది దూరమైపోయిందని కర్నూల్లో ఒకటి, కర్నూలు మరీ దూరంగా ఉందని తిరుపతికి దగ్గర్లో ఉన్న నెల్లూరులో ఇంకొకటి పెట్టారు. ఇరుగుపొరుగు జిల్లాల్లో ఇన్నిచోట్ల అవసరమా? ఇంతాజేసీ అనంతపురానికి అన్ని కేంద్రాలూ దూరంగానే ఉన్నాయి. పైగా కొత్త కేంద్రాలు కూడా అన్నీ అంచుల్లోనే పెట్టారు. రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాలకు కలిపి 9 కేంద్రాలు!

చదవండి :  సీమ పై విషం కక్కిన తెలంగాణా మేధావి - 1

దేశవ్యాప్తంగా కేవలం ఐదు రాష్ట్రాల్లోనే ఇంతకంటే ఎక్కువ కేంద్రాలున్నాయి. ఎక్కువ కేంద్రాలు ఉండడం మంచిదే కదా అనుకోవచ్చు. రాష్ట్రేతరుల్లో అది కలిగించే అభిప్రాయం అంత మంచిది కాదు – ప్రత్యేకించి దాని వల్ల పొందుతున్న ప్రయోజనం పరిమితంగా ఉన్నప్పుడు. దీన్ని నివారించడానికి కావలసిందల్లా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, నగరాల అమరిక పట్ల ప్రాథమిక అవగాహన, ఆవగింజంత ఇంగిత జ్ఞానం. ఇప్పుడిదెందుకంటే – రేపు హైకోర్టు విషయంలో ఇలాంటి తప్పే చేస్తే దిద్దుకోవడానికి బాబు గారన్నట్లు ఊరికొకటి పెట్టలేరు కదా?

తిరుపతి:చిత్తూరు జిల్లా వాళ్ళేమో ఎందుకో ఎవరికీ తెలియకపోయినా రాయలసీమకు సంబంధించినదేదైనా తిరుపతిలో ఏర్పాటు చెయ్యడమే సహజ న్యాయంగా భావిస్తారు. తిరుపతికి ఉన్న ఒకే ఒక్క అనుకూలత – పైన చెప్పినట్లు అది “రాయలసీమ”లో కోస్తాంధ్రుల రాకపోకలకు మిక్కిలి అనుకూలంగా ఉండే నగరం కావడమొక్కటే (ఇదే అనుకూలత నంద్యాల పట్టణానికి కూడా వర్తిస్తుంది). కోస్తాంధ్రుల సౌకర్యం కూడా చూడ్డం మంచిదే. ఐతే ఇంతాజేసి, కోస్తాంధ్రుల సౌకర్యం కోసం సీమవాసుల సౌకర్యం విషయంలో రాజీ పడవలసే వస్తే రాయలసీమలో కావాలని అంతగా పోరాడడమెందుకు? పైగా, త్వరలోనే పూర్తి కావస్తున్న కడప-నెల్లూరు (ఓబులవారిపల్లె-కృష్ణపట్నం) రైలు మార్గం వల్ల ఈ అనుకూలత కడపకు కూడా వర్తించనుంది.

అనంతపురం:ఇక అనంతపురం వాళ్ళేమో రాయలసీమ అంటే కరువు, కక్షలకు ఆలవాలమై అభివృద్ధికి నోచుకోని ప్రాంతం కాబట్టి, ఆ రెండు అంశాల్లోను తీవ్రంగా ప్రభావితమైన జిల్లాగా రాయలసీమకు నిజమైన ప్రాతినిధ్య జిల్లా తమదేనని భావిస్తారు. ఐతే, కక్షలన్నవి గతించిన చరిత్ర కాగా రాయలసీమలోని (రాష్ట్రంలోని) అత్యధిక ప్రాంతాల నుంచి రాకపోకలకు అనుకూలంగా లేకపోవడం అనంతపురానికి పెద్ద సమస్య. అభివృద్ధిలో వెనుకబాటుతనం గురించి, వెనుకబడిన జిల్లాలకు నీతి ఆయోగ్ ఇచ్చిన ర్యాంకుల గురించి ఈ వ్యాసపు రెండో భాగం చివర్లో మాట్లాడుకుందాం.

(ఇంకా ఉంది)

త్రివిక్రమ్

(trivikram@kadapa.info)

రచయిత గురించి

కడప జిల్లా సమగ్రాభివృద్ది కోసం పరితపించే సగటు మనిషీ త్రివిక్రమ్. సాహిత్యాభిలాషి అయిన త్రివిక్రమ్ తెలుగును అంతర్జాలంలో వ్యాపితం చేసేందుకు ఇతోధికంగా కృషి చేశారు. ‘ఈ-మాట’ అంతర్జాల పత్రికకు సంపాదక వర్గ సభ్యులుగా వ్యవహరిస్తున్న వీరు కొంతకాలం పాటు అంతర్జాల సాహితీ పత్రిక ‘పొద్దు’ సంపాదకవర్గ సభ్యులుగా వ్యవహరించినారు. అరుదైన ‘చందమామ’ మాసపత్రిక ప్రతులను ఎన్నిటినో వీరు సేకరించినారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ‘పడిగెలపల్లి’ వీరి స్వస్థలం.

ఇదీ చదవండి!

పుట్టపర్తి తొలిపలుకు

ఈ రాయలసీమ చీకటి ఖండం – పుట్టపర్తి వారి తొలిపలుకు

ఇప్పటికి శివతాండవం పదిసార్లైనా ప్రింటు అయివుంటుంది. కానీ నేను ఆర్ధికంగా లాభపడింది మాత్రం చాలా తక్కువ. కారణాలు అనేకాలు. ముఖ్యంగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

CAPTCHA * Time limit is exhausted. Please reload CAPTCHA.

error: